You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుపతి: గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... ఏమిటీ దీని ప్రత్యేకత?
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
మీసాలతో ఆడవేషం, పట్టుచీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోవడంతోపాటూ, మెడలో నిమ్మకాయల దండ, పూలమాలతో అల్లు అర్జున్ పుష్ప 2 పోస్టర్ రిలీజ్ కాగానే, చాలా మంది ఇది మా తిరుపతి గంగమ్మ జాతర వేషమంటూ ఆ ఫొటోను వైరల్ చేశారు.
ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరపాలని జీఓ జారీ చేయడంతో ఈ జాతర గురించి ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది.
అసలేంటీ తిరుగతి గంగమ్మ జాతర, ఇది ఎందుకంత ప్రత్యేకం?
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల్లాగే తిరుపతిలో కూడా గంగమ్మ జాతర జరుగుతుంది.
తెలంగాణలో బోనాలు, సమ్మక్కసారక్క, మేడారం జాతర్లలాగానే తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని ఆలయంలో ఉండే గంగమ్మకు నిర్వహించే ఈ జాతర చాలా ప్రత్యేకం.
తిరుపతితో పాటూ ఆ చుట్టుపక్కల పల్లెలు, పట్టణాల్లో ఈ జాతర సందడి కనిపిస్తుంది.
ఒకప్పటి తిరుపతి, ఆ పరిసర ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవనవిధానాలు ఈ జాతరలో కనిపిస్తాయి.
చాలా ప్రాంతాల్లో గ్రామ దేవతకు ఒక్క రోజే జాతర జరిగితే, తిరుపతి గ్రామదేవత అయిన తాతయ్యగుంట గంగమ్మ జాతర మాత్రం ఏడు రోజులపాటు జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
ప్రతి ఏడూ మే నెలలో తిరుపతి గంగజాతర జరుగుతుంది. ఈ ఏడాది మే 9న పుట్టింటి సారె, చాటింపుతో మొదలయ్యే జాతర 16న ముగుస్తుంది.
రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
తిరుపతి గంగజాతరను రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 13న ఒక జీవో విడుదల చేసింది.
అంతకుముందు, ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుపతి గంగమ్మను తిరుమల వెంకటేశ్వరస్వామికి సోదరిగా చెబుతూ, గంగమ్మ భక్తుడు అనంతాళ్వార్ తాతయ్యగుంటలో గంగమ్మకు ఆలయం కట్టించారని ప్రభుత్వం జీవోలో తెలిపింది.
తిరుపతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని, తెలుగు ప్రజల చరిత్రను ఈ జాతర ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఈ ఏడు రోజుల జాతరకు తిరుపతి ప్రజలే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని వివరించారు.
తిరుపతి గంగమ్మ ఆలయానికి 900 ఏళ్ల పురాతన చరిత్ర ఉన్నట్టు స్థానికులు భావిస్తారని, అందుకే ప్రతి ఏటా మేలో జరిగే తాతయ్యగుంట గంగజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నామని తెలిపింది.
గంగ జాతర చరిత్ర ఏంటి?
తాతయ్య గుంట గంగ జాతర గురించి స్థానికులందరూ ఒక కథ చెప్పుకుంటారు.
తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే కాలంలో, ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను అత్యాచారం చేసేవాడని, కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించాడనీ చెబుతారు.
దాంతో, ఆ పాలెగాడిని అంతమొందించి మహిళలను కాపాడేందుకు గంగమ్మ తిరుపతికి రెండు కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని భక్తుల విశ్వాసం.
యుక్తవయసుకు వచ్చిన గంగమ్మపై కూడా కన్నేసిన పాలెగాడు, ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందని, ఆమె తనను అంతం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని చెబుతారు.
తర్వాత గంగమ్మ పాలెగాడిని వెతుకుతూ, రకరకాల మారు వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందట.
మూడు వేషాలు వేసినా పాలెగాడు కనిపించకపోవడంతో, నాలుగోరోజు గంగమ్మ దొరవేషం వేయగానే, తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు వచ్చాడట. వెంటనే అతడిని చంపి గంగమ్మ దుష్టశిక్షణ చేసిందని భక్తులు చెబుతుంటారు.
గంగమ్మ ఆరోజు చేసిన దుష్టశిక్షణకు గుర్తుగా ఈ రోజుకూ తిరుపతి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. గంగమ్మ తమను కాపాడాలని మొక్కులు చెల్లించుకుంటారు.
