వలసపోయే ప్రజల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర మార్గాలు ఇవే...

అంతర్జాతీయ సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు సంబంధించిన రెండు ఘోరమైన విషాదాలను కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచం చూసింది.

స్పెయిన్, మొరాకోలను విభజించే మెలిలియా కంచెను దాటడానికి శుక్రవారం ఒక పెద్ద సమూహం ప్రయత్నించినప్పుడు కనీసం 23 మంది ప్రజలు చనిపోయారు.

అంతకు మూడు రోజుల ముందే అమెరికాలోని టెక్సస్‌లో శాన్ ఆంటోనియో పోలీసులు ఒక ట్రక్కులో 50కి పైగా మృతదేహాలను కనుగొన్నారు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాకపోకలపై చాలా దేశాలు తీవ్రమైన నిబంధనలను విధించాయి. కరోనా తర్వాత ప్రధాన వలస మార్గాల్లో క్రాసింగ్‌ల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇలాంటి ప్రయత్నాల కారణంగా అధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ వంటి ప్రదేశాలకు చేరుకునే ప్రయత్నంలో 2014 నుంచి దాదాపు 50,000 మంది వలసదారులు మరణించడం లేదా కనిపించకుండా పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పేర్కొంది. అయితే, ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఐఓఎం నమ్ముతోంది.

అయితే, వలసదారులకు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మార్గాలు ఏంటి? వాటిని ఎందుకు ప్రమాదకర మార్గాలుగా పరిగణిస్తున్నారు?

సెంట్రల్ మెడిటెరేనియన్

ఐఓఎం ప్రకారం, వలసదారులకు ఇది అత్యంత ప్రమాదకరమైన మార్గం. 2014 నుంచి ఈ మార్గం ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్‌కు వెళ్లడానికి ప్రయత్నించి 19,500 మందికి పైగా మరణించినట్లు అంచనా.

నాణ్యతలేని ఓవర్‌లోడ్‌తో ఉన్న పడవల్లో ప్రజలు సముద్రాన్ని దాటడానికి తరచుగా ప్రయత్నిస్తుంటారు. తీవ్రమైన గాలుల కారణంగా ఈ క్రాసింగ్ ప్రమాదకరమైనదిగా ప్రాణాంతకమైనదిగా మారుతుంది.

ఈ పడవలను తరచుగా క్రిమినల్ ముఠాలు, మానవులను అక్రమంగా స్మగ్లింగ్ చేసేవారు దోచుకుంటారు.

సెంట్రల్ మెడిటెరేనియన్ సముద్ర మార్గం ద్వారా యూరప్‌కు చేరుకోవాలని భావించేవారికి లిబియా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి వలస వెళ్తూ సముద్రంలో మునిగి చనిపోయే వారి కోసం ట్యూనీషియాలో ప్రత్యేక స్మశాన వాటికను ఏర్పాటు చేశారు.

''ఇక్కడ ఉన్న ఈ సమాధులను చూడటం నాకు చాలా బాధను కలిగిస్తుంది. వాటిని చూసినప్పుడు నేను ఇకపై సముద్రం దాటగలనా అని అనిపిస్తుంది'' అని నైజీరియన్ వలసదారుడు విక్కీ, ఏఎఫ్‌పీకి చెప్పారు. ఆయన ట్యూనీషియా నుంచి వలస వెళ్లాలని అనుకుంటున్నారు.

ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, ఈ మార్గాన వలసదారులను నిరోధించలేమని ఐఓఎం వంటి ఏజెన్సీలు భయపడుతున్నాయి.

''సెంట్రల్ మెడిటెరేనియన్ మార్గంలో వలసదారుల పయనం కొనసాగుతోంది. ఈ అత్యంత ప్రమాదకరమైన సముద్రపు క్రాసింగ్‌లో తరచుగా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం ఇక్కడ చాలా ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రాలు కచ్చితమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది ప్రాణాలను హరిస్తూనే ఉంది'' అని ఐఓఎం అధికార ప్రతినిధి సఫా సెహ్లీ అన్నారు.

2015 నుంచి ఈ మార్గాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తోన్న 3 లక్షల మందిని కాపాడినట్లు యూరోపియన్ సరిహద్దు, తీరప్రాంత ఏజెన్సీ ఫ్రాంటెక్స్ చెప్పింది.

ఆఫ్రికాలోని అంతర్గత మార్గాలు

ఆఫ్రికా వలసదారులు యూరప్ చేరుకోవాలంటే ముందుగా సహారా ఎడారిని దాటాల్సి ఉంటుంది.

