You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మ్యూచువల్ ఫండ్స్: నెలకు రూ. 5,000 మదుపు చేస్తే పదేళ్ళకు 12 లక్షలు వస్తాయా?
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
వారెన్ బఫెట్‌ను కొత్త మదుపరులకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే ఆయన ఇలా బదులిచ్చారు:
రూల్ 1: ఎప్పుడూ నష్టం వచ్చే అవకాశం ఉన్న మార్గాల్లో మదుపు చేయకు
రూల్ 2: రూల్ 1 మరోసారి చూడు
మదుపు మార్గం ఏదైనా మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలి. కానీ రిస్క్ లేని మదుపు మార్గాలు లేవు. మదుపులో సహజంగా ఉండే రిస్క్ కాక మరెన్నో కారణాలు మదుపు మీద వచ్చే రాబడిని ప్రభావితం చేస్తాయి.
కరోనా లాంటి ఆరోగ్య సంక్షోభం సంభవిస్తే దాన్ని అధిగమించే మదుపు మార్గం ఏమిటి? లేదా యుక్రెయిన్-రష్యా యుద్దం లాంటి అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు మన ఆర్థిక లక్ష్యాలు ఎలా చేరుకోవాలి?
2009లో చూసిన రిసెషన్ లాంటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి? ఒక వైపు ఉద్యోగ బాధ్యతలలో బిజీగా ఉంటూ మదుపు మార్గాలను అధ్యయనం చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితుల్లో ఎలా మదుపు చేయాలి? ఇవన్నీ సగటు మదుపరిని తొలిచే ప్రశ్నలు.
ఈ ప్రశ్నలకు సూటిగా ఇవ్వగలిగే సమాధానాలు అంటూ ఏమీ లేవు. కానీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి తక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకుని మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
విపత్కర పరిస్థితులు, సంక్షోభాలు జరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా దెబ్బతింటాయి. అలా ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ మౌలిక సూత్రాలను మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం.
ఇండెక్స్ ఫండ్స్:
వివిధ కంపెనీల పనితీరుని విశ్లేషించే సమయం లేని వాళ్లకు ఇండెక్స్ ఫండ్ ఒక గొప్ప అవకాశం. గోల్డ్ ఫండ్స్ తప్ప మిగతా అన్ని ఇండెక్స్ ఫండ్స్ 12% కంటే ఎక్కువ రాబడిని గత పదేళ్ళుగా ఇస్తున్నాయి.
అంటే పదేళ్ల కిందట నెలకు రూ. ఐదు వేలు ఎస్.ఐ.పి.(SIP) మొదలు పెట్టుంటే నేడు దాదాపుగా రూ. 12 లక్షల మూలనిధిగా అయ్యేది. ఇప్పుడు ఈ ఫండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అనే నానుడి ఇండెక్స్ ఫండ్ మేనేజర్ విషయంలో సరిపోతుంది. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ మేనేజర్ పనితీరు మిగతా ఫండ్ మేనేజర్లకంటే భిన్నంగా ఉంటుంది.
ఆ వ్యక్తి సదరు కంపెనీ ఎలాంటి ఆర్థిక ప్రగతిని సాధిస్తోంది, వార్షిక మదుపరుల సమావేశంలో ఏం చెప్పారు లాంటివి పట్టించుకోరు. కేవలం ఆ కంపెనీ స్టాక్ నిర్ధారిత ఇండెక్స్ లో భాగంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ప్రతి మార్కెట్ ఇండెక్స్ గణించేటప్పుడు కంపెనీల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇండెక్స్ భాగంగా ఉంచడమో, తీసివేయడమో చేస్తారు.
దీనివల్ల ఫండ్ మేనేజర్ పని చాలా సులువుగా మారుతుంది. ఇండెక్స్ గణనలో వివిధ రంగాలను ఎలాగూ పరిశీలిస్తారు కనుక ఒకే విధమైన సంస్థలలో మదుపు చేసే రిస్క్ ఉండదు.
1974లో వాన్ గార్డ్ గ్రూప్ ద్వారా వాడుకలోకి వచ్చిన ఈ ఫండ్స్ గురించి మొదట్లో చాలా మంది మదుపరులు ఆందోళన వ్యక్త పరిచారు. ఫండ్ మేనేజర్ లేకుండా ఫండ్ ఉండటం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత కాలంలో ఇండెక్స్ ఫండ్స్ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
స్వయంగా పోర్ట్ ఫోలియో నిర్మించుకోవడం
మదుపరులు స్వయంగా నిర్మించుకునే పోర్ట్ ఫోలియో ఎలా ఉండాలో మౌలిక సూత్రాల ఆధారంగా చూద్దాం. మదుపు చేయాల్సింది వ్యాపారాలలో కానీ షేర్లలో కాదు అనేది ఒక ముఖ్యమైన మదుపు సూత్రం.
