కేసీఆర్ చెప్పినట్లు మూసీ నదిలో బోటు షికారుకి వెళ్లొచ్చా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏం తేలిందంటే

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘గోదావరి నీళ్లతో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను నింపుతాం. గోదావరి నదిని మూసీతో అనుసంధానించే ప్రాజెక్టు వెంటనే చేపడుతున్నాం’’

''మూసీ నదిలో పిల్లలు బోటింగ్ చేసి షికారు వెళ్లేంత గొప్పనదిగా తీర్చిదిద్దాలి.''

''ఫ్రాన్స్‌లోని నది కూడా ముందుగా చెడగొట్టుకున్నరు. తర్వాత బాగు చేసుకున్నరు. లండన్ లోని థేమ్స్ నది కూడా మూసీ కన్నా ఘోరంగా మురికిగా ఉండేది. వాళ్లు మేల్కొని ఈ రోజు థేమ్స్ నదిని పరిశుభ్రమైన నదిగా మార్చుకున్నారు.

అందుకని మూసీ రివర్ ఫ్రంట్ తెచ్చాం.’’

2020 నవంబరు 23న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలివి.

ప్రస్తుతం మూసీ పరిసరాలు ఎలా ఉన్నాయి? మూసీ ప్రక్షాళణకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? పిల్లలు బోటింగ్ చేసే స్థాయికి వచ్చిందా?

వాస్తవాలేంటి?

వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

104 దేశాల్లోని 258 నదులపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం చూస్తే.. కాలుష్య సూచీలో మూసీ నది 22వ స్థానంలో ఉంది.

మూసీ నది కాలుష్యంతో నిండిపోయినట్టు నిరుడు ఫిబ్రవరిలో పీఎన్ఏఎస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది. ఫార్మాస్యూటికల్ వ్యర్థాలు మూసీ నీటిలో ఉన్నట్లు తేలింది.

ప్రధానంగా హైదరాబాద్‌లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నదీజలాలు కలుషితమవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే 94 శాతం మురుగు నేరుగా మూసీలో కలుస్తోంది.

మూసీ నది ఎలా కనిపించిందంటే..

బాపూఘాట్, అత్తాపూర్, హైకోర్టు ఎదురుగా, పురానాపూల్, చాదర్ ఘాట్, నాగోలు ప్రాంతాల్లో మూసీ నది పరివాహక ప్రాంతాలను బీబీసీ పరిశీలించింది.

నది గట్టు, లేదా ఒడ్డున వాకింగ్ ట్రాక్, రోడ్డు వేస్తుంటారు. కానీ, పలు ప్రాంతాల్లో మూసీ నది లోపల వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరిగింది.

హైకోర్టు నుంచి నాగోలు వరకు నదికి రెండువైపులా వాకింగ్ ట్రాకు కట్టాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది.

నాగోలు వద్ద రెండువైపులా 1.8 కిలోమీటర్ల మేర ట్రాకు నిర్మాణం పూర్తి చేశారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సందర్భంగా ట్రాకు చాలావరకు కొట్టుకుపోగా, మళ్లీ మరమ్మతులు చేసినట్లు సిబ్బంది చెప్పారు.

హైకోర్టు వద్ద ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాకు మధ్యలో కొన్ని చోట్ల పిచ్చిమొక్కలు కనిపించాయి. చాలాచోట్ల వీధి దీపాలు ఊడిపోయి వేలాడుతున్నాయి.

చాదర్ ఘాట్ వద్ద ట్రాకు నిర్మాణం జరిగింది. దానిపై వేసిన రాళ్లు గతంలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. ఇప్పుడు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

2020 తర్వాత వరుసగా వస్తున్న వరదలతో వాకింగ్ ట్రాక్ మునిగిపోతోంది. నదీగర్భంలోనే వాకింగ్ ట్రాక్ నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

‘‘ప్రతి సంవత్సరం వానాకాలం రాగానే మూసి నది చుట్టూ ఉన్న బస్తీలలో భయమవుతోంది. మూడేళ్ల నుంచి వరుసగా వరదలు వచ్చి చుట్టుపక్కల బస్తీలు మునిగిపోతున్నాయి. ఓపెన్ ట్రాక్ జిమ్ అని పెట్టారు. దాని వల్ల ఎవరికి ఏం లాభం లేదు. అధికారులు, మంత్రులకే లాభం కలిగినట్లుగా అనిపిస్తోంది.

మూసీలో పూడికతీసి రిటైనింగ్ వాల్ కడితేనే ప్రజలకు ఇబ్బంది తప్పుతుంది. ప్రజలకు రక్షణ ఉంటుంది’’ అని ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్‌కు చెందిన సయ్యద్ బిలాల్ ‘బీబీసీ’తో అన్నారు.

అలాగే, లంగర్ హౌస్ బాపూ ఘాట్ నుంచి అత్తాపూర్ వంతెన వరకు ఒకవైపు నదిలోనే ట్రాకు తరహాలో మార్గం ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలతో నిర్మించినట్లుగా ఉంది.

ఈ తరహా ట్రాకుల నిర్మాణంతో నది సహజ ప్రవాహానికి భవిష్యత్తులో ఆటంకం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెబుతున్నారు.

‘‘ఏ నది కారణంగానైతే నగరాలు వెలిశాయో.. ఇప్పుడు ఆ నగరాల కారణంగా నదులే చచ్చుబడిపోయే స్థాయికి దిగజారాయి.

మూసీ నది ప్రక్షాళన అంటే నది ఉద్భవించిన ప్రదేశం నుంచి ముగింపు వరకు జరగాలి.’’ అని పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆయన మూసీనది పరిస్థితిపై బీబీసీతో మాట్లాడారు.

