You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- రచయిత, డాక్టర్ రాజేంద్ర బార్వే
- హోదా, బీబీసీ కోసం
నిరంతరం సంజు ఏవో ఆలోచనలతో మథనపడుతుంటాడు. అతడి వల్ల అతడి తల్లి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
‘‘అసలు నీకు పెళ్లి ఎలా అవుతుంది? నీ భార్య నీతో ఎలా వేగుతుంది?’’ అని తల్లి అడిగినప్పుడు ఏదో లోకం లోనుంచి అప్పుడే బయటకు వచ్చినట్లుగా ‘‘నువ్వు ఇప్పుడు నన్ను ఏమైనా అడిగావా?’’ అని సంజు ప్రశ్నించేవాడు.
‘‘అంతా బానే వుంది. కానీ, ముందు ఇలా తీవ్రంగా ఆలోచించడం నువ్వు ఆపాలి’’ అని సంజుకు అతడి తల్లి చెప్పేవారు.
‘‘అమ్మా.. నేను నువ్వు అనుకునేంతగా ఏమీ తీవ్రంగా ఆలోచించడం లేదు. నువ్వు చెప్పే ఆ కుటుంబ వ్యవహారాలపై నాకు అంత ఆసక్తి లేదు’’ అని సంజు దానికి సమాధానం ఇచ్చేవాడు.
మొత్తంగా సంజు అతి ఆలోచనలపై వీరు మానసిక నిపుణుడికి సంప్రదించారు. అక్కడే వీరి చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.
సునీత కథ కాస్త భిన్నమైనది. తనకు వచ్చే ఆలోచనల గురించి ఆమెకు అవగాహన ఉంది.
‘‘ఈ ఆలోచనలతో అలసిపోతున్నాను. ఒక్కోసారి ఏవోవో ప్రశ్నలు, ఆలోచనలు నాకు ఊపిరి సలపకుండా చేస్తుంటాయి. ఎందుకు అంతలా ఆలోచిస్తుంటావని చాలా మంది నన్ను అడుగుతుంటారు. నిజానికి నాక్కూడా అలా ఆలోచించాలని ఆసక్తి ఏమీ ఉండదు. కానీ, ఏం చేయను? నెగిటివ్ ఆలోచనలు నిత్యం అలా నన్ను సతమతం చేస్తూనే ఉంటాయి’’ అని ఆమె చెప్పారు.
ప్రసాద్ సమస్య మరింత భిన్నమైనది. ఆయనకు నెగెటివ్ ఆలోచనలు రావడం మాత్రమే కాదు, తరచూ తన చేతులకు ఏదో మట్టి అంటుకున్నట్లుగా ఆయనకు అనిపిస్తుంటుంది.
కొన్నిసార్లు ఈ సమస్య చేతులతో ఆగిపోదు. కడుపులో కూడా తీవ్రమైన నొప్పి వచ్చినట్లుగా ప్రసాద్‌కు అనిపిస్తుంటుంది. అసలు తన శరీరంలో ఏం జరుగుతోందో కూడా ఆయనకు తెలిసేది కాదు.
చేతులకు అంటినట్లు అనిపించే ఆ మట్టిని వదిలించుకునేందుకు ఆయన పదేపదే చేతులు సబ్బుతో కడుక్కుంటుంటారు. అయితే, మళ్లీ కొంతసేపటికే మళ్లీ ఏదో మట్టి అంటుకున్నట్లుగా ఆయనకు అనిపిస్తుంది.
ఆయనకు అతి ఆలోచనలతోపాటు మళ్లీమళ్లీ చేతులు కడుక్కొనే సమస్య కూడా వెంటాడేది. అసలు ఇలాంటి సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉంటుందా?
పైన పేర్కొన్న మూడు కథలూ మూడు కేస్ స్టడీలు. అసలు ఓవర్ థింకింగ్ వెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ సంజు చెప్పే విషయంలోనూ పాయింట్ ఉంది. తనకు ముఖ్యం అనిపించే అంశాల గురించే తను ఆలోచిస్తున్నాడు.
ఇతరులు చెప్పే అంశాలపై అతడికి అంత ఆసక్తి లేదు. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ‘క్రియేటివ్’గా చెబుతుంటారు. అయితే, ఇది కూడా ఒక సమస్యే. దీన్ని మనం పరిష్కరించొచ్చు.
సంజు తన ఆలోచనల్లో తానే మునిగిపోతున్నాడు. ఆలోచనలే అతడికి ఒక అలవాటులా మారిపోయాయి. ఈ విషయాన్ని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా మొదట చెప్పాల్సి ఉంటుంది.
అన్నీ తెలుసుకున్న తర్వాతే అతడిని ఆమె పెళ్లి చేసుకోవాలి. అదే సమయంలో అతడు కుటుంబ వ్యవహారాలకు కూడా కొంత సమయం కేటాయించేందుకు ప్రయత్నించాలి. ఆ సమయంలో ఇతర ఆలోచనలను అతడు పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు సునీత దగ్గరకు వద్దాం. ఆమె ఓవర్ థింకింగ్‌ను రూమినేషన్‌గా పిలుస్తాం. ఆవులు ఎలా తాము తిన్న ఆహారాన్ని మళ్లీ ఎలా నోటిలోకి తెచ్చుకుని నములుతాయో సునీత ఆలోచనలు కూడా అంతే. అయితే, అలా చేయడం వల్ల ఆవులకు మెరుగ్గా జీర్ణం అవుతుంది. కానీ, సునీతకు మాత్రం దీని వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండటం లేదు.
కాలంతో ఆమె ఆలోచనలు పోటీపడుతున్నట్లుగా ఆమెకు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి భవిష్యత్‌లో ఏం అవుతుందోనని ఆమె చాలా ఆందోళన పడుతుంటారు.
