You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మైనస్ 67 డిగ్రీల చలిలో జీవిస్తున్న ప్రజలు వీళ్లు
మనకు సంవత్సరమంతా చలికాలం అయితే ఎలా ఉంటుంది?
అమ్మో తలచుకుంటేనే భయమేస్తోంది కదా! అదే జీవితాంతం ఎముకలు కొరికే చలిలో గడపడమంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.
మనకు చలికాలం ఉండేది దాదాపు నాలుగు నెలలు మాత్రమే. కశ్మీర్ వంటి కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మనదేశంలో ఉష్ణోగ్రతలు సగటున 15-20 డిగ్రీల మధ్య ఉంటాయి.
అదే ఉత్తర సైబీరియాలోని వెర్కోయానస్క్‌లో ఉష్ణోగ్రతలు -67.8 డిగ్రీల వరకు పడిపోతాయి. అంటే ఇక్కడ జీవనం ఎంత సాహసంతో కూడుకుందో అర్థమవుతుంది.
ఇక్కడ ఆయా కాలాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో -67.8 డిగ్రీలు, ఎండాకాలంలో 37.30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతాయి. ఇది గిన్నీస్ బుక్‌లో రికార్డుగా నిలిచింది.
రష్యాకు తూర్పున ఉన్న ఈ గ్రామంలో 15 ఏళ్ల అయాల్ తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు.
ఈ గ్రామానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం యాకుటస్క్‌లో అతని నలుగురు సోదరులు చదువుకుంటున్నారు. త్వరలోనే తనూ అక్కడకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్లడం ఇక్కడ చాలా సాధారణమైన విషయం.
వీరికి 3జీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా యువత తమ జీవితాలను ఇతరులకు తెలియజేస్తూ బాహ్యప్రపంచం గురించి వారు తెలుసుకుంటూ ఉంటారు.
అయాల్ జీవన గమనాన్ని బ్రైసీ పోర్టోలానో అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరా కన్నుతో బంధించారు.
అయాల్ తల్లి తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమె స్వయంగా తన అయిదుగురు పిల్లలను పెంచుతోంది.
అయాల్ ఇంట్లో నేలపై అతనికి ఎంతో ఇష్టమైన స్ట్రోగానినా అనే స్థానిక ఆహారం ఉంది. చలికి బాగా గడ్డకట్టిన పొడవాటి చేపలను నిలువుగా ముక్కలు చేసి తినడమే స్ట్రోగానినా. ఆకలిని పెంచేందుకు ఉప్పు, మిరియాలు కలిపి దీన్ని తింటారు.
ప్రపంచంలో అతి శీతల గ్రామాల జాబితాలో మొదటి స్థానం కోసం వెర్కోయానస్క్.. ఈ గ్రామానికి ఆగ్నేయంగా ఉండే ఓమ్యాకోన్ పోటీపడుతుంటాయి.
వెర్కోయానస్క్ గ్రామంలో తాగు నీటి కోసం నదుల నుంచి మంచు దిమ్మెలను ఇళ్లకు తీసుకెళ్తారు. ఆ తరువాత వీటిని కరిగిస్తారు. కాచిన నీటిని పైపుల ద్వారా పంపేటప్పుడు గడ్డకట్టకుండా ఉండేందుకు అధిక ఉష్ణోగ్రతలు ఉండేలా చూస్తారు.
ప్రజలు ఎదుర్కొనే సమస్యలు
- కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీలలోని ఛార్జింగ్ అయిపోతుంది.
- పెన్‌లోని సిరా గడ్డకడుతుంది.
- లోహంతో చేసిన కళ్లజోడు ధరించడం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
- కారు ఇంజిన్లు ఆపరు. ఎందుకంటే ఒకసారి ఆపితే మళ్లీ వసంతకాలం వరకు స్టార్ట్ కావనే భయం ఇక్కడి వారిలో ఎక్కువ.
కాపాడుతున్న కొవ్వు
ఇక్కడ ఉండే గుర్రాలు, కుక్కలు ఆరు బయట ఎముకలు కొరికే చలిలో గడుపుతాయి. ఆకు రాలే కాలంలో వాటి శరీరంలో పేరుకునే కొవ్వు ఈ చలిని తట్టుకునేందుకు దోహదపడుతుంది.
