You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధోలావీరా: 3,000 ఏళ్ల కిందట ఈ నగరం, ఇక్కడి సముద్రం ఎలా మాయమయ్యాయి?
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, గుజరాత్‌లోని కఛ్ నుంచి
హరప్పా నాగరికత సుమారు 5 వేల ఏళ్ల సంవత్సరాల కాలం నాటిది. సింధూ లోయ ప్రాంతంలో ఈ నాగరికత ఒకప్పుడు విలసిల్లింది.
ఆ సంస్కృతి ఆనవాళ్లు ఇంకా ప్రస్తుతం పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ నుంచి అఫ్గనిస్తాన్ , భారత్‌లోని ఉత్తరప్రదేశ్, గుజరాత్ వరకు కనిపిస్తూ ఉంటాయి.
హరప్పా లేదా సింధూ నాగరికతనే ప్రాచీన కాలంలో అత్యంత ఆధునిక నాగరికత. ఈ సంస్కృతిని ప్రతిబింబించే రెండు అతిపెద్ద నగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ రెండు నగరాలే హరప్పా, మొహంజోదారో.
ఈ రెండు ప్రాచీన నగరాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. సామాన్య భారత పర్యాటకులు ఈ ప్రాంతాలకు వెళ్లి వాటిని సందర్శించడం కష్టమే.
అయితే, భారతీయులు ఈ నగరాలను చూడలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ నాగరికత కాలంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన ధోలావీరాను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రాంతం గుజరాత్‌లోని కచ్ ఎడారిలో ఉంది. ఈ ఎడారికి ఒక మూలన దాగి ఉన్న ఈ నగరం వెనుక ఎన్నో అంతుచిక్కని విశేషాలున్నాయి.
కచ్ ఎడారిని రాన్ ఆఫ్ కచ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఎడారి ఇదే.
ఇక్కడ ఒకప్పుడు సముద్రం ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తల అంచనావేస్తున్నారు.
ఒకప్పటి ఈ సముద్రం ఒక్కసారిగా కనుమరుగై, దీని పక్కనే పరిఢవిల్లిన ఒక గొప్ప సంస్కృతిని కూడా తన గర్భంలో కలిపేసుకుంది.
ఈ సముద్రపు ఆనవాళ్లు ప్రస్తుతం రాన్ ఆఫ్ కచ్‌లో ఉప్పు రూపంలో మిగిలిపోయాయి.
అయితే, ఈ ప్రాంతంలోని ప్రజలకు ఏమైంది? ఈ నగరాన్ని వదిలి వారందరూ అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లారు? ఈ ప్రజలు ఎక్కడి వారు?
ఇంత అద్భుతమైన, అధునాతన నగరాన్ని నిర్మించేంత జ్ఞానం, శాస్త్రీయత, కళలు అప్పట్లోనే వారికెక్కడ నుంచి వచ్చాయి? అనే అంశాలపై సమాధానాలను కనుగొనేందుకు ఇప్పటికీ రీసెర్చర్లు అధ్యయనం చేస్తున్నారు.
సముద్రానికి, ఎడారికి మధ్యలో ఈ నగరం
కచ్‌లోని ప్రధాన నగరమైన గాంధీధామ్ నుంచి 200 కి.మీ దూరంలో ఖాదిర్బెట్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ద్వీపంలో ఉన్న చిన్న గ్రామమే ధోలావీరా.
ఐదు నుంచి ఐదున్నర వేల సంవత్సరాల క్రితం సింధూ నాగరికతకు ప్రధాన నౌకా కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేది.
ఆ సమయంలో ఈ సంస్కృతి అత్యంత అధునాతనమైనది. పుణెలోని డెక్కన్ కాలేజీకి చెందిన మాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వసంత్ షిండే ధోలావీరా నగరంపై ప్రత్యేక అధ్యయనం చేశారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఆ సమయంలో హరప్పా నాగరికతకు ధోలావీరా అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. సింధు నుంచి సౌరాష్ట్రకి వెళ్లే వాణిజ్యదారుల రక్షణకు, వసతి కోసం ప్రధానంగా ఈ పోర్ట్‌ను ఏర్పాటు చేసుంటారు.
ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఒక వైపు సముద్రం, మరోవైపు ఎడారి ఉండేవి. సముద్రానికి, ఎడారికి మధ్యలో ఈ నగరం ఉండేది.
ప్రత్యేకమైన నీటి సరఫరా వ్యవస్థ
ఎడారి ప్రాంతంలో ఉండటం వల్ల ఈ నగర ప్రజలు కచ్చితంగా నీటి సమస్యను ఎదుర్కొని ఉండొచ్చు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఇప్పటికీ నీటి కొరత అక్కడ అతిపెద్ద సమస్యగా ఉంది.
రూపార్ ( ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ఈ నగరాన్ని రూప్ నగర్ అని పిలుస్తున్నారు) తాలూకాకి 105 కి.మీల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో మీరు కేవలం మూడు నాలుగు గ్రామాలు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా చాలా చిన్నవి. మిగిలిన ప్రాంతమంతా ఎడారినే కనిపిస్తుంది.
ఇక్కడ తాము సెక్యూరిటీ గార్డుగా పనిచేసే నాగ్జి పర్మార్‌ను కలిశాం. ఆయన ఏం చెప్పారంటే.. ‘‘నేను, నా తల్లిదండ్రులం ఇక్కడ నివసిస్తున్నాం. నీటి కోసం మేం నిత్యం వేచిచూస్తుంటాం. నీరు లేకపోవడం వల్లనే మా పిల్లలు బడికి పోవడం లేదు, మా ఇంట్లో ఆడవాళ్లు ఎలాంటి పనులు చేయడం లేదు. మా జీవితాలు ఏమీ బాగా లేవు’’ అన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ సమయంలో సాధ్యం కానిది, ఐదు నుంచి ఐదున్నర వేల సంవత్సరాల క్రితం ఎలా సాధ్యమైంది? అంటే, ఒకటి ఆ కాలంలోని నిర్మాతల సంకల్పం, రెండోది ఆధునీక సాంకేతిక, ముందుచూపు.
ఇవే అప్పటి కాలంలో అత్యంత కీలకమైన అంశాలుగా నిలిచాయి.
‘‘ఈ పురాతన చారిత్రక ప్రదేశం ధోలావీరా రెండు నదుల మధ్యలో ఉంది. ఈ నగర నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే, తొలుత మీరు ఈ ఎడారికి చెందిన రుతుపవనాల కాలాన్ని అర్థం చేసుకోవాలి’’ అని బీబీసీ మరాఠితో మాట్లాడిన షిండే అన్నారు.
ఈ ఎడారిలో వర్షాలు ఎప్పుడూ కురవవు. ఎప్పుడైనా వర్షం పడిందో, అది కుంభవృష్టే. ఇక్కడ పయనించే మన్‌సార్, మన్‌హార్ అనే రెండు నదుల మధ్యలో ధోలావీరా నగరాన్ని సింధూ నాగరికత వ్యవస్థాపకులు నిర్మించారు.
ఈ ప్రాంతంలో మంచి నీటి సరఫరా, ఇరిగేషన్ సౌకర్యాలపై ప్రస్తుతం రీసెర్చర్లు అధ్యయనం చేస్తున్నారు.
ఈ నగరమంతా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, బావులు, నీటి కుంటలు, కాలువలు కనిపిస్తాయి.
నగరానికి అన్ని వైపుల నుంచి నీరు ప్రవహించే వ్యవస్థ అక్కడ ఉండేది. అలాగే వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్‌కి కూడా మెరుగైన వ్యవస్థ ఉంది.
