ఎకనామిక్ సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు

ఆదాయ పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి గుర్తింపును ఇచ్చి, గౌరవించాలని ఆర్థిక సర్వే సలహా ఇచ్చింది. అంతేకాదు, నిజాయితీగా పన్ను కట్టే వారి పేర్లను పంచాయతీ లేదా జిల్లా కార్యాలయాల్లో ప్రదర్శించాలని కూడా చెబుతోంది. తద్వారా పన్ను ఎగవేతలను తగ్గించొచ్చని సర్వే అంటోంది.

మీ పేరు మీద రోడ్డో లేక రైలో ఉంటే ఎలా ఉంటుంది..? ఏకంగా ఒక ఎయిర్‌పోర్టుకు మీ పేరు పెట్టేస్తే ఏమనిపిస్తుంది..?

అబ్బా! వినడానికి బాగుంది కానీ, అది అయ్యే పనేనా గురు, అంటారేమో!

మీరు సక్రమంగా పన్ను చెల్లిస్తే, అత్యధికంగా పన్ను కట్టే తొలి 10 మందిలో మీరూ ఉంటే అప్పుడు సాధ్యమవుతుందని భారత ముఖ్యఆర్థిక సలహాదారు కృష్ణ మూర్తి సుబ్రమణియన్ అంటున్నారు.

అనడమే కాదు ఏకంగా ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2018-19 ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాల్లో ఇదీ ఒకటి.

ఒక జిల్లాలో అత్యధికంగా పన్ను చెల్లించిన తొలి 10 మందికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆర్థిక సర్వే సిఫారసు చేసింది.

మీకు లభించే ప్రత్యేక సౌకర్యాలు:

  • విమానాశ్రయాల్లో బోర్డింగ్ ప్రివిలేజెస్
  • టోల్ గేట్ల వద్ద స్పెషల్ ప్రివిలేజెస్
  • విదేశీయ ప్రయాణాలప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద దౌత్యవేత్తల తరహాలో ప్రత్యేక క్యూలు

వీటికి మీ పేరు పెడతారు:

  • ముఖ్యమైన భవనాలు
  • చారిత్రక కట్టడాలు
  • రహదారులు
  • రైళ్లు
  • పాఠశాలలు
  • విశ్వవిద్యాలయాలు
  • ఆసుపత్రులు
  • విమానాశ్రయాలు

ఆదాయ పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి గుర్తింపును ఇచ్చి, గౌరవించాలని ఆర్థిక సర్వే సలహా ఇచ్చింది. అంతేకాదు నిజాయితీగా పన్ను కట్టే వారి పేర్లను పంచాయతీ లేదా జిల్లా కార్యాలయాల్లో ప్రదర్శించాలని కూడా చెబుతోంది. తద్వారా పన్ను ఎగవేతలను తగ్గించొచ్చని సర్వే అంటోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులకు పచ్చజెండా ఊపితే రాబోయే రోజుల్లో నిజంగానే మీ పేరు పెట్టిన రోడ్డు మీద మీరు జామ్ జామ్ అంటూ దూసుకు పోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)