You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈపీఎస్: అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి?
- రచయిత, ఆర్కే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు మరింత మంది ఉద్యోగులు పదవీ విరమణ తరువాత అధిక మొత్తంలో పెన్షన్ పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
2022లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈమేరకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది.
అధిక మొత్తంలో పెన్షన్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలా? వద్దా? వంటి విషయాలను వివరంగా చూద్దాం.
సుప్రీం కోర్టు 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం పెద్ద జీతాలు తీసుకునే వారు కూడా అధిక పెన్షన్ కాంట్రిబ్యూట్ చేయడానికి అర్హులు. కాకపోతే 2014 సెప్టెంబరు 1 నాటికి ఉద్యోగులు ఎంప్లాయి పెన్షన్ స్కీం(ఈపీఎస్)లో సభ్యులై ఉండాలి.
మళ్లీ ఇక్కడ రెండు కేసులున్నాయి.
2014 సెప్టెంబరు కంటే ముందు నేను పదవీ విరమణ చేసి ఉంటే?
2014 సెప్టెంబరు 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఉండాలి. దాన్ని ఈపీఎఫ్‌ఓ ఆమోదించి ఉంటే వారి విషయంలో మార్పులేమీ ఉండవు.
ఒకవేళ అధిక పెన్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును గతంలో ఈపీఎఫ్‌ఓ తిరస్కరించి ఉంటే, అలాంటి వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
2014 సెప్టెంబరు తరువాత నేను పదవీ విరమణ చేసి ఉంటే?
2014 సెప్టెంబరు 1 నుంచి 2022 నవంబరు 4 మధ్య పదవీ విరమణ చేసిన వారు అధిక పెన్షన్‌కు అర్హులు కాదు అని సుప్రీం కోర్టు తీర్పులో ప్రత్యేకంగా ఎక్కడా చెప్పలేదు. కాబట్టి వీరు కూడా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకవేళ గతంలో అధిక పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తును ఈపీఎఫ్‌ఓ తిరస్కరించి ఉంటే అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు 2023 మార్చి 3 తుది గడువు.
నేను ప్రస్తుతం సర్వీసులో ఉంటే?
2014 సెప్టెంబరు 1 కంటే ముందే ఈపీఎఫ్‌లో చేరి ఉండి, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు అధిక పెన్షన్ సౌలభ్యాన్ని ఉపయోగించుకోకుండా ఉండి ఉంటే 2023 మార్చి 3లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో చేసుకున్న దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరించి ఉంటే అలాంటి వారు కూడా అధిక పెన్షన్ కోసం కాంట్రిబ్యూట్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా మార్చి 3 చివరి తేదీ.
నాకు నెలకు రూ.15 వేలు అంత కంటే తక్కువ జీతం వస్తూ ఉంటే?
నెలకు రూ.15 వేలు అంత కంటే తక్కువ జీతం తీసుకుంటూ ఉండే ఉద్యోగుల మీద సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఏమీ ఉండదు.
2014 సెప్టెంబరు 1 నాటికి నా నెల జీతం రూ.15 వేల కంటే తక్కువగా ఉంది. ఆ తరువాత అది రూ.15 వేలు దాటింది. మరి నాకు అధిక పెన్షన్ పొందడానికి అర్హత ఉందా?
లేదు. 2014 సెప్టెంబరు 1 నాటికి ఎవరైతే రూ.15 వేల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుంది.
2014 సెప్టెంబరు 1న లేదా ఆ తరువాత నేను ఈపీఎఫ్‌ఓలో చేరితే?
2014 సెప్టెంబరు 1 తరువాత ఈపీఎఫ్‌ఓలో చేరిన వారి నెల జీతం రూ.15 వేల కంటే ఎక్కువ ఉంటే అలాంటి వారు ఈపీఎస్‌లో చేరడానికి అర్హులు కారు. కాబట్టి సుప్రీం కోర్టు తీర్పు వీరికి వర్తించదు.
పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
పదవీ విరమణ చేసిన తరువాత నెలవారీ వచ్చే పెన్షన్, ఉద్యోగి పెన్షనబుల్ శాలరీ మీద ఆధారపడి ఉంటుంది.
