You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిష్టి నిజంగానే తగులుతుందా... కంటికి ఇతరులకు చెడు చేసేంత పవర్ ఉందా?
- రచయిత, కోయెన్ హర్జేతాయి
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేకపోయినా దిష్టి, ‘ఈవిల్ ఐ’ లాంటి నమ్మకాలు చాలా దేశాల్లో ఉన్నాయి.
ప్రాచీన ఈజిప్టులో గుర్రపు కన్నును రక్షణ, రాచరికపు శక్తి, మంచి ఆరోగ్యానికి చిహ్నంగా భావించేవారు. అమెరికా మోడల్ జీజీ హడిద్, 'కన్ను' గుర్తుతో ఒక షూ బ్రాండ్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌లో కూడా దిష్టి తగిలిందని లేదా కన్ను అదిరితే ఏదో జరిగిపోతుందని నమ్ముతుంటారు. ఇలా వేల ఏళ్లుగా కళ్ల ప్రభావం గురించి మానవులు ఏదో ఒకటి ఆపాదించుతూనే ఉన్నారు.
చెడు దృష్టి నుంచి తప్పించుకోవడానికి కొందరు తమకు తోచింది చేస్తుంటారు. నర దిష్టి (నర దృష్టి) తగిలిందో లేదో తెలుసుకోవడానికి, దాని ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని నివారణలు చేస్తుంటారు.
ఇస్తాంబుల్ మార్కెట్‌లలో 'నీలి రంగు కన్ను' చిత్రాలు కనిపిస్తాయి. బజార్లలో మాత్రమే కాదు విమానాలు, కామిక్ పుస్తకాల్లో కూడా దీని ఫొటోలు ఉంటాయి.
గత దశాబ్ధంలో ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఇలాంటి చిత్రాలు తరచుగా తెరపైకి వచ్చాయి. 'డెవిల్ ఐ' చిహ్నాలు ఉన్న హెడ్ పీస్‌లు, బ్రేస్‌లెట్‌లు ధరించిన అమెరికా మోడల్ కిమ్ కర్దాషియా ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదే కాకుండా 2017లో జీజీ హడిద్ 'ఐ లవ్' అనే షూ బ్రాండ్‌ను స్థాపించి ఈ ట్రెండ్‌కు మరింత ప్రచారం కల్పించారు.
చెడు దృష్టి నుంచి కాపాడుకోవడం కోసం 'కన్ను' చిహ్నంతో కూడిన బ్రేస్‌లెట్, హారాలు, కీ చైన్లను తయారు చేసే విధానాలు ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చాయి.
నిజం చెప్పాలంటే వేల ఏళ్లుగా కన్నుకు సంబంధించిన భయాందోళనలను మానవులు నమ్ముతున్నారు.
చెడు దృష్టికి మూలం ఎక్కడ?
దీని గురించి తెలుసుకోవాలంటే మొదట టాలిస్మాన్ (తాయెత్తు), ఈవిల్ ఐ (చెడు దృష్టి) మధ్య తేడాను అందరూ అర్థం చేసుకోవాలి.
నీలి రంగు కన్ను చిహ్నాన్ని కలిగి ఉండే తాయెత్తును 'డెవిల్ ఐ' అని పిలుస్తుంటారు. చెడు దృష్టి నుంచి కాపాడుకోవడం కోసం ఈ 'డెవిల్ ఐ' తాయెత్తును కట్టుకుంటారు. శత్రువుల చూపు మంచిది కాదని, వారి చూపు వల్ల దిష్టి తగులుతుందని నమ్ముతారు. దీన్ని నివారించడం కోసం తాయెత్తును ఉపయోగిస్తారు.
వేల ఏళ్లుగా ఈ తాయెత్తులు వివిధ రూపాల్లో ఉనికిలో ఉన్నాయి. 'దిష్టి' అనే భావన ఎంత పురాతనమైనదంటే, దాని మూలాన్ని కనుగొనడం చాలా కష్టం.
ఒక వ్యక్తి ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు లేదా బాగా పేరు గడించినప్పుడు చుట్టూ ఉండే ప్రజలు ఆయనను చూసి అసూయ చెందుతారు. దీనివల్ల దిష్టి తగులుతుందని భావిస్తుంటారు.
ఈ అసూయ వల్ల ఆ వ్యక్తి అదృష్టానికి హాని కలుగుతుందని నమ్ముతారు.
దిష్టి అనే భావన గురించి పురాతన గ్రీకు రొమాంటిక్ నవల 'హెలియోడోరస్ ఆఫ్ ఎమెసా' లో వివరించారు.
