You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నల్లులు రక్తం పీల్చేయడంతో ఖైదీ మృతి-లాయర్ ఆరోపణ
- రచయిత, బ్రాండన్ డ్రెనాన్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్
నల్లులు, పురుగులు కుట్టడం, కరిచి తినడంతో అట్లాంట జైలులో ఖైదీ మరణించాడని అతని కుటుంబం తరఫు లాయర్ ఆరోపించారు.
నల్లుల వల్లే అతను మరణించాడనడానికి ఆధారాలు లేవని మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ పేర్కొంది.
లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి తన దుష్ప్రవర్తన కారణంగా జైలు పాలయ్యాడు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో అధికారులు అతన్ని ఫుల్టన్ కంట్రీ జైలులోని సైకియాట్రిక్ వింగ్‌కి తరలించారు.
అయితే, ఆ జైలులో అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు అతని ప్రాణం తీశాయని బంధువుల న్యాయవాది అన్నారు. జైలులో ఉన్న పురుగులు, నల్లులు కుట్టడంతో థాంప్సన్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
థాంప్సన్ శరీరమంతా నల్లులతో ఉన్న ఫొటోలను ఫ్యామిలీ లాయర్ మైఖెల్ డీ హార్పర్ విడుదల చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
బతికుండగానే థాంప్సన్‌ను జైలు సెల్‌లో నల్లులు, పురుగులు తిన్నాయని, అందువల్ల జబ్బుల పాలై థాంప్సన్ మరణించాడని హార్పర్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
వ్యాధిగ్రస్తుడైన థాంప్సన్‌కి ఈ జైలు సెల్ సరైనది కాదని లాయర్ అన్నారు.
ఎలా గుర్తించారు?
అరెస్ట్ చేసిన మూడు నెలల తర్వాత సెప్టెంబర్ 19న జైలు సెల్‌లో అపస్మారక స్థితిలో ఉన్న థాంప్సన్‌ను గుర్తించినట్లు ఫుల్టన్ కంట్రీ మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ పేర్కొంది.
ఆయన్ను రక్షించేందుకు వైద్యులు, స్థానిక పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని యూఎస్‌ఏ టుడే పేర్కొంది.
థాంప్సన్ ఆరోగ్యం క్షీణిస్తోందని డిటెన్షన్ అధికారులు, వైద్య సిబ్బంది గుర్తించారని జైలు రికార్డులలో ఉన్నట్లు హార్పర్ పేర్కొన్నారు.
కానీ ఆయనకు వైద్య సాయం ఇచ్చేందుకు వారెలాంటి చర్యలు తీసుకోలేదని బీబీసీ యూఎస్ మీడియా పార్టనర్ సీబీఎస్ న్యూస్ నివేదించింది.
తన సైకియాట్రిక్ వార్డులోని జైలు సెల్‌లో నల్లులు ఎక్కువగా ఉన్నాయని, అయితే థాంప్సన్ శరీరంపై అయిన గాయాలు ఏ విధంగా అయ్యాయో స్పష్టమైన సంకేతాలు లేవని మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ తెలిపింది.
దీంతో, మరణానికి గల కారణాలను గుర్తించలేదని మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ పేర్కొంది.
నల్లులు అంత ప్రమాదకరమా?
థాంప్సన్ ఫొటోలను ఆయన ఫ్యామిలీ లాయర్ విడుదల చేశారు. ఆ ఫోటోల్లో థాంప్సన్ ముఖం, శరీర భాగాలన్ని చాలా వరకు నల్లులు పాకుతూ ఉన్నాయి.
ఆ ఫోటోల్లో జైలు సెల్ చాలా దారుణంగా ఉందని కెంటకీ యూనివర్సిటీ కీటకాల శాస్త్రవేత్త మైఖెల్ పోటర్ అన్నారు. ఈయన నల్లులపై అధ్యాయనం చేస్తున్నారు.
‘’20 ఏళ్లకి పైబడిన నల్లులపై నేను అధ్యాయనం చేస్తున్నాను’’ అని పోటర్ బీబీసీకి తెలిపారు. ఒకవేళ నేను చూసేదే నిజమైతే ఇలా జరగడం తానెప్పుడూ చూడలేదన్నారు.
