You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- రచయిత, రవి ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో కేవలం 70 ఇళ్లున్న హెసెల్ గ్రామం నేడు వార్తల్లో నిలిచింది. 2016 ఒలింపిక్స్ తరువాత మళ్లీ ఈ గ్రామం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం 17 ఏళ్ల పుండీ సారు.
అమెరికాలోని మిడిల్‌బరీ కాలేజీలో కల్చరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం కింద ఝార్ఖండ్‌కు చెందిన అయిదుగురు వర్ధమాన మహిళా హాకీ క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వారిలో పుండీ ఒకరు.
హాకీ క్రీడాకారుల గ్రామం
హెసెల్ గ్రామంలో చాలా ఇళ్లకు మట్టిగోడలే ఉంటాయి. అలాంటి చిన్న గ్రామం 2016 ఒలింపిక్స్ సమయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశంలోని మీడియా కళ్లన్నీ ఆ గ్రామం వైపే చూశాయి.
ఆ ఏడాది అదే గ్రామానికి చెందిన నిక్కీ ప్రధాన్ ఒలింపిక్స్‌లో ఆడే భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికయ్యారు. ఝార్ఖండ్ నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి మహిళా క్రీడాకారిణి ఆమె.
అంతకు ముందు, ఇదే గ్రామానికి చెందిన పుష్పా ప్రధాన్ భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలుగా ఉండేవారు.
ఇప్పుడు ఆ గ్రామంలో ప్రతి అమ్మాయి హాకీ ఆడుతుందంటే ఆశ్చర్యం కాదు. భారత మహిళల హాకీ జట్టులో చోటు సంపాదించడమే వాళ్లందరి కల.
పుండీ సారు కథ
కొన్నేళ్ల క్రితం పుండీ తండ్రి ఎత్వా సారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు ఆయన మునుపటిలా పని చేయలేకపోతున్నారు.
పుండీ అక్క మంగూరి మెట్రిక్యులేషన్‌లో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ఆత్మహత్య చేసుకుంది.
ఇంటి బాధ్యత పుండీ అన్న సహారా, తల్లి చందు మీద పడింది. పుండీ కూడా వారికి సహయం చేస్తుంటుంది. అందుకే అప్పుడప్పుడూ హాకీ ప్రాక్టీస్ వదిలిపెట్టి పొలంలో పనిచేస్తుంది.
2016లో నిక్కీ ప్రధాన్‌ను కలిసేందుకు బీబీసీ హెసెల్ గ్రామానికి వెళ్లింది. అప్పట్లో పుండీ , తన అక్క మంగూరి కలిసి హాకీ ఆడేవారు. దీనికి సంబంధించి ఒక ఫొటోను బీబీసీ ప్రచురించింది కూడా. అక్క చనిపోవడంతో ఇప్పుడు పుండీ ఒంటరిగా హాకీ ఆడుతోంది.
"మొదట్లో ఫుట్‌బాల్ ఆడేదాన్ని. హాకీ ఆడితే త్వరగా ఉద్యోగం వస్తుందని ఇది ఆడడం మొదలుపెట్టాను. మా కుటుంబం నడవాలంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా ముఖ్యం. భారత్ తరఫున హాకీ ఆడాలనుకుంటున్నా. నాకు ఆ అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది. భారత మహిళా హాకీ జట్టులో సెంటర్ హాఫ్ నుంచి ఆడతాను" అని పుండీ బీబీసీతో చెప్పింది.
పుండీ సారు గిరిజన తెగలకు చెందిన అమ్మాయి. ఆమె క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. పుండీ 2020లో ఈ ఎక్స్‌చేంజ్ కార్యక్రమానికి ఎంపికైంది. కానీ, కోవిడ్ వ్యాప్తి వల్ల అమెరికా వెళ్లలేకపోయింది.
పుండీ తో పాటు ఖుంటి జిల్లాకు చెందిన జుహీ కుమారి, సిండెగాకు చెందిన హెన్రిటా టోప్పో, పూర్ణిమ నేతి, గుమ్లా జిల్లాకు చెందిన ప్రియాంక కుమారి కూడా అమెరికా వెళ్లారు. జూన్ 24 నుంచి జూలై 13 వరకు మిడిల్‌బరీలో శిక్షణా శిబిరానికి హాజరవుతున్నారు.
'విమానంలో కిటికీలు తెరవలేం'
అమెరికా ప్రయాణానికి ముందు పుండీ బీబీసీతో మాట్లాడుతూ, విమానం ఎక్కి అమెరికా వెళ్లే అవకాశం రావడం చాలా సంతోషమని చెప్పింది.
