You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గవర్నర్ వ్యవస్థ ఈ దేశానికి అవసరమా అని కేటీఆర్ ఎందుకు అన్నారు?
తెలంగాణ గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను గవర్నర్ తమిళి సై తిరస్కరించడంపై మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తులనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తే, రాజకీయాల్లో ఉన్న వారిని సిఫారసు చేయొద్దని గవర్నర్ అన్నారు. ఈ నియమం ఆమెకు వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు.
గవర్నర్ అయ్యే ముందు రోజు వరకు కూడా తమిళి సై, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారని చెప్పారు.
సర్కారియా కమిషన్ ప్రకారం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారు గవర్నర్‌గా వ్యవహరించకూడదు. దీన్ని బట్టి తమిళిసై, గవర్నర్ పదవికి అర్హురాలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మోదీ ఏజెంట్లుగా గవర్నర్లు
‘‘గవర్నర్లు, మోదీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్న ఇద్దరు మంచి వ్యక్తులను కేబినెట్ నామినేట్ చేసింది. ఒకరు ప్రొఫెసర్, మరొకరు ట్రేడ్ యూనియన్‌లో సేవలు అందించారు. వారిని గవర్నర్ ఆమోదిస్తారని అనుకున్నాం. కానీ, ఆమె తిరస్కరించారు. బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను శాసనమండలికి తీసుకొస్తామంటే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎవరు అర్హులో ఎవరు అనర్హులో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. గవర్నర్‌కు ఒక న్యాయం, ఇతరులకో న్యాయమా? గవర్నర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.’’
‘‘గవర్నర్ పదవి వలసపాలన నాటిదే కదా’’
‘‘దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరమా? గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థను తీసేసి, ప్రధాని హోదాని వైస్రాయ్ చేస్తారా? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మారుస్తున్నామని మోదీ అన్నారు. రాజ్‌పథ్ పేరులో కలోనియల్(వలసవాదం) వాసన వస్తుందని చెప్పారు. గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ కాలం నాటిదే కదా. దీని గురించి కూడా ఆలోచించండి మరి. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఎన్నికైన ప్రభుత్వాలను అవమానపరుస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘గవర్నర్ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం’’- కవిత
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తమిళి పై నిర్ణయం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.
దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేక భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ అనేది బీసీ వ్యతిరేక పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ పార్టీ సిఫార్సు చేసిన ఎంబీసీ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ కమ్యూనిటీ) సెక్షన్లకు చెందిన ఇద్దరు వ్యక్తులను తిరస్కరించడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది?
నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ మంత్రి మండలి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లను సిఫార్సు చేసింది.
అయితే, నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని పేర్కొంటూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు.
ఆర్టికల్ 171 (5) ప్రకారం వారి అర్హతలు సరిపోవని అన్నారు.
రాష్ట్రంలో ఎంతోమంది అర్హులున్నారనీ, రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదని ఆమె చెప్పారు.
‘‘ఇలా చేయడం వల్ల సరైన వ్యక్తులకు అవకాశాలను నిరాకరించినట్లు అవుతుంది. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రి వర్గ సిఫార్సుల్లో అన్ని అంశాలను జత చేయలేదు’’ అని గవర్నర్ వెల్లడించారు.
అయితే, సోషల్ వర్క్, రాజకీయాలు రెండూ భిన్నమైన భూమిక, ప్రయోజనాలు కలిగి ఉన్న రంగాలని.. అయితే, రెండూ పరస్పరం భిన్నమైనవేమీ కావని దాసోజు శ్రవణ్ అన్నారు.
‘‘విధానాలలో మార్పులు తీసుకొచ్చేందుకు సోషల్ వర్కర్క్ లాబీయింగ్ చేయొచ్చని.. రాజకీయ నాయకులు చట్టసభల ద్వారా సామాజిక సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని చెప్పారు. సంక్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించే క్రమంలో, సమాజాభ్యున్నతి కోసం పనిచేసే క్రమంలో ఈ రెండు రంగాల దారులూ అనేక సందర్భాలలో కలుస్తుంటాయి’’ అన్నారు శ్రవణ్.
గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తుండగా, బీజేపీ శ్రేణులు మాత్రం సమర్థిస్తున్నాయి.
నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి, ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికి గవర్నర్ అవకాశం కల్పిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేవారిని తిరస్కరిస్తూ గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ సమర్థించారు.
‘‘గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటోంది. వాళ్లు పంపిన ఫైళ్లన్నీ చూడకుండా సంతకం పెట్టాలనుకుంటోంది. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తే ఆమెకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది సరి కాదు. వాళ్లకు నచ్చినట్లు లేకపోతే విమర్శలు చేయకూడదు’’ అని సంజయ్ అన్నారు.
ప్రజాస్వామ్యానికి అంపైర్ గవర్నర్
ప్రధాన మంత్రి సూచన మేరకు గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత గవర్నర్.
రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ విధి. కార్యనిర్వాహక, శాసనపరమైన, పర్యవేక్షణ అధికారాలు గవర్నర్ చేతులోనే ఉంటాయి.
రాష్ట్ర ఎన్నికల సమయంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకంగా మారుతుంది.
క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే గవర్నర్‌ను ప్రజాస్వామ్యానికి అంపైర్‌గా భావించవచ్చు.
కానీ, గవర్నర్లు రాజకీయ పక్షపాతిగా ఉంటున్నారని చాలా కాలంగా రాష్ట్రాల గవర్నర్లపై ఆరోపణలున్నాయి. వారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారని విమర్శలున్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, రాజ్యాంగ ప్రతిష్టంభనకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకి వెళ్లింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే, కేరళను లెఫ్ట్ పార్టీల కూటమి పాలిస్తోంది. ఈ రాష్ట్రాలకు, మహారాష్ట్రకు గవర్నర్లుగా బీజేపీకి చెందిన వారిని నియమించింది కేంద్రం.
