ఆక్స్‌ఫామ్ నివేదిక: ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్‌ సంపద

2021 వరకు భారతదేశం కలిగిన మొత్తం సంపదలో దాదాపు 40.5 శాతం కేవలం 1 శాతం మంది వద్దే ఉందని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది.

2020లో దేశంలోని బిలియనీర్ల సంఖ్య 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగిందని పేర్కొంది.

మరోవైపు భారతదేశంలోని పేదలు "జీవించడానికి కనీస అవసరాలు కూడా పొందలేకపోతున్నారు" అని తెలిపింది నివేదిక.

ఈ అసమానతలను పరిష్కరించడానికి అత్యంత సంపన్నులపై సంపద పన్ను విధించాలని ఆ స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభమైనప్పుడు 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' అనే ఈ నివేదిక విడుదలైంది.

ఆ నివేదిక ప్రకారం 2012 నుంచి 2021 మధ్య దేశం కలిగిన సంపదలో 40 శాతం కంటే ఎక్కువ సంపద కేవలం 1 శాతం మందికి చేరింది. దిగువ 50 శాతం మంది వద్ద కేవలం 3 శాతం సంపద ఉన్నట్లు తెలిపింది.

ఈ నివేదిక భారతదేశంలో సంపద పంపిణీలో అసమానతలను ఎత్తి చూపింది.

2022లో భారతదేశంలోని అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 46 శాతం పెరిగింది.

అంతేకాకుండా భారతదేశంలోని 100 మంది సంపన్నుల సంపద మొత్తం దాదాపు రూ. 53 లక్షల కోట్లకు చేరుకుంది.

జీఎస్టీ ఎక్కువ చెల్లిస్తున్నదెవరు?

ఇదిలా ఉండగా దేశంలోని ధనవంతుల కంటే పేద, మధ్యతరగతిపై ఎక్కువ పన్ను విధించారని ఆక్స్‌ఫామ్ ఆరోపించింది.

దేశంలోని మొత్తం వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో దాదాపు 64 శాతం మేర పన్ను దిగువ సంపద కలిగిన 50 శాతం ప్రజల నుంచి వచ్చింది. అయితే 4 శాతం జీఎస్టీ మాత్రమే టాప్ 10 శాతం మంది నుంచి వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది.

"దురదృష్టవశాత్తూ ధనికుల కోసం మాత్రమే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ ఆరోపించారు.

"దేశంలోని అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, అనధికారిక రంగ కార్మికులు అత్యంత ధనవంతుల మనుగడకు భరోసానిచ్చే వ్యవస్థలో కష్టాలను అనుభవిస్తున్నారు." అని తెలిపారు.

ప్రస్తుతం తగ్గిన కార్పొరేట్ పన్నులు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాల నుంచి సంపన్నులు లబ్ది పొందుతున్నారని నివేదిక పేర్కొంది.

ఈ అసమానతను సరిచేయడానికి, రాబోయే బడ్జెట్‌లో సంపద పన్ను వంటి ప్రగతిశీల పన్ను చర్యలను అమలు చేయాలని ఆ స్వచ్ఛంద సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

భారతదేశంలోని బిలియనీర్ల మొత్తం సంపదపై 2 శాతం పన్ను విధించడం వల్ల వచ్చే మూడేళ్లలో దేశంలోని పోషకాహార లోపం ఉన్న వారికి ఆహారం అందుతుందని నివేదిక పేర్కొంది.

1 శాతం సంపద పన్ను జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఏడాదిన్నర వరకు నిధులు సమకూరుస్తుందన్నది.

టాప్ 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా టాప్ 10 బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే దాదాపు 15 కోట్ల మంది పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి అవసరమైన మొత్తం అందుతుందని ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)