అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీ డెవలప్‌మెంట్ బోర్డు విద్యుత్ కొనుగోలుపై ఆ దేశ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదానీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని కోరింది.

బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ పవర్ సెల్ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ''ఈ అంశంపై చర్చించడానికి అదానీ గ్రూప్ ప్రతినిధి బృందం ఈ నెలాఖరులోగా బంగ్లాదేశ్‌కు రానుంది. ఆ సమయంలో ముఖాముఖి చర్చలు ఉంటాయి. చర్చలు జరపడానికి అదే ఉత్తమం అని భావిస్తున్నా'' అన్నారు.

మరోవైపు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చర్చ జరిగిందా లేదా అనేదానిపై ఎటువంటి సమాచారం లేదు.

అయితే ఫిబ్రవరి 7న అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం బంగ్లాదేశ్ విద్యుత్ కొనుగోలుపై ఎటువంటి ఒప్పందం జరగలేదని భారత నియంత్రణ సంస్థకు అదానీ పవర్ కంపెనీ లేఖ రాసినట్లు తెలిపింది.

అదానీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించారు. మరి ఎలాంటి ఒప్పందం కుదరకపోతే, అదానీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండటం బంగ్లాదేశ్‌ను ఇరుకున పడేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ విషయంలో ఇంధన నిపుణులు బద్రుల్ ఇస్లాం మాట్లాడుతూ "అదానీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదానీ గ్రూప్ టన్ను బొగ్గు ధరను రూ. 33 వేలుగా నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ధర సుమారు రూ. 20 వేలు మాత్రమే’’ అని చెప్పారు.

‘‘ఇంధనం ధరను నిర్ణయించే సందర్భంలో అధిక విద్యుత్ ఖర్చు చెల్లించవలసి ఉంటుంది. ఇది బంగ్లాదేశ్‌కు నష్టం చేకూరుస్తుంది. దీంతో బంగ్లాదేశ్ భవిష్యత్తులో విద్యుత్ రిటైల్ ధరను పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుత ఒప్పందంలోని నిబంధనలను అంగీకరిస్తే బంగ్లాదేశ్‌కు అంతగా ప్రయోజనకరం కాదు" అని ఆయన వాదిస్తున్నారు.

మరో ఇంధన నిపుణుడు ఎం. తమీమ్ మాట్లాడుతూ "బంగ్లాదేశ్‌లోని దేశీయ మార్కెట్‌తో పోల్చితే అదానీ గ్రూప్ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్‌కు ఒకటి లేదా ఒకటిన్నర రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. కానీ బంగ్లాదేశ్‌లో 13-14 రూపాయల ఖరీదు చేసే విద్యుత్‌ను 22 రూపాయలకు కొనుగోలు చేస్తే అది ఆ దేశానికి నష్టం చేకూర్చేదే'' అని వ్యాఖ్యానించారు.

పవర్ స్టేషన్లకు ఇంధనం సరఫరాలో విఫలం

ఎనర్జీ ఎక్స్‌పర్ట్, బంగ్లాదేశ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (బీయూఈటీ) మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ ''అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విధంగా మంచిదే’’ అన్నారు.

‘‘బంగ్లాదేశ్ పవర్ స్టేషన్లను నిర్మించడంలో విజయవంతం అయినప్పటికీ, వాటికి ఇంధనాన్ని సరఫరా చేయడంలో అది విఫలమైంది. దీని ప్రభావం ముఖ్యంగా కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కనిపించింది. ఈ కోణంలో చూస్తే అదానీ గ్రూప్ ఒప్పందం ప్రకారం అక్కడ పవర్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఇంధనం కూడా సరఫరా అవుతుంది’’ అని పేర్కొన్నారు.

‘‘అయితే సమస్య ఏంటంటే ఒప్పందం కుదిరినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం లేదు. అందువల్ల ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఇంధన ధర ఎలా ఉంటుందనే దానిపై ఎటువంటి ప్రణాళిక రూపొందించలేదు’’ అని ఆయన చెప్పారు.

‘‘గొడ్డా పవర్ స్టేషన్ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఇంధన ధరను చెల్లించాలి. అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బొగ్గు ధర కనీసం మూడు రెట్లు పెరిగింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒప్పందంలోని నిబంధనలను పునరాలోచించకుండా ముందుకు వెళితే బంగ్లాదేశ్ భారీగా నష్టపోవాల్సి వస్తుంది'' అని వివరించారు.

ఖర్చులన్నీ బంగ్లాదేశ్ ప్రభుత్వమే భరించాలి

ఇంధన ధర సాధారణంగా న్యూకాజిల్ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణ పరిస్థితుల్లో దీని వల్ల ఇబ్బంది ఉండదని ఎనర్జీ విశ్లేషకులు చెబుతున్నారు.

కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఈ సూచిక నుంచి ఏదైనా ఇంధనం ధరను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, బంగ్లాదేశ్‌కు ఇది లాభదాయకం కాదు.

గొడ్డా పవర్ స్టేషన్‌లో వినియోగించే బొగ్గు అదానీ ప్రైవేట్ సోర్స్ నుంచి ఓడల ద్వారా వస్తుందని వాషింగ్టన్ పోస్ట్‌ కథనం పేర్కొంది.

అదానీ గ్రూప్‌కు చెందిన ఓడరేవులో బొగ్గు దిగుతుంది. అదానీ నిర్మించిన రైలు మార్గం ద్వారా రవాణా చేస్తారు. దీంతో పాటు ఈ కేంద్రంలో తయారైన విద్యుత్ సరఫరా కూడా అదానీ ఏర్పాటు చేసిన హై-వోల్టేజ్ లైన్ ద్వారానే జరుగుతుంది.

