తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఈ కాలంలో ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్మగలమా!

ఈ ఊరిలోకి దళితులను రానివ్వరు. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకుని నడవరు.

కలెక్టర్ వచ్చినా ఊరి బయట చెప్పులు తీసి, లోపలికి రావాలని చెబుతారు.

తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలోని పాకాల మండలంలో ఉన్న ఉప్పర పల్లి పంచాయతీలోని ‘వేమన ఇండ్లు’లో పరిస్థితి ఇదీ.

తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న 'ఆచార సంప్రదాయాలను' తాము గౌరవిస్తున్నామని ఊరి ప్రజలు చెబుతున్నారు.

ఈ గ్రామంలో చెప్పులేసుకుని ఎవరినీ అడుగుపెట్టనివ్వరు. అంతేకాదు, గ్రామస్థులు కూడా ఎన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా చెప్పులు ధరించరు.

గ్రామంలో ఉంటున్న వారు తమను పాలవేకరి కులస్థులుగా, దొరవార్లుగా చెప్పుకుంటున్నారు. వీరు బీసీ కిందకు వస్తారు. ఈ ఊళ్లో ఉన్న అందరూ ఒకే వంశం వారు. తమ కులం వారితో మాత్రమే వీరు సంబంధాలు కలుపుకుంటున్నారు.

వేమన ఇండ్లు గ్రామస్థుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మను కూడా పూజిస్తారు.

శ్రీ వెంకటేశ్వరుడిపై భక్తి భావంతో పాదరక్షలు ధరించడం మానేశామని గ్రామస్థులు చెబుతున్నారు.

గ్రామానికి ఎవరు వచ్చినా చెప్పులు గ్రామం బయట వదలితే గానీ గ్రామంలోకి అనుమతించరు.

పాఠశాలకు వెళ్లే చిన్నారుల నుంచి కాలేజీలకు వెళ్లే ఎవరైనా సరే చెప్పులు లేకుండానే వెళ్తారని గ్రామస్థుడు ఎర్రబ్బ బీబీసీతో చెప్పారు.

‘‘మా పిల్లోడు కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌కు కూడా మేం చెప్పులు వేసుకోమని చెప్పాం. ఆ తర్వాత బెంగళూరులో కొంతకాలం మా అబ్బాయి ఉద్యోగం చేశాడు. అప్పుడు కూడా చెప్పులు వేసుకోలేదు. పాలవేకరి కులం మాది. దొరవార్లు మేము. మేం వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాం, నరసింహస్వామి ఉన్నాడు, గంగమ్మ ఉంది. మేం పూజలు చేసుకుంటాం. కాలేజీకి వెళ్లినా, స్కూల్‌కు వెళ్లినా ఎవరూ చెప్పులేసుకోరు. బయటకు వెళ్తే, స్నానం చేశాకే ఇంట్లోకి రావాలి. మా వంశం పుట్టినప్పటి నుంచి ఈ ఆచారం ఉంది’’ అని ఎర్రబ్బ అన్నారు.

బయటి వ్యక్తులను ముట్టుకోనివ్వరు

అంతే‌కాదు, బయటి వ్యక్తులను గ్రామస్థులు ముట్టుకోనివ్వరు. ఒకవేళ వారు బయటికి వెళ్లినా.. ఎన్ని రోజులు వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినా బయటి తిండి ముట్టరు.

ఊరి బయట అడుగుపెడితే వేరే చోట భోజనం చేయడం కాదు, కనీసం మంచి నీళ్లు కూడా తాగబోమని ఎర్రబ్బ చెప్పారు.

‘‘మీరు ముట్టుకున్నా నేను స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని ఇంట్లోకి పోతా. హైదరాబాద్‌కు కోర్టు పని మీద వెళ్లినా ఏమీ తినేవాడిని కాదు. ఇంటికి వచ్చి స్నానం చేశాకే తిన్నాను. నీళ్లు అయినా ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాం’’ అని ఎర్రబ్బ అన్నారు.

వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం అయినప్పటికీ, పక్కనే ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా గ్రామస్థులు వెళ్లరు.

అనారోగ్యం వచ్చినా పూజలే

తమకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తారు కానీ, ఆస్పత్రికి కూడా వెళ్లరు.

‌పాము కాటేసినా, గ్రామంలోని పుట్ట చుట్టు తిరిగితే నయం అవుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు. ఈ గ్రామంలో ఎవరూ కోవిడ్ వ్యాక్సీన్ కూడా వేసుకోలేదు.

‘‘మా ఆచారం ప్రకారం పాము కరిచినా దేవుడే మమ్మల్ని కాపాడుతాడు. మా దేవుడి పుట్ట చుట్టూ తిరిగితే నయం అవుతుంది. హాస్పిటల్‌కు పోము. మా దేవుడే అన్ని బాగు చేస్తాడు. ఒంట్లో ఏం బాగా లేకపోయినా, రెండు రోజులు ఉంటే అదే తగ్గిపోతుంది’’ అన్నారు ఎర్రబ్బ.

ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజుకొక్క కుటుంబం పూజలు చేస్తుంది. ఒకే‌ఒక్క కుటుంబంతో ప్రారంభమైన గ్రామంలో నేడు 25 కుటుంబాల వరకూ ఉన్నాయి.

80 మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో 52 ఓట్లు ఉన్నాయి. వీరిలో డిగ్రీ చదివిన వాళ్లు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారు.

మిగతా అందరూ పెద్దగా చదువుకోని వారే. చదువుకున్న వారు కూడా ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళకుండా వ్యవసాయమే చేసుకుంటున్నారు.

