కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటక రాజధాని బెంగళూరులో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్‌ చూడ్డానికి వచ్చే పర్యటకులను, దాన్ని ఆనుకుని ఉన్న కోటె ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం కూడా ఆకర్షిస్తుంది.

ఈ ఆలయానికి, మైసూరు సుల్తానులకు అనుబంధం ఉన్నట్లు చెబుతున్న ఒక ఆసక్తికరమైన చరిత్ర హిందువులతోపాటూ, ఇక్కడికి ముస్లింలలో కూడా ఆసక్తి కలిగిస్తోంది.

బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన వెంకటేశ్వరుడి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎడమవైపున ఆలయం గురించి భక్తులకు తెలిసేలా, ఒక చిన్న గదిలాంటిది ఏర్పాటు చేశారు. దాన్ని రెండుగా విభజించి అందులో కొన్ని బోర్డులు ఏర్పాటు చేశారు.

ఆ బోర్డుల్లో కోటె వెంకటరమణ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు రాశారు. అప్పటి మైసూరు పాలకుడు చిక్కదేవరాజ వడియార్ ఆలయాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు కంఠీరవ నరసరాజ వడియార్ ఆలయంలో నిత్య పూజల కోసం నాలుగు గ్రామాల పరిధిలో ఉన్న పొలాలను గుడి మాన్యాలుగా ఇచ్చారని రాశారు.

ఆలయంలోని అదే గదిలో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక 2010లో ఆలయం గురించి రాసిన ప్రత్యేక కథనాన్ని ఫ్రేమ్ చేసి పెట్టారు. ఆ కథనంలోని కొన్ని రికార్డుల ప్రకారం, ఈ ఆలయాన్ని 1695లో నిర్మించారు.

కోటె అంటే కన్నడంలో కోట అని, మొఘల్ పాలకుల నుంచి బెంగళూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్న మైసూరు పాలకులు నగరంలో కోట కట్టారని, ఆ ప్రాంగణంలో ఉంది కాబట్టే ఆలయానికి కోటె వెంకటరమణస్వామి ఆలయం అనే పేరు వచ్చిందని అందులో రాసి ఉంది.

ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని రాతి స్తంభాలు మూడో మైసూరు యుద్ధంలో ఫిరంగి గుండ్లను తట్టుకుని నిలబడ్డాయని, ఆ యుద్ధం వల్ల గుడిలో చాలా భాగాలు ధ్వంసమయ్యాయని కూడా పత్రిక కథనంలో రాశారు.

హిందూ ఆలయం-ముస్లిం సుల్తాన్ అనుబంధం

ఈ ఆలయానికి హిందువులతో పాటూ ముస్లింలు కూడా ఎందుకు వస్తున్నారు అని వివరించే అత్యంత ఆసక్తికరమైన ఒక చరిత్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. మంచి లైటింగ్‌తో, స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసిన ఈ బోర్డుల్లో కోటె వెంకటరమణ ఆలయానికి, మైసూర్ సుల్తాన్ టిప్పూ సుల్తాన్‌కు ఉన్న అనుబంధం గురించి కొన్ని వివరాలు రాశారు.

ఆ వివరాల ప్రకారం, 1791లో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో జనరల్ లార్ట్ కారన్‌వాలీస్ నేతృత్వంలోని బ్రిటిష్ సేనలు మైసూరు సామ్రాజ్యంపై దండెత్తినపుడు, బ్రిటిష్ సైన్యం బెంగళూరులోని టిప్పూ సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ మీద కూడా దాడి చేసింది.

బ్రిటిష్ సైనికులు ఆలయం ముందున్న మైదానం నుంచి టిప్పు సుల్తాన్‌‌కు ఫిరంగి గురిపెట్టారని, ఆ గుండు సమ్మర్ ప్యాలెస్ ముందున్న కోటె వెంకటరమణ ఆలయం గరుడ స్తంభానికి తగిలిందని, అలా అది టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందని చెబుతున్నారు.

ఆ ఆలయ గరుడ స్తంభం తన ప్రాణాలు కాపాడిందనే భక్తి భావంతో టిప్పు సుల్తాన్ కోటె వెంకటరమణ స్వామిని దర్శించుకునేవారని, అలా చివరకు హిందువులతోపాటూ ముస్లింలు కూడా ఆ ఆలయానికి రావడం ప్రారంభమైందని బోర్డుల్లో రాశారు.

ఇదే విషయాన్ని వంశపారంపర్యంగా ఆలయ అర్చకులుగా ఉన్న ఏడో తరం అర్చకుడు ఎస్.ఆర్. శేషాద్రి భట్టర్ బీబీసీతో చెప్పారు.