పెన్షన్= పెన్షనబుల్ శాలరీx(పెన్షనబుల్ సర్వీసు)/70
సంఘటిత రంగంలో ఎన్ని సంవత్సరాలు పని చేశారో దాన్ని పెన్షనబుల్ సర్వీసు అంటారు.
గత 60 నెలల్లో సగటున తీసుకున్న నెలవారి జీతాన్ని పెన్షనబుల్ శాలరీ అంటారు.
అధిక పెన్షన్ ఎంచుకోవడం వల్ల వచ్చే మార్పులు ఏంటి?
ప్రస్తుతం ఇలా...
ఉదాహరణకు A అనే వ్యక్తి నెలవారీ బేసిక్ శాలరీ రూ.50,000.
ఉద్యోగి వాటా: ప్రస్తుతం ఉద్యోగి వాటా కింద బేసిక్ శాలరీలో 12శాతాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నారు.
A విషయంలో రూ.50,000లో 12శాతం అంటే రూ.6,000 పీఎఫ్ ఖాతాకు వెళ్తాయి.
యాజమాన్యం వాటా: ఎంప్లాయర్ వంతు 12శాతాన్ని రెండుగా విభజిస్తారు. ఇందులో 8.33శాతం (రూ.15,000 సీలింగ్) ఈపీఎస్‌కు వెళ్తుంది.
A విషయంలో ఎంప్లాయర్ వాటాలో రూ.1,250 (రూ.15,000లో 8.33శాతం)ను ఈపీఎస్‌లో జమ చేస్తారు.
ఇంకా యాజమాన్యం వంతు పీఎఫ్ వాటా మిగిలే ఉంది. దాన్ని ఇలా లెక్కిస్తారు...
యాజమాన్యం పీఎఫ్ చందా= బేసిక్ శాలరీలో 12శాతం – రూ.15,000లలో 8.33శాతం
ఇక్కడ A విషయంలో బేసిక్ శాలరీలో 12శాతం అంటే రూ.6,000 అవుతుంది. ఇక రూ.15,000లో 8.33శాతం అంటే రూ.1,250 అవుతుంది.
ఇప్పుడు రూ.6,000 నుంచి రూ.1,250 తీసేస్తే రూ.4,750 వస్తుంది. ఇదే యాజమాన్యం వాటా అవుతుంది.
అంటే మొత్తం మీద రూ.10,750(6,000+4,750) పీఎఫ్ ఖాతాకు, రూ.1,250 పెన్షన్ పథకానికి వెళ్తాయి.
అధిక పెన్షన్ ఎంచుకుంటే...
ఉద్యోగి వాటా మారి పోతుంది. 1.16శాతాన్ని ఈపీఎస్ కోసం కట్టాల్సి ఉంటుంది. రూ.15,000 కంటే మూల వేతనం ఎంత ఎక్కువ ఉంటుందో అంత మొత్తం మీద 1.16శాతాన్ని లెక్కిస్తారు.
A విషయంలో రూ.50,000 మూల వేతనంగా ఉంది. ఇందులో నుంచి రూ.15,000 తీసేస్తే రూ.35,000 వస్తుంది. ఈ రూ.35,000లో 1.16శాతం అంటే రూ.406ను ఉద్యోగి వాటా కింద పెన్షన్ కోసం కట్ చేస్తారు.
ఉద్యోగి పీఎఫ్ చందా కూడా మారిపోతుంది.
ఉద్యోగి పీఎఫ్ చందా= మూల వేతనంలో 12శాతం- రూ.406
అంటే రూ.6,000-406= రూ.5,594.
కాబట్టి అధిక పెన్షన్ ఎంచుకోవడం వల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొంత తగ్గుతుంది.
ఇక యాజమాన్యం వాటా విషయానికి వస్తే గతంలో మాదిరిగా వేజ్ సీలింగ్ ఏమీ ఉండదు. అంటే మూల వేతనం మీదనే లెక్కిస్తారు.
A కేసులో బేసిక్ శాలరీ రూ.50,000.
యాజమాన్యం 8.33శాతం ఈపీఎస్‌కు, 3.67శాతం పీఎఫ్‌కు కాంట్రిబ్యూట్ చేస్తుంది.
