You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంతవరకూ తాగునీటి కనెక్షన్లకు మీటర్లు పెట్టడం చూసి ఉంటారు.. ఇకపై తెలంగాణలో భూగర్భ జలాలు తోడుకునే బోర్లకు కూడా మీటర్లు రాబోతున్నాయి.
కొన్ని వర్గాలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బోర్లకు మీటర్లు బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. మూడు కేటగిరీల కింద వేసుకున్న బోర్లు మినహా మిగిలిన అన్ని బోర్లకు మీటర్లు బిగించాల్సి ఉంటుంది.
‘‘తెలంగాణకు ప్రత్యేకంగా వాల్టా చట్టం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా భూగర్భ నీటిపైనే ఆధారపడాలి. కాలువలు, వర్షాలపై ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే కొన్ని వర్గాలకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పండిట్ మధునూరె ఇటీవల మీడియాకు వివరించారు.
మినహాయింపు ఎవరికి..
మీటర్లు పెట్టడం నుంచి మూడు వర్గాలకు మినహాయింపు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
1.వ్యవసాయ అవసరాల కోసం రైతులు బోర్లు వేసుకుంటే మినహాయింపు లభిస్తుంది.
2.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం బోర్లు వేసుకుంటే మీటర్లు బిగించనక్కర్లేదు.
3.వ్యక్తిగత ఇళ్లు నిర్మించుకుని బోర్లు వేసుకుంటే మీటర్లు పెట్టనక్కర్లేదు.
ఈ మూడు వర్గాలు కాకుండా, మిగిలిన ఏ కేటగిరీ కింద బోరు వేసినా మీటర్ పెట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఎంత భూగర్భ నీటిని వాడుకుంటున్నారనేది లెక్క గట్టే వీలుంటుంది.
ఎంత నీటిని వాడుకోవచ్చు?
నీరు ఎంత వాడుకోవచ్చనే విషయంపై భూగర్భ జల శాఖ అధికారి చంద్రారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, నెలకు 20 కిలో లీటర్లు (అంటే 20 వేల లీటర్లు) దాటితే బిల్లు కట్టాల్సి ఉంటుంది. 20 కిలోలీటర్లు దాటితే ఒక్కో కిలో లీటరుకు రూపాయి చొప్పున ఛార్జీలు చెల్లించాలి. అలా దాటితే మొత్తం వాడుకున్న నీటికి చార్జీలు కట్టాల్సి ఉంటుంది.
ఒక వినియోగదారుడు నెలకు 100 కిలోలీటర్ల నీటిని వాడుకుంటే, అతను 100 కిలోలీటర్లకు.. అంటే రూ.100 కట్టాలి. అంతేగానీ 20 కిలోలీటర్ల వరకు ఉచితంగా ఉంది కదా అని మిగిలిన 80 కిలోలీటర్లకే డబ్బులు కడతా అంటే కుదరదు’’ అని చంద్రారెడ్డి బీబీసీతో అన్నారు.
ఎవరెవరు మీటర్లు పెట్టుకోవాలి..
అపార్టుమెంట్లు, పరిశ్రమలు, మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మీటర్లు కచ్చితంగా పెట్టుకోవాలి.
ఇప్పటికే హైదరాబాద్ శివారులోని నందిగామ, కొత్తూరు ప్రాంతాల్లో పరిశ్రమలలో బోర్లకు మీటర్లు పెడుతున్నారని చంద్రారెడ్డి బీబీసీకి చెప్పారు.
వాల్టా చట్టం ఏం చెబుతోంది?
గాలి, నీరు మట్టి, చెట్లు సహజ వనరులు. అవి ప్రకృతిలో భాగం. వీటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
సహజ వనరుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ (వాల్టా చట్టం) ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ చట్టాన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాతా అనుసరిస్తున్నారు.
దీని ప్రకారం, విచ్ఛలవిడిగా సహజ వనరులు వినియోగించుకునేందుకు వీల్లేదు.
