రష్యా నుంచి వస్తున్న ముడి చమురుతో భారత్‌‌కు లాభమేనా?

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో దాడి మొదలుపెట్టిన తర్వాత, అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్‌ ధరల కంటే తక్కువకే ముడి చమురును భారత్ సహా చాలా దేశాలకు రష్యా విక్రయించడం మొదలుపెట్టింది.

రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇలా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.

అయితే, నేడు ఇలా తక్కువ ధరకు భారీగా చమురును కొనుగోలు చేయడంపై భారత్‌కు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి.

నానాటికీ పెరుగుతున్న చమురు దిగుమతుల వల్ల భారత్ వాణిజ్య లోటు భారీగా పెరుగుతోందని తాజాగా బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. విదేశీ వాణిజ్యాన్ని రూపాయల్లోకి మార్చే దిశగా మోదీ ప్రభుత్వం ఎలాంటి పురోగతీ సాధించడం లేదని సంస్థ చెబుతోంది.

ఇది వినడానికి కాస్త ఆర్థిక పరిభాషలో కనిపించొచ్చు. దీన్ని అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో మాట్లాడుకుందాం.

దీనిపై దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్‌ ప్రొఫెసర్ అమితాబ్ కాంత్ మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఇదివరకు భారత్, రష్యాల మధ్య వాణిజ్యం ఎలా జరిగేదో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ముఖ్యంగా, రక్షణ రంగ ఉత్పత్తుల కోసం రష్యాపై భారత్ ఆధారపడేది. అయితే, ఇదే మొత్తంలో భారత్ నుంచి కొన్ని వస్తువులు కూడా రష్యాకు ఎగుమతి అయ్యేవి. దీని వల్ల వాణిజ్యంలో పెద్దగా తేడా ఉండేది కాదు. అంటే ఇక్కడ డబ్బులు పెద్దగా చేతులు మారాల్సిన అవసరం వచ్చేది కాదు.

అయితే, ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది.

చమురు దిగుమతులు..

‘‘కొన్ని నెలల ముందువరకు భారత్‌కు అవసరమైన చమురులో కేవలం ఒక శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి అయ్యేది. కానీ, ఇప్పుడు ఇది 20 శాతం వరకు పెరిగింది’’ అని ప్రొఫెసర్ అమితాబ్ కాంత్ చెప్పారు.

రష్యా నుంచి భారత్ రోజూ 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు వంట నూనె, ఎరువులు కూడా రష్యా నుంచి దిగుమతి చేస్తున్నారు.

ఇక్కడ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఎగుమతులు పడిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తంగా దిగుమతులు 400 శాతం పెరగ్గా, ఎగుమతులు మాత్రం 14 శాతం పడిపోయాయి.

మరోవైపు భారత్, రష్యా తమ సొంత కరెన్సీల్లో (రూపాయి, రూబల్) వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాయి.

ఈ విషయాన్ని 2022లోనే భారత రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రష్యా బ్యాంకులు భారత్‌లో వోస్టో అకౌంట్‌లు కూడా తెరిచాయి.

రష్యా బ్యాంకుల్లో భారత్ రూపాయలు..

వోస్ట్రో అకౌంట్ తెరచిన తర్వాత, భారత్‌తో వాణిజ్యం చేసే దేశాలు డాలర్లకు బదులుగా రూపాయల్లో చెల్లించేందుకు అవకాశం ఏర్పడింది.

భారత్‌లోని కొన్ని విదేశీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. అయితే, వీటిలో పెద్దగా లావాదేవీలు జరగడం లేదు.

ఉదాహరణకు రష్యాను తీసుకుంటే దిగుమతులు భారీగా పెరగడంతో రష్యా దగ్గర భారీగా భారత రూపాయలు పోగుపడ్డాయి. వీటి నిల్వలను మరింత పెంచేందుకు రష్యా బ్యాంకులు సుముఖంగా లేవు.

‘‘ఇప్పటివరకు 30 బిలియన్ డాలర్ల విలువైన రూపాయలు రష్యా బ్యాంకుల దగ్గర అలానే ఉన్నాయి’’అని ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ చెప్పారు.

‘‘అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ రూపాయలను రష్యా ఉపయోగించలేదు. మరోవైపు రష్యా దగ్గర పోగుపడుతున్న రూపాయల విలువ కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో డాలర్‌తో రూబల్ మారకపు విలువ కూడా పడిపోతోంది’’అని ఆయన వివరించారు.

కొత్త ఆంక్షల భయం..

