You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా?
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుపతికి పుట్టినరోజు నిర్వహిస్తామని 2022లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రకటించినప్పటి నుంచి తిరుపతి అసలు ఎప్పుడు ఏర్పడింది? అనే విషయంపై చర్చ మొదలైంది.
ఆ ఏడాది నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24ను టెంపుల్ సిటీ తిరుపతికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించబోతున్నట్లు భూమన ప్రకటించారు.
తిరుపతిలో ఉన్న శిలాశాసనాల్లో ఉన్న వివరాలను బట్టి 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతికి శంకుస్థాపన చేశారని, అందుకే ఇక మీదట ఆ రోజును తిరుపతి ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు.
అయితే, తిరుపతి ఫలానా రోజు పుట్టింది అంటూ ఆయన ఒక తేదీని కూడా చెప్పడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
తిరుపతి ఎన్నో వేల సంవత్సరాల నుంచీ ఉన్నట్టు కొందరు చరిత్రకారులు చెబుతుంటే.. మరికొందరు రామానుజాచార్యులు తిరుపతికి ప్రాచుర్యం మాత్రమే తీసుకొచ్చారని చెబుతున్నారు.
ఇంతకీ ఎమ్మెల్యే అలా ఒక తేదీని ఎందుకు నిర్ణయించారు? తిరుపతి ఎప్పుడు పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారో బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఎమ్మెల్యే ఏం చెప్పారు?
తిరుచానూరు నుంచి అర్చకులు తిరుమలకు వెళ్లి పూజలు చేయడం కష్టంగా ఉండడంతో రామానుజాచార్యులు ప్రస్తుతం ఉన్న గోవిందరాజస్వామిని ప్రతిష్టిస్తూ ఆయన పేరున గోవిందరాజపురంగా తిరుపతికి పునాదిరాయి వేశారని ఇదే ఏడాది (2022) ఫిబ్రవరి 20న మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు.
"ఇక్కడ గోవిందరాజస్వామిని ప్రతిష్టిస్తూ తిరుపతికి శంకుస్థాపన చేసి నాలుగు మాడ వీధులను ఏర్పాటు చేసిన రామానుజాచార్యులు నగరానికి మొదట గోవిందరాజపురం అనే పేరుతో 1130లో ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేశారు. గోపురానికి దక్షిణాన ఉన్న ప్రాకారం గోడ లోపలి ముఖంపై ఉన్న ముక్కలైన ఒక తమిళ శాశనంలో ఆన సౌమ్య అంటే సౌమ్య ఏడాది తొరునాళ్ అంటే పలనా తేదీన రామానుజాచార్యులు పెరుమాన్ అనే హోదాలో శంకుస్థాపన చేశారని ఉంది'' అని వివరించారు.
గోవిందరాజస్వామి ఆలయం, నాలుగు మాడ వీధులు, అగ్రహారాలు, ఇతర ప్రాంతాలన్నీ కలిసి క్రమంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిగా ఏర్పడ్డాయి. అందుకే ఇక నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంది" అని ఎమ్మేల్యే ప్రకటించారు.
గోవిందరాజుల గుడి ఆవరణలో ప్రతిష్టించిన రామానుజచార్యుల విగ్రహం దగ్గర ఈ ఏడాది ఫిబ్రవరి 24న పూజలు చేసి నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షణలు నిర్వహించారు.
వేల సంవత్సరాల చరిత్ర
అయితే, తిరుపతికి 892 సంవత్సరాల చరిత్రే ఉందనడాన్ని చరిత్రకారులు తప్పుబడుతున్నారు.
రామానుజాచార్యులు విగ్రహాన్ని ప్రతిష్టించారని ఎమ్మెల్యే చెబుతున్న గోవిందరాజ స్వామి ఆలయం అంతకు ముందు పార్థసారది ఆలయమని, అక్కడ కృష్ణుడికి పూజలు జరిగేవని చెబుతున్నారు.
గోవిందరాజస్వామి ఆలయం ప్రధాన రాజగోపురం మీద ఇప్పటికీ కృష్ణుడి విగ్రహం ఉండడాన్ని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.
అయితే, ఎమ్మెల్యే భూమన కూడా కొత్తూరుకు కొద్ది దూరంలోనూ తిరుచానూరుకు అంతే దూరంలో ఉన్న పార్థసారధి ఆలయంలో కొవింద రాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని తన మీడియా సమావేశంలో చెప్పారు.
అభ్యంతరాలు ఎందుకు?
తిరుపతికి రామానుజాచార్యులు పునాది వేయలేదని, తిరుపతి ఫలనా తేదీన పుట్టిందనడానికి చారిత్రక ఆధారాలు ఏవీ లేవని ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర రిటైడ్ ప్రొఫెసర్ ఎ.ఆర్. రామచంద్రారెడ్డి బీబీసీకి చెప్పారు.