"టిప్పు సుల్తాను ఇక్కడి సమ్మర్ ప్యాలెస్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బ్రిటిష్ సైన్యం టిప్పు సుల్తాన్ ప్యాలస్ పైకి ఫిరంగి పేల్చారు. ఆ కాలంలో ఇప్పుడున్న విధంగా ఇలా భవనాలేవీ లేవు. ఈ ఆలయం, దాని ముందు గరుడ స్తంభం మాత్రమే ఉండేవి. బ్రిటిష్ సైన్యం మైదానం నుంచి ఫిరంగి పేల్చడంతో, ఆ గుండు గరుడ స్తంభానికి తగిలి ఇక్కడే ఆగిపోయిందట. ఆ స్తంభం తనను కాపాడిందని, అప్పటినుంచి టిప్పు సుల్తాన్ కూడా ఈ దేవుణ్ణి కొలిచేవారట. ఈ దేవుడంటే ఆయనకు అభిమానం అని చెబుతారు. అందుకే, హిందూ, ముస్లింలు ఈ దేవస్థానానికి వస్తుంటారు" అని చెప్పారు.

ప్యాలెస్ ప్రాంగణంలోనే ఆలయం

టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడినట్లు చెబుతున్న కోటె వెంకటరమణస్వామి ఆలయం ముందున్న గరుడ స్తంభం ఇప్పుడు లేదు.

ఆ రాతి స్తంభానికి పగుళ్లు రావడం, పక్కనే ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ వైబ్రేషన్ వల్ల అది కూలిపోతుందని భావించిన పురావస్తు విభాగం 1978లో దాన్ని తొలగించిందని ఆలయంలోని బోర్డుల్లో రాశారు. ప్రస్తుతం దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాతి గరుడ స్తంభం కనిపిస్తోంది.

ఈ ఆలయంలో కొన్ని శిల్పాలు, గోడలపై బ్రహ్మ, విష్ణు, శివుడి బొమ్మలు, గర్భగుడిలో వెంకటరమణ స్వామి విగ్రహం ఉన్నాయి.

ఈ ఆలయం పురాతనమైనదని, హిందూ, ముస్లింలు వచ్చి ఇక్కడ వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారని బెంగళూరుకు చెందిన అభిషేక్ బీబీసీతో చెప్పారు.

''ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనిని 15 శతాబ్దంలో మైసూర్ మహారాజు కట్టిచ్చారని చెబుతారు. తర్వాత ఆయన కొడుకు నాలుగు గ్రామాలను దీనికి ఆస్తిగా ఇచ్చారంటారు. టిప్పు సుల్తాన్ ఇక్కడ ఉన్నప్పుడు బ్రిటిష్ సైనికులు ఫైరింగ్ చేసినపుడు, ఆ గుండు ఎదురుగా ఉన్న స్తంభానికి తగిలి ఆగిపోయింది. దీంతో ఆయన కూడా ఈ దేవుణ్ణి నమ్మడం, తర్వాత హిందూ, ముస్లింలు అందరూ ఇక్కడ పూజలు చేసే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు'' అన్నారు.

టిప్పు సుల్తాన్ వేసవి విడిది

ఇక బెంగళూరులోని మైసూర్ ప్యాలెస్ విషయానికి వస్తే, కోటె వెంకటరమణస్వామి ఆలయం దాదాపు ఆ ప్రాంగణంలోనే ఉన్నట్లు ఉంటుంది.

మైసూరు సుల్తానులు హైదరలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా బెంగళూరులో దీన్ని నిర్మించడంతో దీనికి సమ్మర్ ప్యాలెస్ అనే పేరు వచ్చింది. దీని నిర్మాణ పనులను హైదరలీ ప్రారంభించగా 1791లో టిప్పు సుల్తాన్ పూర్తి చేసినట్లు దీని గురించి ఉన్న వివరాలు చెబుతున్నాయి.

నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణం తర్వాత బ్రిటిష్ వారు దీన్ని తమ సెక్రటేరియట్‌గా ఉపయోగించారు. 1868లో అత్తర కచేరి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలసి పాళ్య బస్టాండ్ సమీపంలో పాత బెంగళూరు మధ్యలో ఉన్న ఈ ప్యాలెస్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చింది.

దీన్ని చూడ్డానికి భారతీయులు రూ.20, విదేశీ సందర్శకులకు రూ.200 టికెట్ కొనుక్కొని వెళ్లాలి. ఇది ఇప్పుడు బెంగళూరులోని ప్రముఖ పర్యటక కేంద్రాల్లో ఒకటిగా మారింది.