''మూసీ ప్రక్షాళనను కూడా నగరంలో ఒక భాగంగా చూడాలి. కేవలం బిల్డింగులు, రోడ్లు, పైవంతెనలు మాత్రమే అభివృద్ధి అంటే ప్రమాదం.'' అని ఆయన అన్నారు.

‘‘పుట్టుక.. ప్రవాహం.. ముగింపు.. ఇలా అన్ని ఒకే రాష్ర్టంలో ఉండటం మూసీ ప్రత్యేకత. ఈ నదిని కాపాడే విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్రానిదే. గోదావరి, కృష్ణా నదుల విషయంలో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు చేయాలి. మూసీ విషయంలో అలాంటివేం అక్కర్లేదు.’’ అని సుబ్బారావు బీబీసీతో చెప్పారు.

2017లోనే అభివృద్ధి సంస్థ ఏర్పాటు

వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి.. హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పారుతూ వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణం సాగుతుంది.

హిమాయత్ సాగర్, గండిపేట నుంచి మొదలుకుని తూర్పు వైపున ఉన్న ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర నగరంలో మూసీ ప్రవాహం సాగుతోంది.

మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం 2017 మార్చి 25న మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత, రెండేళ్ల పాటు 2017-18, 2018-19‌ బడ్జెట్‌లలో మూసీ ప్రక్షాళనకు 754 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవంగా అలా జరగలేదని సీపీఎం నాయకులు చెబుతున్నారు.

రెండేళ్ల కిందట సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేవలం 3 కోట్ల 12 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసినట్లు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వారు తెలిపారు.

‘‘నిధుల కొరత సమస్యతో పనులను ముందుకు తీసుకెళ్లలేకపోయిన మాట వాస్తవమే. వచ్చే మూడు, నాలుగేళ్లలో ప్రభుత్వం నిధులు కేటాయించి మూసీ రూపురేఖలు మార్చనుంది. ’’ అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

‘‘నాలుగు దశల్లో మూసీ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. మొదటి దశలో మురుగునీటి శుద్ధి చేయడం. రెండో దశలో నదికి రెండువైపులా మొక్కలు పెంచి సుందరీకరణ చేయడం. మూడో దశలో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నదికి ఇరువైపులా రహదారి నిర్మాణం. నాలుగో దశలో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను గోదావరి జలాలతో నింపి మూసీకి అనుసంధానం చేయడం.''

''ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం కట్టి బోటింగ్, పడవ పందేలు నిర్వహించాలనే ప్రణాళిక ఉంది.’’ అని ఆయన చెప్పారు.

నిధులు లేవా?

మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం మొత్తం రూ.16,635 కోట్లు అవసరమవుతాయని ఎంఆర్డీసీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు అంచనా వేశాయి.

రోడ్లు వేయడానికి రూ.9వేల కోట్లు కావాలి. 31 ప్రాంతాల్లో మురుగు శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) ఏర్పాటుకు రూ.3,866 కోట్లు, సుందరీకరణ కోసం రూ.2 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.

రూ.545 కోట్లతో మూసీపై 14 వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు.

ఇందుకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది.

అయితే.. ఈ పనులన్నీ జరగాలంటే మొదటి దశలో మురుగునీటి శుద్ధి జరగాల్సి ఉంది.

హైదరాబాద్ సీవరేజీ బోర్డు పరిధిలో రోజూ 1950 మిలియన్ గ్యాలన్ పర్ డే(ఎంజీడీ) మురుగునీరు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇందులో 1650 ఎంజీడీల నీరు జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తోంది. ప్రస్తుతం 772 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి 25 ఎస్టీపీలున్నాయి.

మరో 1259 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు.

‘‘ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలలో 11 చోట్ల పనులు పూర్తి కావొచ్చాయి. వచ్చే నెలలో వాటిని ప్రారంభించే అవకాశం ఉంది.’’ అని సుధీర్ రెడ్డి చెప్పారు.

ఆక్రమణల సంగతేంటి?

మూసీ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 8౦ బస్తీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి పరిధిలో ఆక్రమణల తొలగింపు ప్రభుత్వానికి ఓ సవాల్.

‘‘డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రభుత్వమే ఇళ్లు ఇవ్వనప్పుడు మేం ఏం చేయగలం. మేం 6౦ ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. పట్టాలు కూడా ఉన్నాయి. ఇళ్లు కట్టించి ఇస్తే అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుంది.’’ అని చాదర్ ఘాట్లో ఉండే అన్వర్ బీబీసీకి చెప్పారు.

‘‘దాదాపు 9 వేల ఆక్రమణలు గుర్తించాం. గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. పేదవాళ్లకు అన్యాయం జరగకుండా భవిష్యత్తులో వారికి పునరావాసం కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.’’ అని సుధీర్ రెడ్డి అన్నారు.

‘‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేస్తున్న పనులు, ప్రణాళికలు, నివేదికలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. సమాచారం దాపరికంతో పారదర్శకత లేకుండా పోతోంది.

ప్రభుత్వం చేస్తున్నది ప్రైవేటు వ్యక్తుల కబ్జాకు భిన్నంగా లేదు. ప్రభుత్వం కూడా అటు.. ఇటు రోడ్డు వేస్తోంది.

ఎక్కడ ప్రభుత్వ నిర్మాణం చేపడితే.. దాన్ని ముసురుకుంటూ ప్రైవేటు కబ్జాలు పెరుగుతున్నాయి.’' అని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి: