బీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేసిందేంటి?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలకు ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, పింఛన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, కార్పొరేషన్ల ఏర్పాటు వంటి ఎన్నో హామీలు ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రం మరో నెల రోజుల్లో ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో ఆనాటి మేనిఫెస్టోలోని ఎన్ని హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చింది, వాటి అమలు తీరు ఎలా ఉందనే అంశాలపై బీబీసీ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.

కేశవరావు నేత్వత్వంలో కమిటీ

2018 ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారు చేయడానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు కె.కేశవరావు నాయకత్వంలో మేనిఫెస్టో రూపకల్పన కమిటీ వేశారు.

2018 డిసెంబరు 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో దాన్ని కేసీఆర్ విడుదల చేశారు.

వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించినట్లుగా కేసీఆర్ ప్రకటించారు.

సాధ్యాసాధ్యాలను పరిశీలించి, మిగిలిన ప్రతిపాదనలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు.

2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు, ప్రజలకు అవసరమని భావించిన రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి 76 కొత్త పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అప్పట్లో కేసీఆర్ చెప్పారు.

2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు:

  • అన్ని రకాల ఆసరా పెన్షన్లు రూ.1000 నుంచి రూ.2016కు పెంపు. వికలాంగుల పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను 2018 వరకు పొడిగింపు.
  • వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు
  • నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి
  • ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం.
  • రైతు బంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
  • రైతులకు రూ.1 లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ.
  • రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక అమలు.
  • చట్ట సభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వ పోరాటం.
  • ఎస్టీలకు 12 శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు కేంద్రంతో రాజీలేని పోరాటం.
  • ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి ఆమోదం కోసం పోరాటం.
  • వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనల పరిశీలన.
  • రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్ల ఏర్పాటు.
  • వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లపై పరిశీలన.
  • అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.
  • కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన
  • ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ.
  • ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం.
  • పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు.
  • అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కుల కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాల వర్తింపు
  • బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు.
  • సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు.
  • హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం.

మేనిఫెస్టో అమలుపై బీఆర్ఎస్ ఏం చెబుతోంది?

2018 మేనిఫెస్టో అమలు తీరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘2018 మేనిఫెస్టోలో చెప్పినవి చేశాం.. చెప్పనివి కూడా చాలా చేశాం. రోజూవారీ కార్యక్రమాలకు ఎక్కడా అప్పులు తీసుకోలేదు. మున్ముందు ఆదాయం తీసుకు వచ్చే ప్రాజెక్టులకే డబ్బులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టాం. హైదరాబాద్‌కే కాకుండా తెలంగా‌ణలో అన్ని మూలలకు అభివృద్ధి సాధ్యపడేలా చేశాం’’ అని వినోద్ కుమార్ చెప్పారు.

‘‘పవర్, నీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కట్టాం. మరో ఇరవై ఏళ్ల వరకు మౌలిక వసతుల కల్పనకు ని‌ధులు కేటాయించాల్సిన అవసరం లేకుండా ప్రగతి కార్యక్రమాలు చేపట్టాం. ఇక నుంచి నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టడానికి వీలు చిక్కనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్దఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చాం’’ అని వినోద్ కుమార్ బీబీసీతో చెప్పారు.

అయితే, 2018 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన కొన్ని హామీలు నెరవేర్చగా.. మరికొన్ని పెండింగులో ఉన్నాయి.

నిరుద్యోగ భృతి విషయంలో యువత ఏమంటున్నారు?

ఈసారి బీఆర్ఎస్‌ను కలవరపరుస్తున్న అంశం నిరుద్యోగం.

నిరుడు 80 వేల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ప్రకటించింది.

పేపర్ లీకేజీ ఘటనలు, గ్రూప్ పరీక్షల వరుస వాయిదాలు, క్యాలెండర్ ప్రణాళికలో లోపం.. ఇలా వరుస వివాదాలతో భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని నిరుద్యోగులంటున్నారు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. దాదాపు 34 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి అందిస్తామని మేని‌ఫెస్టోలో ప్రధానంగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ.

అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1810 కోట్లను కేటాయించింది. ఆ తర్వాత హామీ విషయాన్ని ప్ర‌భుత్వం పూర్తిగా పక్కన పడేసింది.

‘‘ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇస్తే మా కోచింగ్‌కు ఎంతో సాయపడేది. చాలామంది నిరుద్యోగ యువత ఊళ్ల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అలాంటివారికి ఈ సాయం చాలా ఉపయోగపడేది. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం నిరుద్యోగ భృతి విషయాన్నే పట్టించుకోలేదు’’ అని గ్రూప్ 2కు సిద్ధమవుతోన్న అభ్యర్థి భానుచందర్ బీబీసీతో అన్నారు.

‘‘నిరుద్యోగ భృతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాలుగున్నరేళ్లలో ఏ విధమైన ప్రణాళిక చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పలేదు. ఒకవైపు నోటిఫికేషన్ల విషయంలో గందరగోళంతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

పింఛను అర్హతా వయసు తగ్గించినా..

వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది ప్రభుత్వం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాకపోవడంతో అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదు.

‘‘పెన్షనర్ల వి‌షయంలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. దరఖాస్తుల తీసుకున్నాక పరి‌శీలన పూర్తి చేసిన కొందరికే పింఛన్లు అందిస్తున్నారు. దరఖాస్తుదారుల వయసు విషయంలో అనుమానాలు రావడంతో ప్రస్తుతం పరిశీలన ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు రావాల్సి ఉంది.’’ అని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఒకరు బీబీసీతో అన్నారు.

ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కుదింపు

అర్హులైన పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.

అప్పటికే నడుస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే కొత్త పథకం తీసుకు వస్తామని చెప్పింది.

ఎట్టకేలకు ఎన్నికల ఏడాదిలో గృహలక్ష్మి పేరిట పథకానికి రూపకల్పన చేసింది.

అయితే, 2018 మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.

అయితే, కేవలం రూ.౩ లక్షల సాయం మాత్రమే చేసేలా నిబంధనలు తీసుకొచ్చారు.

పునాది దశలో రూ.లక్ష, శ్లాబు దశలో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పటికే పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించింది. అయితే, ఇవి పరిశీలన దశలోనే ఉన్నాయి. బీబీసీ కథనం రాసేనాటికి ఒక్కరికీ ఆర్థిక సాయం అందలేదు.

కార్పొరేషన్లు ప్రకటనకే పరిమితం

రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామనే హామీ పూర్తి కాలేదు.

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆదుకునేందుకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లో సర్కారు ప్రకటించింది.

నిరుడు జూన్‌లో సిరిసిల్లలో రెడ్డి సంక్షేమ సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్.. ‘‘రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా’’ అని చెప్పారు.

కార్పొరేషన్ల ఏర్పాటుపై వైశ్య వికాస వేదిక ఛైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ‘‘రూ.1000 కోట్లు కేటాయించి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకడిన వైశ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

వైశ్య, రెడ్డి కులాల్లోని పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కచ్చితంగా కృషి చేస్తుందని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీబీసీతో అన్నారు.

పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్

ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

దీనికి సంబంధించి ఇటీవల వేతన సవరణ కమిటీని నియమించింది. ఇందులో తాత్కాలిక భృతి (ఐఆర్) ఐదు శాతమే ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సాధ్యమేనా..?

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మహిళా సంఘాలు, ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు.

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అంచనా ప్రకారం తెలంగాణలో టమాటా, ఉల్లి, బియ్యం, మొక్కజొన్న, ద్రాక్ష, బొప్పాయి వంటి పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది.

మహిళా సంఘాలు, ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసే యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తోంది.

మొత్తం రూ.2 కోట్లకు మించని యూనిట్లకు టర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీకి పది శాతం రాయితీని అందిస్తోంది.

ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన సెర్ప్ సాయంతో మహిళా స్వయం సహాయక సంఘాల నేతృత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి జిల్లాకో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలో 4,35,364 మహిళా సంఘాల్లో 45.60లక్షల మంది సభ్యులున్నారు.

ఇప్పటికే దాదాపు 500కు పైగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు తప్ప ఎన్నికల ముందు ఇచ్చినట్లుగా ఐకేపీ ఉద్యోగులు, మహిళా సంఘాల సమన్వయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయలేదు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకురాలేదు.

రిజర్వేషన్లపై పట్టు సడలిందా...

మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో రిజర్వేషన్ల అంశం కీలకమైనది.

ఇది రాజకీయంగా ముడిపడింది.

చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు బీఆర్ఎస్ కొన్ని సందర్భాల్లోనే ప్రయత్నాలు చేసింది.