రూ.50,000లో 8.33శాతం = రూ.4,165. ఈ మొత్తాన్ని పెన్షన్ కింద జమ చేస్తారు.
రూ.50,000లో 3.67శాతం = రూ.1,835. ఈ మొత్తం పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది.
మొత్తం మీద పీఎఫ్ ఖాతాలో రూ.7,429, పెన్షన్ ఖాతాలో రూ.4,571 జమ అవుతాయి.
అధిక పెన్షన్ ఎంచుకుంటే జీతంలో అదనంగా కోతలు ఉంటాయా?
అదనంగా జీతంలో కోతలు ఉండవు.
అధిక పెన్షన్ సదుపాయాన్ని భవిష్యత్తులో రద్దు చేసుకోవచ్చా?
లేదు. ఒకసారి ఎంచుకున్నాక మళ్లీ రద్దు చేసుకునే వీలు లేదు.
ఎప్పటి నుంచి వర్తిస్తుంది?
అధిక పెన్షన్ సదుపాయాన్ని ఎంచుకుంటే, ఉద్యోగి ఈపీఎఫ్‌ఓలో చేరిన నాటి నుంచి అది వర్తిస్తుంది.
అధిక పెన్షన్ ఎంచుకోవాలా? వద్దా?
అధిక పెన్షన్ సదుపాయాన్ని వినియోగించుకుంటే పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎస్ ఖాతాకు తరలిస్తారు. అందువల్ల ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ మొత్తం పెరుగుతుంది. అదే సమయంలో పీఎఫ్ కార్పస్ తగ్గుతుంది.
అధిక పెన్షన్ సదుపాయాన్ని ఎంచుకోక పోతే పీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది. ఈపీఎస్‌లో తక్కువ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి నెలవారీ వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా, పీఎఫ్ కార్పస్ ఎక్కువగా ఉంటుంది.
పీఎఫ్ ఖాతాలో మొత్తం మీద వడ్డీ వస్తుంది. కానీ ఈపీఎస్ ఖాతా మీద ఎటువంటి వడ్డీ రాదు. అధిక పెన్షన్‌ను ఎంచుకునే ముందు ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అలాగే 5ఏళ్లు దాటిన తరువాత పీఎఫ్ కార్పస్ మీద ఎటువంటి పన్ను ఉండదు. కానీ నెల వారీ తీసుకొనే పెన్షన్ మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి?
యాజమాన్యం, ఉద్యోగి ఉమ్మడిగా 2023 మార్చి 3వ తేదీలోపు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఆ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను పీఎఫ్ విభాగం ఇంకా వెల్లడించలేదు.
అధిక పెన్షన్ సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలా?
కాదు. ఉద్యోగులు ఇష్టమైతే ఎంచుకోవచ్చు లేదంటే లేదు.
అధిక పెన్షన్ ఎంచుకునే సదుపాయం ప్రైవేటు పీఎఫ్ ట్రస్టులకు కూడా ఉందా?
ప్రైవేటు పీఎఫ్ ట్రస్టులకు కూడా వర్తిస్తుంది.
పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది?
పదవీ విరమణ తరువాత పెన్షన్ వస్తుంది. ఇందుకు కనీసం 10ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగులకు 58ఏళ్లు పూర్తి అయిన తరువాత పెన్షన్ ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఉద్యోగులు ఒకవేళ 50 నుంచి 57ఏళ్ల మధ్య ఉద్యోగం వదిలేస్తే వారికి కూడా పెన్షన్ వస్తుంది.
పెన్షన్ ఎప్పటి వరకు ఇస్తారు?
ఉద్యోగులు చనిపోయే వరకు పెన్షన్ పొందుతారు. ఉద్యోగి చనిపోయిన తరువాత వారి భాగస్వామికి లేదా పిల్లలకు పెన్షన్ అందిస్తారు. పిల్లల వయసు 25 ఏళ్లకు మించకూడదు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటిల్
- ఎస్కే యూనివర్సిటీ: విద్యార్ధులు, ఉద్యోగుల సంక్షేమానికి హోమం, చందా కోసం రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- అదానీ గ్రూపు సంస్థల్లో సంక్షోభం.. నరేంద్ర మోదీ గ్రీన్ ఎనర్జీ కలలను దెబ్బతీస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)