You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్ vs హమాస్: ‘‘ఈ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?’’
ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న ఊహించని రీతిలో హమాస్ చేసిన భీకర దాడులు, వీటికి స్పందనగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రపంచం విలవిలలాడుతోంది. మరోవైపు గాజాలోకి నేరుగా ప్రవేశించి సైనిక చర్యలు చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘర్షణల ప్రభావం సాధారణ ప్రజలపై ఎలా ఉంటుంది? ఎప్పుడు వీటికి తెరపడుతుంది? మిగతా దేశాలు కూడా ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటాయా? లాంటి వందల ప్రశ్నలు పాఠకుల నుంచి మాకు అందాయి.
వీటిలో కొన్నింటికి ఇజ్రాయెల్ నుంచి పనిచేస్తున్న మా ప్రతినిధులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుందా?
‘‘ఈ ఘర్షణలో ఇరాన్ నేరుగా జోక్యం చేసుకుంటే, అమెరికా, దాని మిత్ర పక్షాలు కూడా యుద్ధంలోకి అడుగుపెడతాయా? దీని వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?’’ అని బ్రిటన్‌లోని స్కేల్‌మెర్స్‌డేల్ ప్రాంతానికి చెందిన క్రెయిన్ జాన్సన్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు దక్షిణ ఇజ్రాయెల్ నుంచి పనిచేస్తున్న మా ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ సమాధానం ఇచ్చారు.
ఇరాన్ లేదా లెబనాన్‌లోని హెజ్బొల్లా ఈ ఘర్షణలో నేరుగా జోక్యం చేసుకోవచ్చా? అనే ప్రశ్నపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. అలాంటి అవకాశం ఉండదని అన్నారు.
తూర్పు మధ్యధరా సముద్రంలో రెండు విమాన వాహక యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. ఈ ఉద్రిక్తతల నుంచి ఇరాన్ దూరంగా ఉండాలని చెప్పేందుకే వీటిని మోహరించినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఎవరైనా జోక్యం చేసుకుంటే, కేవలం ఇజ్రాయెల్ సైన్యాన్ని మాత్రమే కాదు, అమెరికా సైన్యాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని దీని ద్వారా సందేశం ఇస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే కొన్ని ప్రాంతాల్లో అమెరికా, దాని మిత్రపక్షాలు.. ఇరాన్, దాని మిత్రపక్షాలతో పోరాడుతున్నాయి.
ఇక్కడి యుద్ధంలో నేరుగా పాల్గొంటే జరిగే ముప్పులు, పరిణామాలపై రెండువైపులా అవగాహన ఉంది. అయితే, వీరు ఇక్కడ పరోక్ష యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధంలోకి అడుగుపెడితే, ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టే స్థాయికి ఈ ఉద్రిక్తతలు వెళ్లిపోతాయి.
ఇజ్రాయెల్ ఏం సాధించాలని అనుకుంటోంది?
గాజాలోకి వెళ్లి నేరుగా చేపట్టే సైనిక చర్య ద్వారా ఇజ్రాయెల్ ఏం సాధించాలని అనుకుంటోంది? అని స్కాట్లండ్‌కు చెందిన లూసియానో ప్రశ్నించారు.
దక్షిణ ఇజ్రాయెల్ నుంచి పనిచేస్తున్న మా చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లైసీ డౌసెట్ దీనికి సమాధానం ఇచ్చారు.
గతంలో జరిగిన యుద్ధాల్లో హమాస్‌పై చావు దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు పంపే సామర్థ్యంతోపాటు భూగర్భ సొరంగాలన్నీ ధ్వంసం చేస్తామని చెప్పింది.
కానీ, నేడు పరిస్థితులు భిన్నమైనవి. ప్రస్తుతం హమాస్‌ను ఇస్లామిక్ స్టేట్ తరహాలోనే కూకటివేళ్లతో పెకలించేయాలని ఇజ్రాయెల్ అంటోంది.
హమాస్ మౌలిక సదుపాయాలను, సొరంగాలను, కమాండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేయగలిగే శక్తి ఇజ్రాయెల్ సైన్యానికి ఉంది.
