‘గ్లూటెన్’ అంటే ఏమిటి? ఇది లేని ఆహారం మంచిదేనా?

ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగంగా 8 శాతం మంది పెద్దలు తమ ఆహారంలో గ్లూటెన్‌ లేకుండా చూసుకుంటున్నారని మింటెల్ అధ్యయనంలో తెలిపారు.

గ్లూటెన్(బంకగా) ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల సిలియాక్ వ్యాధి(ఉదర కుహర వ్యాధి) ఉన్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ, గ్లూటెన్ రహిత ఆహారాన్ని తినడం ఎవరికైనా మంచిదేనా? ఇది ఎంత వరకు మేలు చేస్తుంది? వీటికి సమాధానాలు ఇక్కడ చూద్దాం.

గ్లూటెన్‌ రియాక్షన్లు ఏంటి?

గ్లూటెన్ తినడం వల్ల అలర్జీ, ఆటోఇమ్యూన్ వంటి ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశముంది.

సిలియాక్ వ్యాధి అంటే?

సిలియాక్ వ్యాధి చాలా ప్రమాదకరమైది. ఇది జీవితకాలం వేధించే జన్యుపరమైన జీర్ణ సంబంధ సమస్య. ఈ వ్యాధి ఉంటే రోగనిరోధక వ్యవస్థ తనపై తానే దాడి చేసుకుంటుంది. దీనివల్ల చిన్న పేగు దెబ్బతింటుంది. ఆహారంలోని పోషకాలను సరైన స్థాయిలో శరీరం తీసుకోలేకపోతుంది.

సిలియాక్ వ్యాధి అనేది ఫుడ్ అలర్జీ లేదా నిర్దిష్ట ఆహారాన్ని సహించలేకపోవడం(ఇంటాలరెన్స్) కాదు. ఇదొక ఆటోఇమ్యూన్ డిసీజ్. దీనికి నివారణ లేదు. ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ, జీవితకాలం గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పురుషులతో పోలిస్తే మహిళలలో సిలియాక్ వ్యాధి కేసులు రెండు లేదా మూడింతలు ఎక్కువ నమోదవుతున్నాయి.

వీట్ అలర్జీ

గోధుమలో ఉండే ఒక పదార్థం (గ్లూటెన్ కాదు) వల్ల వచ్చే రియాక్షనే వీట్ అలర్జీ.

సాధారణంగా గోధుమలు తిన్న సెకన్ల వ్యవధిలోనే దీని ప్రభావం చూపుతుంది.

మీకు వీట్ అలర్జీ ఉన్నప్పటికీ, బార్లీ, రే వంటి ధాన్యాల ఆహారాన్ని తినవచ్చు.

గ్లూటెన్ ఇంటాలరెన్స్

వీట్ అలర్జీ, సిలియాక్ వ్యాధులతో పోలిస్తే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఎక్కువ కామన్‌గా కనిపిస్తుంటుంది.

గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనే దానికి రోగనిరోధక వ్యవస్థతో సంబంధం ఉండదు. ఇది జన్యు పరమైనది కూడా కాదు. ఇది గట్‌‌ను దెబ్బతీయదు కూడా.

ఈ సమస్యకు కారణం గ్లూటెనా లేదా గ్లూటెన్ ఉన్న ఆహారాన్ని తినడం ఆపేసినప్పుడు డైట్ నుంచి తొలగించిన ఇతర ఆహార పదార్థాలా అనే దానిపై చర్చ జరుగుతోంది.

ఉదాహరణకు.. ఒకవేళ మీ డైట్ నుంచి గ్లూటెన్‌ను తీసేస్తే, డీఫాల్ట్‌గా రిఫైన్డ్ కార్బ్స్ (శుద్ధి చేసిన పిండి పదార్ఘాలను) కూడా తొలగించాల్సి ఉంటుంది.

మీరు పొందే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వరకు వీటితో ముడిపడి ఉంటాయి.

అలర్జీ లక్షణాలతో పోలిస్తే ఫుడ్ ఇంటాలరెన్స్ (నాన్ సియోలిక్ గ్లూటెన్ సెన్సిటివిటీ) లక్షణాలు చాలా నిదానంగా ప్రభావం చూపుతాయి. తిన్న కొన్ని గంటల తర్వాత వీటి ప్రభావం ఉంటుంది.

ఫుడ్ అలర్జీ ఎవరికి ఉంటుంది?

సిలియాక్ వ్యాధి, వీట్ అలర్జీ లేదా గ్లూటెన్ ఇంటాలరెన్స్ సమస్యలను చాలా మంది సొంతంగానే గుర్తిస్తున్నప్పటికీ, సిలియాక్ వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్న కేసులను గుర్తించలేకపోతున్నామని నిపుణులు చెబుతున్నారు.

ఏవైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే, సిలియాక్ వ్యాధి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇది ఉన్నప్పుడు కచ్చితంగా పరీక్షించుకోవాలి.

బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ప్రకారం, సిలియాక్ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ తీసుకుంటూ ఉంటే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఐరన్ లోటుతో వచ్చే అనేమియా, విటమిన్ బీ12, రక్తంలో సరిపడ ఫోలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల వచ్చే అనేమియా, ఆస్టియోపొరోసిస్(ఎముకలు బలహీనంగా మారడం) వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

కొన్ని రకాలైన కేన్సర్లతో పాటు చాలా అరుదుగా కనిపించే మరింత సీరియస్ సమస్యలు వస్తాయి. సిలియాక్ యూకే పరిశోధన ప్రకారం- సిలియాక్ వ్యాధిని గుర్తించేందుకు పట్టే సగటు కాలం 13 ఏళ్లు.

గ్లూటెన్ రహిత ఆహారం వల్ల వచ్చే ప్రమాదాలు

గ్లూటెన్ రహిత ఆహారాన్ని తినడం వల్ల చాలా మందికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభించడం లేదు.

అనవసరంగా గ్లూటెన్ రహిత డైట్‌ను అనుసరించినప్పుడు, పోషకాలపై దృష్టి సారించకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరం.

హోల్‌గ్రైన్ గోధుమలు, బార్లీ, రే బ్రాన్ వంటి వాటిల్లో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. ఫైబర్, ఐరన్, బీ విటమిన్లు, కాల్షియం ఉంటాయి.

గ్లూటెన్ తొలగించి రిఫైన్డ్ గ్రైన్స్(శుద్ధి చేసిన ఆహార ధాన్యాల) తో ఉత్పత్తులను తయారు చేస్తుంటారు.

శుద్ధి చేసిన ధాన్యాలలో కేవలం ఎండోస్పెర్మ్ మాత్రమే ఉంటుంది. అంతేకాక, వీటిలో తక్కువ పోషకాలుంటాయి.

గ్లూటెన్ రహిత ఆహార విధానాన్ని అనుసరించాలని మీరు భావిస్తుంటే.. శుద్ధి చేసిన ఆహారాల బదులు సహజంగా లభించే గ్లూటెన్ రహిత ధాన్యాలను తినడం చాలా మంచిది.

గ్లూటెన్ రహిత మార్కెటింగ్ విపరీతంగా పెరుగుతున్నందున్న ఈ పరిశ్రమ ఎక్కువగా లాభపడుతోంది. ఈ ఉత్పత్తులు కొన్నింట్లో అత్యధికంగా కొవ్వు, కేలరీలు ఉంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

గ్లూటెన్ వేటిలో ఉంటుంది?

కేక్స్, బిస్కెట్స్, బ్రెడ్ వంటి వాటిల్లో గ్లూటెన్ ఉంటుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, మనం రోజు తినే ఆహార పదార్థాల్లో కూడా కనిపించని గ్లూటెన్ ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్: చాలా వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో తినే తృణధాన్యాల్లో వీట్, గ్లూటెన్‌ ఉంటాయి.

ఓట్స్, కార్న్ ఫ్లేక్స్, గ్రానోలా తినేందుకు ప్రయత్నించాలి. కానీ, ఎప్పటికప్పుడు లేబుల్‌ను చెక్ చేసుకోవాలి.

సాస్‌లు: చికెన్, బీఫ్, వెజిటబుల్ స్టాక్స్‌తోపాటు సోయా సాస్, కెచప్, మయోనీస్, సలాడ్ వంటి ఇతర సాస్‌లలో గ్లూటెన్‌ను మనం గుర్తించవచ్చు.

అందుకే ఎప్పటికప్పుడు లేబుల్‌ను చూసుకోవాలి.

స్నాక్స్: వివిధ రకాల స్నాక్స్‌లలో గ్లూటెన్ ఉంటుంది. పాప్‌కార్న్, సాదాసీదా నట్స్, విత్తనాలు, గ్లుటెన్ ఫ్రీ క్రిస్ప్స్ ఉంటాయి. వీటిని తీసుకుంటే మంచిది. కానీ, ఎప్పటికప్పుడు లేబుల్‌ను చెక్ చేసుకోవాలి.

ఆల్కాహాల్‌: బీర్, లైట్ బీర్, హార్డ్ లిక్కర్లను గ్లూటెన్ ఉన్న ధాన్యాలతో తయారు చేస్తారు.

షెర్రీ, పోర్ట్ బ్రాండ్లు సిలియాక్ వ్యాధి ఉన్న వారికి అనువైనవే, వీటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని గ్లూటెన్ రహిత బీర్లు, లాగర్లు, స్టౌట్స్ కూడా దొరుకుతాయి. కానీ, వీటి లేబుల్‌ను చెక్ చేసుకుని తాగవచ్చు.

ధాన్యాలు: కౌస్కస్, బల్గర్ వీట్, సెమోలినాలు గ్లూటెన్ రహిత ఆహార ధాన్యాలు కావు. కౌస్కస్, బల్గర్ వీట్ బదులు క్వినోవా ప్రయత్నించవచ్చు. సెమోలీనా బదులు పెలొంటా, గ్రౌండ్ రైస్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)