You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘నా కొడుకు కడుపులో బుల్లెట్ దించారు.. ఛాతీపై తన్నారు’’- అస్సాం దరంగ్ జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
అస్సాం దరంగ్ జిల్లాలోని బ్రహ్మపుత్ర ఉపనది సుతా తీరం వెంబడి ఉన్న ధోల్‌పుర్ గ్రామంలోని ఓ తాత్కాలిక గుడారం నుంచి పిల్లలు, మహిళల ఏడుపులు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఇక్కడి పరిస్థితులు ప్రశాంతంగానే ఉండేవి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నదీ తీరం వెంబడి ఆక్రమణల తొలగింపు పేరుతో ఇక్కడి ఇళ్లను పోలీసులు కూల్చేందుకు ప్రయత్నించారు. దీంతో విధ్వంసకర ఘర్షణలు చెలరేగాయి.
గురువారం చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో ఇద్దరు మరణించారని దరంగ్ జిల్లా పరిపాలనా విభాగం తెలిపింది. మరో ఏడుగురు గ్రామస్థులు గాయపడ్డారని, మరోవైపు తొమ్మిది మంది పోలీసులకూ గాయాలయ్యాయని వెల్లడించింది. ప్రస్తుతం క్షతగాత్రులకు గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అయితే, ధోల్‌పుర్‌లోని మూడో నంబరు గ్రామంలోకి అడుగుపెడితే, ప్రభుత్వం చెప్పినదానికంటే, ఇక్కడ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతోంది.
సిపాఝార్ పట్టణం నుంచి 14 కి.మీ. ప్రయాణిస్తే ఖార్ ఘాట్ వస్తుంది. పడవల సాయంతో ఈ నదిని దాటితే, అవతలివైపు ధోల్‌పుర్-3 గ్రామం ఉంది.
గ్రామంలోకి అడుగుపెడుతూనే.. కూల్చేసిన, మంటల్లో బూడిదైన ఇళ్ల శిథిలాలు కనిపించాయి. కొన్నిచోట్ల మంటల్లో శిథిలమైన బైక్‌లు, సైకిళ్లు కూడా కనిపించాయి. శిథిలమైన ఇళ్ల బయట, వంట సామగ్రి, ఇతర వస్తువులు చిందరవందరగా పడివున్నాయి.
ఇలా శిథిలమైన ఇళ్లలో తమ వస్తువులను వెతుక్కుంటూ కొందరు మహిళలు కనిపించారు.
విషాదంలో
సుతా నదీ తీరంలో అల్యూమినియం షీట్లతో వేసిన ఓ తాత్కాలిక టెంట్ నుంచి ఏడుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇంటిలో ఓ వృద్ధురాలు, మహిళలు, పిల్లలు ఉన్నారు. మోయినుల్ హక్ కుటుంబం ఇదీ.
28ఏళ్ల మోయినుల్.. పోలీసుల కాల్పుల్లో మరణించారు. అతడిపై పోలీసుల దాడి అనంతరం, పోలీసులతోపాటు వచ్చిన ఓ కెమెరామెన్ అతడిపైకి దూకి బలంగా తన్నుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోయినుల్‌పై దాడిచేసిన ఆ కెమెరామెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మోయినుల్ తల్లి మోయిమోనా బేగమ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తనను చూడటానికి వచ్చిన అందరినీ.. ‘‘నా కొడుకును మళ్లీ నాకు ఇవ్వండి’’అని ఆమె వేడుకుంటున్నారు.
‘‘నా కొడుకు నాకు కావాలి. కాల్పుల తర్వాత, అతడి ఛాతీపై బలంగా తన్నారు. అతడిపై ఎక్కి నిలబడ్డారు. తన కొడుకును ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా చూడగలదా? నేను ఆ వీడియోను చూడలేదు. కానీ నా కొడుకును చంపిన తర్వాత, ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని గ్రామస్థులు చెబుతున్నారు’’అంటూ ఆమె ఏడుస్తున్నారు.
మోయినుల్ ముగ్గురు పిల్లల్ని చూపిస్తూ.. ‘‘రోజువారీ కూలి పనులు చేసుకుంటూ మా అందరినీ మోయినుల్ పోషించేవాడు. చూడండి.. ఈ ముగ్గురు పిల్లలు చాలా చిన్నవారు. వీరిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? మా కుటుంబం ఎలా గడుస్తుంది? మోయినుల్ చనిపోయిన తర్వాత నుంచి మాకు భోజనం కూడా లేదు. ఇది మా ఇల్లు. ఇది మా భూమి. మాకు వేరే ఎక్కడా ఏమీ లేదు. మేం ఇదే దేశంలో పుట్టాం. మా పేర్లు కూడా జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లో ఉన్నాయి. మరి ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు?’’అని ఆమె ప్రశ్నించారు.