టిప్పు టైగర్‌

టేకు కలపతో అందంగా చెక్కిన స్తంభాలతో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో ఎన్నో ఆర్చిలు, బాల్కనీలు కనిపిస్తాయి. దీని పై అంతస్తులో ఉన్న బాల్కనీల్లో టిప్పు సుల్తాన్ దర్బారు నిర్వహించేవారని చెబుతారు. వీటితోపాటూ ప్యాలెస్ మొదటి అంతస్తు మూలల్లో చిన్న చిన్న గదుల్లో ఆనాటి డిజైన్లు కూడా కనిపిస్తాయి.

కింది అంతస్తులో ఉన్న గదులను చిన్న మ్యూజియంగా మార్చారు. అక్కడ టిప్పు సుల్తాన్ పాలనకు సంబంధించిన కొన్ని వస్తువులను ప్రదర్శిస్తున్నారు. టిప్పు టైగర్‌ అనే బొమ్మ కూడా ఉంది.

ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న దీని అసలు బొమ్మను 18వ శతాబ్దంలో తయారు చేసినట్లు చెబుతారు. ఒక బ్రిటిష్ సైనికుడిపై పెద్ద పులి ఉన్నట్టు కనిపించే ఈ పులి బొమ్మకు ఉన్న హాండిల్‌ తిప్పినపుడు, సైనికుడు ప్రాణభయంతో అరిచినట్లు, పులి గాండ్రించినట్లు రెండు రకాల శబ్దాలు రావడం విశేషం. ఈ మెకానికల్ కొయ్య బొమ్మను అప్పట్లో టిప్పు సుల్తాన్ స్వయంగా చేయించినట్టు వివరాలు చెబుతున్నాయి.

టిప్పు సుల్తాన్ దుస్తులు, ఆయన శిరస్త్రాణం, వెండి, బంగారు పీఠాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్యాలెస్ ముందున్న ఉద్యానవనం నిర్వహణను కర్నాటక ప్రభుత్వపు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది.

బెంగళూరులో చారిత్రక ప్రదేశమైన సమ్మర్ ప్యాలెస్‌ చూడ్డానికి వచ్చామని బెంగళూరుకు చెందిన పూజ బీబీసీతో చెప్పారు.

''ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇది ఒక చారిత్రక ప్రదేశం. టిప్పు సుల్తాన్ బెంగళూర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వారంట. లోపలికి వెళ్లి చూస్తే ప్యాలెస్ చాలా బాగుంటుంది. ఇదంతా వుడ్, గ్రావెల్, స్టోన్స్‌తో బిల్ట్ చేశారు. ఇక్కడున్న మ్యూజియంలో టిప్పు సుల్తాన్‌కు సంబందించిన వస్తువులు దానికి సంబందించిన చరిత్ర ఉంది. అప్పట్లో టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, ఆయన టైగర్ బొమ్మ ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఉన్న టెంపుల్ చాలా పురాతన ఆలయం, చాలా చరిత్ర ఉన్న టెంపుల్. బ్రిటిష్ వాళ్లు అటాక్ చేసినప్పుడు ఫిరంగి గుండు ఇక్కడ పడకుండా ధ్వజస్తంభం ఆపిందంట. అందుకు వాళ్లు ఈ టెంపుల్ ని బాగా డెవలప్ చేశారని చెబుతారు. చాలా మహిమగల టెంపుల్. ఇది బెంగళూరులో ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేము అప్పుడప్పుడు వస్తుంటాం. స్కూల్ పిల్లల్ని, మా పిల్లల్ని తీసుకువచ్చి ఇక్కడ అన్ని చూపిస్తూ ఉంటాం''అని పూజ చెప్పారు.

సందర్శకులు ప్యాలెస్‌కు కొంత దూరంలో ఉన్న కోటను కూడా సందర్శిస్తుంటారు. అయితే ఈ కోటలో ప్రస్తుతం దిల్లీ గేట్ మాత్రమే మిగిలింది. మిగతా అన్నీ కూలిపోయాయి. ఇది మొదట ఒక కిలో మీటర్ పొడవు ఉండేదని చెబుతారు. బెంగుళూరు కోటలో ప్రస్తుతం విక్టోరియా హాస్పిటల్, కోటే వెంకటరమణ స్వామి దేవాలయం, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, మక్కల కూట పార్క్ ఉన్నాయి.

బెంగుళూరు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని ఆయుధశాల, ఫోర్ట్ హై స్కూల్, ఫోర్ట్ చర్చి, మింటో ఆప్తాల్మిక్ హాస్పిటల్, ప్రస్తుత కిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి. కోట అని చెప్పడానికి కోటలోని చిన్న భాగం మాత్రమే మిగిలుంది. టిప్పు సమ్మర్ ప్యాలెస్‌లో ఉర్దూలో చెక్కిన శాసనాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.

ఈ ప్రదేశాలన్నీ బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి క్యాబ్, ఆటోలలో చేరుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)