ముఖ్యంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు.

దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులోనే గళమెత్తారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఈసారి బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ వివాదం రేగింది. కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

వర్గీకరణ ఏళ్లుగా అంతే..

ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రయత్నాలు పెద్దగా కనిపించలేదు.

ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు ఈ జులై 27న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి నారాయణ స్వామి పార్లమెంటులో ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశంపై ఏపీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆ మేరకు నారాయణ స్వామి పార్లమెంటులో ప్రకటన చేశారు.

గతంలో ఉమ్మడి ఏపీలో వేసిన కమిషన్ రాజ్యాంగ సవరణ చేయాలని సూచించినట్లు చెప్పారు.

‘‘గతంలో తలెత్తిన సమస్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరాం. ఇప్పటివరకు 20 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి స్పందన తెలియజేశాయి. ఏడు రాష్ట్రాలు ఎస్సీ కులాల వర్గీకరణకు సానుకూలత వ్యక్తం చేశాయి. 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం దీన్ని వ్యతిరేకించాయి. ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ప్రస్తుతం వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది’’ అని నారాయణ స్వామి చెప్పారు.

పోడు విషయంలో చెప్పిందేమిటి, చేసిందేమిటి?

పోడు భూములకు ప్రభుత్వం జూన్‌లో పట్టాలు పంపిణీ చేసింది. ఈ విషయంలోనూ వివాదం రాజుకుంది.

ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనకు, వాస్తవంగా చేసిన పంపిణీకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు వామపక్ష నేతలు చెబుతున్నారు.

2021లో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల నుంచి జిల్లా స్థాయిల్లో దరఖాస్తులు తీసుకుంది. దాని ప్రకారం 4,14,353 మంది 12,46,846 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

గత ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం 11.50 లక్షల ఎకరాల పోడు భూములున్నాయని చెప్పారు.

కానీ, జూన్, జులై నెలల్లో ప్రభుత్వం చేసిన పంపిణీ మేరకు 1,50,012 లబ్ధిదారులకు 4,05,601 ఎకరాలను అందించింది.

ఈ విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క బీబీసీతో మాట్లాడారు.

‘‘పోడు రైతులకు ప్రభుత్వం చెప్పిన మాటకు, తర్వాత అమలుకు పొంతన లేదు. క్షేత్రస్థాయిలో ఇంకా చాలా మందికి పట్టాలు దక్కలేదు. ఈ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది. పైగా పట్టాలు ఇచ్చినప్పటికీ, అవి శాశ్వతం కాదని చెబుతోంది. అలాంటప్పుడు పట్టాలు ఇవ్వడం ఎందుకు..? బీఆర్ఎస్ మేని‌ఫెస్టో అమలు చేయకుండా మోసం చేసిన విషయంపై ప్రజల్లోకి తీసుకెళుతున్నాం’’ అని చెప్పారు.

హెల్త్ ప్రొఫైల్ రెండు జిల్లాలకే పరిమితం

కంటి వెలుగు తరహాలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, అది ముందుకు సాగలేదు.

రెండో విడత కంటివెలుగు పరీక్షలను ప్రభుత్వం చేసింది.

హెల్త్ ప్రొఫైల్ విషయంలో పైలెట్ ప్రాజెక్టుగా 2022 మార్చిలో ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టారు.

దాదాపు 30 రకాల వైద్య పరీక్షలు చేసి ప్రతి వ్యక్తి ఆరోగ్య డేటా చేస్తారు. కానీ, ఈ ప్రాజెక్టు మిగిలిన జిల్లాలకు విస్తరించలేదు.

కటాఫ్ డేట్ పొడిగించినా..

బీడీ కార్మికులకు పింఛన్ల కటాఫ్ డేట్ 2018 నాటికి పొడిగించాలని నిరుడు సెప్టెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులకు రూ.2016 పింఛను పొందేందుకు అర్హులవుతారు.

కానీ, ప్రభుత్వం కటాఫ్ డేట్ పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు జిల్లాలకు రాలేదని చెబుతూ అధికారులు దరఖాస్తులు తీసుకోవడం లేదని బీడీ కార్మికులు చెబుతున్నారు.

బయ్యారం... అగ్రవర్ణ పేదల పథకాలు రాలేదు

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు.

అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక పథకాలు తీసుకు వస్తామనే హామీ విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.

అమలైన హామీలు..