మోయినుల్ మృతి తర్వాత, అతడి భార్య మమతా బేగమ్ కొంతసేపటి వరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె కూడా తన భర్తను కాల్చిచంపిన దృశ్యాలను చూడలేదు. ‘‘మా ఇల్లును కూలగొట్టారు. పొలం పనులు చేసుకునే నా భర్త మరణించారు. అతణ్ని దారుణంగా చంపేశారు. ఆ దృశ్యాలను అందరూ ఫోన్లలో చూస్తున్నారు. మాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేం ఏం చేయాలి? ఇల్లు కూడా లేదు. మేం ఎక్కడికి పోవాలి’’అని చిన్న స్వరంతో ఆమె అన్నారు.
మోయినుల్‌పై కాల్పుల వీడియోలు వైరల్ కావడంతో, గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ‘‘ఆ వీడియో చూసిన తర్వాత, నాకు చాలా భయం వేసింది. మరణించిన వ్యక్తిపై అలా ఎలా దాడిచేస్తారు? అది చాలా క్రూరమైన చర్య’’అని 18ఏళ్ల విద్యార్థి ఖుర్బాన్ అలీ విచారం వ్యక్తంచేశారు.
ఘర్షణల తర్వాత...
ఈ ఘర్షణలు గురువారం చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్లను కూల్చివేసే పనులను జిల్లా పరిపాలనా విభాగం తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇళ్ల కూల్చివేత అనంతరం, చాలా మంది తమ సామగ్రితో సుతా నదిని దాటుకుంటూ వెళ్తూ కనిపించారు.
ఏటా బ్రహ్మపుత్ర నదిలో వరదలు ముంచెత్తే ప్రాంతానికి ఘర్షణలు జరిగిన చోటు సమీపంలోనే ఉంది. వరదలు వచ్చే సమయంలో ఇక్కడి ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తుంటారు.
‘‘వేరేచోట సదుపాయాలు కల్పించలేదు’’
ధోల్‌పుర్-3 గ్రామంలో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన ప్రజలకు వేరేచోట ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలనూ సమకూర్చలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
మరోవైపు ఇళ్ల కూల్చివేతలో భాగంగా, మూడు మసీదులు, ఒక మదర్సాను కూడా జిల్లా పరిసాలన యంత్రాంగం కూల్చేసిందని కొందరు వివరించారు. మసీదులు కూల్చివేయడంతో శుక్రవారం ఆరుబయటే ప్రార్థనలు చేసుకున్నామని తెలిపారు.
‘‘ఇది ఒక సున్నీ మసీదు. ఇక్కడ ప్రార్థనలకు చాలా మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు దీన్ని కూల్చివేశారు. దీని పక్కనే ఒక పాఠశాల ఉంది. కానీ, దాన్ని అధికారులు ముట్టుకోలేదు’’అని శిథిలమైన మసీదువైపు చూపిస్తూ ధోల్‌పుర్-2 గ్రామానికి చెందిన అమర్ అలీ చెప్పారు.
బీజేపీ హయాంలో
అస్సాంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలే అయ్యింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘ఆక్రమణ’’లను తొలగించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెబుతోంది.
ప్రభుత్వ చర్యలపై వేల మంది నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ముస్లిం బెంగాలీ ప్రాంతాలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని వారు విమర్శిస్తున్నారు.
సెప్టెంబరు 20న ధోల్‌పుర్-1, 2 గ్రామాల్లో 4,500 బిఘాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో 800 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
అయితే, సెప్టెంబరు 23నాటి ఘర్షణలతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. గువాహటి హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విపక్షాలు, మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.
ఇది అనాగరిక చర్య - కాంగ్రెస్
ఆక్రమణల తొలగింపు పేరుతో గ్రామస్థులపై కాల్పులు జరపడాన్ని అనాగరిక చర్య అంటూ అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపెన్ బోరా వ్యాఖ్యానించారు.
‘‘అస్సాంలో అమాయకులను కాల్చివేసేందుకు ప్రజలు ఈ ప్రభుత్వానికి లైసెన్సు ఏమీ ఇవ్వలేదు. పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తాం’’అని బోరా వ్యాఖ్యానించారు.
‘‘ఈ ఘర్షణలపై గువాహటి హైకోర్టు విచారణ చేపట్టాలి. వెంటనే డిప్యూటీ కమిషనర్, ఎస్పీలను సస్పెండ్ చేయాలి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆక్రమణల నుంచి ఖాళీ చేయించిన వారికి వేరోచోట ఆశ్రయం కల్పించాలి. ప్రభుత్వం వారికి సదుపాయాలు సమకూర్చేవరకు మేం ఈ పోరాటాన్ని వదిలిపెట్టం’’అని ఆయన అన్నారు.
ఆక్రమణలపై చర్యలు కొనసాగుతాయి.. - ముఖ్యమంత్రి
విపక్షాల విమర్శల నడుమ స్థానిక మీడియాతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే మేం ఊరుకునేది లేదు. ఇలా వదిలేస్తే, రేపు కామాఖ్య దేవాలయాన్ని కూడా ఆక్రమిస్తారు.’’
‘‘పేదలకు ప్రభుత్వం ఆరు బిఘాల స్థలం ఇస్తోంది. దీన్ని గత రెండు నెలలుగా పదేపదే చెబుతున్నాను. ప్రజలు ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా ఎస్పీ, డీసీలను సస్పెండ్‌చేసే ప్రసక్తే లేదు. వారు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటారు’’అని ఆయన అన్నారు.
