‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నల్ల సముద్రం ఒడ్డున సువిశాలమైన కోట లాంటి భవనం ఉందంటూ ఇటీవల ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ భవనాన్ని ఇప్పుడు 'పుతిన్ ప్యాలెస్' అని పిలుస్తున్నారు.

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఈ వీడియోను బయటపెట్టారు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న వీడియోలో ఈ ప్యాలెస్‌లో ఉన్న విలాసాలు, సౌకర్యాలు, సౌలభ్యాల గురించి నవాల్నీ చాలా వివరాలు చెప్పారు. పుతిన్ అవినీతి గురించి చాలా ఆరోపణలు చేశారు.

కొన్ని నెలల క్రితం నవాల్నీపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. జర్మనీలో చికిత్స తీసుకుని ఈ మధ్య ఆయన రష్యాకు తిరిగివచ్చారు. అయితే, ఆయన్ను అధికారులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఆయన జైల్లో ఉండగానే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ అయ్యింది.

అయితే, ఆ ప్యాలెస్ గురించి నవాల్నీ చేసిన ఆరోపణలను రష్యా అధ్యక్ష కార్యాలయం తోసిపుచ్చింది. ఎక్కడెక్కడి ముక్కలనో పేర్చి ఆ వీడియో చేశారని పుతిన్ అన్నారు.

రష్యా ప్రభుత్వ మీడియా కూడా ఆ భవనాన్ని చూపించింది. కానీ, ప్రభుత్వం చూపించిన వీడియోలో ఆ భవనం పూర్తి భిన్నంగా కనిపించింది. మొండి కాంక్రీట్ గోడలతో నిర్మాణం జరుగుతున్న స్థలంలానే ఉంది.

అయితే, ఒకప్పుడు విలాసవంతమైన భవనంలా ఉన్న ఈ ప్యాలెస్ ఇప్పుడు నిర్మాణ స్థలంలా ఎలా మారిపోయింది?

ఈ విషయం తెలుసుకునేందుకు 2005 నుంచి 2020 వరకూ ఈ భవన నిర్మాణం, పునర్నిర్మాణం పనుల్లో పాలుపంచుకున్నవారితో బీబీసీ మాట్లాడింది.

నవాల్నీ చెప్పిన విషయాల్లో చాలా వాస్తవాలు ఉన్నట్లు వారు చెప్పారు.

ఈ ప్యాలెస్ పునర్నిర్మాణం జరుగుతుండటానికి బూజు సమస్య ఓ కారణమని వారు అన్నారు. నవాల్నీ కూడా తన వీడియోలో ఈ విషయాన్ని చెప్పారు.

ఆ ప్యాలెస్ కోసం పనిచేసిన బిల్డర్లు, ఇంజినీర్లు తమ వివరాలు గోప్యంగా ఉంచాలన్న షరతుపై బీబీసీతో మాట్లాడారు.

2018లో తాను ఆ భవనం కోసం పనిలో చేరినట్లు స్టానిస్లవ్ (పేరు మార్చాం) బీబీసీతో చెప్పారు. నవాల్నీ వీడియోలో కనిపించిన విలువైన అలంకార సామగ్రి ఆ ప్యాలెస్‌లో చాలా ఉందని, అయితే ఫర్నీచర్‌ను చాలా వరకూ తరలించారని ఆయన అన్నారు.

''ఆ ప్యాలెస్‌లో హంగులు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత దాన్ని దాదాపు ఖాళీ చేశారు. నవాల్నీ వీడియోలో కనిపించిన విలువైన అలంకారాలు, వస్తువులు ఇదివరకు అందులో ఉండేవి'' అని స్టానిస్లవ్ అన్నారు.

బూజు సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఆ ప్యాలెస్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని నవాల్నీ తన వీడియోలో చెప్పారు.

''గోడలు, లోకప్పు మొత్తం బూజు పట్టాయి. సాధారణ బూజే కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల నల్లగా ఉంది. మొత్తం భవనం అంతటా అలాగే ఉంది. మేం చూసి షాక్ తిన్నాం'' అని స్టానిస్లవ్ చెప్పారు.

ఈ భవనంలో కాంక్రీట్‌ గోడలపై ప్లాస్టర్‌బోర్డ్‌తో గోడలు (ఫాల్స్ సీలింగ్) పెట్టారని... కాంక్రీట్‌కు, ప్లాస్టర్‌బోర్డ్‌కు మధ్యలో బూజు పట్టిందని ఆయన వివరించారు.