ఇక్కడ దేశీయ జాతికి చెందిన యాకుత్ అనే గుర్రాలు ఉంటాయి. తక్కువ ఎత్తులో ఉండే వీటికి చలిని తట్టుకునే శక్తి బాగా ఉంటుంది. వీటిని ఎక్కవగా మాంసం కోసం పెంచుతారు.
సైబీరియన్ల జీవితం, ఆర్థికవ్యస్థ, ఆధ్యాత్మికతలో ఈ గుర్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
ఒంటరి విహారం
ఏవేవో ఆలోచనలు ముసురుతుండగా తనదైన భావ ప్రపంచంలో విహరిస్తూ అయాల్ అప్పుడప్పుడు ఒంటరిగా వీధుల్లో విహరిస్తూ ఉంటాడు. ఒకోసారి తనతో దోస్తీ చేస్తున్న పక్కింటి పెంపుడు కుక్కతో కలిసి తిరుగుతుంటాడు.
త్వరలో పట్టణానికి వెళ్తున్నందున అక్కడ తన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకాలలో ఒకటి.
నటుడు లేదా రచయిత కావాలన్నది అయాల్ లక్ష్యం.
ఈ గ్రామంలో ఎన్నో భవనాలు నేడు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి వాటిని అన్వేషిస్తూ తిరగడం అయాల్ సరదాలలో ఒకటి.
ప్రస్తుతం వెర్కోయానస్క్‌లో 1,131 మంది నివసిస్తున్నారు.
రాక్షసులతో పోరాటం
అయాల్, అతని స్నేహితులు ఖాళీ సమయంలో వీడియో గేమ్‌లు ఆడుకుంటారు.
అండర్‌టేల్ అనే ఆట అంటే వారికి ఎంతో ఇష్టం. అందులో నేల కింద ఉండే రహస్య ప్రాంతంలో చిక్కుకున్న పిల్లాడిని, అక్కడి రాక్షసులతో పోరాడి తిరిగి బయటకు తీసుకు రావాల్సి ఉంటుంది.
ఏడాదికి ఒకసారి వేసవి సెలవులకు అయాల్ సోదరులు ఇంటికి వస్తారు.
వెర్కోయానస్క్, యాకుటస్క్ మధ్య సోవియట్ కాలం నాటి ఆంటోనోవ్ ఏఎన్-24 రకం విమానాలు ఇప్పటికీ నడుస్తున్నాయి.
విమాన ప్రయాణం ఇక్కడ ఎంతో ఖరీదు. 600 కిలోమీటర్ల దూరానికి పోయి రావడానికి వేల రూపాయాలు వెచ్చించాల్సి ఉంటుంది.
తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఒకోసారి విమానాల రాకపోకలక అవరోధంగా మారుతాయి. 2003 నుంచి ఇప్పటి వరకు ఆంటోనోవ్‌కు చెందిన 6 విమానాలు కూలిపోయాయి. మరికొన్ని ప్రమాదకర ఘటనలు జరిగాయి.
ఈ కథనంలోని ఫొటోలు అన్నింటిపై హక్కులు బ్రైసీ పోర్టోలానోవి.
మా ఇతర కథనాలు:
- బౌద్ధ సన్యాసినుల్ని మీరెప్పుడైనా చూశారా!
- ఈ పర్వతాలను ఇక ఎవ్వరూ ఎక్కలేరు!!
- గణేశ్ దేవి: 780 భాషలను ‘గుర్తించారు’
- ఇవి కాఫీతో నడిచే బస్సులు
- తమిళనాడు: ప్రాణాంతకంగా మారిన ప్రైవేటు అప్పులు
- ఇరాన్-ఇరాక్: 2017లో అతి పెద్ద భూకంపం ఇదే
- దిల్లీని వణికిస్తోంది చలి కాదు. కాలుష్యం!
- కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్: ఏడుగురి మృతి
- ‘జైలుకెళ్లడానికైనా సిద్ధం నా బిడ్డకు టీకాలు వేయించను’
- మైనస్ 20 డిగ్రీల మంచు అలాస్కాలో దీపావళి వేడుకలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)