‘‘ఘర్షణల సమయంలో వేల మంది ప్రజలు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడిచేశారు. అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కెమెరాన్ చేసిన పనిని నేను కూడా ఖండిస్తున్నా. అయితే, కేవలం మూడు నిమిషాల వీడియోను పట్టుకుని మాట్లాడటం సరికాదు. అంతకుముందు, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘మాకు సదుపాయాలు కల్పించడం లేదు’’
‘‘పోలీసులు ఇక్కడకు వచ్చినప్పుడు ప్రజలు శాంతియుతంగానే నిరసలు తెలిపారు. ఇళ్లు కూల్చేస్తే మేం ఎక్కడకు వెళ్లాలని అడిగారు. ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. అయితే, ఒక్క నిమిషంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాల్పులు శబ్దాలు వినిపించాయి. పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లేసరికి, రక్తం మడుగులో ఒక వ్యక్తి కనిపించాడు’’అని ధోల్‌పుర్ గ్రామం-1కు చెందిన మహమ్మద్ తాయెత్ వివరించారు.
‘‘ఇది ప్రభుత్వ భూమే. కానీ ఇక్కడ 60, 70ఏళ్ల నుంచీ మేం జీవిస్తున్నాం. మాకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలూ కల్పించలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏకంగా వెళ్లిపోవాలని అంటున్నారు. మేం అస్సాం ప్రజలమే. ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే ప్రభుత్వం దర్యాప్తు కూడా చేపట్టొచ్చు.’’
‘‘మా పత్రాల్లో ఏమైనా తప్పులుంటే, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టండి. ఒకవేళ మేం ఇక్కడి వారిమేనని రుజువైతే, మాకు భూమి ఇవ్వండి. మేం మనుషులం. మాపై అరాచకాలు ఎందుకు చేపడుతున్నారు? మేం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే, మాపై కాల్పులు జరుపుతారా?’’అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల కాల్పుల్లో మోయినుల్‌తోపాటు 13ఏళ్ల షేక్ ఫరీద్ కూడా మరణించాడు. ఏడో తరగతి చదువుతున్న ఫరీద్ ఆ రోజు ఆధార్ కార్డు కోసం బయటకు వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు మరణించినట్లు కుటుంబానికి వార్త అందింది.
4,500 బిఘాల స్థలాన్ని ఖాళీ చేయించాం
‘‘సెప్టెంబరు 20న మేం శాంతియుతంగానే 4,500 బిఘాల స్థలాన్ని ఖాళీ చేయించాం. అక్కడి ప్రజల కోసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేశాం. ఆ రోజు ఎలాంటి సమస్యా తలెత్తలేదు’’అని దరంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రభాతి తౌస్సేన్ చెప్పారు.
‘‘కానీ గురువారం మాత్రం వేలమంది కలిసి పోలీసులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులను కొట్టారు. దీంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ విషయంపై జ్యూడీషియల్ విచారణ జరుగుతోంది. మేం కూడా మెజిస్టేరియల్ విచారణ ఏర్పాటుచేశాం. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయి.’’
ఆక్రమణలపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు.
‘‘మేమంతా పౌరులమే’’
ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలోని ప్రజలు తాము దేశ పౌరులమేనని బీబీసీతో చెప్పారు. ఎన్‌ఆర్‌సీలో కూడా తమ పేర్లు ఉన్నాయని వివరించారు.
‘‘ఇదివరకు మా కుటుంబం సిపాఝార్‌లోని కిరాకారా ప్రాంతంలో ఉండేది. అయితే, వరదలకు మా ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో మేం ధోల్‌పుర్‌కు వచ్చేశాం. ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఏళ్లుగా మేం ఇక్కడే ఉంటున్నాం. 1983 నుంచి నేను ఓటు కూడా వేస్తున్నాను. నా దగ్గర అన్ని పత్రాలూ ఉన్నాయి. ఎన్‌ఆర్‌సీలోనూ నా పేరు ఉంది’’అని 63ఏళ్ల అహ్మద్ అలీ చెప్పారు.
ఇక్కడి ప్రజల పౌరసత్వం గురించి డిప్యూటీ కమిషనర్‌ను బీబీసీ ప్రశ్నించింది. అయితే, నేడు ప్రశ్న ఆక్రమణల గురించి మాత్రమేనని ఆమె అన్నారు.
మోయినుల్ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం అతడి కుటుంబానికి అప్పగించారు. అయితే, కుటుంబానికి ఆధారమైన మోయినుల్‌ను కోల్పోవడంతో, ఇప్పుడు ఏం చేయాలో తెలియని గందరగోళం ఆ కుంటుంబాన్ని వెంటాడుతోంది.
ఇవి కూడా చదవండి:
- డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు?
- ఇస్లామిక్ స్టేట్ మాజీ సభ్యురాలు షమీమా బేగం: 'నాకు మరో అవకాశం ఇవ్వండి... తీవ్రవాదంపై పోరాడడంలో సాయపడతాను'
- పవన్ కల్యాణ్: సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త
- పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టిగా జవాబిచ్చిన స్నేహ దుబే
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)