''కింది అంతస్థును దాటి బూజు వ్యాపించలేదు. అయినా, మొత్తం పునర్మిస్తారనే చర్చలు జరిగాయి'' అని ఇగోర్ (పేరు మార్చాం) అనే మరో బిల్డర్ చెప్పారు. ఇగోర్ 2017లో అక్కడ పనిలో చేరినట్లు తెలిపారు.

''ప్యాలెస్ నిర్మాణం అదివరకే పూర్తైంది. దాన్ని కొన్నేళ్లపాటు ఉపయోగించారు కూడా. కానీ, ఆ తర్వాత బూజు సమస్య వచ్చింది. దాని వల్ల అక్కడ దుర్వాసన సమస్య కూడా వచ్చింది'' అని రష్యా అధ్యక్ష కార్యాలయానికి సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

''దానిలో కాబినెట్లను ఖరీదైన చెక్కతో చేశారు. చాలా మంది పనిచేశారు. చాలా ఖరీదైన సామగ్రి వాడారు. కానీ, మొత్తం తొలగించమని అన్నారు'' అని ఇగోర్ అన్నారు.

ఆ భవనం మొత్తాన్ని కనీసం రెండు సార్లు డిసిన్ఫెక్ట్ చేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు ఇగోర్, స్టానిస్లవ్ చెప్పారు.

నవాల్నీ ఏం ఆరోపించారు?

ఈ ప్యాలెస్ 'చరిత్రలోనే అతిపెద్ద అవినీతి ముడుపు' అని నవాల్నీ వర్ణించారు. దీని విలువ సుమారు రూ. 9,900 కోట్ల రూపాయలు ఉంటుందని ఆరోపించారు.

గెలెన్డ్జిక్ రిసార్టు సమీపంలో ఆ ప్యాలెస్ ఉందని, దాని చుట్టూ ఉన్న 70 చదరపు కి.మీ.ల స్థలం రష్యా ఫెడరల్ సెక్యురిటీ సర్వీస్‌దేనని కూడా ఆరోపించారు.

రష్యాకు చెందిన బిలియనీర్ అర్కాడీ రోటెన్‌బర్గ్ ఆ ప్యాలెస్ తనదేనని గత నెల చివర్లో బయటపెట్టారు. రోటెన్‌బర్గ్‌కు పుతిన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.

రెండేళ్లలో ఈ భవనం నిర్మాణం పూర్తవుతుందని, దీన్ని అపార్ట్‌మెంట్ హోటల్‌గా మారుస్తామని రోటెన్‌బర్గ్ అన్నారు.

రష్యాలో పెద్ద పెద్ద వంతెనలు, గ్యాస్ పైప్‌లైన్ల వంటి ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకు రోటెన్‌బర్గ్ యజమాని. ఆయన పుతిన్‌కు చిన్ననాటి స్నేహితుడు కూడా.

2014లో రోటెన్‌బర్గ్‌పై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. రష్యా నాయకత్వ అంతర్గత వర్గాల్లో ఆయన సభ్యుడని, పుతిన్ సొంత ప్రాజెక్టులకు సహకరిస్తుంటారని కూడా అమెరికా అధికారులు ఆయన గురించి వర్ణించారు.

ఇక ఆ ప్యాలెస్ ఉన్న ప్రాంతం మీదుగా విమానాలు సైతం వెళ్లకుండా రష్యా ప్రభుత్వం నో ఫ్లై జోన్‌ను ప్రకటించింది.

బూజు ఎందుకు పట్టింది?

''కింది అంతస్థులో ఓ వ్యక్తి పనిచేస్తుండగా ప్లాస్టర్‌బోర్డ్ ఊడి దాదాపు ఆ వ్యక్తి మీద పడింది. దీంతో ప్లాస్టర్ బోర్డ్ తొలగించి చూస్తే, బూజు పట్టినట్లు తెలిసింది. అలా సమస్య బయటపడింది'' అని ఇగోర్ చెప్పారు.

సముద్రం పక్కనే ఉండటం, వెలుతురు లేకపోవడం వల్ల బూజు పట్టి ఉంటుందని బిల్డర్లు అభిప్రాయపడ్డారు.

గత ఏడాది ఆ ప్యాలెస్‌లో పని చేసినట్లు చెప్పిన ఓ వ్యక్తి కూడా బీబీసీతో మాట్లాడారు.

