You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Sand Battery: ఇది ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
- రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ న్యూస్
ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఇసుకతో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీనిలో ఒకసారి గ్రీన్ పవర్‌ను స్టోర్ చేస్తే, నెలల వరకు నిల్వ ఉంటుంది.
సౌర, పవన విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీనీ ఏడాది పొడవునా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని తాజా బ్యాటరీ పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లో-గ్రేడ్ శాండ్‌తో ఈ బ్యాటరీని తయారుచేశారు. సౌర, పవన విద్యుత్ లాంటి చవకైన విద్యుత్‌ను ఉష్ణం రూపంలో దీనిలో నిల్వ చేయొచ్చు.
500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఈ ఇసుక ఉష్ణాన్ని నిల్వ చేస్తుంది. శీతకాలంలో విద్యుత్ ఖరీదైనప్పుడు దీని సాయంతో ఇంటిలో ఉష్ణోగ్రతలు పెంచుకోవచ్చు.
కొత్త ఆశలు
గ్యాస్ విషయంలో రష్యాపైనే ఫిన్లాండ్ ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే, యుక్రెయిన్‌లో యుద్ధం వల్ల హరిత విద్యుత్‌పై ఫిన్లాండ్ దృష్టి పెట్టింది.
యూరప్‌లో రష్యాతో అత్యంత పొడవైన సరిహద్దులు గల దేశం ఫిన్లాండే. అయితే, నాటోలో చేరాలని ఫిన్లాండ్ నిర్ణయించుకోవడంతో గ్యాస్, విద్యుత్ సరఫరాలను రష్యా నిలిపివేసింది.
ఇప్పుడు సుదీర్ఘ శీతాకాలం ఇక్కడ ఎలా గడుస్తుందోనని సామాన్యులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చలు నడుస్తున్నాయి.
అయితే, పశ్చిమ ఫిన్లాండ్‌లోని ఒక చిన్న విద్యుత్ కర్మాగారంలో పనిచేస్తున్న ఈ కొత్త బ్యాటరీ ఫిన్లాండ్ వాసుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తోంది.
ఈ బ్యాటరీలో కీలకమైనది ఏమిటి? అంటే దాదాపు వంద టన్నుల బిల్డర్ శాండ్ అని చెప్పొచ్చు. దీన్ని బ్యాటరీ మధ్యలోని పొడవుగా ఉండే నిర్మాణంలో కుప్పగా పోశారు.
వాతావరణ మార్పులతోపాటు ఇంధన ధరలు కూడా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పునరుత్పాదక ఇంధనంపై పెట్టుబడులు పెడుతున్నాయి.
సౌర ఫలకాలు, విండ్ టర్బైన్లను ప్రస్తుత గ్రిడ్లతో అనుసంధానించొచ్చు. అయితే, దీనిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.
సూర్యుడు లేనప్పుడు, గాలి రానప్పుడు విద్యుత్ వాడుకోవడం ఎలా? అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.
గ్రిడ్‌ను పునరుత్పాదక ఇంధన వనరులతో అనుసంధానించేటప్పుడు అదే మొత్తంలో సంప్రదాయ విద్యుత్‌ను కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్‌వర్క్‌లో సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుంది. ఎందుకంటే లోడ్ ఒకేసారి ఎక్కువైనా లేదా పూర్తిగా తక్కువైనా గ్రిడ్ దెబ్బతినే ముప్పుంటుంది.
ఈ నెట్‌వర్క్ సమస్యను పెద్దపెద్ద బ్యాటరీలతో పరిష్కరించొచ్చు. ఇవి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించగలవు. వీటితో గ్రీడ్ కూడా పర్యావరణ హితంగా మారుతుంది.
లిథియంపైనే ఆధారం..
ప్రస్తుతం చాలావరకు బ్యాటరీలను లిథియంతోనే తయారుచేస్తున్నారు. ఇది చాలా ఖరీదైన లోహం. అయితే, ఇది విద్యుత్‌ను మెరుగ్గా నిల్వ చేయగలదు.
