‘స్మార్ట్ ఫోన్ వాడితే క్రీస్తు విరోధి పుట్టుకొస్తాడు జాగ్రత్త’ - రష్యా క్రైస్తవ మతాధికారి హెచ్చరిక

    • రచయిత, అనస్తాసియా క్లార్ల్, క్రిస్ బెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

స్మార్ట్ ఫోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడటం క్రీస్తు విరోధి ఆగమనానికి దారితీయొచ్చని రష్యా సనాతన చర్చి లీడర్ కిరిల్ హెచ్చరించారు.

బైబిల్ చెప్పింది నిజం చేస్తూ క్రీస్తు విరోధి ఒకరు వస్తారని, ఏసు క్రీస్తును సవాల్ చేస్తారని, క్రీస్తు స్థానాన్ని ఆక్రమిస్తారని క్రైస్తవ మతారాధకులు భావిస్తుంటారు.

రష్యా ప్రభుత్వ టీవీ 'రష్యా 1' తో మతాధికారి కిరిల్ మాట్లాడుతూ.. వరల్డ్‌వైడ్ వెబ్ (ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న) పరికరాలు వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే మానవ జాతిపై ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించే అవకాశాన్ని ఈ వెబ్ కల్పిస్తోందని చెప్పారు.

''క్రీస్తు విరోధి ఎవరంటే, వరల్డ్‌వైడ్ వెబ్‌కు అధిపతిగా ఉండి, మానవ జాతిని నియంత్రించే వ్యక్తి'' అని ఆయన అన్నారు.

మతాధికారి కిరిల్ వ్యాఖ్యలపై రష్యాలోని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందించారు. కొందరు ఈ కామెంట్లపై హాస్యంగా వ్యంగ్యోక్తులు విసరగా, మరికొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ''ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్న'' చర్చి అని నిందించారు.

''మీరు మీ గాడ్జెట్‌ను వాడిన ప్రతిసారీ, మీకు ఇష్టమున్నా లేకపోయినా... మీరు మీ లొకేషన్ ఆన్ చేసినా చేయకున్నా, మీరు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో, మీ ఆసక్తులేంటో, మీరు దేనికి భయపడతారో కొంతమంది చాలా కచ్చితంగా తెలుసుకుంటారు.

''ఇవ్వాళో రేపో ఈ పద్ధతులు, సాంకేతికత సమాచారాన్ని అందించటమే కాదు.. ఈ (వినియోగదారుల) సమాచారాన్ని వాడుకునేందుకు కూడా వీలు కల్పిస్తుంది.''

''ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుని, జ్ఞానం సంపాదించేవాళ్ల చేతుల్లోకి ఎలాంటి అధికార శక్తి వెళుతుందో మీరు ఊహించగలరా?''

''ఇలా ఒక ప్రాంతం నుంచి చేసే నియంత్రణ క్రీస్తు వ్యతిరేకి రాకకు బాటలు వేస్తుంది'' అని ఆయన అన్నారు.

సాంకేతిక అభివృద్ధికి తన చర్చి వ్యతిరేకం కాదని, అయితే ఒక వ్యక్తి గుర్తింపును నియంత్రించేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థ అభివృద్ధికి మాత్రం వ్యతిరేకమని మతాధికారి కిరిల్ అన్నారు.

అయితే, కిరిల్ వాదన సోషల్ మీడియా యూజర్లందరినీ సంతృప్తి పర్చలేదు.

''శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి చర్చి వ్యతిరేకం కాదు. కానీ, వ్యక్తుల స్వేచ్ఛ పట్ల ఆందోళన ఉంది. నిజమే, తప్పకుండా'' అని ఒక ట్విటర్ యూజర్ వ్యంగ్యంగా అన్నారు.

''స్మైల్.. క్రీస్తు విరోధి... ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాడు'' అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మతాధికారి కిరిల్, చర్చి ప్రతినిధులతో ఒక మహిళ సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను కూడా జతచేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మతాధికారి కిరిల్ సన్నిహితులు. వీరు ఇరువురూ కలిసి భారీ స్థాయిలో జరిగే చర్చి వేడుకల్లో పాల్గొంటుంటారు. మౌంట్ అతోస్ వంటి సంప్రదాయ క్రైస్తవ మత ప్రాంతాల సందర్శనకు కూడా వెళ్లారు. పుతిన్ జాతీయవాద అజెండాతో రష్యాలోని చాలామంది సంప్రదాయ మతాధికారులు ఏకీభవిస్తుంటారు.

రష్యాలో ఇంటర్నెట్ స్వేచ్ఛపై నియంత్రణ పెరుగుతున్న సమయంలో, రష్యా స్వతంత్ర ఇంటర్నెట్‌ను తయారు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మతాధికారి కిరిల్ దైవ సంబంధిత వ్యవహారాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విధానాన్ని ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

''రష్యాలో ఇంటర్నేషనల్ ఇంటర్నెట్‌ను వాళ్లు రద్దు చేస్తారు. కాబట్టి దాన్నుంచి క్రీస్తు విరోధి రాలేరు'' అని ఒక సోషల్ మీడియా యూజర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)