You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాంబోడియా: నగలు, కిరీటాలు, వడ్డాణాలు, చెవి పోగులు...ఈ ప్రాచీన బంగారు ఆభరణాలను ఎవరు దోచుకున్నారు, బ్రిటన్‌కు ఎలా చేరాయి?
- రచయిత, సెలియా హాటన్
- హోదా, బీబీసీ న్యూస్
దొంగతనానికి గురైన కాంబోడియా ఆభరణాలను బ్రిటన్‌లో గుర్తించారు. 7వ శతాబ్దానికి చెందిన ఆ ఆభరణాలను బ్రిటన్‌కు చెందిన స్మగ్లర్ డగ్లస్ లాచ్‌ఫోర్డ్ కాంబోడియా నుంచి తరలించారు. ఇంత వరకు చూడని అనేక ఆభరణాలు వాటిలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఆ ఆభరణాలను రహస్యంగా కాంబోడియాకు అప్పజెప్పారు. త్వరలోనే వాటిని ఆ దేశంలోని జాతీయ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఇలా ఆయా దేశాలకు చెందిన వారసత్వ సంపదను తరలించిన కేసుల్లో నిందితునిగా ఉన్న డగ్లస్ లాచ్‌ఫోర్డ్ 2020లో మరణించాడు. ఆ తరువాత డగ్లస్ దగ్గర ఉన్న కాంబోడియా వారసత్వ సంపదను తిరిగి ఇస్తామని ఆయన కుటుంబం ప్రకటించింది.
‘‘డగ్లస్ కుటుంబం నన్ను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పార్కింగ్‌లో ఉన్న ఒక వాహనంలో నాలుగు పెట్టెలు ఉన్నాయి. పురాతన కాంబోడియా రాచవంశాల నగలు ఆ పెట్టెల్లో కనిపించాయి. వాటిని చూడగానే నాకు ఏడుపొచ్చింది. కాంబోడియా నాగరికతను వాళ్లు కట్టకట్టి కారు వెనుక పెట్టినట్లు అనిపించింది’’ అని కాంబోడియా విచారణ బృందానికి చెందిన బ్రాడ్ గోర్డాన్ అన్నారు.
కారు వెనుక ఉన్న పెట్టెల్లో 77 ఆభరణాలు ఉన్నాయి. వాటిలో బంగారు నగలు, కిరీటాలు, వడ్డాణాలు, చెవి పోగులు వంటివి ఉన్నాయి. 11వ శతాబ్దానికి చెందిన ఒక పెద్ద గిన్నె కూడా ఉంది. అది మొత్తం బంగారంతో చేసినట్లుగా కనిపిస్తోంది. నాటి అంకోర్ రాజవంశీయులు ఆ గిన్నెను 'రైస్ బౌల్'గా ఉపయోగించే వారని నిపుణులు భావిస్తున్నారు.
లభించిన కిరీటాలలో ఒకటి అంకోర్ రాజుల కంటే ముందు కాలం నాటిదిగా కనిపిస్తోంది. అది 7వ శతాబ్దానికి కళాకారులు దాన్ని చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. చిన్నచిన్న పువ్వులు కూడా వాటిలో ఉన్నాయి.
ఎప్పుడు ఈ ఆభరణాలు, నగలు దొంగతానికి గురయ్యాయి? ఎలా లండన్‌కు చేరాయి? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అంకోర్ వాట్ దేవాలయంలోని గోడల మీద ఉండే అనేక చిత్రాలతో ఈ ఆభరణాలు సరిపోలుతున్నాయి. 1122లో నిర్మాణం ప్రారంభించిన అంకోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద మత కట్టడంగా ఉంది.
విష్ణువు కోసం ఆ దేవాలయాన్ని నిర్మించినా ఆ తరువాత అది బౌద్ధ దేవాలయంగా మారింది. ఫ్రెంచ్ వలస పాలన కాలంలో అంకోర్ వాట్‌ను భారీ స్థాయిలో దోచుకున్నారు. ఆ తరువాత ఖేమర్ పాలన కాలంలో ఇతర దేవాలయాల్లోని సంపద దోపిడికి గురైంది.