బోర్లు వేయాలన్నా, బావులు తవ్వాలన్నా.. చెట్లు నరకాలన్నా.. ఇసుక తోడాలన్నా.. ఇలా చాలా అంశాలకు ప్రభుత్వం నుంచి నిర్దేశిత అనుమతులు తప్పనిసరి.
అతిక్రమిస్తే చేసిన నేరాన్ని బట్టి జైలు శిక్ష లేదా జరిమానా, రెండూ కలిపి విధించే అవకాశమూ చట్టంలో ఉంది.
కేంద్రం నిబంధనలు ఇలా..
2020 గణాంకాల ప్రకారం, దేశంలో ఏటా 245 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ నీటిని తోడేస్తున్నారు.
కేంద్ర భూగర్భ జల మండలి 2011 నవంబర్ నుంచి 2021నవంబర్ మధ్య, పదేళ్ల కాలంలో భూగర్భ నీటి మట్టాలను సేకరించి అంచనా వేసింది. దీని ప్రకారం, దేశంలో 70శాతం బావులలో నీటి మట్టాలు పెరిగినట్లు తేలింది. మరో 30 శాతం బావులలో నీటి మట్టాలు పడిపోయినట్లు గుర్తించారు.
పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన యూనిట్లు, మైనింగ్ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి.
ఈ విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలే అనుమతులు ఇస్తున్నాయి.
దేశంలో ఒకే తరహా నియంత్రణ ఉండేలా 2020 సెప్టెంబరు 24 న కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.
దీనిపై ప్రత్యేక బిల్లును తీసుకువచ్చి అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేసింది.
అయితే, ఇప్పటి వరకూ కేంద్రం తీసుకువచ్చిన మార్గదర్శకాలను 19 రాష్ట్రాలు ఆమోదించి అమలు చేస్తున్నాయి.
ఇందులోని అంశాలను పాక్షికంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
‘‘నీటి పరిరక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ నీటి పరిరక్షణ చాలా కీలకమైనది’’ అని జేఎన్టీయూ ప్రొఫెసర్ గిరిధర్ బీబీసీతో అన్నారు.
‘‘ప్రస్తుతం ప్రభుత్వం మీటర్ల విషయంలో గట్టిగా పట్టుదలతో లేదు. ఎన్నికలు వస్తున్నందున బోర్లకు మీటర్లంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నట్లుగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా నీటి వినియోగం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీటర్లు అంటే అపార్టుమెంట్ వాసుల నుంచి వ్యతిరేకత రావొచ్చు. అందుకే ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసే అవకాశం ఉంది.’’ అని భూగర్భ జల శాఖలోని ఓ అధికారి బీబీసీతో అన్నారు.
ఎన్వోసీ తప్పనిసరి..
అర్బన్ ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాహకులు సీవరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. శుద్ధి చేసిన నీటిని టాయిలెట్ ఫ్లషింగ్, కార్ వాషింగ్, గార్డెనింగ్ కోసం వాడుకోవాలి.
అపార్టుమెంట్లు కట్టే సమయంలోనే సంబంధిత భూగర్భ జల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాలి.
కమర్షియల్ అవసరాల కోసం గ్రౌండ్ వాటర్ లభ్యతను బట్టి ఎన్వోసీ ఇస్తారు.
ఎంఎస్ఎంఈలు మినహా మిగిలిన పరిశ్రమలకు భూగర్భ జలాలు అందుబాటులో లేని చోట అనుమతి ఇవ్వరు.
ఒకవేళ ఏదైనా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టు చేపడితే, నిర్మాణ అవసరాల కోసం రోజుకు 20 క్యూబిక్ మీటర్ల నీటిని తోడుకునేందుకు అవకాశం ఇస్తారు.
భూగర్భ నీటిని అమ్ముకునే ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాలి.
అపార్టుమెంట్లపై ఎక్కువగా ప్రభావం
భూగర్భ నీటి బోర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయంతో అపార్టుమెంట్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ వంటి నగరంలో వేల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. కాస్త పెద్దగా ఉన్న అపార్టుమెంట్లలో రోజుకు 20 వేల లీటర్ల నీటి వినియోగం జరుగుతుంటుందని అధికారులే చెబుతున్నారు.