ఈ ఎడారిలోని కఠినమైన వాతావరణ పరిస్థితులే వలసదారులకు ప్రధాన ముప్పు అని ఐఓఎం తెలిపింది. 2014-2022 మధ్య దాదాపు 5,400 మంది మరణించడానికి సహారా క్రాసింగే కారణమని ఐఓఎం అంచనా వేసింది.

"ఎడారిలో ప్రజలు చనిపోవడం మీకు కనిపిస్తుంది. కొందరు శక్తి లేక నీరసించిపోయి, మరికొందరు తాగడానికి నీరు లేక చనిపోతారు'' అని తన అనుభవం గురించి ఏఎఫ్‌పీ ఏజెన్సీతో వలసదారు అబ్దుల్లా ఇబ్రహీం చెప్పారు.

వాతావరణమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండే స్మగ్లింగ్ ముఠాల వల్ల కూడా వలసదారులకు తీవ్రమైన ముప్పు ఉంటుంది.

'' ఈ ప్రాంతంలోని స్మగ్లర్లు, సరిహద్దు ఏజెంట్ల హింస కారణంగా కూడా సహారా ఎడారిలో నమోదయ్యే మరణాల సంఖ్య పెరుగుతోంది'' అని తాజా నివేదికలో ఐఓఎం పేర్కొంది.

అమెరికా-మెక్సికో సరిహద్దు

అమెరికా-మెక్సికో సరిహద్దు దాటడం వలసదారులకు పెద్ద సవాలు. ఈ ప్రాంతం ఎడారులు, నదులతో ఉండి భౌగోళికంగా అనువుగా ఉండదు. వలసదారులు తరచుగా సరిహద్దుల వెంట ప్రవహించే ప్రమాదకరమైన రియో గ్రాండే నది మార్గంలో అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు.

ఐఓఎం అంచనాల ప్రకారం 2014 నుంచి 3,000 మందికి పైగా ఈ మార్గంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు కారణమైనవాటిలో నదిలో మునిగిపోవడం ప్రధానమైనది.

ఇక వాహనాల్లో దాక్కొని రహస్యంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించే వారు పడే అవస్థలు మరో రకంగా ఉంటాయి. ఉదాహరణకు శాన్ ఆంటోనియోలో మరణాలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.

''అమెరికాకు వలస వెళ్లే మార్గాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన ఇతర ఘటనలు కూడా ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో దక్షిణ మెక్సికోలోని చియాపాస్ వద్ద ట్రక్కు ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తోన్న 56 మంది వలసదారులు మరణించారు. లాటిన్ అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు వలస మార్గాల్లో పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఐఓఎం ఆందోళన చెందుతోంది'' అని సఫా వివరించారు.

ఆసియా మార్గాలు

ప్రపంచవ్యాప్తంగా 2020లో వలస వెళ్లిన 10 మంది వలసదారులలో 4 కంటే ఎక్కువ మంది ఆసియాలో జన్మించారని ఐఓఎం చెబుతోంది. ఆసియాలో ముఖ్యమైన వలస మార్గాలు అధికంగా ఉన్నాయని తెలిపింది.

ఐఓఎం ప్రకారం, వలస వెళ్లే క్రమంలో గత ఎనిమిదేళ్లలో ఆసియాలో దాదాపు 5,000 మంది మరణించారు. లేదా అదృశ్యమయ్యారు. ఇలా మరణించినవారిలో ఎక్కువమంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారులు ఉంటారు.

వారు సురక్షిత ప్రాంతాలకు చేరడం కోసం బంగాళాఖాతం, అండమాన్ సముద్రాలను దాటే ప్రయత్నంలో ప్రాణాలను కోల్పోతుంటారు.

ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొనే ప్రతికూలతలు విపరీతంగా ఉంటాయి.

ఈ మార్గాల్లో కూడా వలసదారులు, స్మగ్లర్లు, ముఠాల దోపిడీకి బాధితులుగా మారుతుంటారు.

మరొక సమస్యాత్మక మార్గం ఇరాన్, టర్కీ సరిహద్దులో ఉంది. గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్గం అప్గాన్ వలసదారులతో పోటెత్తింది.

ఇరాన్, పొరుగు దేశాల్లో 20 లక్షలకు పైగా అఫ్గాన్లు, శరణార్థులుగా నమోదు చేసుకున్నారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ యూఎన్‌హెచ్‌సీఆర్ సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)