తిరుమల నడకదారిలో క్రూరమృగాల దాడికి కారణాలు ఇవేనా? కంచె సాధ్యమేనా? - గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

తిరుమల నడకదారిలో చిరుత దాడితో చిన్నారి చనిపోవడంపై సోషల్ మీడియాలో, జనంలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

తూర్పు కనుమల్లోని శేషాచలం కొండల్లో తిరుమల ఉంది. వేంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి అడవుల గుండా నడక దారి, వాహన మార్గాలు ఉన్నాయి.

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో చిరుత దాడి జరిగింది. ఇటీవలి కాలంలో ఇది రెండో ఘటన.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన దాడిలో అయిదేళ్ల బాలుడు గాయపడగా, ఆగస్టు 11 రాత్రి జరిగిన దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది.

దీంతో మెట్ల మార్గంలోకి చిరుతలు, ఇతర జంతువులు ఎందుకొస్తున్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

చిరుతలు ఎందుకు వస్తున్నాయి?

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలోకి తరచూ చిరుతలు రావడానికి అనేక కారణాలున్నాయని రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ అన్నారు.

ఒకటి అకేసియా చెట్లు. తిరుమల కొండలపై పెంచిన అకేసియా చెట్ల వల్ల ప్రస్తుత సమస్య తలెత్తిందని భూమన్ అంటున్నారు.

“గంటా మండపం, నామాల గవి దగ్గర 225 ఎకరాల ప్రాంతం ఉండేది. 1985లో అక్కడ చెట్లు లేవని అకేసియా అనే రకం మొక్కలను టీటీడీ నాటింది.

ఆ చెట్ల వల్ల అక్కడ మొలిచే శ్రీగంధం, ఈత, మిగతా రకాల చెట్లు ఏవీ ఎదగవు. వేరే ఏ మొక్కలూ బతకవు. చెట్లు పెరిగినా కాయలు కాయవు.

దీంతో ఆ ప్రాంతంలో ఆహారం లేక వేరే జంతువులు లేకుండా పోయాయి. అదే ప్రాంతంలో కొన్ని చిరుతలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ఇటీవల దాదాపు 30 ఎకరాల్లో అకేసియా చెట్లను కొట్టేశారు. దీంతో అప్పటి వరకు వాటి నీడలో జీవించిన చిరుత పులులు మనుషులకు దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి” అని భూమన్ తెలిపారు.

అకేసియా చెట్లను కొట్టేసింది వాస్తవమేనని, అయితే అవి కొట్టేయడం వల్లే చిరుతలు ఇటు వైపు వస్తున్నాయనడంలో నిజం లేదని టీటీడీకి చెందిన డీఎఫ్‌వో శ్రీనివాసులు బీబీసీకి తెలిపారు.

భవిష్యత్తులో మరింత ముప్పు ఉందా?

మెట్ల మార్గంలోకి చిరుతలు రావడానికి భూమన్ చెబుతున్న రెండో కారణం దుకాణాలు. వాటిని నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో చిరుతలు, ఎలుగుబంట్లతోపాటు ఏనుగులు కూడా వచ్చే ప్రమాదం ఉందని భూమన్ హెచ్చరిస్తున్నారు.

“దారి పొడుగునా అంగళ్లు ఉన్నాయి. వ్యర్థాలు అడవిలో వేయడం వల్ల వాటికి అలవాటు పడిన సాధు జంతువులు మనుషులకు దగ్గరకు వస్తాయి. ఆ జంతువుల కోసం చిరుతలు వస్తుంటాయి. ముందుగా దుకాణాలను నియంత్రించాలి.

యాత్రికులు తాము వెంట తెచ్చే పదార్థాలను కొండల్లో పడేస్తుంటారు. అలా కాకుండా చెత్త డబ్బాల్లో వేయాలి. ఈ అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో ఎలుగుబంట్లు, చిరుతలు, ఏనుగులతోనూ ప్రమాదం పొంచి ఉంది” అని భూమన్ అన్నారు.