జాతరలో భక్తులు మొదటిరోజున వేసే బైరాగివేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తే, రెండోరోజు బండవేషాన్ని మనిషి కష్టనష్టాలకు వెనుకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుందని విశ్వసిస్తారు.
ఇక మూడోరోజు చిన్న పిల్లలు ఎక్కువగా వేసే తోటివేషం ఉంటుంది. నాలుగోరోజు వేసే దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు.
చాలా పురాతన ఆలయం
తాతయ్య గుంటలో గంగమ్మ ఆలయం 1400 ఏళ్లకు పూర్వం నుంచే ఉందన్న ఆధారాలు దొరికాయని, గుడిని తిరిగి నిర్మిస్తున్న సమయంలో పల్లవుల కాలం నాటి రాతి స్తంభాలు బయటపడ్డాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి బీబీసీతో చెప్పారు.
“ఇదివరకు ఈ గుడికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అనుకుంటే, 1400 సంవత్సరాలకు పూర్వమే గంగమ్మ తల్లి వెలసిందని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి. 1100 సంవత్సరాల ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామిని కొలిచినటువంటి అనంతాల స్వామి వారు గంగమ్మను మళ్లీ ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి తిరుపతి గంగమ్మ తల్లి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లిగా పేరొందింది. మొదట వెంకటేశ్వర స్వామి చెల్లి గంగమ్మను చూసిన తర్వాతే, శ్రీవారి ఆలయానికి వెళ్లే ఆచారం కూడా గతంలో బలంగా ఉండేది. రాను రాను ఆచారాలు కొద్దిగా బలహీనపడటం కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయినట్టు అనిపిస్తోంది” అన్నారు.
సోదరికి వెంకటేశ్వరుడి సారె
సోదరి గంగమ్మకు తిరుమల వెంకటేశ్వరస్వామి పుట్టింటి సారె పంపే ఆచారం కూడా గత 400 ఏళ్ల నుంచీ కొనసాగుతోందని భూమన కరుణాకరరెడ్డి వివరించారు.
దేశంలో మొట్టమొదటి జాతర తిరుపతిలోనే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారని అన్నారు.
“దాదాపు 400 సంవత్సరాలకు పైగా వెంకటేశ్వర స్వామి, తన చెల్లి గంగమ్మకు ప్రతి సంవత్సరం సారె ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ గంగమ్మ దేవాలయంతోనే జాతర అనే వేడుక ప్రారంభమైనట్లు పరిశోధకులు చెబుతున్నారు. మా అభ్యర్థనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడం చాలా ఆనందించదగ్గ విషయం. గంగమ్మ తల్లి పునరుజ్జీవప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది” అన్నారు కరుణాకరరెడ్డి.
తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్రినెల చివరి మంగళవారం అంటే మే మెదటి లేక రెండవ వారంలో చాటింపు జరుగుతుంది.
ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి, వడిబాల కడతారు.
సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు.
ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ, జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు.
నైవేద్యాలు
జంతుబలిపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయంలో ఓ మూలన మేకలు, కోళ్లు కోస్తారు. స్త్రీలు ఆలయంలో పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. రాగి అంబలి సమర్పిస్తారు. కొందరు మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది మే 9న పుట్టింటి సారె, చాటింపుతో మొదలయ్యే గంగమ్మ జాతర 16న ముగుస్తుందని ఎమ్మెల్యే భూమన చెప్పారు.
“మే 9న చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది. 10న జాతరకు సంబంధించిన వేషాలు వేయడం మొదలవుతుంది. 16 వరకు జాతర జరుగుతుంది. ఈ ఏడాది మే 5న కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతి కుంభాభిషేక కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ఆ తర్వాతే జాతర మెదలవుతుంది’’ అని ఆయన తెలిపారు.
తాళ్లపాక నుంచి తిరుపతికి గంగమ్మ
ఏపీ తెలుగు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి తిరుపతి గంగ జాతరపై పుస్తకం కూడా రాశారు. దీని వెనుక ఉన్న ఒక కథను బీబీసీకి చెప్పారు.
ఒకప్పుడు తిరుపతి గంగ జాతర భారీగా జరిగేదని, జంతు బలులు ఇచ్చేవారని బ్రిటిష్ వారు 200 ఏళ్ల క్రితమే రాశారని ఆయన వివరించారు.