నల్లులు మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు ఆహారం కోసం కోళ్లు, గబ్బిలాలు, ఎలుకల వంటి జంతువులపైనా ఆధారపడతాయి.
నల్లులు కుట్టడం ప్రాణాంతకం కాదు. కానీ, అరుదైన కేసుల్లో జరుగుతుందని పోటర్ అన్నారు. నల్లుల ఎక్కువగా కుట్టడం వల్ల అనీమియాకు దారితీయొచ్చు.
ఒకవేళ ఈ వ్యాధికి చికిత్స చేయకుండా అలానే వదిలేస్తే, అది ప్రాణాంతకంగా మారుతుంది.
‘‘నల్లులు రక్తం తాగి బతుకుతాయి. చాలా వరకు నల్లులు పెద్ద మొత్తంలో రక్తాన్ని పీలుస్తాయి’’ అని పోటర్ అన్నారు.
చాలా అరుదైన కేసుల్లో, బాధితులకు అలర్జీ రియాక్షన్ తలెత్తి, అనాఫిలాక్టిక్ షాక్‌కి గురవుతారు. దీన్ని వల్ల మనిషి మరణిస్తారు.
నల్లులు రక్తాన్ని పీల్చేటప్పుడు, అది గడ్డకట్టకుండా నిరోధించేందుకు వాటి లాలాజలాన్ని లోపలికి పంపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు.
కానీ కొందరిలో తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్ల వంటివి నల్లి కాటు వల్ల కూడా ఏర్పడతాయి.
నల్లులు కుట్టడం వల్ల 1 సెం.మీ పరిమాణంలో ఉండే దద్దుర్లుతో పాటు దురద, మంట కలుగుతాయి. శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
ముఖ్యంగా ముఖం, చేతులు, మెడపై దాడి చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి.
దురద కారణంగా తరచుగా రుద్దడం వల్ల ఏర్పడే గాయాలు ఇన్‌ఫెక్షన్లుగా మారతాయి. ఇవి తీవ్రంగా మారి, చికిత్స చేయడం కూడా కష్టమవుతుంది.
ఇవి బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
థాంప్సన్ మరణంపై విచారణ
ప్రస్తుత సౌకర్యంలో పరిస్థితులు అస్తవ్యస్థంగా మారుతుండటంతో, ఖైదీలు, స్టాఫ్ అందరికీ కూడా ఆరోగ్యకరమైన, శుభ్రమైన వాతావరణం అందించడం కష్టతరంగా మారుతోందని ఫుల్టన్ ఏరియా పోలీస్ అధికారి కార్యాలయం తెలిపింది.
ఈ జైలును నడిపే కార్యాలయం థాంప్సన్ మరణానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఫుల్టన్ కంట్రీ జైలులో నల్లులు, పురుగులు, ఇతర కీటకాలను తొలగించేందుకు తక్షణ వ్యయంగా 5 లక్షల డాలర్ల( సుమారు రూ. 4 కోట్లు )ను ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.
జైలులో పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు సెక్యూరిటీ ప్రొటోకాల్ రౌండ్స్‌ను అప్‌డేట్ చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుత విచారణలో జైలులో అందించిన ఆరోగ్య సంరక్షణను పరిశీలిస్తున్నామని, ఈ కేసులో ఏదైనా నేర అభియోగాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తామని తెలిపింది.
ఖైదీలకు మెరుగైన, మానసిక ఆరోగ్య సేవలు, సెక్యూరిటీని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు సరికొత్తగా, పెద్దగా జైలును ఏర్పాటు చేయాలని షెరిఫ్ కార్యాలయం మరోసారి తెలిపింది.
ప్రస్తుతం ఉన్న జైలు ప్రాంతంలోనే కొత్త జైలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రస్తుత జైలులో ఎక్కువ మంది ఖైదీలు ఉండటంతో పాటు అశుభ్రకరంగా మారింది. ఈ జైలుకి నిధులు కూడా సరిగ్గా అందడం లేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)