You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ వరదలు: ‘ఈ పొలాన్ని బాగు చేసుకోవాలంటే, ఈ పొలాన్ని అమ్మినా సరిపోదు’
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతమున్న ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో తూములవాగును ఆనుకుని ఉంటుంది కాల్వపల్లి గ్రామం.
ఎక్కువ మంది గ్రామస్థులకు వ్యవసాయమే ఆధారం. తాజా వరదల్లో తమకు జరిగిన నష్టాన్ని బీబీసీకి చూపించారు స్థానిక రైతులు.
ఇప్పుడక్కడ పొలాలు లేవు. కేవలం వాగు మాత్రమే ఉంది. వాగు ఒడ్డున ఇసుక తిన్నెలు ఉన్నాయి.
పొలం ఎక్కడని అడిగితే ఇవే పొలాలు అంటున్నారు రైతులు.
నిజమే. తూములవాగు ఆ పొలాలను కేవలం ముంచెత్తి వదల్లేదు. మొత్తానికి రూపు రేఖలు మార్చేసింది.
తెలంగాణ వరదల్లో చాలా మంది రైతులు పంటను కోల్పోతే, ఇంకొంత మంది రైతులు ఏకంగా పొలాన్నే కోల్పోయారు.
వరద తీవ్రతకు పెద్ద ఎత్తున ఇసుక, మట్టి, రాళ్లు, డాంబర్ (తారు) రోడ్డు పెళ్లలు వచ్చి పొలాల్లో పడ్డాయి.
పొలాల నుంచి రాళ్లు తొలగించడమంటే బంజరు భూమిని కొత్తగా సాగులోకి తెచ్చినంత శ్రమ, ఖర్చు, సమయం కావాలి.
రైతులు ఆ భారం తట్టుకోలేరు.
కాల్వపల్లి లాంటి చోట్ల 5-6 అడుగుల మేర పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలు తొలగించాలంటే ఆ భూమి ఖరీదు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి.
కాల్వపల్లి రైతుల పొలాలు సాగుకు పనికిరాకుండా పోయాయి. సాధారణంగా వరదల తరువాత పొలాల్లో పంట మాత్రమే పోతుంది. వరద తగ్గాక మళ్లీ విత్తనాలు వేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా కాస్త మట్టి పేరుకున్నా రైతులు తొలగించుకోగలరు.
కొన్ని సందర్భాల్లో వచ్చిన మట్టి మంచిది అయి, చేను పల్లం అయితే అది మంచి సారవంతమైన భూమిగా కూడా మారుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం.
ఎక్కువ ఇసుక శాతం ఉన్న మట్టి ఇక్కడ కలిసింది. దీంతో ఆరు అడుగుల ఎత్తున మేటను తొలగించడానికి ఎకరాకు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది.
‘‘వందల లారీలు, వేల ట్రాక్టర్ల ఇసుక పేరుకుంది. నేను చెప్పిన వందల లారీలు లేదా వేల ట్రాక్టర్లు అన్నది కేవలం ఒక ఎకరా భూమిలో ఇసుక తొలగించడానికే. ఆ భూమి అమ్మినా అంత రాదు. ఖర్చు లక్షల్లో కాదు. పదుల లక్షల్లో ఉంటుంది’’ అని బీబీసీతో చెప్పారు భూమి నష్టపోయిన రైతు శంకర రావు.
అటు ఆ ఇసుక అమ్మడానికి కూడా పనికిరాదు అని ఆయన చెప్పారు. మట్టి శాతం ఉండడం, మారుమూల ఉండడంతో రవాణా ఖర్చు పెరిగి ఇసుక అమ్మడానికి పనికిరాదని ఆయన వివరించారు.
ఇక కాల్వపల్లి కాకుండా, పెద్దపల్లి ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోని వందల ఎకరాల్లో పొలాల్లో రాళ్లు, తారు పెళ్లలు బాగా పేరుకుపోయాయి. వాటిని తీయడానికి కూడా భారీగా ఖర్చు కానుంది.
‘‘ప్రభుత్వం మా పొలాల్లోని ఇసుక తవ్వుకుపోతే చాలు’’ అని బీబీసీతో అన్నారు రైతు రఘు.
భారీగా దెబ్బతిన్న పంటలు
మొన్నటి వరకూ వానలు ఆలస్యమని బాధపడ్డ తెలంగాణ రైతులకు, అవే వానలు ఒకేసారి కురిసి, కన్నీళ్లు మిగిల్చాయి.