"అమెరికా వెళుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి విమానం ఎక్కుతున్నా. రెండేళ్ల క్రితం మొదటిసారి రైలు ప్రయాణం చేశాను. తరువాత కారులో కూర్చునే అవకాశం వచ్చింది. పట్టరాని సంతోషం కలిగింది. ఇప్పుడు విమానం ఎక్కుతా. కానీ, విమానంలో కిటికీలు తెరవలేం. ఏసీ ఉంటుంది కదా. విమానం చాలా దూరం ఎగురుతుంది. ఆ తరువాతే అమెరికా చేరుకుంటాం. అక్కడి నుంచి తెల్లగా ఉండే ఒక మేడం వస్తుంది. నన్ను వాళ్ళింటికి తీసుకెళతానని చెప్పింది" అంటూ పుండీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది.
"అమెరికాలో మా ఊరిలాగ స్వచ్ఛమైన గాలి, ఖాళీ ప్రదేశాలు ఉండవు. అక్కడివారి తిండి వేరు. అది నాకు నచ్చుతుందో లేదో తెలీదు. నచ్చకపోయినా తినేస్తాను. కడుపు నిండాలి కదా. అక్కడ మొత్తం తిరుగుతా. అక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుంటా. బాగా హాకీ నేర్చుకుని తిరిగి వస్తాను. ఇక్కడికొచ్చాక ఇంకా ఎక్కువ హాకీ ఆడతాను" అని పుండీ చెప్పింది.
ఇంగ్లిష్ భయం
ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాదం చేసేవాళ్లు లేకపోతే మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందని పుండీ భయపడింది.
పుండీ పెలోల్ హైస్కూలు నుంచి పదవ తరగతి పాసయింది. హిందీ మీడియంలో చదువుకుంది. ఆమె ముండారి అనే ఆదివాసీల భాష మాట్లాడుతుంది.
కొంచెం ఇంగ్లిష్‌లో మాట్లాడి చూపించమని బీబీసీ పుండీని కోరింది.
"మై నేమ్ ఈజ్ పుండీ. ఐ లివ్ ఇన్ హెసెల్. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ ఎత్వా సారు. మదర్స్ నేమ్ ఈజ్ చందు సారు. ఐ ప్లే హాకీ" అని చెప్పింది.
ఇప్పుడు ఆమె అమెరికాలో శిక్షణ పొందుతోంది. పుండీ సారు, ఆమె సహచరుల ఫొటోలను అమెరికా నుంచి మేం తెప్పించాం. పిల్లల మొహాల్లో సంతోషం కనిపిస్తోంది. వాళ్లంతా బిజీగా ఉన్నారు. హాకీతో పాటు ఇంగ్లిష్ మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నారు.
అమెరికా అనుభవాలు
"అమెరికా చాలా అందంగా ఉంది. ఇక్కడి వాళ్లంతా చాలా మంచివాళ్లు. ఎయిర్‌పోర్టులోనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మాకు ఏ ఇబ్బందీ లేదు. విమాన ప్రయాణం చాలా బావుంది. మబ్బుల పైనుంచి ప్రయాణం చేశాం. ఇక్కడ అమెరికాలో కేథరిన్ మేమ్ మా భోజన వ్యవహారాలు చూకుంటున్నారు. మేం హాయిగా తింటున్నాం. మా కోచ్ కూడా చాలా మంచివారు" అంటూ పుండీ తన అనుభవాలను చెప్పుకొచ్చింది.
ఈ ఆడపిల్లలతో పాటు శక్తివాహిని అనే సంస్థ ఝార్ఖండ్ నుంచి అమెరికా వెళ్లింది.
ఆ సంస్థకు చెందిన సురభి బీబీసీతో మాట్లాడుతూ, పుండీ మాత్రమే కాదు, ఈ ట్రైనింగ్‌కు వెళ్లిన అయిదుగురు ఆడపిల్లలూ చాలా సంతోషంగా, ఉత్సాహాంగా ఉన్నారని, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.
"విమాన ప్రయాణం అంటే అమ్మాయిలంతా కొంచెం కంగారుపడ్డారు. కానీ, తరువాత ఎంజాయ్ చేశారు. ఆకాశంలో నక్షత్రాలన్నీ తన కోసం భూమి మీద వాలినట్టు అనిపిస్తోందని హెన్రిటా చెప్పింది. అమెరికాలో మనుషులు చాలా మంచివారని, నవ్వుతూ స్నేహపూర్వకంగా ఉంటారని పిల్లలందరూ చెప్పారు. వేరే దేశంలో ఉన్నట్టు అనిపించడం లేదన్నారు" అంటూ సురభి వారి ఆనందాన్ని బీబీసీతో పంచుకున్నారు.
