తెలంగాణ: సెప్టెంబరు 17న అధికారికంగా భారీ ఉత్సవాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి కారణాలేంటి?

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది పాటు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు జరగబోతున్నాయి. దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ముగిసిన నెల తరువాత తెలంగాణలో మరోసారి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చింది. కానీ చాలా రాజ్యాలు (సంస్థానాలు) అప్పటికి పూర్తిగా భారతదేశంలో కలవలేదు. ప్రస్తుత తెలంగాణతో కూడిన హైదరాబాద్ రాజ్యం 1948 సెప్టెంబరు 17న భారతదేశంలో కలిసింది.

దీంతో ఆగష్టు 15 లాగానే సెప్టెంబరు 17న ఉత్సవాలు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉండేది.

ఆ విలీనం జరిగి 75 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ ఉత్సవాలు భారీగా జరగబోతున్నాయి. కాకపోతే అకస్మాత్తుగా ఇంత భారీ ఉత్సవాలు జరగడానికి కారణం మాత్రం, అలనాటి ఘటనల, పోరాటల సంస్మరణలు కాదు.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తులే అసలు కారణం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఉద్యమ సమయంలో ఈ ఉత్సవాల గురించి కేసీఆర్ తరచూ చెబుతుండేవారు. తెలంగాణ ఏర్పడితే అధికారికంగా సెప్టెంబరు 17 ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు సెప్టెంబరు 17 ఉత్సవాలు నిర్వహించలేదని మండిపడేవారు.

కానీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయన ఈ సెప్టెంబరు 17 ఉత్సవాల ఊసే ఎత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుండా, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ కార్యాలయంలో నిర్వహించేది. కానీ తాజాగా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయంలో గతంలో తాను అనుసరించిన వైఖరిని మార్చుకున్నారు కేసీఆర్.

2022 సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం' గా, మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

''రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమానికి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది'' అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన తెలిపింది.

మూడు రోజుల పాటూ జెండా పండుగలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, పోరాట యోధుల సన్మానాలు వంటి కార్యక్రమాలు కూడా ప్రకటించింది.

సరిగ్గా కేసీఆర్ నిర్ణయానికి ఒక్క రోజు ముందు ఇదే తరహా నిర్ణయం తీసుకుంది బీజేపీ. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి సెప్టెంబరు 17 ఉత్సవాల గురించి సమీక్ష చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా, మొట్టమొదటిసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే సెప్టెంబరు 17ను హైదరాబాద్ లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ బలగాలతో పరేడ్ గ్రౌండ్ లో భారీ కార్యక్రమం నిర్వహించాలనీ, హోంమంత్రి అమిత్ షా తో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రినీ పిలవాలనీ నిర్ణయించారు. అదే రోజు ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కూడా బీజేపీ ఆలోచనలో ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తమ ప్రభావమేనని బీజేపీ అంటోంది.

''ఇది బీజేపీ విజయం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే కేసీఆర్ ప్రభుత్వం సహా కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు వంటి గుంట నక్క పార్టీలన్నీ దిగొచ్చి ఐక్యతా రాగాన్ని విన్పిస్తున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంఐఎం మెప్పుకోసం తెలంగాణ విమోచన చరిత్రనే వక్రీకరిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.'' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ కూడా సెప్టెంబరు 17 ఉత్సవాల గురించి పిలుపునిచ్చింది. శనివారంనాడు మునుగోడులో ప్రసంగించిన రేవంత్ రెడ్డి, ఈ సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు వజ్రోత్సవాలు జరుపుకోవాలని కాంగ్రెస్ పక్షాలకు పిలుపునిచ్చారు.

''గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన కేసీఆర్, ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదు? మీరు ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారు? సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనదుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని నిజాం నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు'' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీలే కాదు, సెప్టెంబరు 17 ను జరుపుకోవాలంటూ ఎంఐఎం పార్టీ కూడా వ్యాఖ్యానించింది. సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరపాలని ఎంఐఎం కోరడం బహుశా ఇదే మొదటిసారి. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.

''తెలంగాణ ఒక భూభాగంగా విమోచనం అవడం కాదు. జాతీయవాద భావనలో భాగంగా భారతదేశంతో కలిసింది. ఇది లిబరేషన్ కంటే ఇంటిగ్రేషన్ గానే గుర్తు పెట్టుకోవాలి'' అంటూ తన లేఖలో రాశారు అసద్.

నిజాం రాజుకు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బ్రిటిష్ వ్యవస్థకూ వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం పోరాట యోధుల గురించి అసద్ తన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ విలీనాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరపాలని ఆయన కోరారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తరువాత, ఆ క్రెడిట్ తీసుకున్నారు అసదుద్దీన్.

''సెప్టెంబరు 17 నాడు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల దినం ప్రకటించాలన్న మా ప్రస్తావనాన్ని అంగీకరించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు'' అంటూ ట్విట్టర్లో ప్రకటించారు ఆయన. మొత్తానికి అన్ని పార్టీలూ ఏకమై ఈసారి సెప్టెంబరు 17ను ఘనంగా నిర్వహించబోతున్నాయి.