ఆ భయాన్నే ఆమె నెగిటివ్ థింకింగ్‌గా చెబుతున్నారు. ఆమె అయితే, భవిష్యత్ గురించి ఆందోళన పడుతున్నారు. లేదా గతంలో చేసిన తప్పుల గురించి పశ్చాత్తాప పడుతున్నారు.
ఈ ఆలోచనల వల్ల ఆమె ప్రస్తుతంలో ఉండలేకపోతున్నారు. అందుకే ఆమె నిత్యం భయంలో జీవించాల్సి వస్తోంది.
ఇలాంటి ఆలోచనల నుంచి మనం బయటపడొచ్చు. అయితే, దీనికి మనకు మనమే ప్రయత్నం చేయాలి. ఆ ఆలోచనల సుడిగుండం నుంచి బయట పడగలమని గట్టిగా నమ్మాలి.
ఇక ప్రసాద్ ఓవర్ థింకింగ్ విషయానికి వస్తే.. దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)గా పిలుస్తారు. ఈ రుగ్మత పీడించేవారు బుర్రలో కొన్ని విషయాలను గట్టిగా నమ్ముతుంటారు. కాలం గడిచేకొద్దీ ఆ ఆలోచనలు మరింత బలపడతాయి. అలా వాటితోపాటు వచ్చే యాంగ్జైటీ (ఆందోళన) కూడా ఎక్కువ అవుతుంది.
ఆ ఆందోళన తగ్గేందుకు వారు ఏదో ఒక పని చేయడం మొదలుపెడారు. నెమ్మదిగా ఆ పని పదేపదే చేసేందుకు అలవాటు పడిపోతుంటారు.
ఇక్కడ ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. చేతులు కడుక్కోవడం, లేదా పదేపదే డబ్బులు లెక్క పెట్టడం, లేదా అన్నీ ఉన్నాయో లేదో పదేపదే చూసుకోవడం లాంటివి వారు చేస్తుంటారు.
ఇలాంటి సమస్య చాలా మందికి ఉంటుంది. కానీ, దీన్ని సమస్యగా గుర్తించేందుకు వారు ఇష్టపడరు. దీని వల్ల చాలా సమయం, డబ్బు వృథా కూడా అవుతుంటాయి.
ఇలా సమస్యను చూపించుకోకుండా వెనకడుగు వేయడాన్ని ‘ప్రోక్రాస్టినేషన్’గా చెప్పుకోవచ్చు. అసలు ఇది తప్పా? లేదా సరైనదా? లాంటి విషయాల్లో వారికి స్పష్టత ఉండక వారు అలా చేస్తుంటారు.
వీటికి పరిష్కారం ఏమిటి?
నాణేనికి రెండు వైపులు ఉంటాయి. ఒకసారి ఒకవైపు మాత్రమే చూడగలం. కానీ, ఒకేసారి రెండు వైపులా చూడాలని ప్రయత్నించకూడదు. అంటే ఒకేసారి ప్రస్తుతంతోపాటు గతంలోకో లేదా భవిష్యత్‌లోకో వెళ్లాలని చూడకూడదు.
ఈ సమస్యలకు పరిష్కారం ఉంది. దీని కోసం ఆ వ్యక్తి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి అలవాట్లుగా మారిపోయాయి. వీటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు.
దీని కోసం క్రమశిక్షణ, కఠోర శ్రమ, దృఢ సంకల్పం అవసరం. ఈ సమస్యలను అధిగమించేందుకు కొన్ని సూచనలు కింద ఇస్తున్నాం. అయితే, వాటి వరకూ వెళ్లేముందు ఒక విషయం మీరు తెలుసుకోవాలి.
ఓసీడీలను మందులతో కూడా తగ్గించుకోవచ్చు. మెదడులోని సెరొటోనిన్‌ను నియంత్రించడం ద్వారా ఆ మందులు పనిచేస్తుంటాయి. అయితే, కేవలం మందులు తీసుకుని ఊరుకుంటే సరిపోదు. నిత్యం ఆ అలవాట్లను వదిలించుకునేందుకు కృషి చేయాలి. సాధారణంగా ఆలోచించడం ఎలానే నేర్చుకోవాలి, ఆ సూచనలను ఆచరణలో పెట్టాలి.
సూచనలివీ..
- ఆలోచనల్లో పరిగెడుతున్నారని మీకు అనిపించిన వెంటనే మీరు ఆగిపోవాలి. అంటే ఆ ఆలోచనల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నించాలి.
- మళ్లీ మళ్లీ అవే ఆలోచనలు వస్తున్నప్పటికీ, వాటి వైపు దృష్టి సారించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
- ఏదైనా ఆలోచనలు వచ్చేటప్పుడు ఒక్క నిమిషం చుట్టుపక్కల పరిసరాలపై దృష్టిపెట్టాలి.
- యాంక్సైటీని తగ్గించుకునేందుకు సుదీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇలా తీసుకునే శ్వాస కొంతవరకూ ఆలోచనల నుంచి విశ్రాంతి ఇస్తుంది.
- శ్వాస మీద దృష్టి పెడితే, ఆటోమేటిక్‌గా భవిష్యత్, గతాల గురించి ఆందోళన తగ్గుతుంది.
- వంద శాతం కచ్చితమైన నిర్ణయాలు, ఆలోచనలు ఉండవనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఆలోచించకుండానూ నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిసేపు ఆలోచించడం తప్పనిసరనే విషయాన్ని గుర్తించాలి.
- ఆలోచించడం అనేది మనషులకు ప్రత్యేకమైన వరమనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
(రచయిత మానసిక నిపుణుడు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)
ఇవి కూడా చదవండి:
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)