మరోవైపు మళ్లీ కొత్త ఆంక్షలు విధిస్తారేమోనని రష్యా బ్యాంకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని దశాబ్దాల నుంచి రష్యాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు వినయ్ శుక్లా చెప్పారు.

‘‘రష్యాలో ప్రజల అభిరుచులు నానాటికీ మారుతున్నాయి. భారత వ్యాపారవేత్తలు వాటిని పసిగట్టలేకపోతున్నారు. అందుకే ఎగుమతుల వాటా తగ్గిపోతోంది’’అని వినయ్ శుక్లా వివరించారు.

మరోవైపు ఒకప్పుడు భారత్ నుంచి రష్యా దిగుమతి చేసుకున్న చాలా వస్తువులు నేడు చైనా నుంచి రావడమూ భారత్ ఎగుమతులు పడిపోవడానికి ఒక కారణమని ఆయన తెలిపారు.

మౌనం ఎందుకు?

రష్యా నుంచి చవకైన ధరలకే భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తోంది. దీనిని శుద్ధి చేసిన తర్వాత వచ్చే పెట్రోలియం ఉత్పత్తులను చాలా పశ్చిమ దేశాలకు ఎగుమతి చేస్తోంది.

‘‘ఈ విక్రయాల ద్వారా భారత్‌కు డాలర్లు వస్తున్నాయి. అందుకే దీని గురించి ఎవరూ పెద్దగా ఆందోళన చెందడం లేదు. అయితే, ఈ పరిస్థితిలోనూ మార్పులు వచ్చే అవకాశముంది’’అని అమితాబ్ వివరించారు.

ఇదివరకు విదేశాల్లోని భారత బ్యాంకుల ఖాతాలు అక్కడి నగదులో లావాదేవీలు నిర్వహించి రష్యాకు చెల్లింపులు చేసేవి. ఉదాహరణకు సింగపూర్‌లో చాలా భారత బ్యాంకులకు ఖాతాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి అకౌంట్ల నుంచి రష్యాతో వాణిజ్యం చేయకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం హాంకాంగ్‌ బ్యాంకులో ఖాతాలు పనిచేస్తున్నాయి. అయితే, దీనిపైనా ఆంక్షలు విధించే అవకాశముందని ప్రొఫెసర్ అమితాబ్ తెలిపారు.

‘‘దీర్ఘకాలంలో ఇది భారత్‌కు తలనొప్పి తెచ్చే అంశం. ఎందుకంటే దీని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది’’అని ఆయన చెప్పారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల భారత్, రష్యా అధికారులు సమావేశమయ్యారు. కానీ, దీని నుంచి ఎలాంటి పరిష్కారమూ రాలేదు.

దిర్హమ్‌లో చెల్లింపులు

ప్రస్తుతం రెండు దేశాలకు ఈ విషయంలో ఎలాంటి పరిష్కారమూ కనిపించడంలేదని అమితాబ్ చెప్పారు.

రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేస్తున్న కంపెనీల్లో రిలయన్స్ కూడా ఒకటి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కరెన్సీ దిర్హమ్‌లో సంస్థ ప్రస్తుతం చెల్లింపులు చేస్తోందని, ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అమితాబ్ వివరించారు.

రష్యా బ్యాంకుల్లో భారత కరెన్సీ పోగుపడినట్లే ప్రస్తుతం దిర్హమ్‌లు కూడా పోగుపడుతున్నాయి. దీంతో అసలు వీటితో ఏం చేయాలనే ప్రశ్న రష్యా బ్యాంకుల్లో ఉత్పన్నం అవుతోంది.

పరిష్కారం ఏమిటి?

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) కూటమికి చెందిన న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ చెప్పారు.

అయితే, చైనా తమ ఆర్థిక వ్యవస్థ విషయంలో కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఇక్కడ చైనా సాయం లేకుండా స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చాలా కష్టం.

నేడు భారత్, రష్యాల మధ్య వాణిజ్య సమతౌల్యం జరగడం అవసరం. కానీ, ఇక్కడ దిగుమతులు నానాటికీ పెరుగుతుంటే, ఎగుమతులు పడిపోతున్నాయి.

అయితే, తాజాగా రష్యా సెంట్రల్ బ్యాంకు అంతర్జాతీయ వాణిజ్యం స్థానిక కరెన్సీల్లో చేపట్టేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని మొదలుపెట్టింది. దీని వల్ల పరిస్థితులు కాస్త మెరుగుపడే అవకాశముందని వినయ్ శుక్లా ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)