You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం, తక్కువ మంది ఓటర్లున్న సీటు ఏవో తెలుసా?
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడ ఎక్కువ మంది ఓటర్లున్నారు? ఎక్కడ తక్కువ మంది ఉన్నారు?
అక్టోబర్ 4న ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన ఓటర్ల జాబితా ప్రకారం చూసుకుంటే తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493, మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339.
అక్టోబర్ 30 వరకు ఓటర్ నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్యలో కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య పరంగా అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఓటర్ల సంఖ్యపరంగా అతి చిన్న నియోజకవర్గం భద్రాచలం.
శేరిలింగంపల్లిలో ఓటర్లు ఎంత మంది?
తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గమైన శేరిలింగంపల్లి రంగారెడ్డి జిల్లాలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్న ఈ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 6,98,079 మంది ఓటర్లున్నారు.
ఇక్కడ పురుష ఓటర్లు 3,70,301 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 3,27,636. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 142 మంది ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండడంతో 622 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ.
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) తరువాత 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆరికపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2018 ఎన్నికలలో ఆయన టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
5 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాలు
ఓటర్ల సంఖ్య ప్రకారం శేరిలింగంపల్లి తర్వాతి స్థానాల్లో కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్ ఉన్నాయి.
కుత్బుల్లాపూర్‌లో 6,69,253 మంది, మేడ్చల్‌లో 5,95,382 మంది, ఎల్బీనగర్‌లో 5,66,814 మంది, రాజేంద్ర నగర్‌లో 5,52,363 మంది ఓటర్లు ఉన్నారు.
మహేశ్వరంలో 5,17,241 మంది, ఉప్పల్‌లో 5,10,187 మంది ఓటర్లున్నారు.
రాష్ట్రంలోని మరే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య 5 లక్షలు దాటలేదు.
భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం(ఎస్టీ) నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా తెలంగాణలోనే అత్యంత చిన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 1,45,964 మంది ఓటర్లు ఉన్నారు.
అందులో 70,151 మంది పురుషులు, 75,909 మంది మహిళలు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఈ నియోజకవర్గంలో నలుగురున్నారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 176 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది.
భద్రాచలం నుంచి ప్రస్తుతం పొడెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ స్థానాల్లో 2 లక్షల మంది కంటే తక్కువ
భద్రాద్రి జిల్లాలోనే అశ్వారావుపేట(ఎస్సీ) నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య తక్కువే. ఈ నియోజకవర్గంలో 1,53,757 మంది ఓటర్లున్నారు.
రెండు లక్షల కంటే తక్కువ సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గాలలో ఖమ్మం జిల్లాలోని వైరా(ఎస్టీ), భద్రాద్రి జిల్లాలోని పినపాక(ఎస్టీ), సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్(ఎస్సీ), నిజామాబాద్ జిల్లాలోని బాన్స్‌వాడ, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి(ఎస్సీ), చెన్నూరు(ఎస్సీ) ఉన్నాయి.
రెండు లక్షల మంది కంటే తక్కువ ఓటర్లున్న ఈ 9 నియోజకవర్గాలలోనూ పురుషల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
ఎక్కువ సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గమైన శేరిలింగంపల్లిలో 2018 ఎన్నికలలో 48.61 శాతం మందే తమ ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం 80.41 శాతం పోలింగ్ నమోదైంది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఆరికపూడి గాంధీ రెండు సార్లు గెలిచారు. 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్ నుంచి గెలవగా అంతకంటే ముందు 2009లో కాంగ్రెస్ నుంచి భిక్షపతి యాదవ్ ఇక్కడ విజయం సాధించారు.
భద్రాచలం నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతుండగా ఒక్కసారి మినహా అన్నిసార్లూ వామపక్షాలు, కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1952 నాటి తొలి ఎన్నికలలో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థి గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)