‘‘దేవాలయం గోడల మీద చెక్కిన వాటితో ఆ ఆభరణాలు సరిపోలుతున్నాయి. అంటే ఆ కథలను ఇవి నిజం చేస్తున్నాయి. గతంలో కాంబోడియా నిజంగానే చాలా సంపన్నమైనది. నేను దీన్ని ఇంకా నమ్మలేక పోతున్నా’’ అని ఆర్కియాలజిస్ట్ సొనెత్రా సెంగ్ అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా కాంబోడియా దేవాలయాల్లోని గోడల మీద చెక్కిన చిత్రాల ఆధారంగా అంకోర్ ఆభరణాల మీద ఆమె పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పుడు దొరికిన వాటిలో కొన్ని ఆభరణాలు గతంలోనూ కనిపించాయి. 2008లో తన పార్టనర్ ఎమ్మా బంకర్‌తో కలిసి 'ఖేమర్ గోల్డ్' అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఆయన అయిదు ఆభరణాలను ప్రస్తావించారు.
అయితే ఆ పుస్తకంలో రాసినవన్నీ నిజాలు కాదని, అందువల్ల నిపుణులు వాటి గురించి మరింత లోతుగా పరిశోధించాల్సి ఉందని ఎస్‌ఓఏఎస్ యూనివర్సిటీలో సౌత్ ఈస్ట్ ఏసియన్ ఆర్ట్ మీద పని చేస్తున్న థాంప్సన్ తెలిపారు.
అంకోర్ కాలానికి చెందిన ఆభరణాలు ఇంకా విదేశాల్లో ఉన్నాయని, వాటిని గుర్తించాల్సి ఉందని కాంబోడియా అధికారులు భావిస్తున్నారు. 2019లో నార్త్ లండన్ వేర్‌హౌస్ నుంచి కొన్ని కలెక్షన్లను అమ్మడానికి డగ్లస్ లాచ్‌ఫోర్డ్ ప్రయత్నించినట్లు కాంబోడియా అధికారులు చెబుతున్నారు. ఆయన జరిపిన ఇ-మెయిళ్ల సంప్రదింపులు అందుకు సాక్ష్యంగా వారు చూపుతున్నారు.
బ్రిటన్‌లోని లాచ్‌ఫోర్డ్ సంబంధీకులను కూడా విచారిస్తున్నారా అని మెట్రోపొలిటన్ పోలీస్‌ను బీబీసీ అడిగింది. అయితే ఆ విషయం మీద స్పందించడానికి వారు నిరాకరించారు. విచారణలో నేరారోపణలు నమోదు చేయదగిన ఆధారాలు ఏమీ దొరకలేదని వారు అంటున్నారు.
పోయిన ఏడాది కాంబోడియాకు బీబీసీ వెళ్లింది. ఒకప్పుడు సంపద దోచుకున్న వారిలో కొందరు ఆ తరువాత ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారిపోయారు. అలాంటి వారితో బీబీసీ మాట్లాడింది. కాంబోడియాలోని దేవాలయాల నుంచి పురాతన సంపదను దోచుకుని లాచ్‌ఫోర్డ్‌కు తాము విక్రయించినట్లు వారు తెలిపారు. వారు చెప్పిన కొన్ని ఆభరణాలు బ్రిటిష్ మ్యూజియం వంటి వాటిలో కనిపించాయి.
నాడు బీబీసీ ఇంటర్వ్యూ చేసిన మహిళల్లో ఐరన్ ప్రిన్సెస్(అసలు పేరు కాదు) ఒకరు. ఒకప్పుడు పురాతన ఆభరణాలను దోచుకుని విక్రయించే ఆమె, ప్రస్తుతం దొరికిన ఆభరణాలను గుర్తించేందుకు సాయం చేయనున్నారు.
అంకోర్ రాజవంశాలకు చెందిన పురాతన ఆభరణాలను తిరిగి ఇవ్వడాన్ని కాంబోడియా నేత హన్ సేన్ స్వాగతం పలికారు. ఈ ఏడాది జులైలో ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఆయనకు ఇది ఉపయోగపడొచ్చు.
రాజకీయాలు పక్కన పెడితే, తమ దేశం నుంచి దోచుకున్న పురాతన వస్తువులను పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని సాధారణ కాంబోడియా ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పెట్టెల్లో ఉన్న ఆ పురాతన సంపదను కొద్ది రోజుల్లో కాంబోడియా ప్రజల కళ్లారా చూడనున్నారు.
ఇవి కూడా చదవండి:
- మగవారికి గర్భనిరోధక మాత్రలు ఎందుకు లేవు... ‘సెక్స్’ మీద ప్రభావం పడుతుందని భయపడుతున్నారా
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)