ఈ నగరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచేందుకు, నగరానికి నలుదిక్కుల నుంచి నీటి సరఫరాను ఏర్పాటు చేశారు.
భూఉపరితలంలో నీటి ఉత్పత్తి కోసం ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది.
‘‘ఈ ఎడారిలో కుంభవృష్టి కురిసినప్పుడు, ఈ రెండు నదులు భారీ వరదలతో ఉప్పొంగేవి. ఈ నీటి కోసం పలు డ్యామ్‌లను నిర్మించి నగరంలోకి ఆ నీటిని సరఫరా చేసేవారు. నగరంలోని వాటర్ ట్యాంకుల్లోకి నీరు వచ్చేలా ప్రత్యేక వ్యవస్థ కూడా ఉండేది. కింద నుంచి ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి నిండే వ్యవస్థ ఉంది’’ అని షిండే చెప్పారు.
ఈ పురాతన చారిత్రక ప్రదేశం ధోలావీరాలో వర్షపు నీటిని దారి మళ్లించి, అండర్‌గ్రౌండ్‌లో నీటిని నిల్వ ఉంచేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్లు, డ్యామ్‌లలో నీరు అయిపోయిన తర్వాత, భూగర్భంలో ఉన్న నీటిని బావుల ద్వారా తోడుకునేవారు.
నగర నిర్మాణం
ఈ పురాతన ప్రాచీన నగరమైన ధోలావీరాలో మూడు భాగాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్.
ఈ మూడు పట్టణాలు కూడా నలు దిక్కుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు. ఈ నిర్మాణాలన్ని రాళ్లతోనే ఏర్పాటయ్యాయి.
ఈ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పటికీ కూడా ధోలావీరాలో రాళ్లు ఎక్కువ.
ఈ పోర్ట్‌కి అన్ని వైపుల నుంచి ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ నగరంలోకి వచ్చే వారి, వెళ్లే వారి ప్రతి వివరాలను ప్రవేశ ద్వారాల వద్ద సెక్యూరిటీ గార్డులు తీసుకునే వారు.
ధోలావీరా వాణిజ్య కేంద్రంగా ఉండటం వల్ల అద్భుతమైన నిర్మాణానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
ఆ సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఉండే మార్గాలు చాలా వెడల్పుగా ఉండేవి.
తూర్పు నుంచి పడమరకి, దక్షిణం నుంచి ఉత్తరానికి ఇలా అన్ని దిక్కులను కలుపుతూ పక్కా ప్రణాళికతో ఈ రోడ్లను నిర్మించారు ధోలావీరా నిర్మాణ సృష్టికర్తలు.
రహదారులకు ఇరువైపులా భవనాలు, ఇతర భవంతులు ఉండేవి.
రీసెర్చర్లు ఈ నగరం మూడు భాగాలుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పై భాగం, మధ్య భాగం, కింది భాగం. అలాగే ఈ మూడు భాగాల్లోని ప్రజలు కూడా వివిధ వర్గాలకు చెందిన వారని భావిస్తున్నారు.
‘‘ధోలావీరా నగరంలోని పైభాగంలో ఇళ్లు పెద్దవిగా, అత్యుద్భుతంగా నిర్మించి ఉండేవి. సామాజికంగా పేరున్న, ప్రముఖ వ్యక్తులు అక్కడ నివస్తుండేవారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా అక్కడే ఉండేవారు. మధ్య భాగంలో వారి కార్యాలయాలు ఉండేవి. వర్తకులు, కళాకారులు, ఇతరులు కూడా మధ్య భాగంలోనే నివసించేవారు. మధ్యతరగతి ప్రజలు, వర్కింగ్ క్లాస్ ప్రజలు నగరానికి కింద భాగంలో ఉండేవారు’’ అని షిండే చెప్పారు.
నగర కింద భాగంలో హ్యాండ్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో రంగు రాళ్లను తయారు చేసేవారు.
