ఆఫ్రికా నుంచి 1965లో లండన్‌ వెళ్లి అక్కడ స్థిరపడేందుకు అనేక కష్టాలను భరించిన ఆరుగురు భారతీయుల కథ

1960లలో తూర్పు ఆఫ్రికా నుంచి కొంత మంది భారతీయ వలసదారులు జీవితంలో పైకెదగాలనే ఆశతో లండన్‌లో అడుగుపెట్టారు.

అందులో కొంత మందికి ఇప్పుడు 70- 80 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వీరంతా వారి జీవితాలను వెనక్కి తరచి చూసుకుంటున్నారు. అందులో బీబీసీ ప్రతినిధి కృపా పాధి తండ్రి కూడా ఉన్నారు.

ప్రఫుల్ పటేల్ బ్రిటిష్ సమాజంలో స్థానాన్ని సంపాదించడానికి పడిన శ్రమను ఆమె వివరించారు.

అది 1965వ సంవత్సరం. డిష్ వాషర్‌గా పని చేస్తున్న 21 సంవత్సరాల ప్రఫుల్ పటేల్‌కు వచ్చే సంపాదన లండన్‌లో అద్దెకు గది సంపాదించడానికి సరిపోలేదు.

దాంతో ఆయన, లండన్‌లోని గ్రేట్ రస్సెల్ స్ట్రీట్‌లో ఉన్న 'ది యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్' కు వెళ్లాల్సి వచ్చింది. నీడ సంపాదించుకోవడానికి ఇదే ఆయనకున్న ఆఖరి ఆశ.

సెంట్రల్ హీటింగ్ సదుపాయమున్న గదికి వారానికి 10 షిల్లింగ్‌లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ ఖర్చు భరించగలనని అనుకున్నారు.

అంతకు ముందు ఆయన హ్యాటన్ గార్డెన్‌లో గిల్డా జువెలర్స్‌లో రిసెప్షనిస్ట్‌గా , ఆక్స్‌ఫర్డ్‌ స్ట్రీట్‌లో ఒక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఆ తర్వాత వైఎంసిఏ ఎదురుగా ఉన్న రోడ్డులో ఉన్న ఒక పబ్‌లో పని చేసేవారు.

ఒక రోజు ఆయన వైఎంససీఏ కు తిరిగి వచ్చేసరికి, లాంజ్‌లో ఐదుగురు యువకులను చూశారు. ఆయనలాగే వాళ్ళు కూడా భారతీయులు.

"భారతీయులు ఒక చోట కూర్చుని, గుజరాతీలో సంభాషించుకుంటూ కనపడటం చాలా అద్భుతంగా ఉంటుంది" అని ప్రఫుల్ అన్నారు.

అంతకు ముందెప్పుడూ ఆయన మాతృ భాషను అంత సులభంగా మాట్లాడుతున్న వారెవరూ ఆయనకు లండన్‌లో కనపడలేదు.

వాళ్లంతా సుమారు ఒకే వయసులో ఉన్నారు. ప్రఫుల్ కంటే కొన్నేళ్లు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు.

వారందరి కుటుంబాలూ గుజరాత్ వదిలి తూర్పు ఆఫ్రికాలో బ్రిటిష్ కాలనీలలో పని కోసం వలస వెళ్ళినవారే. వీరంతా పెద్ద పెద్ద ప్రణాళికలతో విద్యాభ్యాసం కోసం, జీవితంలో విజయం సాధించడం కోసం యూకేలో అడుగు పెట్టినవారే.

ప్రఫుల్ కూడా యూకేకి వచ్చి అప్పటికి ఎన్నో రోజులు అవ్వలేదు.

ఆయన తండ్రి జేతాభాయ్ పటేల్ టీనేజీలో ఉండగా 1900లలో గుజరాత్ నుంచి కెన్యాకు వెళ్లారు. అక్కడ ఈస్ట్ ఆఫ్రికా రైల్వే నెట్ వర్క్‌లో పని చేస్తూ ప్రభుత్వ అధికారిగా చేరారు.

ఆ తర్వాత ఆయన కెన్యా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయన 1952లో జరిగిన లండన్ రాణి పట్టాభిషేకానికి కూడా హాజరయ్యారు.

ఆయన పిల్లలు లండన్‌లో విద్యను అభ్యసించాలనే పట్టుదలతో ప్రఫుల్‌కి 10 ఏళ్ళు రాగానే, 1954లో ఆయన ప్రఫుల్‌ను లండన్ పంపించారు.

లండన్ వెళుతున్నప్పుడు మరో 3 ఏళ్ల వరకు తిరిగి కుటుంబాన్ని కలవలేననే విషయం ప్రఫుల్‌కు తెలియదు.