కానీ, గాజాలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎలాంటి స్పష్టతా లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం గురించి చాలా సున్నితమైన సమాచారం సేకరించి, విధ్వంసకర దాడి చేయగలిగేలా మారిన హమాస్ సైనిక శక్తిని చూసి ఇజ్రాయెల్ ప్రజలు షాక్‌కు గురయ్యారు.
బహుశా నేడు గాజాలోకి ఇజ్రాయెల్ ప్రవేశించి దాడులు చేపట్టేటప్పుడు కూడా హమాస్ అంతే దీటుగానూ స్పందించొచ్చు కూడా.
ఇస్లామిక్ స్టేట్ సంస్థ కంటే హమాస్ చాలా భిన్నమైనది. పాలస్తీనా ప్రజల్లో రాజకీయంగా, సామాజికంగా వేళ్లూనుకున్న సంస్థ ఇదీ.
సైనిక చర్యలతో హమాస్ స్థావరాలను దెబ్బతీయొచ్చు. కానీ, దీని వల్ల సంస్థ కోసం ప్రాణాలకు తెగించి పోరాడాలనే వారి సంకల్పం మరింత దృఢంగా మారుతుంది.
హమాస్ లక్ష్యం ఏమిటి?
‘‘ఈ దాడుల ద్వారా హమాస్ ఏం సాధించాలని అనుకుంది?’’ అని బ్రిటన్‌కు చెందిన ఆండ్ర్యూ పార్కర్ ప్రశ్నించారు.
దీనిపై మా సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డెనర్ సమాధానం ఇచ్చారు.
తాము ఎందుకు ఈ దాడి చేశామో హమాస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అల్-దీఫ్ స్పందిస్తూ.. ‘‘ఇక చాలు. మీరు మమ్మల్ని నిత్యం రెచ్చగొడుతూనే ఉన్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లలో ఇజ్రాయెల్ చేతుల్లో పాలస్తీనా ప్రజలు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. వీటికి స్పందనగానే మేం దాడులు చేశాం’’ అని అన్నారు.
అయితే, ఈ దాడి వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ దాడికి ముందుగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు దౌత్య సంబంధాలను ఏర్పరుచుకుంటున్నాయి. దీన్ని హమాస్‌తోపాటు ఇరాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ చర్చలను సౌదీ పక్కన పెట్టేసింది.
దీని వెనుక ఇంకొన్ని కారణాలు కూడా ఉండొచ్చు.
ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడీషియల్ సంస్కరణలపై ప్రజల్లో విభేదాలను హమాస్ నాయకులు గుర్తించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై తీవ్రమైన దెబ్బ కొట్టాలని అనుకున్నారు. దీనిలో వారు విజయం సాధించారు కూడా.
ఈజిప్టు ఎందుకు సరిహద్దులను మూసే ఉంచుతోంది?
‘‘కుటుంబం, సౌభ్రాతృత్వం గురించి ముస్లింలు తరచూ మాట్లాడుతుంటారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాతో సరిహద్దులను ఈజిప్టు మూసే ఉంచడాన్ని అక్కడి ముస్లింలు ఎలా చూస్తారు?’’ అని బ్రిటన్‌కు చెందిన డయానా ప్రశ్నించారు.
దక్షిణ ఇజ్రాయెల్ నుంచి పనిచేస్తున్న మా ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ దీనికి సమాధానం ఇచ్చారు.
ఇస్లాం అనేది ఒక మతం. అయితే, దేశ భద్రతకు సంబంధించిన రాజకీయాలకూ ఇది దిశానిర్దేశం చేయాల్సిన పనిలేదు.
గాజాలో ప్రజలకు సాయం చేయాలని ఈజిప్టు ముస్లింలలోని లక్షల మంది కోరుకుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కానీ, సాధారణ సమయంలోనూ రఫా క్రాసింగ్ ద్వారా ప్రజల రాకపోకలను ఈజిప్టు అనుమతించడం లేదు. 2007లో గాజాను హమాస్ తమ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత, ఈ ప్రాంతాన్ని దిగ్బంధించేందుకు ఇజ్రాయెల్ తీసుకొచ్చిన విధానాల్లో ఈజిప్టుకు కూడా భాగస్వామ్యముంది.