ధోలావీరా వాణిజ్య మార్గం కావడంతో, ఇక్కడ మార్కెట్ కూడా చాలా బలంగా ఉండేది.
సునామీ నుంచి రక్షణ
ధోలావీరా మరో ప్రత్యేకత ఏంటంటే.. కోటకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శైలి గోడలను ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడ చూడం.
‘‘ఈ ప్రాంతంలోని కరకట్టలు సుమారు 18 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. కింద వైపు 25 వెడల్పు ఉంటుంది. అయినప్పటికీ వీరికి ఇంత బలమైన గోడలు అవసరమా? అంత ప్రమాదకర స్థితిలో వారు ఉండేవారా?’’ అని మీకు అనిపిస్తుందని షిండే చెప్పారు.
ఈ సమయంలో ప్రపంచంలో అధునాతన నాగరికతలు కొన్ని మాత్రమే ఉండేవి. ఎవరైనా సింధూ లోయ నాగరికత ప్రజలపై దాడి చేసే అవకాశం ఉండేది. కానీ, విదేశీయుల చొరబాట్లకు రక్షణగా ఈ గోడలను నిర్మించి ఉండకపోవచ్చు.
మరి ఏమై ఉంటుంది?
‘‘నగరానికి నలు దిక్కులా ఏర్పాటు చేసిన ఈ గోడలు ఎప్పుడైనా భారీ సునామీ వచ్చినా నగరాన్ని కాపాడేలా నిర్మించారు. ఈ సంస్కృతి ఆధునీకతకు ఈ గోడలు నిలువుటద్దం. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణాలు మనం మరెక్కడా చూడలేం’’ అని షిండే వివరించారు.
ప్రత్యేకమైన స్టేడియం
ప్రాచీన నగరం ధోలావీరాలో మీరు ఎన్నో కాలాల నాటి వస్తువులను, నిర్మాణ సౌధాలను కనుగొనవచ్చు. దీనిలో స్టేడియం కూడా ఒకటి.
ఈ నగరం కేవలం వాణిజ్యానికి కేంద్రంగా ఉండటమే కాదు. క్రీడలకు, వినోదానికి కూడా ప్రముఖ ప్రాంతంగా ఉండేది.
ఈ నగరంలో అప్పర్ టౌన్, మిడిల్ టౌన్‌లో వెడల్పైన స్పేస్ ఉంది. దీనిలో కొన్ని మెట్లు ఉన్నాయి.
‘‘ఇలాంటి నిర్మాణంతో మనం ఇక్కడ స్టేడియం కూడా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఆ సమయంలో పెద్ద ప్లేగ్రౌండ్ ఉండొచ్చని అంచనాలున్నాయి. క్రీడలతో పాటు ఇతర ఉత్సవాలు, యాత్రలు ఇక్కడ జరిగేవి. పబ్లిక్ ఈవెంట్ల కోసం దీన్ని వాడేవారని అంచనాలున్నాయి. ఈ ప్రాంతంలో కనుగొన్న స్టేడియం ఆధారాలతో, ప్రపంచంలో తొలి స్టేడియంగా దీన్ని భావిస్తున్నారు.’’ అని షిండే చెప్పారు.
2021లో యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రాచీన సింధూ నాగరికత ఆనవాళ్లతో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా భారత్‌లో గుర్తింపు పొందిన ఏకైక ప్రదేశమిదే. దీని గురించి మరింత సమాచారాన్ని యునెస్కో సైట్‌లో పొందుపరిచింది.
1968లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ధోలావీరా గ్రామానికి దగ్గర్లో ఉండటం వల్ల దీనికి ధోలావీరా అనే పేరు పెట్టారు.
ఈ ప్రాంతాన్ని కనుగొన్న క్రెడిట్ భారతీయ పురావస్తు శాస్త్ర విభాగంలో పనిచేసే మాజీ డైరెక్టర్ జగపతి జోషికే దక్కుతుంది.