ఏఆర్. రామచంద్రారెడ్డి ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో 1969 నుంచి 2005 వరకూ పనిచేసి అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు.
"ఇది చారిత్రక ఆసత్యం. దీనికి రుజువులేవీ లేవు. శాసనాల్లో, పుస్తకాల్లో ఈ మాట ఎక్కడా లేదు. ఇది ఈ మధ్య ఎవరో భావావేశంలో పలికినదే తప్ప చారిత్రక వాస్తవం అయితే కాదు. దీనిని తిరుపతి అనేవారు. గుడి చుట్టూ ఉండే ప్రాంతాన్ని కృష్ణాపురం అనేవారు.
ఎక్కడైనా మహద్వారం నుంచి నేరుగా ఏ దేవుడి సన్నిధి ఉంటుందో ఆ ఆలయం వారికి సంబంధించినదే అవుతుంది. అది కృష్ణాలయం. ఇక్కడ ఉండే కృష్ణుడికి పార్థసారథి అనే పేరు కూడా ఉంది. ఆ ఆలయంలో ఉత్తరం వైపు రామానుజాచార్యులు విగ్రహం ప్రతిష్టించి దానికి పూజలు చేయడం అనేది అది ఒక కొత్త ఒరవడి. చాలా గొప్ప విశేషం.
ఆల్రెడీ అన్ని హంగులూ ఉన్న ఆలయంలో ఇంకొక విగ్రహం పెట్టి ఒక ఆలయం ఏర్పాటు చేసి విడిగా ప్రత్యేక పూజలు చేయడం అనేది ఒక కొత్త ఒరవడి.
దానిని ప్రజలు ఒప్పుకున్నారు. తర్వాత దానికి వచ్చిన పేరు గోవిందరాజపట్నం అనే పేరు కొంతకాలమే ఉన్నది ఆ తర్వాత కనుమరుగైపోయింది అన్నారు.
తిరుపతి అనేది అత్యంత పురాతనమైన పేరని, దానికి అంతకు ముందు ఒక పేరు ఉందనే విషయం తను ఎక్కడా చదవలేదని రామచంద్రారెడ్డి చెప్పారు.
"మాకు తెలిసిన వాళ్ళు, మాతో కలిసి పని చేసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా తిరుపతికి వేరే పేరుందనే ప్రస్తావన ఎప్పుడు రాలేదు. ఇక్కడ చాలా సంప్రదాయాలు ఉండేవి. రామానుజుడి గురించి రాసేటప్పుడు వాళ్ళ మేనమామ గారు ఇక్కడే ఉండేవారని, అందుకే చిన్నప్పటి నుంచే ఆయన మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చినట్లు తమిళ గ్రంథాల్లో, ఆయన జీవిత చరిత్రలో ఉంది. ఈ వివరాలు తెలుగులో, వేరే భాషల్లో లేవు.
18, 19 శతాబ్దం వరకు కూడా కొండపైన పూజ చేసి తిరిగి వచ్చేసే వాళ్ళు. ఆర్కాట్ నవాబుల కాలంలో, రాయల కాలంలో ఇది ప్రసిద్ధి చెందింది" అని ఆయన వివరించారు.
తిరుపతికి రామానుజులు ప్రాచుర్యం తీసుకొచ్చారు
ఎస్వీ యూనివర్సిటీలోనే చరిత్ర, పురావస్తు శాఖ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన నాగోలు కృష్ణారెడ్డి కూడా అదే విషయాన్ని బీబీసీకి చెప్పారు.
తిరుపతి చాలా ప్రసిద్ధ క్షేత్రమని, వేదాల్లో ఇతిహాసాల్లో తిరుమల తిరుపతి ప్రస్తావన ఉందన్న ఆయన ప్రాచీన తమిళ సాహిత్యంలో దీని గురించి కూడా ఉందని రామానుజాచార్యులు తిరుపతిని ప్రాచుర్యంలోకి మాత్రమే తీసుకొచ్చారని చెప్పారు.
"ఈ ప్రాంతాన్ని ప్రాచీన పల్లవులు, చోళులు, యాదవ రాజులు పరిపాలించారు. తరువాత కాలంలో విజయనగర రాజులు పాలించారు.
రామానుజులు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో, ఆయన ఈ నగరానికి పునాది వేశారనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ శాసనాలు, సాహిత్యంలో ఎక్కడా దీనిని రామానుజులు నిర్మించాడని లేదు.
చోళ సామంత రాజులు పరిపాలించారనడానికి సంబంధించిన ఆధారాలు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో కూడా 950 లేక 975 ప్రాంతానికి చెందిన ఒక శాసనం లభించింది. రాయన్ రాజేంద్ర చోళ అలియాస్ బ్రహ్మ మరియన్ అనే సామంత రాజు ఈ ప్రధాన దేవాలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు శాసనంలో ఉన్నాయి. అందులో ఉన్నకొట్టురు తెలుగులో కొత్తూరు చెప్పుకోవచ్చు''అని అన్నారు.