ఆ భవనంలో ప్రతి గదికి బాత్రూమ్ ఏర్పాటు చేస్తూ, హోటల్‌ను తలపించేలా మారుస్తున్నారని ఆ వ్యక్తి చెప్పారు.

గదులున్న తీరును కూడా మారుస్తున్నట్లు మరో బిల్డర్ చెప్పారు.

ప్యాలెస్‌లా ఉన్న భవనాన్ని ఇప్పుడు అపార్ట్‌మెంట్ హోటల్‌లా మారుస్తుండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చాలా మంది బిల్డర్లు అన్నారు.

''మేం రోటెన్‌బర్గ్ పేరు ఎప్పుడూ వినలేదు. మాకు అది ప్రభుత్వ నివాసం, పుతిన్ నివాసంగానే తెలుసు. అధికారిక పత్రాల్లో దాన్ని పెన్షన్ (రిసార్టు హోమ్‌)గా పేర్కొనేవారు. దాన్ని హోటల్ అనడం నవ్వు తెప్పిస్తోంది. మేం ఎక్కడ పనిచేస్తున్నామో మాకు తెలుసుగా'' అని స్టానిస్లవ్ అన్నారు.

2011 అక్టోబర్‌లో ఆ ప్యాలెస్‌లో పనిచేసిన ఓ బిల్డర్ కూడా బీబీసీతో మాట్లాడారు.

''భవనాన్ని చూసేందుకు 'డాడ్' వస్తారని, అక్టోబర్ ప్రథమార్థంలోగా పనులు పూర్తవ్వాలని అనేవారు. యజమానిని 'డాడ్' అని పిలిచేవారు'' అని సదరు బిల్డర్ చెప్పారు.

అప్పుడు పని విషయంలో తొందరపెట్టిన విషయం వాస్తవమేనని మరో కార్మికుడు కూడా అన్నారు.

అయితే, ఇంతకీ అనుకున్నట్లుగా ఆ 'డాడ్' అక్కడికి వచ్చారా, లేదా అన్న విషయం మాత్రం తమకు తెలియదని వారిద్దరూ చెప్పారు.

''మొదటి సారి అక్కడికి వెళ్లినప్పుడు ఈజిప్ట్ పిరమిడ్లు కడుతున్న స్థలంలో ఉన్నానా అని అనిపించింది. 1,500 మంది పనిచేసేవారు. రష్యన్లు, ఉజ్బెకిస్తాన్ పౌరులు, సైనికులు ఇలా చాలా మంది పనిచేసేవారు. పని త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉండేది. అనుకున్న సమయం కన్నా నెల ముందే నిర్మాణం పూర్తైంది'' అని ఓ బిల్డర్ చెప్పారు.

సముద్రం నుంచి చూసేవారికి నిర్మాణ పనులు కనిపించకుండా దాచిపెట్టారని... కాంక్రీటు, లోహ వస్తువులపై గడ్డి, చెట్లు, రాళ్ల బొమ్మలు వేసి కనిపించకుండా చేసేవారని మరో కార్మికుడు బీబీసీతో చెప్పారు.

గత 15 ఏళ్లుగా అక్కడ తరచూ పునర్నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయని చాలా మంది కార్మికులు చెప్పారు.

'' వాళ్లు కడుతున్నారు. కూల్చేస్తున్నారు. ప్యాలెస్‌లో కుడివైపు మార్బుల్‌తో పెద్ద జిమ్ కట్టారు. అది చాలా ఖరీదైన నిర్మాణం. కానీ, ఓ రోజు ఒక్కసారిగా కూల్చే యంత్రాన్ని తీసుకువచ్చి, దాన్ని నాశనం చేశారు. అది రెండు మూడేళ్లపాటే ఉంది'' అని ఓ బిల్డర్ చెప్పారు.

''ఈ నిర్మాణ స్థలానికి వచ్చినప్పుడు అంతా అద్భుతంగా ఉందనుకున్నా. కానీ, అక్కడ కనిపించే గందరగోళం, వృథా చూసి పిచ్చెక్కిపోయింది'' అని మరో కార్మికుడు చెప్పారు.

(ఫీచర్: పావెల్ అక్సెనోవ్, సెర్జీ కోజ్లోవీస్కీ, ప్యోట్ర్ కోజ్లోవ్, నైనా నజరోవా. ఎడిటర్: ఓల్గా షమీనా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)