You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుపతి: ఈ ఆధ్యాత్మిక నగరాన్ని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి, ఇది ప్రకృతి బీభత్సమా, మానవ తప్పిదమా?
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుపతికి కొత్త కష్టాలొచ్చాయి. ఎంత వర్షం వచ్చినా ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది పడని తిరుపతి ప్రజలు, ఇప్పుడు భారీ వర్షం అంటేనే వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తిరుపతిని వరదలు ఇబ్బంది పెడుతున్నాయి.
శేషాచలం పర్వత సానువుల్లో ఉండటంతో ఈ కొండల్లో, అడవుల్లో కురిసే వాన నీళ్లన్నీ తిరుపతి మీదుగా స్వర్ణముఖి నదికి చేరుతాయి. ఈ నగర భౌగోళిక స్వరూపం కూడా అందుకు తగినట్టుగా ఉంది. కానీ, ఇటీవల నగరవాసులకు తరచూ వరద సమస్య ఎదురవుతోంది.
2021 నవంబర్‌లో తిరుపతిలో రెండుసార్లు వరదలు వచ్చాయి. ఇద్దరు చనిపోయారు. వాస్తవానికి 2015 నవంబర్‌లో తిరుపతిలో ఆల్ టైం రికార్డు (21.9 సెం.మీ) వాన కురిసినప్పుడు కూడా రాని వరదలు ఇప్పుడు రావడం పట్ల నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరద నీరు 5 రోజులపాటు నగరంలోనే నిలిచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాత భవనాలు కూలిపోయాయి. కొన్ని ఇళ్లకు బీటలు వచ్చాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇవన్నీ తిరుపతివాసులు గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు.
ఒకప్పుడు ఎలా ఉండేది?
భౌగోళికంగా తిరుపతి నగరంలో ఎన్నో చిన్నచిన్న ప్రవాహాలు, చెరువులు, కుంటలు, కాలువలు, దిగుడు బావులు ఉండేవి. నగరానికి ఉత్తరాన దట్టమైన అడవులు, దక్షిణాన స్వర్ణముఖి నది ప్రవాహం ఉంటుంది. నగరంలో 60ఏళ్లు దాటిన ఎవరిని కదిలించినా, తమ చిన్నతనంలో ఈ ప్రాంతంలో ఎన్ని చెరువులను, కుంటలను చూసిందీ, ఈత కొట్టిందీ కథలు కథలుగా చెబుతారు.
''తిరుపతిలో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని చెరువులు, కుంటలు, దిగుడు బావులు ఉండేవి. ఆక్రమణలకు గురై ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఉదాహరణకు తాళ్లపాక చెరువు. ఇప్పుడది ఆర్టీసీ బస్టాండ్‌గా మారింది. పెద్ద చెరువును 'తుడా' అధికారులే ప్లాట్లు వేసి అమ్మి దానికి రాయల్ నగర్ అని పేరు పెట్టారు. అక్కడున్న పెద్ద కాలువలు కూడా చిన్న కాలువగా మారిపోయాయి'' అని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పేట శ్రీనివాసులు రెడ్డి బీబీసీతో అన్నారు.
అవిలాల చెరువును పూడ్చి అక్కడ కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించారని, తర్వాత దానిని ఇళ్ల ప్లాట్లుగా మార్చడానికి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ప్రయత్నిస్తే, కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.
ఎన్నో చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో ఎటూ వెళ్లే దారి లేక నీరు రోడ్ల మీదకు వస్తోందని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులే కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా వదిలేసిందని ఆయన ఆరోపించారు.
పేరూరు చెరువు, అవిలాల చెరువు, తాతయ్యగుంట, మల్లన్న గుంట, కశిం కాలువ లాంటివి తిరుపతిలో వందల సంవత్సరాల నాటి జలవనరుల్లో కొన్ని మాత్రమే.
తిరుపతిలో ఎంత వర్షం పడినా ఆ నీటిని ఇవి తమలో ఇముడ్చుకునేవి. అదనంగా వచ్చే నీరు స్వర్ణముఖికి చేరేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇవి గత కొన్నిదశాబ్దాలుగా కనుమరుగవుతూ వచ్చాయి.
''తిరుపతి మ్యాప్‌లో ప్రతి రేఖ శేషాచలం కొండల్లో నుంచి వచ్చే నీటి దారలే. ఈ దారులన్నీ శేషాచలం నుంచి తిరుపతి మీదుగా స్వర్ఱముఖి నదికి చేరుతాయి. తిరుపతిలోని 27 చెరువుల్లో ఇప్పుడు 6 చెరువులే మిగిలి ఉన్నాయి'' అని సీనియర్ జర్నలిస్ట్ పుత్తా యర్రంరెడ్డి అన్నారు.
''ఎక్కడికక్కడ సప్లై చానల్స్ ఉండి వాటి ప్రకారం నీరు వెళ్లి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. సప్లై చానల్స్ దెబ్బతిని, ఊట కాలువలు పూడుకుపోయి, చెరువులన్నీ ఆక్రమణకు గురవడంతో నీరు పల్లం చూసుకుని నివాస ప్రాంతాల మీదికి వచ్చింది'' అని అన్నారాయన.
నెల్లూరు సముద్ర తీరానికి దగ్గరలో ఉండడంతో తుపాన్ల ప్రభావం తరచూ తిరుపతి మీద కూడా పడుతోంది. ఇక్కడ సంవత్సరానికి సగటున 11.2 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది.
