పుతిన్: ‘దేవుణ్ణి పూజించాలి, గే వివాహాలను నిషేధించాలి’ - రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్త్రీ-పురుష సంబంధాలకు, వివాహ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగంలో కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వివాహం అంటే స్త్రీ-పురుషుల ఏకత్వమే అన్న భావనను రాజ్యాంగంలో పొందుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే సవరించిన రాజ్యాంగంలో సమ లైంగికుల వివాహం అన్న ప్రస్తావన లేకుండా చెయ్యాలనుకుంటున్నారు.

వాటితో పాటు రాజ్యాంగంలో దేవుని ప్రస్తావన, రష్యా భూభాగాన్ని దారదత్తంపై చెయ్యడంపై నిషేధం వంటి మరిన్ని సవరణలను కూడా ప్రతిపాదించారు పుతిన్. ఈ సవరణలపై త్వరలోనే పబ్లిక్ ఓటింగ్ జరగనుంది .

2024 తర్వాత కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకే పుతిన్ ఈ సవరణల ప్రతిపాదన తీసుకొచ్చారని భావిస్తున్నారు విమర్శకులు.

వచ్చే వారం ఎగువ సభలో చర్చ

ప్రముఖ నటుడు, దర్శకుడు, నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకుంటున్న వ్లాదిమిర్ మాష్కోవ్ చెప్పిన ప్రకారం... భూభాగానికి సంబంధించి తీసుకొచ్చిన సవరణ ప్రధాన ఉద్ధేశం 2014లో రష్యా మిలటరీ ఆక్రమించిన క్రైమియాపై అలాగే కురిల్ ద్వీపంపై తమ పట్టును పెంచుకోవడమే. కురిల్ ద్వీపానికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నుంచి రష్యా-జపాన్‌ దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది.

రెండో ప్రపంచయుద్ధంలో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR) చేసిన త్యాగాన్ని ప్రపంచ దేశాలు తక్కువ చేసి చూపాయని అంటారు పుతిన్. ఆ ప్రయత్నాలును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నాజీ జర్మనీల ఓటమి ఖరీదు 2కోట్ల70 లక్షల మంది సోవియట్ ప్రాణాలన్నది ఆయన భావన.

అధ్యక్షుడి నుంచి కొన్ని అధికారాలను పార్లమెంటుకు బదలాయించాలన్న ప్రతిపాదనలతో పాటు రాజ్యాంగాన్ని సవరించాలంటూ గత జనవరిలో ఆయన చేసిన ఆలోచన యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది.

రాజ్యాంగ సంస్కరణ బిల్లును రష్యా పార్లమెంట్ దిగువ సభ ది స్టేట్ ఆఫ్ డ్యూమా జనవరిలోనే ఆమోదించింది. ఇక పుతిన్ ప్రతిపాదనలపై వచ్చే వారం ఎగువ సభలో చర్చించనున్నారు. రష్యా పార్లమెంట్‌లో పుతిన్ వర్గానిదే ఆధిపత్యం కొనసాగుతోంది.

నిజానికి రాజ్యాంగ సవరణపై ఏప్రిల్ 22న పబ్లిక్ ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే అంత కన్నా ముందు అది పార్లమెంట్ నుంచి అలాగే రాజ్యాంగ న్యాయస్థానం నుంచి ఆమోదం పొందాల్సి ఉంది.

పుతిన్ తీసుకొస్తున్న తాజా సవరణలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మెజార్టీ రష్యన్లకు పుతిన్ అద్దం పడతారని కొందరు అంటుండగా... మరి కొందరు మాత్రం ఈ సవరణలు అసందర్భమైనవని, రాజకీయ పరమైనవని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)