You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగినా, తగ్గినా కూడా చర్చనీయాంశమే.
భారత్‌లో ఆయా రాష్ట్రాలు విధించే పన్నులను బట్టి పెట్రోలు ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టే, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి కారణాల వల్లే ధరల్లో తేడాలు వస్తుంటాయి.
పెట్రోలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత శాతం పన్నులు విధిస్తున్నారు? ఎంత రాయితీ ఇస్తున్నారు? ధరలు నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?.. ఇలాంటి అనేక అంశాలపై పెట్రోలు ధరలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక్కోసారి దేశాల మధ్య పెట్రోలు ధరల్లో భారీ అంతరాలుంటాయి.
ఉదాహరణకు, నెదర్లాండ్స్‌లో పెట్రోలు ధరలు చాలా ఎక్కువ. బొలీవియాలో మాత్రం చాలా తక్కువ. అంతమాత్రాన నెదర్లాండ్స్ వాసులు పెట్రోలు ధరలతో ఇబ్బంది పడుతున్నారని అనుకోవడానికి లేదు. ఆ దేశస్థుల ఆర్థిక స్థోమతను బట్టి చూస్తే ఆ ధర తక్కువే కావొచ్చు.
మన దేశంలోని పెట్రోలు ధరలతో, మన కరెన్సీతో పోల్చి చూస్తే.. తక్కువ ధరకు పెట్రోలు దొరికే దేశాలివే.
వెనెజువెలా
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాల్లో వెనెజువెలాది తొలిస్థానం. అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.67పైసలు.
ఓ పక్క ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అలాంటి పరిస్థితుల్లో అంత తక్కువ ధరకు పెట్రోల్ దొరకడానికి ప్రధానంగా రెండు అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు ఆ దేశంలో ఉండటం ఒక కారణమైతే, ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోలుపై రాయితీలు కొనసాగిస్తుండటం మరో కారణం.
సౌదీ అరేబియా
భారీ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో సౌదీ అరేబియాది రెండో స్థానం. కానీ పెట్రోలు ధరల విషయంలో మాత్రం ఆ దేశానిది 13వ స్థానం. అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.36.40.
ఇరాన్, సూడాన్, కువైట్
ఇరాన్‌లో 18.88 రూపాయలకు, సూడాన్‌లో 22.93 రూపాయలకు లీటరు పెట్రోలు దొరకుతుంది. ఇవి రెండూ ఆసియా, ఆఫ్రికాల్లో అత్యంత ఎక్కువగా పెట్రోలును ఉత్పత్తి చేస్తున్న దేశాలు. కువైట్‌లో కూడా దాదాపు 23 రూపాయలకు లీటరు పెట్రోలు లభిస్తుంది.
ఈ దేశాలన్నీ విదేశాలకు ఎక్కువ ధరకు పెట్రోలు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నాయి. తమ దేశస్థులకు మాత్రం తక్కువ ధరకే పెట్రోలును అందిస్తున్నాయి.
ఎక్కువ ధరకు పెట్రోలు దొరికే దేశాలివే.
ఐస్‌లాండ్
అత్యంత ఎక్కువ ధరకు పెట్రోలు దొరికే దేశం ఐస్‌లాండ్. అక్కడ లీటరు పెట్రోలు కొనాలంటే రూ.144.96 చెల్లించాలి.
హాంకాంగ్
హాంకాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 144.31 రూపాయలు. ఇది వెనెజువెలాలోని ధర కంటే 194రెట్లు అధికం.
నార్వే
నార్వేలోని పెట్రోలు ధరలు కాస్త చిత్రంగా కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చమురు ఉత్పత్తి దేశాల్లో నార్వే ఒకటి. అయినా కూడా అక్కడి పెట్రోలు ధర లీటరు రూ.138.20.
ఆ దేశంలో పెట్రోలు ధర ఎక్కువగా ఉండటానికి ప్రభుత్వ విధానమే కారణం. ప్రజలంతా కార్లను వదిలేసి ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే అక్కడ పెట్రోలుపై భారీగా పన్నులు విధిస్తోంది.
పెట్రోలు అమ్మకం ద్వారా వచ్చే డబ్బునంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నార్వే ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో చమురు నిల్వలు అడుగంటితే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా ముందుజాగ్రత్తగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
నెదర్లాండ్స్, గ్రీస్, మొనాకో, డెన్మార్క్ దేశాల్లో కూడా పెట్రోలు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో లీటరు పెట్రోలు ధర 132.80 రూపాయలు. గ్రీస్, మొనాకో, డెన్మార్క్‌లలో అది 129.43 రూపాయలుగా ఉంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)