ఆంజనేయ స్వామి గుడి దగ్గర గతంలో జింకల పార్కు ఉండేది. జింకల కోసం ఆ ప్రాంతంలో చిరుతల సంచారం పెరగడంతో దాన్ని తీసేశారు.

కానీ, కాలి నడకన వెళ్లే భక్తులు అక్కడ అప్పుడప్పుడూ కనిపించే జింకలకు తినడానికి ఏదో ఒకటి పెడుతుండటంతో ఆ చుట్టు పక్కలకు ఇప్పటికీ జింకలు వస్తున్నాయని తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు అన్నారు.

నడకదారిలో వెళ్లే భక్తులు జింకలకు తినడానికి ఏమీ పెట్టకుండా నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

తిరుమల కొండల్లో క్రూరమృగాల సంచారం కొత్త కాదని భూమన్ అన్నారు.

“గతంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పెట్లు-తాళాలు, అరుపులు, కేకలతో పాటలు పాడుకుంటూ వెళ్లేవారు. ఇప్పుడు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. భజన చేసుకుంటూ వెళ్లే మార్గం కూడా లేదు’’ అని ఆయన చెప్పారు.

తన చిన్నతనంలో తండ్రితో కలిసి తిరుమలకు నడకదారిలో వెళ్లేవాడినని, అప్పట్లో జనం భజనలు చేసుకుంటూ గుంపులు గుంపులుగా వెళ్లేవారని శ్రీకాళహస్తికి చెందిన భక్తుడు వెంకటసుబ్బారెడ్డి చెప్పారు.

మెట్ల మార్గంలో డేంజర్ జోన్లు ఏవి?

తిరుమల చేరుకోవడానికి వాస్తవానికి మూడు నడక మార్గాలున్నాయి. కడప నుంచి కుక్కల దొడ్డి మీదుగా తిరుమలకు వచ్చే మార్గం ఒకటి. దీన్ని అన్నమయ్య నడిచిన మార్గమని చెబుతారు. అయితే ఈ మార్గంలో భక్తులను అనుమతించరు.

రెండోది శ్రీవారి మెట్టు నుంచి మొదలయ్యే నడక దారి. ఈ మార్గంలో మరీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వెళ్లరు.

మూడోది, అలిపిరి నుంచి ప్రారంభమయ్యే మెట్ల మార్గం. తిరుమలకు నడవాలనుకునే మెజారిటీ భక్తులు వెళ్లేది ఈ మార్గం నుంచే. చిరుత దాడి ఘటనలు జరిగింది కూడా ఈ మెట్ల మార్గంలోనే.

250వ మెట్టు దగ్గర రెండో గోపురమైన మైసూరు గోపురం వస్తుంది. ఆ తర్వాత 2,083వ మెట్టు దగ్గరకు రాగానే మూడో గాలి గోపురం వస్తుంది. అక్కడి నుంచి కొండపైకి వెళ్లే నడకదారి మైదాన ప్రాంతంలా ఉంటుంది. దీంతో సులభంగా నడుస్తూ ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు చేరుకోవచ్చు. సరిగ్గా ఇదే ప్రాంతంలో రెండు నెలల క్రితం అంటే జూన్‌లో కౌశిక్ అనే బాలుడిపై చిరుత పులి దాడి చేసింది.

ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు వెళ్తుండగా ఉన్న 2, 831వ మెట్టు దగ్గరే కొన్ని రోజుల క్రితం చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి 2,850వ మెట్టు దగ్గర ఉండే లక్షీనరసింహస్వామి ఆలయం వరకుగల దారిని డేంజర్ జోన్‌గా టీటీడీ ప్రకటించింది.

హనుమాన్ విగ్రహం నుంచి లక్ష్మీ నరసింహా ఆలయానికి మధ్య ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ దారికి రెండు వైపులా రెండు మూడు మీటర్ల దూరంలో దట్టమైన అడవి ఉంటుంది.