అంతకుముందెప్పుడూ ఆయన లాంగ్ ట్రౌజర్‌లను ధరించలేదు. ఆయనకు ఇంగ్లీష్‌లో ' ప్లీజ్', 'థ్యాంక్ యూ' అనే పదాలు తప్ప మరేమి తెలియదు.

బ్రిటన్‌లో స్కూలు పిల్లలకు, కాలనీల మధ్య సంబంధాలను పెంపొందించే ఎంపైర్ డే మూవ్‌మెంట్‌కు పని చేసిన స్టెల్లా మాంక్‌ను ఆయనకు గార్డియన్‌గా నియమించారు.

ఆమె ప్రఫుల్‌ని ఈస్ట్ బోర్న్‌లో ఉన్న ప్రెప్ స్కూల్‌కు పంపారు.

పటేల్ అనే పేరుతో మరో ఇద్దరు విద్యార్థులు అక్కడ చదువుతుండటంతో ప్రఫుల్‌కు "పటేల్ నంబర్ త్రీ" అని పేరు పెట్టారు.

రొట్టెలు, పప్పు, కూర తినడం అలవాటు ఉన్న ప్రఫుల్‌‌కు అక్కడ ఉడికించి ఉప్పూ కారం లేని కాయగూరలు తినడం, చాలా కష్టంగా ఉండేది. దాంతో వాటి మీద ఆయన వినేగర్ చల్లుకునేవారు. ఇప్పటికీ ఆయనకు ఇదే అలవాటు కొనసాగుతోంది.

సెలవులు వస్తే కారవాన్‌లో నివసించే అంటీ స్టెల్లా దేశంలో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వివిధ కుటుంబాలతో ప్రఫుల్ ఉండే ఏర్పాట్లు చేసేవారు.

ఒక క్రిస్మస్‌ పండుగకు సొమెర్‌సెట్‌లో ఉన్న చిన్న గ్రామంలో ఒక డాక్టర్ కుటుంబంతో గడిపారు. ప్రఫుల్‌తో పాటు అదే వయసులో ఉన్న ఒక నైజీరియా అబ్బాయితో కలిసి ఊర్లో తిరుగుతూ ఉండేవారు.

"కొంత మంది మా దగ్గరకు వచ్చి మా ముఖాలు చూసి, ముఖానికి రంగు వేసుకున్నారా? అని అడిగేవారు. మమ్మల్ని ప్రతి క్రిస్మస్ పండుగకు పిలిచేవారు" అని చెప్పారు.

సరిగ్గా మూడేళ్ళ తర్వాత ప్రఫుల్ ఇంటికి వెళ్లేందుకు అవకాశం దొరికింది.

ఆయన ఉత్తరాలతోనే కుటుంబంతో సంభాషణలు చేసేవారు.

కానీ, ఆయన రాసే ఉత్తరాలు ఆయన అమ్మగారికి అర్ధమయ్యేవి కావు. ఈ మూడేళ్ళలో ప్రఫుల్ గుజరాతీ పూర్తిగా మర్చిపోయారు.

"మా నాన్నగారు నన్ను పూర్తిగా ఒక ఇంగ్లీష్ వ్యక్తిగా ఉండాలని అనుకున్నారు. నిజానికి నేనలానే తయారయ్యాను" అని అన్నారు.

కానీ, ఇంగ్లీష్ వాళ్ళు నన్ను పూర్తిగా ఆమోదించరని హృదయాంతరాళాల్లో నాకు తెలుసు" అని అన్నారు.

బ్రిటన్ తిరిగి వచ్చిన తర్వాత ప్రఫుల్ సెవెన్ ఓక్స్ లో ఉన్న పబ్లిక్ స్కూల్‌లో చేరారు. అక్కడ చదివే విద్యార్థులు క్రైస్తవ మతం తీసుకోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉండేది.

ప్రఫుల్‌ని అక్కడ అందరూ ప్రఫ్ అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు 14 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన పేరును మతాధికారికి ఇవ్వగానే, ఆయన అది క్రైస్తవ పేరు కాదని అన్నారు

వాళ్ళు ఆయనకు బాప్టిజం ఇచ్చి ఆయన పేరును పీటర్ అని మార్చినట్లు చెప్పారు. ఆయన ఇప్పటికీ ఆ పేరునే వాడుతున్నారు.

ప్రఫుల్‌కు చదువు అంతగా రాలేదు. దాంతో, ఆయన తండ్రి ఆయనను వెనక్కి పిలిచారు.

నైరోబీలో ఆయన టీచర్ అయ్యేందుకు శిక్షణ తీసుకున్నారు. కానీ, రెండేళ్లు స్కూల్‌లో పని చేసిన తర్వాత ఆయన తండ్రి దగ్గరకు వెళ్లి, అక్కడ ఇమడలేక పోతున్నానని చెప్పారు.