ఐదేళ్ల కాలంలో మేనిఫెస్టోలో ప్రకటించిన కొన్ని హామీలను బీఆర్ఎస్ అమల్లోకి తీసుకువచ్చింది.

  • ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్లను రూ.2016కు పెంచి అమలు చేస్తోంది.
  • అదే సమయంలో వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను రూ.3016కు పెంచింది. మళ్లీ అదనంగా రూ.వేయి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • రాష్ట్రంలో దాదాపు పది కేటగిరీల కింద పింఛన్లు అందిస్తున్నారు.
  • ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ గణాంకాలను బీబీసీ పరిశీలించినప్పుడు.. 43,68,784 మందికి పింఛన్లు అందిస్తున్నట్లుగా ఉంది.
  • రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం పెంచి అందిస్తోంది. తొలుత పథకాన్ని ప్రారం‌‍‌‍భించినప్పుడు ఎకరాకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.8 వేలను ప్రభుత్వం అందించింది. 2019 జూన్ నుంచి ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.10 వేలు అందిస్తోంది.
  • సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి నిరుడు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. శ్రీరాంపూర్ ప్రాంతంలోని 176 ఎకరాల్లోని 2843 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు.
  • హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యలు మరింత ముమ్మరం చేస్తామని మేనిఫెస్టోలో చివరి హామీగా చేర్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ దిశలో కొంత కదలిక ఉంది. ముఖ్యంగా ఫ్లై ఓవర్లు, నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా 47 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటివరకు 31 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటికితోడు ఉప్పల్ వద్ద స్కైవాక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, రహదారులు, ట్రా‌ఫిక్ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని నగరవాసులు కోరుతున్నారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61ఏళ్లకు పెంచింది. అదే సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాల అర్హత వయసును మూడేళ్లు పెంచుతామని హామీ ఇచ్చింది. దీనికి భిన్నంగా ఏకంగా ఉద్యోగాలకు అర్హత వయసు పదే‌ళ్లకు పెంచింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరి‌ష్ఠ వయో పరిమితి 34ఏళ్లు ఉండేది. నిరుడు మార్చిలో 44ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రుణమాఫీ అమలు ఎలా జరిగిందంటే...

రైతులకు రూ.ఒక లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం ని‌ధులు విడుదల చేసింది.

గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 2018 డిసెంబరు 11వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది.

నాలుగున్నరేళ్లపాటు రుణమాఫీలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా ఈ నెల 3వ తేదీ నుంచి దశల వారీగా రూ.19వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. గతంలో రూ.36వేల లోపు ఉన్న రుణాలకు సంబంధించి రూ.1207 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

చివరికి ఆగస్టు 14వ తేదీన 9.02 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.5,807.78 కోట్లను విడుదల చేస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది.

ఈ నిధులను రూ.99,999 వరకు ఉన్న రుణాలకు జమ చేస్తూ బ్యాంకుల్లో వేస్తున్నట్లు తెలిపింది.

నాలుగేళ్లుగా రు‌ణమాఫీ అవుతుందని లోన్లు కట్టకపోవడంతో వడ్డీభారం పెరిగిపోయింది. వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించి మాఫీ చేయాలని రైతు సంఘ నాయకులు చెబుతున్నారు.

దళిత బంధు అమలు

ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అ‌భివ్రద్ధి కోసం ప్రత్యేక పథకాల పేరిట దళిత బంధును ప్రభుత్వం తీసుకువచ్చింది.

హుజురాబాద్ ఎన్నికల ముందు దీన్ని హడావుడిగా తీసుకువచ్చారనే విమర్శలున్నప్పటికీ, అమలు విషయంలో ముందడుగు వేస్తోంది.

ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే దీనిపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు..

‘‘దళితబంధు పథకం కింద ఆర్థిక సాయం నియోజకవర్గంలో చాలా కొద్ది మందికే అందిస్తున్నారు. అవి కూడా అధికార పార్టీ నాయకులకే పథకం వెళుతోంది’’ అని జీవన్ రెడ్డి అన్నారు.

ఈ పథకం కింద నియోజవకర్గానికి వంద మందికి చొప్పున సాయం అందిస్తుండటంతో మిగిలిన లబ్దిదారులు ఎదురుచూపులకే పరిమితం అయ్యారు. మరోవైపు లబ్ధి పొందిన వారు యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలుదొక్కుకున్నట్లు ప్ర‌భుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)