పార్టీకి నమ్మకంగా పనిచేసినవారికే గవర్నర్ పదవి ఇస్తారా?
కేంద్ర ప్రభుత్వాలు సాంప్రదాయంగా తమ ప్రత్యర్థులు నియమించిన గవర్నర్లను తొలగించి, కొత్త వారిని నియమిస్తూ వస్తున్నాయి. ఇది కూడా గవర్నర్ కార్యాలయాన్ని పూర్తిగా రాజకీయం చేస్తోందన్న వాదన చాలాకాలం నుంచి ఉంది.
1950 నుంచి 2015 మధ్య కాలంలోనే కేవలం 25 శాతం మంది గవర్నర్లు మాత్రమే అయిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 37 శాతం మంది గవర్నర్లు తమ ఆఫీసులో ఏడాది కంటే తక్కువగానే ఉన్నారు.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరకుండానే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, గవర్నర్లను ప్రతిపాదిస్తూ వెళ్తుంది. ఈ కారణంతోనే కేంద్ర, రాష్ట్రాల సంబంధాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా, చాలా మంది గవర్నర్లు, సజావుగా సాగుతోన్న ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం చూశాం.
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి విపక్ష పార్టీలు కావడం గమనార్హం.
పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి 1980లో పదవీ విరమణ పొందిన బీకే నెహ్రూ తనకు తాను ఒకసారి ‘‘అధికార పార్టీలో అలసట పొందిన పదవీ విరమణ సభ్యుడు, ఆయనకు గవర్నర్‌షిప్ అనేది అద్భుతమైన రిటైర్‌మెంట్’’ అంటూ వర్ణించుకున్నారు.
పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారికి, వారి సేవలకు ప్రతిఫలంగా ఈ పదవి ఇచ్చేందుకు మొగ్గుచూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
1950 నుంచి 2015 వరకు 52 శాతం రాజకీయ నాయకులకు లేదా 26 శాతం పదవీ విరమణ పొందిన బ్యూరోక్రాట్స్‌కు భారత్‌లో గవర్నర్ పదవులు దక్కాయని తన స్టడీలో ప్రొఫెసర్ అశోక్ పంకజ్ పేర్కొన్నారు.
మిగతా వారు జడ్జీలు, న్యాయవాదులు, రక్షణ శాఖ అధికారులు, విద్యావేత్తలు ఉన్నారు. గవర్నర్లందరిలో ఐదింట ఒకవంతు మాజీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలని పేర్కొన్నారు.
‘‘ఏదైనా ఒకరోజు ఈ పోస్టు కనుమరుగైతే, ఏం జరగదు’’ అని ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా అన్నారు.
గవర్నర్ పదవిని రద్దు చేయాలా? లేక సంస్కరిస్తే సరిపోతుందా?
ఒకవేళ గవర్నర్ల పదవులను రద్దు చేయకపోతే, వారి అధికారాలను పరిమితం చేయడం మంచిదని చరిత్రకారుడు ముకుల్ కేశవన్ అన్నారు.
భారత్‌లో గవర్నర్ల పాత్రపై విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ థింక్ ట్యాంక్ సభ్యులు వివరణాత్మకంగా ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ‘హెడ్స్ హెల్డ్ హై: సాల్వేజింగ్ స్టేట్ గవర్నర్స్ ఫర్ 21 ఫస్ట్ సెంచరీ ఇండియా’ పేరుతో ఈ స్టడీని నిర్వహించారు.
రాజ్ భవన్‌ను తీసేయడం కంటే, ఈ ఆఫీసును సంస్కరించాలని ఈ అధ్యయనం సూచించింది.
గవర్నర్లను నియమించడం, తొలగించడంలో అధికార పార్టీకి విశేషాధికారాలు ఉండకూడదని ఈ అధ్యయనాన్ని చేపట్టిన రచయితలు చెప్పారు.
మరింత సమాఖ్య, సహకార విధానంలో వీరి నియామకం, తొలగింపు ప్రక్రియ జరగాలన్నారు. గవర్నర్లపై తాము తీసుకునే చర్యలకు సంబంధించిన కారణాలు, ఇతర విషయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
గవర్నర్ల బాధ్యతలను ఎగ్జిక్యూటివ్‌కి లేదా జడ్జీలకు అప్పగిస్తే, ఆ రెండింటిని రాజకీయం చేసే అవకాశం ఉందన్నారు ఈ బుక్ సహ రచయిత లలిత్ పాండా.
లలిత్ పాండా స్టేట్‌మెంట్‌తో ఏకీభవించిన ప్రముఖ న్యాయవాది కేవీ విశ్వనాథన్, గవర్నర్ ఆఫీసుతో ఎలాంటి సమస్య లేదు, కానీ, ఈ కార్యాలయానికి ఎంపికయ్యే కొందరు అధికారుల చేతనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు.
ఈ కార్యాలయాన్ని రద్దు చేయొద్దని, గవర్నర్ల చర్యలకు గల కారణాలను తెలుసుకుని, రికార్డు చేయాలని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. వారి నియామకం మరింత పారదర్శకంగా జరగాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ : 'ఒక స్త్రీ ఎదుగుతుంటే ఏ పురుషుడూ సహించడు'
- తెలంగాణ: '10 నెలలుగా మాకు జీతాల్లేవ్, నాన్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు’ అంటున్న ఉత్తమ ఉద్యోగి..
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..
- రైలు ప్రమాదాలు: బాధితులకు పరిహారాన్ని 10 రెట్లు పెంచిన రైల్వే బోర్డు.. నిబంధనలు ఇవీ
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)