దాడి చేసిన చిరుత అదేనా?

లక్షిత మీద చిరుత దాడి చేసినట్లుగా చెబుతున్న ప్రాంతాన్ని బీబీసీ పరిశీలించింది. నడక దారికి దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతం చిన్న గుట్టలా ఉంది. చుట్టు పక్కల బండరాళ్లు, చిన్న చెట్లు ఉంటాయి.

చిన్నారిని చిరుత చంపిందని చెబుతున్న ప్రాంతంలో ఇప్పటికీ మనిషి వెంట్రుకలు కనిపిస్తున్నాయి. రక్తపు మరకలు కూడా ఉండేవని, ఎండకు అవి ఆరిపోయినట్లు చెబుతున్నారు.

ఆ రాళ్లు, చెట్లు దాటి వెళ్తే దట్టమైన అడవి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులోనే ఒక చిరుత పులి పడింది. ఆ చిరుతను తీసుకెళ్లి ఎస్వీ జూలో ఉంచారు.

చిన్నారిని చంపిన చిరుత పులి అదేనని నిర్ధరణ అయితే, దాన్ని అక్కడే ఉంచి సంరక్షిస్తామని, లేదంటే అడవిలో వదిలేస్తామని నాగేశ్వరరావు చెప్పారు.

అయితే, ఈ విషయం తేలక ముందే మరో చిరుత పులి కూడా ఈ రోజు బోనులో పడింది.

‘‘మేం పట్టుకున్న చిరుత, దాడి చేసిన చిరుత ఒకటేనని తేలితే దాన్ని శాశ్వతంగా జూలోనే ఉంచేస్తాం. ఎందుకంటే మనిషి రక్తం, మనిషి మాంసానికి అది అలవాటు పడి ఉంటుంది. దానికి మరో అవకాశం ఇవ్వం’’ అని నాగేశ్వరరావు అన్నారు.

సాధారణంగా చిరుతలు మనుషులపై దాడి చేయవని ఆయన తెలిపారు. పాప నడకదారి నుంచి పక్కకు వెళ్లడంతో ఏదో జంతువుగా పొరబడి ఆమెపై చిరుత దాడి చేసి ఉండొచ్చని అన్నారు. శబ్దాలు చేస్తూ మెట్లపై నడిచే మనుషుల జోలికి చిరుతలు రావని చెప్పారు.

బోన్లు, కెమెరాలు

డేంజర్ జోన్‌గా గుర్తించిన ప్రాంతంలో అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో వేరే చిరుతలు ఇంకా ఏవైనా ఉంటే వాటిని కూడా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ రెండు బోన్లూ నడకదారి పక్కన దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం చిరుతల సంఖ్యను తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మొత్తం 300 కెమెరాలను అమర్చుతున్నట్లు, అలిపిరి మార్గంలో 70 మంది, శ్రీవారి మెట్టు దగ్గర 50 మంది గార్డులతో పెట్రోలింగ్ చేయిస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.

కాలి నడకన వెళ్లే భక్తులకు ఊతకర్ర

తిరుమల నడకదారిలో చిరుత దాడుల గురించి మీడియాలో పెద్దయెత్తున కథనాలు రావడంతో నడకదారిలో భక్తుల భద్రతపై టీటీడీ దృష్టి పెట్టింది.

ప్రమాదకరమైన జోన్‌గా భావిస్తున్న ప్రాంతంలో మొత్తం ఎన్ని చిరుతలు ఉన్నాయో గుర్తించే పని ప్రారంభించామని టీటీడీ కార్యనిర్వాహక అధికారి(ఈవో) ధర్మారెడ్డి చెప్పారు.

‘‘చిన్న పిల్లలతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన వెళ్లాలనుకునే తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. మధ్యాహ్నం 2 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 12 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించరు. రాత్రి 10 గంటల వరకు పెద్దవారిని అనుమతిస్తారు. దీంతోపాటు కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి, భక్తురాలికి ఒక ఊత కర్రను ఇవ్వాలని నిర్ణయించాం’’ అని కరుణాకర్ రెడ్డి అన్నారు.

