బ్రిటన్‌: పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లు

బ్రిటన్‌ దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ముందు ఇటీవలి రోజుల్లో పొడవైన క్యూలు బారులు తీరడం గురించి మీరు విని ఉండొచ్చు.

ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ ప్రజలంతా పెట్రోల్ కొనడానికి ఎగబడుతున్నారు.

అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందో మేం తెలుసుకున్నాం.

పెట్రోల్ స్టేషన్లలో ఏం జరుగుతోంది?

పెట్రోల్ స్టేషన్లలో బాహాబాహీకి దిగుతున్నారని ఒక బంకు యజమాని వర్ణించారు.

కొన్ని పెట్రోల్ స్టేషన్ల బయట మైళ్ల దూరం వరకు పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి.

ప్రజలంతా వారి వాహనాల ట్యాంకులను నింపుకొనేందుకు గంటల తరబడి లైన్లలో ఎదురు చూస్తున్నారు.

కొంతమంది డ్రైవర్లు కార్లలోనే నిద్రపోతున్నారు. కొందరేమో క్యూలను దాటుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు.

చాలా పెట్రోల్ బంకులు డిమాండ్‌కు సరిపడా పెట్రోల్‌ను అందించలేక స్టేషన్లను మూసివేస్తున్నారు.

సౌత్‌ వేల్స్‌ మేస్టాగ్‌లోని తన బంకులో రోజుకు సాధారణంగా 20 వేల నుంచి 30 వేల లీటర్ల పెట్రోల్‌ను అమ్ముతామని 'ఆయిల్ 4 వేల్స్' డైరెక్టర్ కోలిన్ ఓన్స్ అన్నారు. కానీ గత 24 గంటల్లో లక్ష లీటర్ల పెట్రోల్‌ను అమ్మాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

కొన్ని స్టేషన్లలో పెట్రోల్ కోసం గొడవలు కూడా జరిగాయి.

పెట్రోల్ అయిపోవడంతో ఒక బంకులో జరిగిన గొడవ గురించి ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ డానీ ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు.

''నా వెనుక ఉన్న వ్యక్తి కోపంతో ఊగిపోతూ స్టేషన్ సిబ్బందిపై పిడిగుద్దులు ప్రారంభించాడు. మరో 8 నుంచి 10 మంది కూడా జత కూడటంతో అది వీధి కొట్లాటలా మారిపోయింది'' అని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

యూకేలో పెట్రోల్ కొరత ఉందా?

షెల్, ఇక్సాన్‌మోబిల్, గ్రేఎనర్జీ లాంటి ఆయిల్ కంపెనీలన్నీ దేశంలో పెట్రోల్ కొరత లేదని నొక్కి చెప్పాయి.

''ఒక్కసారిగా వినియోగదారులు పొటెత్తడం వల్లే తాత్కాలిక కొరత ఏర్పడిందని, అంతే తప్ప జాతీయ స్థాయిలో ఇంధన కొరత లేదని'' అవి స్పష్టం చేశాయి.

యూకే ప్రభుత్వ మంత్రులు కూడా ఇదే మాట చెప్పారు.

''ఎలాంటి ఇంధన కొరత లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే... ప్రజలు మామూలు సమయాల్లో లాగా పెట్రోల్ కొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పెట్రోల్ కొరత అంటూ మీడియా కవరేజీ కూడా ఉండకపోయేది. ఇంతలా ప్రజలు కూడా స్పందించకపోయేవారు '' అని పర్యావరణ కార్యదర్శి జార్జి యుస్టిస్ సోమవారం అన్నారు.

కానీ ప్రస్తుతమైతే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడిందనేది నిజం.

''మాకు మెంబర్‌షిప్ ఉన్న 5500 ఇండిపెండెంట్ ఔట్‌లెట్లలో ఇప్పటికే ఇంధనం అయిపోయింది. అంటే మూడింట రెండొంతుల ఔట్‌లెట్లు ఖాళీ అయ్యాయి. మిగతా వాటిలో కూడా చివరకు వచ్చి ఉంటుంది'' అని పెట్రోల్ రిటెయిలర్స్ అసోసియేషన్ సోమవారం పేర్కొంది.