రైతులే కాదు చిరు వ్యాపారులు, మారుమూల గ్రామాల ప్రజలు, వాగులు, నదులు తీర ప్రాంత వాసులు తామెన్నడూ చూడని భయంకరమైన వరదలు చూశారు.
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, ములుగు జిల్లా కొండాయి వంటి గ్రామాల ప్రజలు సర్వస్యం కోల్పోయి, రోడ్డున పడ్డారు.
ఆ గ్రామాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతమంతా ఇదే పరిస్థితి.
చెరువులకు గండ్లు పడ్డాయి, అప్పుడే నాటిన విత్తనాలు, నార్లు కొట్టుకుపోయాయి.
పశు సంపద నష్టం అంచనాకు కూడా అందలేదు.
తెలంగాణలో పంట నష్టంపై సమగ్ర సర్వే ఇంకా కొనసాగుతోంది.
పత్తి, వరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఏమీ స్పష్టంగా చెప్పలేమనీ, కానీ ప్రాథమిక అంచనాల ప్రకారం 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉండవచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
‘‘దెబ్బతిన్న వాటిలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్, కందులు, కూరగాయలు, బొప్పాయి తోటలు ఉన్నాయి’’ అని ఆయన తెలిపారు.
2 వేల ఇళ్లు కూలిపోయినట్లు అంచనా
భూపాలపల్లి, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, యాదాద్రి, నిర్మల్, హనుమకొండ, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
400కు పైగా చెరువుల కట్టలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 వేలకు పైగా ఇళ్లు కూలిపోయినట్టు విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది.
చిన్నా, పెద్దా కలిపి 50 వంతెనల వరకూ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
విద్యుత్ శాఖకు చెందిన వేల కరెంటు స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టంపై తుది నివేదిక రావాల్సి ఉంది.
ఇప్పటివరకు 41 మంది వరదల వల్ల చనిపోయారని తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
వరద సాయం కింద ఇప్పటి వరకూ రూ.500 కోట్లు విడుదల చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
వరద సహాయ చర్యల గురించి హైకోర్టులో డాక్టర్ చెరకు సుధాకర్ పిటిషన్ వేయగా, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తున్నారు.
విమర్శలు, ప్రతి విమర్శలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ప్రగతి భవన్ నుంచే క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆరా తీస్తూ, మంత్రులు, ప్రజా ప్రతినిధులను అప్రమత్తంగా ఉంచుతూ, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసినట్టు ఆయన కార్యాలయం తెలిపింది.
మంగళవారం మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్, అక్కడే బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
మంగళవారం నుంచి కేంద్ర బృందం వరద నష్టం అంచనా వేయడం ప్రారంభించింది.
ఆ బృందం నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇచ్చిన తరువాత దాని ఆధారంగా కేంద్రం సహాయం ప్రకటించే అవకాశం ఉంది.
వరదల నియంత్రణ, సహాయ చర్యలపై కాంగ్రెస్ నాయకులు గవర్నర్ వద్ద ఫిర్యాదు చేశారు. బాధితులకు పరిహారం అందేలా చూడాలంటూ వినతిపత్రం ఇచ్చారు.
‘‘ప్రకృతి విపత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వాతావరణ శాఖ చెప్పినా ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తంగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్ల ముంపు పెరిగింది. సీఎం వరద బాధితులను ఆదుకోవడం మానేసి మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపి, అక్కడి వారిని పిలిపించుకుని గులాబీ కండువాలు కప్పుతున్నారు. మహారాష్ట్రకు విమానాలు పంపారు కానీ, వరద సాయానికి హెలికాప్టర్లు పంపలేకపోయారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
మరోవైపు పాత వరంగల్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.
‘‘భూపాలపల్లి బీజేపీ నాయకులు ఇచ్చిన సమాచారంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి నేను హెలికాప్టర్లు తెప్పించాను’’ అని ఆయన చెప్పారు. వరదలు వచ్చినప్పుడు తక్షణ సాయం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు.
కేంద్రం ఏనాడూ పైసా ఇవ్వలేదు: జగ్‌దీశ్ రెడ్డి
కాంగ్రెస్ గవర్నర్‌ను కలసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది.
‘‘గత నాలుగేళ్ల నుంచి వరద నష్టం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. కేంద్రం ఏనాడూ పైసా ఇవ్వలేదు. కేంద్రాన్ని నిలదీయకుండా కేసీఆర్‌పై విరుచుకుపడటం వెనుక కారణం- కాంగ్రెస్, బీజేపీకి ‘బీ టీమ్’ కావడమే. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నష్ట నివారణ చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)