నవంబర్ 18వ తేదీన తిరుపతి అర్బన్ మండలంలో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైతే రూరల్‌లో 8.1 సెం.మీ. నమోదైంది. 19న తిరుపతి అర్బన్‌లో 10.4 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా రూరల్‌లో 12.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నవంబర్ నెలలో మొత్తం అర్బన్‌లో 57.1, రూరల్ 53.7 సెంటీమీటర్ల వాన కురిసింది. వాస్తవానికి తిరుపతిలో 18, 19 తేదీల్లో కురిసింది ఆల్ టైం రికార్డ్ కాదు. తిరుపతి ఆల్ టైం రికార్డ్ 2015 నవంబర్ 16న నమోదైంది. ఆ ఒక్క రోజులోనే 21.9 సెం.మీ. వర్షం కురిసింది.
గత రికార్డులను బట్టి చూస్తే, నవంబర్‌లో కురిసిన వర్షాలు ఏమంత పెద్దవి కాదని స్పష్టమవుతోంది. కానీ, గతంలో ఉన్న వరద వెళ్లే దారులు ఇప్పుడు లేవు. అదే సమస్యకు మూలం.
''శేషాచలం కొండల నుంచి పదుల సంఖ్యలో జలపాతాలు తిరుపతి మీదుగా స్వర్ణముఖీ నదికి చేరుతుంటాయి. ఇప్పుడున్న రాయల చెరువు గేటు, రాయల్ నగర్, అన్నమయ్య సర్కిల్, రేడియో స్టేషన్, ఆర్డీఓ కార్యాలయాలు ఒకప్పుడు పెద్ద చెరువులో భాగంగా ఉండేవి. పలు ప్రాంతాల్లో సహజ సిద్దమైన నీటి మార్గాలు మూసుకుపోవడంతో ఆ నీరు నగరంలోకి ప్రవేశించింది'' అని యర్రంరెడ్డి వివరించారు.
అయితే, ఈ ఆక్రమణల వెనక ప్రభుత్వాల తప్పిదం కూడా ఉందని, చాలా సందర్బాల్లో అధికారులు ఆక్రమణలకు సహకరించారని ఆరోపణలు వినిపించాయి.
''మొదట్లో చెరువు కట్టలను, ఆ తరువాత చెరువులను ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. అవినీతి, రాజకీయాల వల్ల ఆక్రమణలను తొలగించలేకపోతున్నారు" అని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పేట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
తిరుపతి ప్రాంతంలో మానవ ఆవాసానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. 1886లో తిరుపతి మున్సిపాలిటీగా అవతరించింది. 2006లో 'తుడా' ఏర్పడింది. ప్రస్తుతం తిరుపతి నగర విస్తీర్ణం 27.44 చ.కి. మీ. పట్టణ జనాభా 2.87 లక్షలు కాగా, శివార్లను కలుపుకుంటే 4.87 లక్షలు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిరుపతి నగరంలో నివాసాలు అవసరమయ్యాయి. దీంతో అడ్డగోలు నిర్మాణాలకు తెరలేచింది. వాటి పర్యవసానమే ఇదంతా అని నిపుణులు అంటున్నారు. ఈ ఆక్రమణల నుంచి చెరువులను, కుంటలను కాపాడటానికి స్థానికులు కొందరు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అవిలాల,పేరూరు చెరువుల్ని అలాగే కాపాడుకున్నారు.
పరిష్కారం ఏంటి?
ప్రస్తుతం తిరుపతి సమస్యకు అదనపు నీటి వనరులు, వసతులు సృష్టించడమే పరిష్కారంగా చెబుతున్నారు. ఇప్పటికే పూర్తిగా ఆక్రమణలకు గురైన వాటిని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇక కాలువల పూడికతీత, ఆక్రమణల తొలగింపు, అవసరమైనచోట శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తిరుపతికి ఒక సమగ్ర వరదనీటి పారుదల ప్రణాళిక అవసరమని నిపుణులు చెబుతున్నారు.
''తిరుపతిలో కొండల మీద నుంచి వచ్చే నీటి కోసం డీవియేషన్ చానల్స్ ఏర్పాటు చేయాలి. ఆ కాలువలను చెరువులకు లింక్ చేస్తూ చివరగా స్వర్ణముఖికి కలపాలి'' అని యర్రం రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఏమనుకుంటోంది?
తిరుపతి శివార్లలోని కరకంబాడి దగ్గర ఒక జలాశయాన్ని నిర్మించాలని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
''నగరంలో దాదాపు 2 లక్షలమంది ఆక్రమిత స్థలాల్లో ఉంటున్నారు. ఇంతమందిని ఖాళీ చేయించడం అసాధ్యం. కరకంబాడి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే తిరుపతివైపు వచ్చే వర్షపు నీటిని అటువైపు మళ్లించవచ్చు. ఇటీవలి కాలంలో తిరుపతి తాగునీటి సమస్యను కూడా ఎదుర్కొంటోంది. 3 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తే, ఒక్కసారి నిండితే నాలుగేళ్ల వరకు మంచి నీటి సమస్య ఉండదు'' అని కరుణాకర్ రెడ్డి అన్నారు.
ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.400-500 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ భేటీ
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- న్యూజీలాండ్‌పై 372 పరుగుల తేడాతో భారత్ విజయం
- చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతోంది?
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- మైక్ టైసన్: 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్'
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)