ఉత్తర ఐర్లాండ్‌లో ఈ ప్రభావం లేనప్పటికీ, బ్రిటన్‌లోని పట్టణ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

పెట్రోల్ కొనాలని తొందరపడటానికి కారణమేంటి?

దీనికి ముఖ్య కారణం బ్రిటన్‌లో లారీ డ్రైవర్ల కొరత ఉండటమే.

దేశంలో లక్షకు పైగా లారీ డ్రైవర్ల కొరత ఉన్నట్లు అంచనా. ఈ కొరత వల్ల చాలా పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

తగినంత సంఖ్యలో లారీ డ్రైవర్లు లేకపోవడం వల్ల ఇటీవలి నెలల్లో సూపర్ మార్కెట్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తీవ్ర ఇబ్బందుల పాలయ్యాయి.

లారీ డ్రైవర్ల కొరత కారణంగా కొన్ని బంకులను తాత్కాలికంగా మూసివేస్తామని గతవారం ప్రముఖ చమురు సంస్థ బీపీ ప్రకటించడంతో ప్రజల్లో ఈ ప్యూయల్ భయం నెలకొంది.

అదే సమయంలో మరికొన్ని చమురు సంస్థలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.

యూకేలో లారీ డ్రైవర్ల కొరత ఎందుకు ఉంది?

యూరప్ వ్యాప్తంగా హెవీ గూడ్స్ వెహికిల్ (హెచ్‌జీవీ) డ్రైవర్ల కొరత ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. బ్రిటన్‌ ఈ సమస్యతో ఎక్కువగా నష్టపోయింది.

బ్రెగ్జిట్ తర్వాత యూరప్‌లోని చాలామంది డ్రైవర్లు తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు.

బ్రెగ్జిట్ ప్రభావం తమ ఆదాయం పడటంతో కొంతమంది మరో పని చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

కోవిడ్-19 కారణంగా మిగిలిన వారు కూడా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వెళ్లిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే తిరిగి వస్తున్నారు.

మరోవైపు కొంతమంది డ్రైవర్లు రిటైర్మెంట్ తీసుకోగా వారి స్థానాల్నిఇంకా భర్తీ చేయలేదు. కోవిడ్ 19 కారణంగా హెచ్‌జీవీ లైసెన్స్ పరీక్షలు నిలిచిపోయాయి.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది?

పెట్రోల్ స్టేషన్ల వద్ద గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ సహాయం తీసుకుంటామని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది.

అత్యవసరమైన ప్రాంతాల్లో ఇంధనాన్ని రవాణా చేసేందుకు వీలుగా మిలిటరీ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

హెచ్‌జీవీ లైసెన్స్‌లను పొడిగించనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. చమురు సంస్థల మధ్య పోటీ చట్టాలను తాత్కాలిక నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

''దీని వల్ల ఇంధన రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ఆయిల్ కంపెనీలు షేర్ చేసుకోగలుగుతాయి. ప్రాధాన్యత ప్రకారం అత్యవసరమైన ప్రాంతాలకు పెట్రోల్‌ను చేర్చుతాయి'' అని బిజినెస్ సెక్రటరీ ఖాసి క్వార్టెంగ్ అన్నారు.

లారీ డ్రైవర్ల కొరతను అధిగమించడానికి విదేశీ ఫ్యూయల్ ట్యాంకర్ డ్రైవర్లు, ఫుడ్ లారీ డ్రైవర్లకు సంబంధించి 5 వేల తాత్కాలిక వీసాలను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

క్రిస్‌మస్ ఏర్పాట్లలో భాగంగా 5,500 మంది ఫౌల్ట్రీ వర్కర్లకు వీసాలు మంజూరు చేస్తామని చెప్పింది.

హెచ్‌జీవీ లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్లు వెనక్కి తిరిగి రావాల్సిందిగా కోరుతూ దాదాపు 10 లక్షల ఉత్తరాలను పంపించింది. మరో 4 వేల మందికి హెచ్‌జీవీ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)