సెలక్షన్ ఎలా జరిగింది?
శక్తివాహిని సంస్థ మహిళల అక్రమ రవాణా (వుమెన్ ట్రాఫికింగ్)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 2019-20లో అమెరికా కాన్సులేట్‌ను సంప్రదించి గిరిజన బాలికలను ప్రోత్సహించేందుకు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది.
ఆ తరువాత అమెరికన్ కాన్సులేట్ (కోల్‌కతా)లోని కొందరు అధికారులు రాంచీ వచ్చి అక్కడి మహిళా హాకీ క్రీడాకారులకు క్యాంపు నిర్వహించారు.
ఆపై, ఝార్ఖండ్‌కు చెందిన అయిదుగురు బాలికలను అమెరికా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
"కల్చరల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఈ బాలికలు వెర్మాంట్ లోని ప్రసిద్ధ మిడిల్‌బరీ కాలేజీలో శిక్షణకు ఎంపికయ్యారు. ఇందుకు అయ్యే ఖర్చును అమెరికా రాయబార కార్యాలయం భరిస్తోంది. ఈ పిల్లలంతా పేద కుటుంబాలకు చెందినవారు. వాళ్ల తల్లులు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ బాలికలు మిడిల్‌బరీ కాలేజీలో ఇంగ్లిష్ స్పీకింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో కూడా శిక్షణ పొందుతున్నారు. అక్కడి ప్రముఖులను కూడా కలుస్తారు" అని శక్తివాహిని సంస్థకు చెందిన రిషికాంత్ బీబీసీతో చెప్పారు.
రోజూ ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ..
పుండీ సారు వాళ్ల గ్రామంలో హాకీ ప్రాక్టీస్ చేయడానికి సరైన మైదానం లేదు. అందుకని, పుండీ తన స్నేహితురాలు చింతామణి ముండితో కలిసి రోజూ ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ఖుంటి వెళుతుంది. అక్కడ బిర్సా కాలేజీ గ్రౌండ్‌లో హాకీ ప్రాక్టీస్ చేస్తుంది. అది ఇసుక మైదానం. అప్పుడప్పుడూ ప్రభుత్వం నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్ స్టేడియంలో ఆడేందుకు అవకాశం వస్తుంటుంది.
అక్కడ దశరథ్ మహతో, మరికొందరు కోచ్‌లు ఆమెకు హాకీలో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టులో ఆడుతున్న నిక్కీ ప్రధాన్‌కు కూడా ప్రారంభ దశలో ఆయన కోచింగ్ ఇచ్చారు.
"పుండీతో పాటు ఇక్కడ చాలామంది అమ్మాయిలకు హాకీ అంటే క్రేజ్ ఉంది. వాళ్లు బాగా ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి మరికొందరు అమ్మాయిలు భారత హాకీ జట్టులో కనిపిస్తారు. వీరి ప్రతిభను సానబెట్టడానికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడి అమ్మాయిలు బాగా హాకీ ఆడుతున్నారు" అని దశరథ్ మహతో బీబీసీకి చెప్పారు.
గ్రామానికే గర్వకారణం
గ్రామంలో అందరూ తమ ఆడబిడ్డలను చూసి గర్వపడుతున్నారని హెసెల్ గ్రామానికి చెందిన కృష్ణ ముండు చెప్పారు.
"మా ఆడపిల్లలు శెనగ పిండి రొట్టెలు, ఆకుకూరలు తిని పెరిగారు. హాకీ కర్రలు కొనుక్కునే స్తోమత లేక వెదురు కర్రలతో హాకీ ఆడడం మొదలుపెట్టారు. కొంతమంది చెక్క, ఫైబర్‌తో చేసిన హాకీ స్టిక్స్, టీ షర్టులు అందించారు. దాంతో, కొన్ని సౌకర్యాలు చేకూరాయి" అని కృష్ణ చెప్పారు.
అమెరికా వెళ్లే ముందు ఈ అయిదుగు ఆటగాళ్లు రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలుపుతూ, ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
"గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. మేం క్రీడా శక్తిగా మారే దిశలో పయనిస్తున్నాం. ఈ బాలికల పట్ల మాకు గర్వంగా ఉంది. వారి అవసరాలన్నీ తీరుస్తాం. ఈ అమ్మాయిలు అమెరికా నుంచి తిరిగి వచ్చాక మళ్లీ వారిని కలుస్తాను. వారి అనుభవాలను తెలుసుకుని, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు ప్రయత్నిస్తాం" అని హేమంత్ సొరేన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
- వలసపోయే ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర మార్గాలు ఇవే...
- ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పు 53 మంది ప్రాణాలను బలి తీసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)