ఇంతకీ సెప్టెంబరు 17న ఏం జరిగింది?

భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు పూర్తి భూభాగం తమ ప్రత్యక్ష పాలనలో కాకుండా కొంత భూభాగం పరోక్ష పాలనలో ఉండేది. తమకు కుదిరినంత మేరకు నేరుగా తమ పాలనలో పెట్టుకున్నారు. మిగిలిన చోట్ల స్థానిక రాజుల ప్రత్యక్ష పాలనలో కొంత ప్రాంతాన్ని ఉంచేసి, వారి దగ్గర పన్నులు వసూలు చేయడం, ఇతరత్రా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండేది.

ఆ రాజులు బ్రిటిష్ వారి కనుసన్నుల్లో, బ్రిటిష్ సింహాసన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు సహకరిస్తూ, తమ రాజ్యంలో తాము రాజులుగా పాలన చేసేవారు. ఇలాంటివి అప్పటి భారత భూభాగంలో 500 పైగా రాజ్యాలు ఉండేవి. వాటిల్లో చాలా పెద్ద రాజ్యం హైదరాబాద్.

ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని నైజాం కర్ణాటక ప్రాంతాలు కలపి హైదరాబాద్ రాజ్యంగా ఉండేది.

1947లో భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ వారు వెళ్లిపోతూ, ఈ రాజ్యాలకు కూడా స్వతంత్ర్యం ఇచ్చారు. వీరు భారత్ లేదా పాకిస్తాన్ తో కలవచ్చు. లేదా స్వతంత్ర్యంగా ఉండవచ్చు అన్నది ఆప్షన్.

దీంతో స్వతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ భారత ప్రభుత్వం ఈ రాజ్యాలను ఒప్పించి, భారతదేశంలో కలిపించే పని పెట్టుకుంది. నెహ్రూ ప్రధానిగా, పటేల్ ఉప ప్రధాని, హోం మంత్రిగా ఉండేవారు. పటేల్ ఆధ్వర్యంలోని హోం శాఖ ఈ రాజ్యాల విలీన వ్యవహారాలు చూసేది.

అదే సందర్భంలో హైదరాబాద్ రాజ్యంలో భూస్వాముల ఆగడాలు, నిజాం రాజు అండదండులన్న రజకార్ల ఆగడాలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడేవారు. జీవితం నిత్య నరకంగా ఉండేది . దీనిపై కమ్యూనిస్టులు పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా కొన్ని సంస్థలు, వ్యక్తులు కూడా దీనిపై పోరాడారు.

మిగతా దేశమంతా స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడితే , హైదరాబాద్ రాజ్యంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం సాగేది.

1947 తరువాత భారతదేశంలో కలవకుండా స్వతంత్ర్యంగా ఉండాలనుకుంది హైదరాబాద్ రాజ్యం. దీన్ని వ్యతిరేకించిన భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో సైన్యాన్ని పంపింది.

హైదరాబాద్ రాజ్య సైనికులకూ, భారతదేశ సైనికులకూ మధ్య మూడు రోజులు జరిగిన యుద్ధంలో నిజాం సైన్యం ఓడిపోయింది. నిజాం రాజు భారతదేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. అది సెప్టెంబరు 17న. ఆ తరువాత నిజాం రాజుకు రాజ ప్రముఖ్ (గవర్నర్ తో సమాన హోదా) ఇచ్చింది భారత ప్రభుత్వం.

అప్పుడు హైదరాబాద్ రాజ్యం కాస్తా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. 1952లో ఎన్నికలు జరిగే వరకూ సైనిక పాలన జరిగింది ఇక్కడ.

1948 కి ముందు నిజాం పాలనలో పేదలు, మరీ ముఖ్యంగా హిందువులపై అకృత్యాలు ఎక్కువగా జరిగాయన్న చరిత్ర ఒకవైపు, 1948 తరువాత 1952 వరకూ ముస్లింలు లక్ష్యంగా అనేక దాడులు, సామూహిక హత్యాకాండ జరిగింది అన్న నివేదికలు మరోవైపు…కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత పరమైన విశ్లేషణలు - ఇవన్నీ కలపి సెప్టెంబరు 17 అనే తేదీ చుట్టూ ఎన్నో వివాదాలను తీసుకువచ్చాయి.

కమ్యూనిస్టు పార్టీలు ముందు నుంచీ సెప్టెంబరు 17 ను నిర్వహించడమో లేదా కనీసం దాని గురించి చర్చించడమో చేస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచీ ఈ సెప్టెంబరు 17ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఆ డిమాండ్‌ను పక్కన పెట్టింది.

1990ల చివరి ప్రాంతం నుంచీ సెప్టెంబరు 17ను జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ డిమాండ్ మరింత బలంగా వినిపించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలనుకున్న మరునాడే, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)