You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- రచయిత, ఫెర్నాండో డ్వర్టే
- హోదా, బీబీసీ న్యూస్
బ్రెజిల్ తీరానికి వెయ్యి కి.మీ. దూరంలో ట్రిండేడ్ దీవి ఉంటుంది.
ఇక్కడి అందమైన బీచ్‌లు, జంతుజాలాన్ని చూసేందుకు చాలా కొద్ది మంది పర్యటకులే వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడకు పర్యటకులు రాకూడదు.
ఇక్కడ కేవలం బ్రెజిల్ నౌకాదళ శిబిరం, రీసర్చ్ సెంటర్ మాత్రమే కనిపిస్తాయి. ఆ సెంటర్‌లోనూ ఒకసారి ఎనిమిది మందికి మించి ఉండటానికి వీలులేదు.
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని మారుమూల ప్రాంతంలో కేవలం పది చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ దీవి కూడా ప్లాస్టిక్ కాలుష్యం నుంచి తప్పించుకోలేకపోతోంది.
ఇక్కడ సహజసిద్ధంగా కనిపించే శిలల అవక్షేపాలతో చెత్తాచెదారం కలిసి నీలం రంగు ప్లాస్టిక్ శిలలు ఏర్పడుతున్నట్లు బ్రెజిల్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
‘‘ఇది నిజంగా చాలా వింతగా అనిపిస్తోంది. అసలు ఇలాంటి రాళ్లు ఏర్పడతాయని ఎవరూ ఊహించరు కూడా’’ అని బ్రెజిల్‌లో పరానా ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన ఫెర్నాండా అవెలార్ చెప్పారు.
‘‘రాళ్లలో చూసిన వెంటనే ఏదో కృత్రిమంగా ఉన్నట్లు కనిపించింది’’ అని ఆమె వివరించారు.
పరీక్షల్లో ఏం తేలింది?
సముద్ర అలలతో రాళ్లు కోతకు గురవుతాయి. ట్రిండేడ్‌లో ఇలాంటి పరిణామాలపై పరిశోధన చేపట్టేందుకు 2019లో ఫెర్నాండా ఇక్కడకు వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ రాళ్లను తొలిసారి ఆమె చూశారు.
సముద్రపు తాబేళ్లు ఎక్కువగా గుడ్లు పెట్టే ఇక్కడి టర్టల్స్ బీచ్‌లో నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె దృష్టి వీటిపై పడింది.
మొదట 12 చ.మీ. విస్తీర్ణంలో ఈ రాళ్లను చూసినప్పుడు బీచ్‌లో సాధారణంగా కనిపించే అవక్షేప శిలల 'కంగ్లోమెరేట్‌లు' అనుకున్నారు.
ఆ రంగు మాత్రం ఆమెకు కాస్త ఏదో తేడాగా ఉన్నట్లు అనిపించింది.
ఆ సమయంలో ట్రిండేడ్‌లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయి ఉండటంతో ఆ రాళ్లను రసాయన పరీక్షల కోసం పంపేందుకు ఆమె కొన్ని వారాలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
ప్లాస్టిక్, శిలల అవశేషాలు, అవక్షేపాలు కలిసి ఈ ప్లాస్టిక్ రాళ్లు ఏర్పడినట్లు పరీక్షల్లో తేలింది.
2022 చివర్లో ట్రిండేడ్ నుంచి వచ్చిన ఆమె తన పరిశోధనల ఫలితాలు మెరైన్ పొల్యూషన్ బులిటెన్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.
‘‘ఇదివరకు కూడా ట్రిండేడ్‌కు నేను కొన్నిసార్లు వెళ్లాను. కానీ, ఇలాంటివి ఎప్పుడూ గుర్తించలేదు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన పరిణామం’’ అని ఆమె చెప్పారు.
ప్లాస్టిక్ రాళ్లు కనిపించడం ఇదేమీ తొలిసారి కాదు. హవాయిలోని కమీలో బీచ్, బ్రిటన్ నైరుతి తీరాలతోపాటు జపాన్‌లోనూ ఇలాంటి రాళ్లు ఏర్పడినట్లు అధ్యయనాలు ధ్రువీకరించాయి.
అయితే, ఇలాంటి రాళ్లు ఏర్పడిన ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతం ఇదే అయ్యుండొచ్చని ఫెర్నాండా చెబుతున్నారు.
కొత్త రకం ప్లాస్టిక్ రాళ్లు
ఈ అధ్యయనం తర్వాత తాము కొత్త రకం రాయి ‘‘ప్లాస్టిస్టోన్’’ను కనుక్కొన్నామని ఫెర్నాండా, ఆమె బృంద సభ్యులు ప్రకటించారు.
ప్లాస్టిక్ వల్ల ఏర్పడే రెండు రకాల రాళ్లను ఇప్పటికే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో మొదటిది ప్లాస్టిగోమెరేట్. రాళ్ల అవశేషాలు, అవక్షేపాలు, బీచ్‌లో కనిపించే గవ్వలు, ప్లాస్టిక్ కలిపి ఏర్పడే ఈ రాళ్లను తొలిసారి 2014లో హవాయిలో గుర్తించారు.