“ఇది నార్త్ ఆర్కాట్ జిల్లాగా ఉన్నప్పుడు వేలాది మేకపోతులు, కోళ్లను గంగమ్మకు బలి ఇచ్చేవారని 200 సంవత్సరాల క్రితమే డిస్ట్రిక్ట్ మాన్యువల్లో బ్రిటిష్ వాళ్ళు పొందుపరిచారు. గంగమ్మ గ్రామ దేవతగా వెలియడానికి కారణం మరొకటి కూడా ఉంది. ఒకప్పుడు గ్రామాలు వెలసినప్పుడు వ్యవసాయ దేవతని ఊరి చివర్న పూజించేవారు. వారినే గంగమ్మలుగా పిలిచేవారు. కలరా రాకుండా నివారించేందుకు గ్రామ పొలిమేరలో ప్రతిష్టించేవారు. ఆ గ్రామ సరిహద్దులను బట్టి ఎల్లమ్మ, పోచమ్మ అని అమ్మవారిని పిలిచేవారు. జంతువులకి మనుషులకు ఎటువంటి రోగాలు రాకుండా, వర్షాలు సమృద్ధిగా కురవాలని గంగమ్మను పూజిస్తారు. ఇలా ఈమె తిరుపతి గ్రామ దేవతగా వెలసింది” అన్నారు.
తిరుపతి ఆలయంలో పల్లవుల కాలం నాటి స్తంభాలు కనిపించాయి. అంటే క్రీస్తు శకం 500 సంవత్సరాల ముందు నిర్మించినదని చెప్పవచ్చని శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు.
ఆ గుడి కట్టక ముందే అక్కడ గంగమ్మ 1500 సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉండవచ్చని తెలిపారు.
దేశంలో ఎక్కడా వారం రోజులు జాతరలు జరగవని, దక్షిణ భారతదేశంలో ఇంత కోలాహలంగా జరిగే జాతర ఎక్కడా ఉండదన్నారు.
సమ్మక్క సారక్క జాతర భారీగా జరిగినా, అది రెండేళ్లకు ఒకసారి జరుగుతుందని, అందులో ఇన్ని రూపాలు, వేషాలు వేయడం లాంటివి ఉండదని అన్నారు.
గంగ జాతర ప్రత్యేకం బూతుల దండకం
గంగజాతరలో భాగంగా రకరకాల వేషాలు వేసిన భక్తులు, పిల్లలు అందరినీ నోటికి వచ్చిన బూతులు తిడుతుండడం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది.
వారు జాతరలో భాగంగా ఎలాంటి తిట్లు తిట్టినా స్థానికులు నవ్వుతూ వాటిని తేలిగ్గా తీసుకుంటారు. చాటుగా గంగమ్మకు కల్లు, సారా కూడా నైవేద్యం సమర్పిస్తారని, వీటన్నింటికీ కారణం ఉందన్నారు శ్రీనివాసరెడ్డి.
“దేవాలయాల పైన కూడా బూతు బొమ్మలు ఉంటాయి. బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉంది. పూరీలో కూడా జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు బండ బూతులు తిడతారు. తిట్టకపోతే మహా పాపంగా బావిస్తారు. గంగమ్మ పాలేగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి, వేషం వేసేవాళ్లు బూతూలు తిడతారు. జాతరలో అలా తిట్టినా, ఎవరు ఏం పట్టించుకోరు. అది దేవుడి కార్యం అనుకుంటారు. మనకు ఎవరిపైనైనా కోపం ఉంటే వారిని తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. దీన్నే దమన సిద్దాంతం అంటారు’’అని చెప్పారు.
చివరి అంకం విశ్వరూప దర్శనం
ఏడు రోజుల జాతరలో నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వచనాలు చెబుతుందట.
దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఐదోరోజు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది.
గోపురాల్లా ఉండే సప్పరాలను తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. అదేరోజున కైకాల కులస్తుల పేరంటాల వేషం వేస్తారు.
ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజునుంచి భక్తులు దీనికోసం ఎదురుచూస్తారు.
8వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.
పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు, పూజారులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు.
అర్ధరాత్రి తరువాత, ఆలయం ముందు గంగమ్మ (విశ్వరూపం) మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
ఒక వ్యక్తి "పేరంటాళ్ళు" లాగా వేషం వేస్తాడు. ఆ వ్యక్తి విశ్వరూపం చెంప నరుకుతాడు. ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.
ఎనిమిది రోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.