ఇప్పుడు కంకాన్పా నగరంలోని ఫిన్లాండ్ ఇంజినీర్లు ఇసుకతో తయారుచేసిన బ్యాటరీలో ఇలానే విద్యుత్ నిల్వ చేయగలిగారు. పైగా ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చింది.
‘‘హరిత విద్యుత్ ఉత్పత్తి పెరిగినప్పుడు వెంటనే అదనపు విద్యుత్‌ను ఈ బ్యాటరీలో నిల్వ చేయొచ్చు’’అని పోలార్ నైట్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన మార్కు యోనెన్ చెప్పారు. ఈ సంస్థే తాజా బ్యాటరీని అభివృద్ధి చేసింది.
ఈ బ్యాటరీని వటజన్కోస్కి విద్యుత్ కర్మాగారంలో ఏర్పాటుచేశారు.
సౌర, పవన విద్యుత్‌తో బ్యాటరీలోని ఇసుక ఉష్ణోగ్రతను 500 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెంచొచ్చు. కొన్ని నెలలపాటు ఇసుక ఇదే ఉష్ణోగ్రతలో ఉండేలా చేయొచ్చని పరిశోధకులు నిరూపించారు.
ఉష్ణాన్ని అలానే దాచి ఉంచడంలో ఇసుక మెరుగ్గా పనిచేస్తుంది. దీని నుంచి బయటకు వెళ్లే ఉష్ణం చాలా తక్కువగా ఉంటుంది.
విద్యుత్ ధరలు పెరిగినప్పుడు.. ఈ బ్యాటరీలోని ఇసుకపై ఉండే వేడి గాలిని బయటకు విడుదల చేయొచ్చు. ఇది నీటిని వేడి చేయగలదు. దీన్ని పంపుల సాయంతో ఇళ్లు, కార్యాలయాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు తీసుకెళ్లొచ్చు.
పనికొస్తుందా?
అయితే, ప్రజలు వినియోగించగలిగే స్థాయిలో ఈ బ్యాటరీని మార్చొచ్చా? అనేదే అతిపెద్ద సవాల్. మరోవైపు ఉష్ణానికి బదులుగా విద్యుత్ వచ్చేలా దీనిలో మార్పులు చేయొచ్చా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.
విద్యుత్‌ను గ్రీడ్‌కు తిరిగి ఇచ్చే సమయంలో ఈ బ్యాటరీ సామర్థ్యం ముందుగా అంచనా వేసిన స్థాయిలో లేదు. అయితే, ఉష్ణాన్ని నిల్వ చేయడం వరకు ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఆహారం, పానీయాలు, వస్త్రాలు, ఫార్మా లాంటి రంగాలకు ఇది ఉపయోగపడే అవకాశముంది.
అమెరికాలోని నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లేబొరేటరీ లాంటి సంస్థలు కూడా ఇసుకను హరిత ఇంధనంగా భావించి పరిశోధనలు చేపడుతున్నాయి.
అయితే, ప్రపంచంలో తొలిసారి విజయవంతంగా పనిచేస్తున్న బ్యాటరీని ఆవిష్కరించిన ఘనత ఫిన్లాండ్ సంస్థకే దక్కుతుందని వటజన్కోస్కి విద్యుత్ కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ పెక్కా పస్సి అన్నారు.
‘‘ఇది చాలా చిన్న విషయం. కానీ, ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఐడియా నచ్చింది. పైగా, ప్రపంచంలో ఇలాంటిది చేయడం ఇదే తొలిసారి’’ అని ఇందులో పెట్టుబడులు పెట్టిన పస్సి తెలిపారు.
‘‘ఇదొక పిచ్చిపని అని మీరు అనొచ్చు. కానీ, నాకు తెలిసి ఇది గొప్ప విజయం సాధిస్తుంది’’.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)