దాంతో ఆయన తండ్రి ప్రఫుల్‌ని లండన్ పంపేశారు.

కెన్యాలో వలస పాలన అంతమవుతోంది. లండన్‌లో కూడా పరిస్థితులు మారుతున్నాయి

నల్ల జాతీయులు, ఆసియా ప్రజలను చూసే దృక్పథాలు మారుతున్నాయని ప్రఫుల్ గమనించారు.

"నేను ఉండటానికి స్థలం కోసం వెతికాను. ప్రతీ చోటా నల్ల వారికి , రంగు జాతీయులకు ఇల్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పేవారు. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది" అని ఇంటి కోసం వెతుకుతూ ఆయన పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు.

కెన్యాలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్‌లో ఆయన సంపాదించిన టీచర్ అర్హతలను ఇంగ్లాండ్‌లో గుర్తించలేదు.

దాంతో ఆయన డిష్ వాషర్‌గా పనిలో చేరాల్సి వచ్చింది. గది కోసం వెతుకుతూ వైఎంసీఏ కి వచ్చినప్పుడు ఆయన మిగిలిన అయిదుగురు యువకులను కలిశారు.

వీరంతా స్నేహితులుగా మారారు. అందులో మా నాన్నగారు చంద్రకాంత్ థక్రార్ కూడా ఉన్నారు.

వారికున్న ఉత్తమమైన సూట్లు ధరించడానికి, జుత్తు సరిగ్గా పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు. ప్రఫుల్ వీరి కంటే ఒక అడుగు ముందుండే వారు.

ఆయనలో ఇంగ్లీష్ హావభావాలు మిగిలిన వారికంటే ఎక్కువగా ఉండేవి.

"నేను ధరించే బట్టలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండేవి. నేను కార్నబి స్ట్రీట్ కి వెళుతూ ఉండేవాడిని. అక్కడ స్వెటర్లు, నెహ్రు కాలర్ షర్ట్‌లు కొనేవాడిని. మిగిలిన వారు అలా చేసేవారు కాదు. వాళ్లంతా చాలా సంప్రదాయ తరహాలో ఉండేవారు."

"వాళ్లెప్పుడూ కలలో కూడా ఊహించని పనులను నేను చేయడం వాళ్ళు చూశారు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు నన్ను కలవడానికి వైఎంసీఏ కు వచ్చేవారు. మేము బయటకు వెళుతూ ఉండేవాళ్ళం. వాళ్లంతా ఒకరితో ఒకరు, ప్రఫుల్ ని చూడండి అనుకుంటూ ఉండేవారు" అని చెప్పారు.

వారి భారతీయ మూలాలు, వలస పాలన, కుటుంబాల పట్ల తమ కున్న బాధ్యత లాంటి విషయాలు వారి బంధం బలపడటానికి సహకరించాయి.

కొన్ని దశాబ్దాల క్రితం ఆర్ధిక అవకాశాల కోసం భారతదేశం వదిలి వచ్చిన వారి కుటుంబాల నుంచి వారికి పనిలో నైతికత వారసత్వంగా వచ్చిందని వారు భావిస్తారు.

ఒక రోజు ప్రఫుల్‌ని కలవడానికి వచ్చిన ఇందు మమ్‌తోరా , నువ్వు ఇలాగే క్ల‌ర్క్‌గా, వెయిటర్‌గా పని చేస్తూ ఉండిపోతావా అని ప్రశ్నించారు. నీకొక మంచి అర్హత సంపాదించుకునే ఉద్దేశ్యం లేదా అని ప్రశ్నించారు.

ఆ ప్రశ్న ఆయనను కదిల్చింది. ఆయన ఆ తర్వాత హోల్‌బోర్న్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి వెళ్లారు. తర్వాత లండన్ లోని లింకన్ ఇన్‌లో చేరారు.

ప్రఫుల్ తీసిన ఈ చిత్రంలో ఎడమ నుంచి కుడి వైపు ఉన్నవారు:

చంపక్ పంచల్ - ఆయిల్ పరిశ్రమలో ఇంజనీర్ గా పని చేసి అమెరికాకు వలస వెళ్లారు.

ఫాజల్ మూసా - ఆయన ఆస్ట్రేలియా మహిళను కలిసి అక్కడి గ్రామీణ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు.

చందు థక్రార్ - స్నేహితుల్లో అందరి కంటే పెద్ద వారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసి పదవీ విరమణ చేశారు.

ఇందు మమ్ తోరా - న్యాయవాదిగా పని చేశారు. చనిపోయారు.

ప్రవీణ్ చోక్సీ - ఐదుగురు మనుమలకు తాత. ఇప్పటికీ లండన్‌లోని టెక్నాలజీ షాపులో పని చేస్తున్నారు.