హైదరాబాద్ జలమండలి విభాగం సరఫరా చేసే నీటిపై పూర్తిగా ఆధారపడకుండా భూగర్భ నీటిని తోడుకుంటున్నారు.
ఆ నీటిని ప్యూరిఫై చేయడం లేదా ఆర్వో పద్ధతిలో శుద్ధి చేసి ఫ్లాట్లకు సరఫరా చేస్తుంటారు. వాటినే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే నివాసితులు తాగునీటి అవసరాలకు వాడుకుంటున్నారు.
భూగర్భ నీటి బోర్లకు మీటర్లు పెడితే అపార్టుమెంట్లపై చార్జీల భారం పడే అవకాశం ఉందని యజమానులు చెబుతున్నారు.
ఈ విషయంపై మియాపూర్‌లోని లేక్ వ్యూ అపార్టుమెంట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.సురేష్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
‘‘మా అపార్టుమెంట్ లో 80 కుటుంబాలు ఉంటున్నాయి. నెలకు 20 కిలోలీటర్ల నీరు ఏ మాత్రం సరిపోదు. రమారమి 90 నుంచి 100 కిలోలీటర్ల నీరు పట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువే అవసరం ఉంటుంది. మోటార్లకు మీటర్ పెడితే చార్జీల భారం పడుతుంది. అలాగే నిర్వహణ చార్జీలు పెంచకతప్పదు’’ అని చెప్పారు.
తెలంగాణలో భూగర్భ జలాల పరిస్థితి
తెలంగాణలో వర్షాల మీద ఆధారపడి భూగర్భ జలాలలో పెరుగుదల, తగ్గుదలలు కనిపిస్తాయి. అయితే, గత కొన్నేళ్లుగా నీటి మట్టం పెరుగుతూ వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 1,718 బావులను పరిశీలించి భూగర్భ జల శాఖ నివేదిక రూపొందించింది.
రాష్ట్రంలో సగటున 20 అడుగుల లోతు (6.13 మీటర్ల)లో నీటి లభ్యత ఉన్నట్లు భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 11.67 మీటర్లు ఉండగా.. జగిత్యాలలో అతి తక్కువగా 2.84 మీటర్ల నీటి లభ్యత ఉంది.
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలకుగానూ 14 జిల్లాల్లో సరాసరి నీటి మట్టం 5 మీటర్ల కంటే తక్కువగా ఉంది.
17 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లలోపు ఉంది. రెండు జిల్లాల్లో మాత్రం 10 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.
‘‘గత పదేళ్లతో పోల్చితే భూగర్భ జలాలు పెరిగాయి. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో గ్రామాల్లో భూగర్భ జల మట్టం గతంలో పోల్చితే పెరిగింది. గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఆగస్టు నెలలో నీటి మట్టంలో తగ్గుదల కనిపిస్తోంది. ఈసారి ఆగస్టులో వర్షాలు తక్కువగా పడటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు’’ అని భూగర్భ జల శాఖాధికారి చంద్రారెడ్డి బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్లో కూర్చుని అమెరికన్లకు గాలం వేస్తున్నారు, పోలీసులకు చిక్కిన ముఠా
- విద్యా లక్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?
- Caste Census: ఇది జరిగితే దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థే మారిపోతుంది, అందుకే బీజేపీ వద్దంటోందా?
- తెలంగాణ: కేసీఆర్ అప్పుడు అసంభవం అని చెప్పిన పనులను ఇప్పుడు హడావిడిగా ప్రకటిస్తున్నారెందుకు?
- తెలంగాణ: పెరట్లో ఎద్దులు మేసాయని దళిత రైతును గుంజకు కట్టేశారు.. ‘‘ఆ పెరడు రెడ్లదని ఎద్దులకు తెలియదు కదా’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)