ఇక రెండోది పైరోప్లాస్టిక్. దీన్ని కార్న్‌వాల్‌లోని విట్‌శాండ్ బేలో 2019లో తొలిసారి గుర్తించారు. ప్లాస్టిక్‌ను మండించడంతో వచ్చే అవశేషాలు, అవక్షేపాలు కలిసి ఇవి ఏర్పడతాయి.
‘‘ప్లాస్టిస్టోన్‌లు గట్టిగా ఉంటాయి. వాటిని చూసి మనం గుర్తుపట్టొచ్చు. వీటిలో దాదాపు అంతా ప్లాస్టిక్ కనిపిస్తుంది. అవక్షేపాల అవశేషాలు చాలా తక్కువగా ఉంటాయి’’అని ఫెర్నాండా చెప్పారు.
‘‘ట్రిండేడ్‌లో మొత్తం ఆ మూడు రకాల రాళ్లు మాకు కనిపించాయి’’ అని ఆమె తెలిపారు.
ఇక్కడకు ప్లాస్టిక్ ఎలా వస్తుందో కూడా ఫెర్నాండా బృందం పరిశోధన చేపట్టింది. దీంతో చేపల వలల నుంచి వచ్చే ప్లాస్టిక్ అవశేషాలను సముద్ర ప్రవాహాలు ఇక్కడకు తీసుకొస్తున్నట్లు వీరు తేల్చారు. కొన్ని సాధారణ ప్లాస్టిక్ అవశేషాలు కూడా కనిపిస్తున్నాయి.
‘‘ట్రిండేడ్‌లో నేడు మనకు కనిపిస్తున్నది మానవ ప్రమేయంతో జరుగుతున్న కాలుష్యం. ఇది పటిష్ఠమైన రక్షణలోనున్న మారుమూల ప్రాంతాలకూ చేరిపోతోంది’’ అని ఆమె చెప్పారు.
బీచ్‌లు, మారుమూల దీవులు, పర్వతాలు, ధ్రువ ప్రాంతాలతోపాటు నేడు సముద్రపు అడుగున కూడా ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణంతో ఎలాంటి చర్యలు జరుపుతున్నాయో మనకు పెద్దగా తెలియడం లేదు.
జీవులకు ముప్పు
కేవలం మట్టిలో మార్పుల గురించి ఆమె ఆలోచించడం లేదు. ట్రిండేడ్‌లోని ఈ ప్లాస్టిక్‌తో ఇక్కడి జీవులకు అంటే చేపలు, పీతలు, పక్షులకు కూడా చాలా ముప్పుందని ఆమె హెచ్చరిస్తున్నారు.
‘‘అత్యంత సున్నిత పర్యావరణ ప్రాంతాల్లో ఒకటైన టర్టల్స్ బీచ్‌లో ఇలాంటివి కనిపించడం నిజంగా ఆందోళనకు గురిచేసే పరిణామం’’ అని ఆమె చెప్పారు.
‘‘ట్రిండేడ్ అనేది బ్రెజిల్ తీరంలో తిరిగే గ్రీన్ టర్టల్స్‌కు గుడ్లు పెట్టే కేంద్రం లాంటిది. నేడు ఈ జీవుల ఆహారపు గొలుసులోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది’’ అని ఆమె తెలిపారు.
పరిశోధన పత్రంలో ఆమె ప్రధానంగా రాళ్లలో వచ్చే మార్పులపైనే దృష్టిసారించారు.
సహజంగా అయితే, రాళ్లు ఏర్పడటానికి వందల ఏళ్లు పడుతుంది. అయితే, ఇక్కడ మానవ చర్యలు ఏజెంట్లలా మారి రాళ్ల తయారీ ప్రక్రియలను ప్రభావితం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
‘‘ఈ రాళ్లు ఎన్నాళ్లు ఉంటాయో మనకు తెలియదు. కొన్ని శతాబ్దాల పాటు ఇవి ఇక్కడ అలానే ఉండొచ్చేమో’’ అని ఫెర్నాండా అన్నారు.
నాడు ఆ జంతువులతో సమస్య, నేడు ప్లాస్టిక్‌తో..
‘‘2017లో వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ రాళ్లు కనిపించలేదు. ఇంత వేగంగా ఇక్కడ రాళ్లు ఏర్పడటం చూస్తుంటే చాలా ఆందోళనగా అనిపిస్తోంది. దీర్ఘకాలంలో ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయో మనకు ఇప్పటికీ తెలియదు’’అని ఫెర్నాండా అన్నారు.
ట్రిండేడ్‌ను వెంటాడిన తొలి పర్యావరణ ముప్పు ఇది కాదు.
ఇక్కడి తీర ప్రాంతాల్లో ఒకప్పుడు అడవులు ఉండేవి. అయితే, 17వ శతాబ్దంలో మేకలు లాంటి జంతువులను ఇక్కడకు తీసుకురావడంతో అవి ధ్వంసమయ్యాయి.
ఇక్కడ వేటాడే మృగాలు లేకపోవడంతో ఆ జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1994లో మొదలుపెట్టి దశాబ్ద కాలంపాటు ఆ జంతువులను హతమార్చేందుకు బ్రెజిల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నేడు ప్లాస్టిక్ కొత్త శత్రువు. దీన్ని జయించడం మరింత కష్టం.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)