ఇక్కడ కనుగొన్న ఆనవాళ్లు 3000 నుంచి 1500 బీసీ మధ్య కాలానికి చెందినవి. 1989 నుంచి 2005 మధ్య కాలంలో ఈ నగర తవ్వకాలను చేపట్టారు.
కొందరు స్కాలర్లు సమర్పించిన తమ రీసెర్చ్ రిపోర్ట్‌లలో, ఈ పోర్ట్ నుంచి మెసోపోటమియాకి అంటే ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, సిరియా, కువైట్, ఒమన్ పెనిన్సులా అంటే ప్రస్తుత కాలంలో ఒమన్, ఖతార్, దుబాయ్‌లకు వాణిజ్యం సాగేది.
ఈ నగరం ఎలా కనుమరుగైంది?
దీనిపై రీసెర్చర్లు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సింధూ నాగరికత ధ్వంసానికి ఆర్యులే కారణమని కొందరు చెప్పారు.
హరప్పా నాగరికతలోని ప్రజలు వీరిని తట్టుకుని నిలబడలేకపోయారని, వారి సమర్థవంతమైన యుద్ధ నైపుణ్యాలతో సింధూ నాగరికత ప్రజలని ధ్వంసం చేశారని అంటున్నారు.
ఆ తర్వాత ఆర్యులు భారత్‌లో ప్రాచీన వేద సంస్కృతికి పునాది వేశారని చెబుతున్నారు.
సింధూ లోయలో హరప్పా నాగరికత ధ్వంసానికి ఆసియా నుంచి వచ్చిన ఆర్యులే కారణమని బ్రిటీష్ మిలటరీ అధికారి, పురావస్తు శాస్త్ర నిపుణుడు సర్ రోబర్ట్ ఎరిక్ మోర్టిమర్ వీలర్ రాశారు.
సింధూ నాగరికత ధ్వంసమయ్యేటప్పుడు, ధోలావీరా ఎలా వీరి ధాటికి తట్టుకుని నిలబడగలదు?
కొందరు స్కాలర్ల అంచనాల ప్రకారం నీటి వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైందని అన్నారు. సునామి వల్ల ఇలా జరిగిందన్నారు.
సునామీ వల్ల సముద్ర తీరంలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా కనుమరుగైందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అధ్యయనం తెలిపింది.
కానీ, డాక్టర్. షిండే భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్ల సింధూ నాగరికత, ఈ నగరం పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పారు.
1900 బీసీ నుంచి మొదలైన ఈ నాగరికత పతనం, 1500 ఏడీ నాటికి పూర్తిగా అంతమైందన్నారు.
‘‘ప్రాచీన కాల వాతావరణం గురించి ప్రస్తుతం ప్రతి దగ్గరా అధ్యయనం చేస్తున్నారు. వాతావరణ మార్పులకు ప్రభావితమైనది సింధూ నాగరికత ఒక్కటి మాత్రమే కాదని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. వాతావరణం మార్పులకు గురైన ప్రతిసారి, మానవ నాగరికతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు 2000 బీసీ కాలంలో కూడా ఈజిప్ట్ సంస్కృతి కనుమరుగవడం ప్రారంభమైంది. మెసోపోటెమియన్ నాగరికత పతనకావడం ప్రారంభమైనప్పటి నుంచి హరప్పా లేదా సింధూ నాగరికత అంతం కూడా మొదలైంది. ’’ అని షిండే చెప్పారు.
కారణమేదైనా.. ఈ నగరం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ నగరానికి అనుసంధానంగా ఉన్న సముద్రం కూడా ఎండిపోయింది. ఈ సముద్రంలో ఉన్న ఉప్పు, కచ్‌లో తెల్లటి ఎడారిగా మారింది.
కానీ ఈ సాంస్కృతి ఆనవాళ్లు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా లేదా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)