You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త – ప్రెస్‌రివ్యూ
‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోయి... తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సంపదను బ్యాంకులకు చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రిపబ్లిక్’ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘సాయితేజ్ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో మీడియాలో కొద్దిమంది నిర్లక్ష్యంగా వెళ్లాడని, ఎక్కువ వేగంతో వెళ్లాడని ప్రోగ్రామ్స్ చేశారు. అలా చేసే వ్యక్తులు కొంచెం కనికరం చూపించాలని కోరుతున్నా. ఇలాంటి కథనాల కంటే... వై.ఎస్.వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో మాట్లాడితే బాగుంటుంది. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పొడిచారు. అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా భారీ కుట్ర ఉందని చెప్పారు. అది ఏమైందని అడగండి.’
‘లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అది వాళ్లకి దక్కడం లేదు. అదెందుకో దాని గురించి మాట్లాడండి. ఇడుపులపాయలో నేలమాళిగలో టన్నులకొద్దీ డబ్బులు ఉంటాయని చెబుతుంటారు. దానిపై కథలు నడపండి. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమావాళ్ల గురించి కాదు’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘పాలమూరు’పై నీళ్లు చల్లొద్దు: సీఎం కేసీఆర్
తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం జీవధార అని.. ఆ ప్రాజెక్టును కొనసాగనివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘కరువు తీర్చే ఈ ప్రాజెక్టు పనులను ఆపి.. ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లొద్దని కేసీఆర్ విన్నవించారు.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి కేంద్రమంత్రితో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు.
సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపైనే చర్చించారు.
వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 6వ తేదీనే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చర్చించారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం గమనార్హం’’అని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
హెడ్‌మాస్టర్ దండనతో బాలికకు పక్షవాతం
‘‘హోంవర్క్ చేయలేదని బాలికను చెంపమీద, తలమీద ప్రధానోపాధ్యాయుడు కొట్టడంతో ఆమె విసురుగా వెళ్లి తరగతి గోడకు తగిలింది. ఆమె తల లోపల తీవ్ర గాయమవ్వడంతో చెయ్యి, మూతి వంకర్లు పోయి పక్షవాతమొచ్చింది’’అని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాల్యాతండాకు చెందిన దారావత్ రమేశ్-రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె స్నేహిత పడమటనర్సాపురం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.
ఈ నెల 18న తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్ట్‌లకు సంబంధించి హోమ్‌వర్క్ చేయలేదని స్నేహితను ప్రధానోపాధ్యాయుడు బాణోత్ శంకర్ కొట్టారు. బాలిక విసురుగా గోడకు తగిలి కింద పడిపోయింది.
బడి నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె నీరసంగా ఉండటంతో తల్లి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. 20న బడికి వెళ్లమంటే ఇంటి సమీపంలోని రహదారి పక్కన కూర్చుండిపోయింది. బడికెందుకు వెళ్లడం లేదని తల్లి ప్రశ్నించగా తలనొప్పిగా ఉందని చెప్పింది.
ఆ మరుసటి రోజు బాలిక చెయ్యి, మూతి వంకరపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, అక్కడి నుంచి ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయగా తలలో దెబ్బతగలడంతో పక్షవాతం వచ్చిందని తేలింది.
ఎవరైనా తలపై కొట్టారా అని స్నేహితను వైద్యుడు ప్రశ్నించడంతో హోమ్‌వర్క్ చేయలేదని ప్రధానోపాధ్యాయుడు కొట్టారని, ఎవరితో చెప్పొద్దని ఆయన బెదిరించడంతో తల్లికి కూడా చెప్పలేదని వెల్లడించింది. బడికి వెళ్లి కూతురిని ఎందుకు కొట్టారని తల్లి ప్రశ్నిస్తే సదరు ప్రధానోపాధ్యాయుడు తాను కొట్టలేదని, దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి
తల్లిదండ్రుల మద్యం మత్తు వారి చిన్నారి మరణానికి కారణమైందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పూసలబస్తీలో నివసించే రాజేశ్, జాహ్నవి దంపతులు నిత్యం మద్యం సేవించి గోడవపడేవారు.
శుక్రవారం కూడా ఇరువురు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన రాజేశ్.. జాహ్నవి మీద దాడి చేశాడు.
భర్త దెబ్బలు తాలలేక.. జాహ్నవి తన చేతిలోని 21 రోజుల బాబును అడ్డుపెట్టింది. దాంతో చిన్నారికి బలంగా దెబ్బ తగిలింది.
చిన్నారిని ఆసుపత్రికి తలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో సైదాబాద్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
ఘటన జరిగిన ప్రాంతానికి నిందితుడు రాజేశ్‌ను తీసుకెళ్లి పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ నిర్వహించారు.
ఘటన జరిగిన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా గొడవ పడ్డారు, గొడవలో పసికందు ఎలా మృతి చెందాడు అని ఆరా తీశారు’’అని వెలుగు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టిగా జవాబిచ్చిన స్నేహ దుబే
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)