ఆయన పట్టభద్రులు కాగానే, ట్రెజరీ సాలిసిటర్ విభాగంలో చేరారు. ఆయన పని చేస్తున్న వేగం చూసి, అంత వేగంగా పని చేయవద్దని పిలిచి చెప్పారు.

"నేను కూర్చుని నెమ్మదిగా పని చేస్తూ చేసే పనిని వాయిదా వేసే అలవాటు లేక ఆ ఉద్యోగాన్ని వదిలేశాను" అని అన్నారు.

సరైన జీతం ఇచ్చే ఉద్యోగం దొరకక ఆయన మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో చేరారు. అక్కడ అకౌంట్ల నిర్వహణ చూస్తూ ఆయన కొన్ని కోట్ల విలువైన కాంట్రాక్టులను నిర్వహించడం మొదలు పెట్టారు.

దాంతో, సేల్స్ రంగంలో ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఆయన తండ్రి కోరుకున్న ప్రొఫెషనల్ అర్హతలను సంపాదించుకున్నారు. కానీ, నల్ల జాతీయుల పట్ల బ్రిటిష్ వారికుండే అభిప్రాయాలను మాత్రం ఎదుర్కోవలసి వచ్చింది. .

ఆయన ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆయనను మొదట ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పారు.

మరొకరు, నల్ల జాతి సేల్స్ మ్యాన్ ను ఉద్యోగం లోకి తీసుకోవడానికి తమ సంస్థ సిద్ధంగా లేదని చెప్పారు.

"ఈ రోజుల్లో అయితే, దానిని వర్ణ వివక్ష అంటారు" కానీ, నేను దానినలా చూడలేదు. ఏదైనా ఆటంకం వస్తే దానిని ఎలా అధిగమించాలో చూడాలి. నేను ఆ వర్ణ వివక్షను పోగొట్టాలని అనుకోలేదు. అది జరిగే పని కాదని తెలుసు" అని అన్నారు.

ప్రఫుల్ స్నేహితుడు చంపక్ పంచల్ కూడా ఇదే విధానాన్ని అవలంబించారు.

ఆయన ఇప్పుడు టెక్సస్‌లో నివసిస్తున్నారు. ఆయన లండన్ లో చదువు పూర్తవ్వగానే, హ్యాండ్లీ పేజీ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉద్యోగం మొదలుపెట్టారు.

ఆ తర్వాత ఆ సంస్థ ఆర్ధికంగా పతనమైంది.

దాంతో, ఆయన నిరుద్యోగ భృతి కోసం నమోదు చేసుకున్నారు.

ఆయనకు 2.10 పౌండ్లు వచ్చేవి. ఆయన దాంతోనే సరిపెట్టుకునేవాడినని చెప్పారు.

నేను ఇంజనీర్‌ను. ఆ డబ్బును నేను తీసుకోలేను అని చెప్పాను. దాంతో వారు ఆయనకు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం దొరికేందుకు సహాయం చేసినట్లు చెప్పారు.

ఆయన ప్రస్తుతం విజయవంతమైన కెరీర్ తర్వాత పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన ఛార్టర్డ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని చెప్పడానికి ఏ మాత్రం సందేహించలేదు.

ఆ స్నేహాలన్నీ అనారోగ్యం, ఆర్ధిక సమస్యలు, విదేశాలకు వెళ్లిపోవడం లాంటి ఆటుపోట్లు ఉన్నప్పటికీ కాలాన్ని తట్టుకుని నిలబడ్డాయి.

ప్రఫుల్ విషయానికొచ్చేసరికి కెన్యాలో గడిచిన బాల్యం నుంచీ లండన్‌లో బ్రిటిష్ పౌరునిగా మారేవరకూ , ఆయన జీవితంలో జరిగిన ఏ విషయమూ ఊహించినట్లుగా జరగలేదు.

"నా చిన్నప్పుడే కెన్యాను వదిలి ఇంగ్లాండ్ కు వచ్చాను. నేనేమి చేయాలో, చేయకూడదో చెప్పడానికి ఎవరూ లేరు. నేను గాలిలో వదిలేసిన పావురంలా ఉండేవాడిని. నాకెక్కడికి నచ్చితే అక్కడకు ఎగిరాను" అని ప్రఫుల్ చెప్పారు.

"నాకు ఇంగ్లాండ్ అంటే ఇష్టం. ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉండేది. కానీ, ఇదే నా ఇల్లు" అని అన్నారు.

70వ పడిలో ఉన్న ప్రఫుల్ లుకేమియా వ్యాధి తిరిగి కబలించడంతో, ఆయన భార్య లిజీతో కలిసి చెషైర్ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారు. ఆయన ఇప్పుడు స్వచ్ఛమైన గుజరాతీ కూడా మాట్లాడగలరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)