శతాబ్దం క్రితం ఈజిప్టులో ఏర్పాటైన ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థతో హమాస్‌కు సంబంధాలున్నాయి. ఇస్లామిక్ బోధనలు, విశ్వాసాలకు అనుగుణంగా దేశాలను మార్చేందుకు ముస్లిం బ్రదర్‌హుడ్ పనిచేసేది.
అయితే, ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఈజిప్టు సైన్యం వ్యతిరేకిస్తోంది. 2013లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముస్లిం అధ్యక్షుడిని కూడా ఈజిప్టు సైన్యం పదవీచ్యుతుడిని చేసింది.
అయితే, ప్రస్తుతం ఈజిప్టు ప్రభుత్వానికి హమాస్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇదివరకు హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య ఈజిప్టు ప్రభుత్వం మధ్యవర్తిత్వం కూడా చేసింది. కానీ, నేడు పాలస్తీనా శరణార్థులు తమ దేశంలోకి పోటెత్తడాన్ని ఈజిప్టు అసలు కోరుకోవడం లేదు.
శరణార్థుల కోసం 75 ఏళ్ల క్రితం గాజాలో ఏర్పాటుచేసిన శిబిరాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వారికి నేటికీ సొంత ఇళ్లు అనేవే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తమ దేశంలో చోటు ఇవ్వాలని ఈజిప్టు కోరుకోవడం లేదు.
హమాస్ యుద్ధ నేరాలకు పాల్పడిందా?
‘‘ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇంటర్నేషనల్ అరెస్టు వారెంట్ ఉంది. కానీ, హమాస్ నాయకులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇంత పెద్ద దాడి చేపట్టడం యుద్ధ నేరం కిందకు రాదా?’’ అని బ్రిటన్‌కు చెందిన సైమన్ ప్రశ్నించారు.
మా వరల్డ్ అఫైర్స్ కరస్పాండెంట్ పాల్ ఆడమ్స్ దీనికి సమాధానం ఇచ్చారు.
చాలా ఏళ్ల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేటప్పటికీ, అక్టోబరు 7కు ముందువరకూ హమాస్‌తో యుద్ధంలో ఉన్నట్లు ఇజ్రాయెల్ ఎప్పుడూ చెప్పలేదు.
వీటిని ఉగ్రవాద చర్యలుగానే ఇజ్రాయెల్ చెప్పేది.
కానీ, బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం తమదైన శైలిలో ఈ విషయంలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే భారీ నరమేథాలు సృష్టించిన ఇద్దరు హమాస్ కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చింది.
భవిష్యత్‌లో ఇలాంటివి మరికొన్ని జరుగుతాయి.
అయితే, ఖతార్, లెబనాన్‌లలో జీవించే హమాస్ రాజకీయ నాయకత్వానికి తమ సైనిక విభాగం దాడులతో ఎలాంటి సంబంధమూలేదని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదే అసలు ప్రశ్న.
వైమానిక దాడుల విషయంలో ఐక్యరాజ్యసమితి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?
‘‘వైమానిక దాడుల్లో ఇప్పటికే చాలా మంది సాధారణ ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని అందరూ అంగీకరిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఐక్యరాజ్యసమితి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?’’ అని లండన్‌కు చెందిన సాదుల్ హక్ ప్రశ్నించారు.
దీనిపై మా డిప్లమాటిక్ కరస్పాండెంట్ జేమ్స్ లాండేల్ సమాధానం ఇచ్చారు.
నేడు వైమానిక దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌కు చాలా దేశాలు చెప్పకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, హమాస్ దాడిని తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వారు భావిస్తున్నారు.
అయితే, దాడుల విషయంలో కాస్త సంయమనం పాటించాలని కొందరు కోరుతున్నారు.
తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ స్పందిస్తూ...‘‘సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రితో నేను మాట్లాడాను’’ అని అన్నారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని కోరింది.
కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ స్పందిస్తూ.. ‘‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, హ్యూమన్ రైట్స్ లా లను గౌరవించాలి. సాధారణ ప్రజలను రక్షించాలి. వారిని షీల్డులుగా ఎవరూ ఉపయోగించుకోకూడదు’’ అని అన్నారు.