టీటీడీ నిర్ణయంపై కొందరు భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాల వల్ల విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తమలాంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారని అమెరికాలోని న్యూజెర్సీ నుంచి వచ్చిన హైదరాబాద్‌ మహిళ లక్ష్మీలత బీబీసీతో చెప్పారు.

‘‘సెక్యూరిటీ పెంచాలి. రెండు గంటల తర్వాత అనుమతించం అంటున్నారు. మేం విదేశాల నుంచి వస్తున్నాం. భద్రత పెంచితే బాగుంటుంది. వచ్చేటప్పుడు ఒక సమయంలో దారిలో ఎవరూ లేరు. మాకు కాస్త భయం వేసింది. ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేయడం, అంత మంచిది కాదేమో అని నా అభిప్రాయం. భద్రతా సౌకర్యాలు పెంచితే నడవాలనే అనుకుంటారు’’ అని ఆమె చెప్పారు.

భక్తుల రక్షణకు వారికి ఊతకర్రలు ఇవ్వడం సరైనదేనని రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ భావిస్తున్నారు.

“వాటిని చంపడానికి మనం ఎవరు? వాటి స్థలంలోకి వెళ్లి వాటిని చంపడం ఏంటి? అవి ఎప్పుడూ మనుషులకు ప్రమాదం కలిగించే జంతువులు కావు. వాటికి అంతరాయం కలిగిస్తే, వాటిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తేనే అవి మనపై దాడి చేస్తాయి.

ఊతకర్రల అలికిడి వల్ల జంతువులు దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఊత కర్రలతోపాటు పిల్లలకు, పెద్దలకు ఎక్కడా వంగి కూర్చోకూడదు అనేది తెలియజేయాలి. ఆ ప్రాంతంలో కూర్చోకుండా నేరుగా వెళ్లిపోవాలని చెప్పాలి’’ అని ఆయన అన్నారు.

దారి నుంచి పక్కకు పోకూడదు

తిరుమల కొండల్లో వెంకటేశ్వర అభయారణ్యం ఉందని, అందులోని జంతువులను కాపాడుకుంటూ, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోడమే తమ పని అని అటవీ అధికారులు చెబుతున్నారు.

వెళ్లాల్సిన దారిలోనే వెళ్లాలని, ఎప్పుడూ పక్కకు వెళ్లడానికి ప్రయత్నించవద్దని తాము పదే పదే భక్తులకు సూచిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

టాయిలెట్ వెళ్లాలన్నా సరే వాటిని ఏర్పాటు చేసిన దగ్గర మాత్రమే వెళ్లాలని, విడిగా ఎవరూ అడవిలోకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

నడకదారి అంతటా కంచె సాధ్యమేనా?

భక్తులకు భద్రత ఉండేలా నడకదారి అంతటా కంచె వేయడం సాధ్యమవుతుందా అని అటవీ అధికారులను బీబీసీ అడిగింది.

‘‘మనుషులకు ఉన్నట్లే జంతువులకు కూడా అటూ ఇటూ తిరగడానికి హక్కులు ఉన్నాయి. వాటికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేదానిపై ఒక నిపుణుల కమిటీని వేయాలి.

కంచె వేయడంతో పాటు, ఆ కంచెను జంతువులు కింది నుంచిగానీ, పైనుంచిగానీ దాటి వెళ్లేలా నిర్మాణం ఉండాలి. అవన్నీ శాస్త్రీయంగా ఎలా చేయాలి? అనేది వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో డిజైన్ చేస్తారు. తర్వాత మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని నాగేశ్వరరావు చెప్పారు.

శేషాచలం కొండలను బయో రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించడంతో జంతువులకు తిరిగే హక్కు ఉంటుందని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.