ఈ ఊళ్లో చిన్న పిల్లల విషయంలోనూ ఊరి కట్టుబాట్లు పాటిస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చెప్పులు వేసుకోరు. స్కూల్లో పెట్టే అన్నం కూడా తినరు. బయటవారిని తాకినా వీరు స్నానం చేసిన తర్వాతే ఇళ్లలోకి వెళ్లాలి.

ఈ ఊరికి బాగా తెలిసిన పక్క ఊరి వాళ్లు వచ్చినా చెప్పులు తీసేసి రావాలి. వాళ్లు తమ ఇంటి దగ్గరకు వచ్చినా గ్రామస్థులు వారిని తమ ఇళ్లలోకి పిలవరు.

'దళితులను గ్రామంలోకి రానివ్వరు'

ఏదైనా పని మీద వేమన ఇండ్లకు వెళ్తే, కనీసం మంచినీళ్లు ఇచ్చేవారు కూడా ఉండరని పక్క గ్రామం మల్లెల చెరువుపల్లెకు చెందిన భవిత బీబీసీతో అన్నారు.

‘‘అక్కడకు చెప్పులేసుకుని వెళ్లం. ఊరి బయటనే తీసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా పని మీద వెళ్లినా ఇంటి బయటే ఉండి వాళ్ళతో మాట్లాడాలి. మనం వాళ్ల ఇంట్లోకి కూడా పోకూడదు. నాకు తెలిసినప్పటి నుంచీ ఆ సంప్రదాయాలు అలానే ఉన్నాయి. గర్భం వచ్చినా అక్కడ ఎవరూ హాస్పిటల్‌కు వెళ్లరు’’ అని ఆమె తెలిపారు.

ఈ గ్రామంలోకి దళితులకు ప్రవేశం లేదు. కనీసం వారితో మాట్లాడడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. రుతుస్రావ సమయంలో మహిళలను ఊరి బయట పెట్టే ఆచారం ఇక్కడ కూడా ఉంది.

గ్రామస్థులు తమ గ్రామం గురించి మీడియాలో రావడానికి కూడా ఇష్టపడడం లేదు. వీరికి రేషన్ కూడా విడిగా ఇస్తామని, పక్క ఊరు నుంచి వచ్చి ఆ గ్రామానికి రేషన్ ఇస్తున్న బాబు రెడ్డి బీబీసీతో చెప్పారు.

‘‘నాలుగు సంవత్సరాలుగా రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నాను. ఎమ్మార్వో వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా చెప్పులేసుకుని పోకూడదు. ఈ ఊరికి బీసీలు, ఓసీలు అంతా రావచ్చు. ఎస్సీలను ఊర్లోకి రానివ్వరు. వాళ్ళను ముట్టుకోరు. వాళ్లతో కనీసం మాట్లాడరు కూడా. మా గ్రామాల్లోకి వచ్చినా మన ఇళ్ల లోపలికి వారు రారు. రుతుస్రావమైన మహిళల కోసం ఒక గది కట్టారు. ఆ రోజుల్లో మహిళలు అక్కడే ఉండాలి’’ అని బాబు రెడ్డి వివరించారు.

‘‘వందేళ్లు వెనుక పడ్డారు’’

అయితే, ఈ గ్రామస్థులు వంద ఏళ్లు వెనుక పడినట్లుగా కనిపిస్తున్నారని జనవిజ్నాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి అన్నారు.

‘‘ఇలాంటివి చిన్నప్పుడు కథల్లో విన్నాం. నేడు అంటరానితనం అనేది నేరం, అనాగరికం. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయంటే, చదువుకున్నవారు ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ సమస్యలు తెలియజేయడం లేదని అర్థం’’అని ఆయన అన్నారు.

‘‘ఒక్కోసారి ఎవరైనా చెప్పినా ప్రజలు మూర్ఖంగా ఉంటారు. కలెక్టర్, ఎస్పీ స్థాయిలో జోక్యం చేసుకుని వారికి అవగాహన కల్పించాలి. రుతుస్రావ సమయంలో మహిళలను అలా విడిగా ఉంచడం కూడా మూఢత్వం కిందకే వస్తుంది. ఈ గ్రామస్థులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి. అప్పుడు కచ్చితంగా వీరిలో మార్పు వస్తుంది’’అని ఆయన అన్నారు.

వెనకబాటుతనంపై కలెక్టర్ ఏమన్నారు?

గ్రామానికి వచ్చిన బంధువులు కూడా ఈ ఆచారాలను పాటించాల్సిందేనని, ఇక్కడి గ్రామస్థులు ఇంకా పురాతన సంప్రదాయాలనే పాటిస్తున్నారని తన అక్కను చూడడానికి వేరే గ్రామం నుంచి వచ్చిన మహేశ్ అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు.

‘‘నేను చెప్పులు తీసి ఊరి బయట ఉన్న ముళ్ల పొదల్లో దాచిపెట్టి మా అక్క ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండే వాళ్లంతా భిన్నమైన పద్ధతులు పాటిస్తారు. ఇక్కడకు వస్తే, మేం కూడా వాటిని అనుసరించాల్సి ఉంటుంది’’ అని మహేశ్ అన్నారు.

వేమన ఇండ్లు గ్రామంలో వెనకబాటుతనంపై తిరుపతి కలెక్టర్ వెంకట రమణా రెడ్డిని బీబీసీ వివరణ కోరింది.

ఆ గ్రామంలో అవగాహన క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. గ్రామస్థుల్లో మార్పులు తీసుకొస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)