అయితే, గాజాలోని హమాస్ లక్ష్యాలపైనే వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, ఈ దాడుల్లో చనిపోతున్న వారిలో సాధారణ ప్రజలు కూడా ఉంటున్నారు. అయితే, వీరికి హమాస్ హ్యూమన్ షీల్డులుగా ఉపయోగించుకుంటోందని ఇజ్రాయెల్ అంటోంది.
అసలు హమాస్ దాడి గురించి ఇజ్రాయెల్‌కు ఎందుకు తెలియలేదు?
‘‘గాజాలో హమాస్ నాయకులు ఎక్కడ తలదాచుకున్నారో కూడా ఇజ్రాయెల్‌కు తెలిసినప్పుడు, వారి దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యానికి ముందుగా ఎందుకు సమాచారం లేదు?’’ అని ఒక పాఠకుడు ప్రశ్నించారు.
దీనిపై జెరూసలేంలోని మా పశ్చిమాసియా ప్రతినిధి యోలాండ్ నెల్ సమాధానం ఇచ్చారు.
గాజాపై నిఘా కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ సెంటర్‌కు ఇజ్రాయెల్ సైన్యం కొంతమంది జర్నలిస్టులను కూడా తీసుకెళ్లి చూపించింది. అధునాతన సదుపాయాలు, కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెడుతున్నట్లు వాటిని చూస్తే తెలుస్తుంది.
అంతేకాదు చాలా మంది క్షేత్రస్థాయిలో ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారు.
మే నెలలో ఉద్రిక్తల సమయంలో ఇజ్రాయెల్ నిఘా సమాచారం పక్కాగా పనిచేసింది. మిలిటెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఆనాడు ఇజ్రాయెల్ మిలిటరీ కనిపెట్టింది.
కానీ, తాజా దాడుల విషయంలో తమ నిఘా, భద్రతా విభాగాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఇజ్రాయెల్ సైన్యాధికారులు అంగీకరించారు.
హెజ్బొల్లాతో హమాస్‌ను పోల్చొచ్చా?
గాజాకు ఉత్తరంగా లెబనాన్, ఇజ్రాయెల్‌ల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, హమాస్‌తో పోల్చినప్పుడు హెజ్బొల్లా ఎంత పెద్ద దళం? అని ఒక పాఠకుడు తెలుసుకోవాలని అనుకున్నారు.
దీనిపై దక్షిణ లెబనాన్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న హ్యూగో బచేగా సమాధానం ఇచ్చారు.
హెజ్బొల్లా ఒక లెబనాన్ సైనిక, రాజకీయ, సామాజిక సంస్థ. హమాస్ కంటే దీన్ని శక్తిమంతమైన సంస్థగా ఇక్కడి వారు చూస్తుంటారు.
ఇరాన్ మద్దతున్న వీరి దగ్గర 1,30,000 రాకెట్లు, క్షిపణులు ఉండొచ్చని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా వేసింది.
హెజ్బొల్లా అమ్ముల పొదిలో ఎక్కువగా ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలపై ప్రయోగించే రాకెట్లే ఉన్నాయి. అయితే, కొన్ని విమాన విధ్వంసక, నౌకా విధ్వంసక క్షిపణులు కూడా వీరి దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని మారుమూల ప్రాంతాలపై దాడి చేయగలిగే క్షిపణులు కూడా వీరి దగ్గర ఉన్నాయి.
హమాస్ దగ్గరున్న ఆయుధ సంపత్తితో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ.
తమ సాయుధ బలగాల్లో 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని హెజ్బొల్లా నాయకుడు చెప్పారు. అయితే, ఈ సంఖ్య 20,000 నుంచి 50,000 వరకూ ఉండొచ్చని కొన్ని అంచనాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది మంచి శిక్షణ పొందిన వారు ఉన్నారు. వీరిలో కొందరు సిరియాలో అంతర్యుద్ధంలో హెజ్బొల్లా తరఫున పోరాడారు కూడా.
అయితే, హమాస్ దగ్గర కూడా దాదాపు 30,000 మంది ఫైటర్లు ఉన్నారని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)