మరోవైపు ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వం షిప్పింగ్, ట్రాన్స్‌మిషన్ ఖర్చు మొత్తం భరించాలి. దేశంలోని విద్యుత్ హోల్‌సేల్ ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లించి మరీ బంగ్లాదేశ్ ఈ విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది.

బొగ్గు ధర మునుపటి స్థాయికి తిరిగి వచ్చినప్పటికీ, అదానీ ప్రతి కిలోవాట్ ఫర్ అవర్ విద్యుత్‌కు స్థానిక మార్కెట్ కంటే 33 శాతం ఎక్కువ ఖర్చు అవుతుంది. కప్టై సోలార్ ఫామ్ కంటే అదానీ విద్యుత్ ధర ఐదు రెట్లు ఎక్కువ.

డాక్టర్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ "ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌ మీద ఈ ధరను విధిస్తే, కొనుగోలు చేయడం కంటే బంగ్లాదేశ్ ఇంధన ధర తగ్గే వరకు వేచి ఉండటం మేలు’’ అని చెప్పారు.

‘‘కానీ, ఈ సమయంలో బంగ్లాదేశ్ కెపాసిటీ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. లేదా అదానీ గ్రూప్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఇంధనాన్ని సరఫరా చేసే బాధ్యతను బంగ్లాదేశ్ తీసుకోవడం మరొ దారి. దీనిపై ఒత్తిడి పెరిగితే అదానీ గ్రూప్‌ అగ్రిమెంట్‌ నిబంధనలపై పునరాలోచించాల్సి వస్తుంది’’ అని హుస్సేన్‌ చెబుతున్నారు.

అంతేకాకుండా నిబంధనలను పునఃపరిశీలిస్తే బంగ్లాదేశ్‌కు ఈ ఒప్పందం మంచిదని హుస్సేన్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. అసాధారణ పరిస్థితి ఏర్పడితే పునఃపరిశీలించవచ్చనే నిబంధన ప్రతి ఒప్పందంలోనూ ఉంటుందని ఆయన గుర్తుచేస్తున్నారు.

కాబట్టి, ఈ ఒప్పందాన్ని కూడా పునఃపరిశీలించవచ్చని ఆయన స్పష్టంచేశారు.

గడువులోపు విద్యుత్ సరఫరాపైనా నీలినీడలు

2017లో బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీ డెవలప్‌మెంట్ బోర్డ్ (పీడీబీ)కు అదానీ పవర్‌తో 25 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. ఇందులో ఇంధనం దిగుమతి, రవాణా ఖర్చులను కొనుగోలుదారు దేశం (బంగ్లాదేశ్) భరిస్తుందని పేర్కొంది.

అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ఈ ధర నిర్ణయిస్తారు. అదానీ పవర్‌కు పీడీబీ పంపిన లేఖలో గ్రూప్ బొగ్గు ధరను టన్నుకు రూ.33 వేలుగా నిర్ణయించినట్లు పేర్కొంది.

అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర ప్రస్తుతం టన్నుకు రూ. 20 వేలు మాత్రమే ఉంది. ఈ కారణంగా బొగ్గు ధరపై పునరాలోచన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

2022 అక్టోబర్‌లో బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీ డెవలప్‌మెంట్ బోర్డ్ తన వార్షిక నివేదిక వెల్లడించింది. అందులో అదానీ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఛార్జ్ బంగ్లాదేశ్‌లోని ఇతర పవర్ స్టేషన్ల కంటే 16 శాతం ఎక్కువ అని పేర్కొంది.

దేశంలోని పేరా పవర్‌ స్టేషన్‌తో పోలిస్తే బొగ్గు ధర 45 శాతం ఎక్కువ అని అందులో ఉంది.

ఒకవేళ అదానీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఇండియా నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్ ఖర్చు కంటే 3 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.

భారత్ నుంచి విద్యుత్ దిగుమతికి యూనిట్‌కు ఏడు రూపాయలు ఖర్చవుతుందని, అదానీ గ్రూప్‌ నుంచి కొనుగోలు చేస్తే యూనిట్‌కు 18 రూపాయలు ఖర్చవుతుందని ఈ నివేదికలో పేర్కొంది.

దీంతో పాటు అదానీ విద్యుత్‌కు సంబంధించి ప్రతి ఏటా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను కెపాసిటీ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు గొడ్డాలో ఉన్న అదానీ గ్రూపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి దాదాపు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ 16 నుంచి ఈ సరఫరా ప్రారంభం కావాల్సి ఉండగా అది కుదరలేదు.

పవర్ సెల్ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ''వచ్చే నెలాఖరులోగా మొదటి యూనిట్‌ కరెంటు వచ్చేలా ఉంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు'' అని అన్నారు.

అయితే ముందుగా ఈ గడువును మార్చి మొదటి వారంలో, ఆ తర్వాత మార్చి మధ్యలో నిర్ణయించారు. మార్చి మొదటి వారంలో 750 మెగావాట్ల విద్యుత్ రావడం ప్రారంభమవుతుందని ఫిబ్రవరి 5న ఇంధన, ఖనిజ వనరుల శాఖ సహాయ మంత్రి నస్రుల్ హమీద్ ప్రకటించారు.

కానీ, అదానీ గ్రూప్ విద్యుత్ సరఫరా ప్రారంభానికి గడువును పలుమార్లు వాయిదా వేసింది. ఇప్పుడు మార్చి నెలాఖరులోగా విద్యుత్ సరఫరా ప్రారంభిస్తామన్న ప్రకటనపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)