ప్రస్తుతం కపిల తీర్థం సమీపంలో కొత్తూరు ఉండేదని శాసనాల్లో ఉందని, కొత్తూరు అని చరిత్రలో ఉందంటే దానికి పక్కనే పాత ఊరు కూడా ఉండే ఉంటుందని. తిరుపతి అదే కావచ్చని కృష్ణారెడ్డి చెప్పారు.
"ఎందుకంటే కొత్తూరు తిరుమల పుట్ హిల్స్ దగ్గరగా ఇప్పటి రామచంద్ర నగర్, ఖాదీ కాలనీ ప్రాంతాల్లో ఉండేదని చాలా మంది భావిస్తారు. 1970లలో ఇక్కడ ఒక పురాతన ఆలయ గోపురం ఉండేదని ఆ తర్వాత దాన్ని కూల్చేశారని చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు.
తిరుపతి గురించి శాసనాల్లో, సాహిత్యంలో ఆధారాలు లేకపోయినా, ఈ నగరం కచ్చితంగా రామానుజులు కంటే వందల సంవత్సరాల ముందే ఉందని భావించవచ్చు" అన్నారు.
ఈ ప్రాంతానికి రామానుజులు రావడానికి ప్రధానంగా ఆయన మేనమామ ఇక్కడ ఉండడమేనని కృష్ణారెడ్డి కూడా చెప్పారు.
"మేనమామ ఆహ్వానంతోనే రామానుజులు తమిళ దేశం నుంచి ఇక్కడికి వచ్చారని, తిరుమలకి వెళ్లి స్వామి కైంకర్యాలు చేశాడని చెప్పి మనం భావిస్తున్నాం. ఆ మేనమామ కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళి స్వామివారికి సేవలు చేసి మళ్ళీ తిరిగి తిరుపతికి వచ్చే వారని చాలామంది చెప్పేవాళ్ళు. అదేవిధంగా వైష్ణవ సాహిత్యంలో కూడా రాశారు. అందుకే ఆయన తప్పనిసరిగా ప్రతి రోజూ ఇక్కడ తిరుపతి గ్రామం నుంచి వెళ్ళేవాడని మనం భావించవచ్చు" అని వివరించారు.
తిరుపతికి ముందే కొట్టూరు
మొదట తిరుపతి లేదని కపిల తీర్థం దగ్గర కొట్టురు అనే గ్రామం ఉండేదని రిటైర్డ్ హెడ్మాస్టర్, తిరుపతి తిరుమల గురించి అధ్యయనం చేసిన ఎస్.కృష్ణారెడ్డి చెప్పారు.
"తిరుపతి అనే పేరుతో లేదు. కపిలతీర్థం దగ్గర కొట్టూరు అనే పేరుతో చిన్న గ్రామం ఉండేది. తిరుపతి కంటే ప్రాచీనమైనది తిరుచానూరు. దానికి ముందు పేరు తిరుకొడవూరునాడు అనే పేరుతో తిరుచానూరు ప్రసిద్ధిగాంచింది. తిరుపతి అనేది అప్పటికి లేదు.
తర్వాత కొంతకాలానికి చోళుల పాలనా కాలంలో రాయన్ రాజేంద్ర చోళ అనే సామంత రాజు అక్కడ ఒక గ్రామాన్ని కట్టాడు. ఆ గ్రామం పేరు కొట్టూరు" అన్నారు.
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో విగ్రహం గురించి కృష్ణారెడ్డి ఉన్నమరో ఆసక్తికరమైన విషయాన్ని బీబీసీకి చెప్పారు.
చిదంబరంలోని గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రంలో పారవేసినపుడు రామానుజాచార్యులు ఆ విగ్రహాన్ని సముద్రం నుంచి వెలికి తీయించి తిరుపతి పంపించినారు. అప్పుడు ఆ విగ్రహాన్ని శ్రీనివాసపురం పేరుతో ఉన్న మంచినీళ్ల కుంట లక్ష్మి నరసింహ స్వామి గుడిదగ్గర కోనేటి గడ్డ మీద భద్రపరిచారు.
చిదంబరం గుడిలో నుంచి గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాలని తిరుపతికి పంపించారు. తిరుపతి లేదు కదా అందుకే, కొట్టురులో అప్పుడు భద్రపరిచారు. శ్రీనివాసపురం అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉండేది అని కృష్ణా రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల టీ20 వరల్డ్ కప్- క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్-లలో భారత్-ను రనౌట్ల దురదృష్టం వెంటాడుతోందా- - BBC News తెలుగు
- ఈపీఎస్- అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలిగు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- వృద్ధిమాన్ సాహాకు రిటైర్ కావాలని కోచ్ ద్రవిడ్ సలహా, ఇద్దరి మధ్యా ఏం జరిగింది?
- ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం.. దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)