హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని మోదీ భేటీ

భారత్‌, రష్యాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సోమవారం దిల్లీ చేరుకున్నారు.

న్యూ దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టబడులు తదితర అంశాలపై చర్చించారు.

కోవిడ్ సహా వివిధ అంశాల్లో రష్యా అందిస్తున్న సహకారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రష్యాతో భారత్ సంబంధాలు గతంలో కంటే దృఢంగా ఉన్నాయన్నారు.

"కోవిడ్ మహమ్మారి వల్ల అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోవిడ్‌పై పోరాటంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకున్నాయి.

ఆర్థిక రంగంలోనూ ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దీర్ఘ దృష్టితో అడుగులు వేస్తున్నాం. 2025 నాటికి 30 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నాం.

భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలకు 2021వ సంవత్సరం చాలా ముఖ్యమైనది. 1971లో చేసుకున్న ఒప్పందం 'ట్రీట్ ఆఫ్ పీస్ ఫ్రెండ్‌షిప్ అండ్ కోపరేషన్'కు ఈ ఏడాదితో అయిదు దశాబ్దాలు పూర్తయ్యాయి. అలాగే, మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి రెండు దశాబ్దాలు నిండాయి.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద కోర్ డెవలప్‌మెంట్, కో ప్రొడక్షన్ ద్వారా మన రక్షణ సహకారం మరింత బలోపేతం అవుతోంది.'' అని ప్రధాని మోదీ అన్నారు.

అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. భారత్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత్, రష్యాల సంబంధం కాలంతో పాటు నిలిచిన స్నేహం అని అభివర్ణించారు.

''గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో 17% క్షీణత నమోదైంది, అయితే ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లో వాణిజ్యం 38% పెరిగింది. మేము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా చూస్తున్నాం'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)