You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ రూ. 3,309 కోట్లు... త్వరలో 300 సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీ - ప్రెస్ రివ్యూ
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ. 3,309.89 కోట్ల రూపాయలుగా పాలకమండలి నిర్ణయించినట్టు సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వరంలో శనివారం జరిగిన సమావేశంలో పాలక మండలి ఈ బడ్జెట్‌ను ఆమోదించింది. గత ఏడాదితో పోల్చితే రూ. 66 కోట్లు అధికం.
ఈ బడ్జెట్లో హిందూ ధర్మ ప్రచారం, భక్తులకు సౌకర్యాల కల్పన, దేవాలయాల నిర్మాణం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. తిరుమలలోని బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు రూ.3.3 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన థర్మో ఫ్లూయిడ్ కడాయిల్ని ఏర్పాటు చేయనున్నారు.
పాలకమండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
- టీటీడీ నిఘా - భద్రత విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం.
- అలిపిరి చెక్ పాయింట్ వద్ద టోల్ గేట్‌లో జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన ప్రకారం వాహనాల విభజన చేపట్టి ఫాస్ట్ టాగ్ విధానం అమలు చేయాలి. టోల్ రుసుము పెంచాలి.
- జమ్మూ, వారణాసి, ముంబయిలలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం.
- రూ. 4 కోట్లతో హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి, వాహన మండపం, కల్యాణోత్సవ మండపాల నిర్మాణం.
- జూపార్క్ సమీపంలో రూ. 14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనం. రూ. 34 కోట్లతో ఎస్వీ బధిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణం.
తెలంగాణ సహకార ఎన్నికల్లో తిరుగులేని టీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా తిరుగులేని విజయాలతో టీఆర్ఎస్ దూసుకెళ్తోందంటూ సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ప్రస్తావిస్తూ నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
డీసీసీబీ, డీసీఎంస్‌లన్నీ టీఆర్ఎస్‌వేనని... మొత్తం 18 పదవులు కారుకే ఖరారయ్యాయని పేర్కొంది.
శనివారం 9 ఉమ్మడి జిల్లాలకు జరిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో టీఆర్ఎస్ మద్దతున్న రైతులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పుకొచ్చింది.
ఉద్యమకారులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు సామాజిక సమతుల్యత పాటించడం ఈ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిందని తన కథనంలో ప్రస్తావించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెట్రో ధరలపెంపు
ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంతో పెట్రోల్, డీజిల్‌పై పన్ను విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మార్చింది. దీంతో కచ్చితంగా ధరలు పెరగనున్నాయంటూ ఈనాడు ప్రచురించిన కథనం వివరాలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్‌పై పన్ను విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మార్చింది. నెల రోజుల్లోనే ఇలా మార్చడం ఇది రెండోసారి.
పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయి. తాజా పెంపు తర్వాత ఫిబ్రవరి నెలతో పోల్చితే పెట్రోల్ ధర లీటరుకు 72 పైసలు, డీజీల్‌పై 77పైసలు అదనపు భారం పడుతుంది.
2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 31శాతం పన్ను, రూ. 2 స్థిర ధర, డీజీల్‌పై 22.25శాతం పన్ను, రూ. 2 స్థిర ధర కలిపి వసూలు చేసేది. అయితే పెట్రోల్‌పై పన్ను 35.20 శాతానికి, డీజిల్‌పై 27శాతానికి పెంచుతూ జనవరి 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ రెండింటిపై ఉన్న రూ. 2 స్థిర ధరను తొలగించింది. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ధరలు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. దీంతో తాజా పెంపు అనివార్యమైంది.
ఈ సవరణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు అదనపు ఆదాయం రావచ్చంటూ వాణిజ్యపన్నుల శాఖ వర్గాల అంచనా అని ఈనాడు తన కథనంలో పేర్కొంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ
రిలయన్స్ అధినేత ముఖాశ్ అంబానీ ఏపీ సీఎం జగన్‌తో సమావేశమయ్యారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పరిమళ్ నథవాణీతో పాటు ముఖేశ్ కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారని పేర్కొంది.
సుమారు 2 గంటల సేపు సీఎం నివాసంలో ఉన్నారని తెలిపింది. ఆపై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రంగం అభివృద్ధిపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారన్న ప్రభుత్వ ప్రకటన సారాంశాన్ని కూడా ఈ వార్తలో ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే
- కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం
- దిల్లీ హింస: పోలీసుల పాత్రపై వినిపిస్తున్న ప్రశ్నలకు బదులిచ్చేదెవ్వరు?
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)