ఎందుకంటే ఎలాంటి కంపెనీ పనితీరు అయినా మూలాధారమైన వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సదరు కంపెనీ పనిచేసే రంగం పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి వాటి ఆధారంగా మదుపు చేయాలి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వారి డేటా ప్రకారం కొన్ని కీలక రంగాల సూచీల వార్షిక వృద్ధి కింద ఇచ్చిన పట్టికలో ఉంది. ఈ పట్టిక ప్రకారం చూస్తే ఎఫ్.ఎం.సి.జి. ఇండెక్స్, బ్యాంక్ ఇండెక్స్ మిగిలిన వాటి కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి.
ఈ రెండు రంగాలూ కూడా 15% కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని ఇచ్చాయి. అంటే ఈ రంగాలలో చేసిన మ్యూచువల్ ఫండ్స్ మనకు కనీసం 15% వార్షిక రాబడిని అందించే అవకాశం ఉంది అని నిర్దారించుకోవచ్చు. కానీ ఈ రంగాలలో ఇంత వృధ్ధి ఎందుకు ఉంది అనే విషయం ఆలోచించి సహేతుకమైన నిర్ణయానికి రావాలి.
ప్రతీ కుటుంబానికి దైనందిన జీవనంలో అవసరమయ్యే నిత్యావసరాలు అందించే ఈ రంగానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. కరోనా సంబంధిత లాక్ డౌన్ సమయంలో కూడా నిత్యావసరాలకు వెసులుబాటు కల్పించారు. దేశ జనాభా మొత్తం ఈ రంగానికి కస్టమర్లే. ఈ కారణంగా ఎఫ్.ఎం.సి.జి. రంగం వృద్ధి చెందడం పూర్తిగా డిమాండ్ ఆధారితమైనదే.
టెక్నాలజీ సహాయంతో హోం డెలివరీ పెరుగుతున్న నేటి తరుణంలో ఈ రంగానికి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువ. అందువల్ల మదుపరులకు ఈ రంగం ఒక చక్కని అవకాశం.
బ్యాంకింగ్ రంగం:
బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది. దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో కీలకమైన ఈ రంగం మీద సహజంగానే ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత ఈ రంగంలో వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు వచ్చినా దాని వల్ల ప్రభావం మిగిలిన అన్ని రంగాల మీద కూడా ఉంటుంది.
ఆ కారణం చేత అటు ప్రభుత్వం, ఇటు రెగ్యులేటరీ ఆథారిటీ కూడా ఈ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాయి.ఈ రంగం లాభదాయకంగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం.
నిలకడగా 15% వార్షిక రాబడి ఇస్తూ భవిష్యత్తులో కూడా వృద్ధికి ఎంతో అవకాశం ఉన్న ఈ రెండు రంగాలలో మనం మ్యూచువల్ ఫండ్ మదుపులో 50% దాకా మదుపు చేయడం చెప్పదగిన సూచన. దాని వల్ల మనం మదుపు చేసిన మొత్తంలో 50% మదుపుకు నష్ట భయం లేనట్లే.
ఇక మిగిలిన 50% మదుపు మొత్తంలో ఏదైనా అధిక రిస్క్/రాబడి వచ్చే ఫండ్స్ లేదా స్మాల్ క్యాప్ లాంటి ఫండ్స్ కలిగించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక బలమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకోవచ్చు.
*వృద్ధిరేటు గణించేటప్పుదు 2020 ఫిబ్రవరి నుంచీ 5,10,15 సంవత్సరాల డేటా తీసుకున్నాం.
ఇవి కూడా చదవండి:
- #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు?
- యుద్ధం బూటకమా, అంతా యుక్రెయిన్ ఆడుతున్న నాటకమా
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- ఆంధ్రప్రదేశ్: 'మా ఇంటిని మళ్లీ మేమే ఎక్కువ రేటిచ్చి కొనుక్కోవాలా...' యూఎల్సీ నోటీసులపై మండిపడుతున్న జనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)