You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముకరం జా: ఇస్తాంబుల్‌లో మరణించిన ఈ ‘ఎనిమిదో నిజాం’ చరిత్ర ఏంటి?
హైదరాబాద్ సంస్థానం ‘ఎనిమిదో నిజాం’ రాజుగా బిరుదు ఉన్న నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం జా బహదూర్ కన్నుమూశారు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో జనవరి 14 (శనివారం) రాత్రి 10: 30 గంటలకు 89 ఏళ్ల ముకరం జా కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఈ వార్త చెప్పేందుకు విచారిస్తున్నాం. గత రాత్రి 10:30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో హైదరాబాద్ ఎనిమిదో నిజాం రాజు నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం జా బహదూర్ తుదిశ్వాస విడిచారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
తన స్వస్థలమైన హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగాలన్న ఆయన చివరి కోరిక మేరకు కుటుంబసభ్యులు మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని తీసుకొని హైదరాబాద్‌కు రానున్నారు.
నగరానికి చేరకున్నాక ఆయన భౌతిక కాయాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. అక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలను పూర్తి చేస్తారు.
తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ఆయనను ఖననం చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరం జా.
1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలించారు. ఆయన ఏడో నిజాం రాజు.
మీర్ ఉస్మాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆజమ్ జా, ప్రిన్సెస్ దుర్రె షెహవార్ దంపతులకు 1933లో ముకరం జా జన్మించారు.
తన కుమారులను పక్కన బెట్టి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారుసుడిగా ముకరం జాను ప్రకటించినట్లు వార్తా పత్రిక ‘ది హిందూ’ తన కథనంలో పేర్కొంది.
1967 ఏప్రిల్ 6న చౌమహల్లా ప్యాలెస్‌లో ముకరం జా, హైదరాబాద్ ఎనిమిదో నిజాం రాజుగా పట్టాభిషిక్తులు అయినట్లు ఈ కథనం తెలిపింది.
భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి కొన్ని రోజుల గడిపిన ముకరం జా, ఆతర్వాత అక్కడి నుంచి టర్కీకి వెళ్లి స్థిరపడ్డారు.
నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ కు ముకరం జా చైర్మన్ గా వ్యవహరించారు.
ఏడో నిజాం వారసుడిగా1967లో ప్రపంచంలో అత్యధిక సంపదను ముకరం జా వారసత్వంగా పొందారని ఇండియా టుడే ఒక కథనంలో పేర్కొంది.
అయితే, పెద్ద పెద్ద రాజభవనాలు, అచ్చెరువొందించే నగలు, విలాసవంతమైన జీవన శైలి, ఆస్తులను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఆయన సంపదంతా కరిగిపోయిందని హైదరాబాద్ కేంద్రంగా నడిచే సియాసత్ డైలీ ఒక కథనంలో పేర్కొంది.
30 ఏళ్ల వయసులో దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరం జా ఆస్తి తర్వాత తర్వాత ఆవిరైపోయిందని, ఆయన తన చివరి రోజుల్లో తుర్కియేలోని ఇస్తాంబుల్ నగరంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండాల్సి వచ్చిందని ఈ కథనం పేర్కొంది.
ఇప్పుడు ముకరం జా మరణంతో ఒక శకానికి ముగింపు పలికినట్లు అయింది.
1724లో నిజాం ఉల్ ముల్క్ రాకతో హైదరాబాద్‌లో నిజాం రాజుల పాలన మొదలైంది.
నిజాం కుటుంబీకులు 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్‌ను పరిపాలించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
నిజాం ఎనిమిదో నవాబ్ ముకరం జా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
నిజాం వారసుడిగా పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకరం జా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ముకరం జా పార్థివ దేహం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ను సీఎం కోరారు.
ముకరం జా తాత ఏడో నిజాం ఎవరు ?
ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా మెలిగిన అసఫ్ జా ముజఫరుల్ ముల్క్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిరోహించారు.
ఆ కాలంలో ఆయన ప్రప్రంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధికెక్కారు.
1937 ఫిబ్రవరి 22న విడుదలైన టైమ్ మ్యాగజీన్ సంచికలో "ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి" అంటూ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌పై కవర్ పేజీ కథనాన్ని ప్రచురించారు.
హైదరాబాద్ సంస్థానం వైశాల్యం ఇంగ్లాండ్, స్కాంట్లాండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువ.
హైదరాబాద్ నిజాం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్లలో ఒకటైన 282 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఉండేది. ఆ వజ్రం చిన్న నిమ్మకాయంత పరిమాణంలో ఉండేది.
దాన్ని ప్రపంచం దృష్టి నుంచి కాపాడడానికి సబ్బుపెట్టెలో ఉంచేవారు. అప్పుడప్పుడూ పేపర్ వెయిట్‌లాగా వాడేవారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇండియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించిన మూడు ప్రధాన సంస్థానల్లో నిజాం ఒకటి.
అయితే, భారత ప్రభుత్వ పోలీసు చర్య ద్వారా స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ సైన్యం లొంగిపోయిన తరువాత, నిజాం మద్దతుదారులు రజ్వీ, లయిక్ అహ్మద్‌లను భారత ప్రభుత్వం నిర్బంధించింది.
అయితే, లయిక్ అహ్మద్ బురఖా సహాయంతో నిర్బంధం నుంచి తప్పించుకుని, బొంబాయి విమానాశ్రయం నుంచి కరాచీకి వెళ్లే విమానం ఎక్కేశారు.
నిజాం నవాబును, ఆయన పరివారాన్ని భారత ప్రభుత్వం తాకలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తన రాజభవనంలోనే ఉండేందుకు అనుమతి లభించింది.
"ఇప్పటి నుంచి భారత రాజ్యాంగమే హైదరాబాద్ రాజ్యాంగం అవుతుంది" అని నవాబు ఒక ఫర్మానా జారీ చేశారు. ఈ విధంగా హైదరాబాద్, భారతదేశంలో 562వ సంస్థానంగా విలీనమైంది.
నిజాం నవాబుకు భారత ప్రభుత్వం సంవత్సరానికి 42 లక్షల 85 వేల 714 రూపాయల రాజభరణం ఇచ్చే విధంగా 1950 జనవరి 25న ఒక ఒప్పందం కుదిరింది. 1956 నవంబర్ 1 వరకు నిజాం నవాబు హైదరాబాద్ రాజప్రముఖులు(గవర్నర్ సమాన హోదా)గా వ్యవహరించారు. ఆ తరువాత, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కింద నిజాం సంస్థానం.. మహారాష్ట్ర, కర్ణాటక, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మూడు భాగాలుగా విభజించబడింది. 1967 ఫిబ్రవరి 24న నిజాం నవాబు తుది శ్వాస విడిచారు.
ఇవి కూడా చదవండి:
- సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?
- దిల్లీ: గర్భంతో ఉన్న భార్యను తగులబెట్టాలని ప్రయత్నించాడు... ఇలాంటి నేరాలకు శిక్షలేంటి?
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)