''ఎవరైనా వ్యక్తి అసూయతో చూసినప్పుడు, అక్కడి వాతావరణం హానికరంగా మారుతుంది. ఆ వాతావరణంలో విషపూరితమైన శ్వాస నిండిపోతుంది' అని అందులో పేర్కొన్నారు.
దిష్టి అనే భావన అనేక సంస్కృతుల్లో, చాలా తరాలుగా వ్యాపించి ఉంది. బైబిల్, ఖురాన్ సహా అనేక మత గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఫ్రెడరిక్ థామస్ ఎల్వర్తీ తన పుస్తకం 'ది ఈవిల్ ఐ'లో కూడా దీని గురించి వివరించారు.
కన్నుకు కన్ను
చెడు దృష్టిపై నమ్మకం మూఢవిశ్వాసాలను మించిపోయింది. చాలా మంది ప్రముఖ ఆలోచనాపరులు దీన్ని ధ్రువీకరించారు. గ్రీకు తత్వవేత్త ప్లూటార్క్ తన పుస్తకం 'సింఫోసిక్స్'లో ఒక శాస్త్రీయ వివరణను ఇచ్చారు. ''మానవ కంటికి అదృశ్య శక్తి కిరణాలను విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలను, జంతువులను చంపేసేంత శక్తి వాటికి ఉంటుంది'' అని అందులో వివరించారు.
దీన్ని బలపరిచేందుకు ప్లూటార్క్ మరో ఉదాహరణను ఇచ్చారు. నల్ల సముద్రానికి దక్షిణాన ఉండే కొంతమంది వ్యక్తులకు చెడు దృష్టి ఉంటుందని చెప్పారు. నీలి రంగు కళ్లను కలిగి ఉండేవారు హిప్నటైజ్ చేసే సామర్థ్యాలను కలిగి ఉంటారని నమ్ముతారు.
కొంతమంది శక్తిమంతమైన కళ్లను కలిగి ఉంటారని, వాటికి ఇతరులకు హాని కలిగించేంత శక్తి ఉంటుందని నమ్ముతుంటారు. అయితే, శక్తిమంతమైన కళ్లను కలిగి ఉన్నవారంతా ఇతరులకు చెడు చేయాలని అనుకోరని ఆయన చెప్పారు.
ఇలాంటి శక్తిని కలిగి ఉండటాన్ని కొన్ని సంస్కృతుల్లో భారంగా, తమకు లభించిన శాపంగా ప్రజలు భావించారని అన్నారు.
పోలండ్‌కు చెందిన ఒక జానపద కథను ఎల్వర్తీ ఉదహరించారు. ఈ కథ శక్తిమంతమైన కళ్లు ఉన్న ఒక వ్యక్తి గురించి వివరిస్తుంది. తన కళ్ల నుంచి ఇతరులను కాపాడటం కోసం ఆయన తన రెండు కళ్లను పెకిలించారని ఎల్వర్తీ చెప్పారు.
'చెడు దృష్టి' గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురాతన నాగరికతలకు చెందిన ప్రజలే దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. దీని నుంచి తప్పించకోవడం కోసం తాయెత్తులను వాడటం మొదలుపెట్టారు. ప్రజలు ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తున్నారు.
తాయెత్తుల వాడకం ఎప్పుడు మొదలైంది?
తాయెత్తుల గురించి ఇస్తాంబుల్‌లో నివసించే ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్, డాక్టర్ నెషే ఇల్దారన్ బీబీసీతో మాట్లాడారు. చెడు దృష్టి నుంచి తప్పించుకోవడం కోసం వాడిన పురాతన తాయెత్తు క్రీ.పూ 3,300 నాటిది అని చెప్పారు.
ప్రస్తుతం సిరియాలో ఉన్న తల్ బరాక్ ప్రాంతం తవ్వకాల్లో ఈ తాయెత్తులను కనుగొన్నారు. అక్కడ కత్తిరించిన కళ్లతో చేసిన విగ్రహాలు బయటపడ్డాయి.
తల్ బరాక్‌లోని పురాతన అలబాస్టర్లతో చేసిన శిల్పాలు, ప్రస్తుతం మనం చూస్తోన్న నీలి రంగులో ఉండే తాయెత్తుల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ తాయెత్తుల తొలినాళ్లకు సంబంధించిన రూపాలు క్రీ.పూ 1500 వరకు కనిపించలేదు. ఈ తాయెత్తుల పరిణామ ప్రక్రియ ఎలా సంభవించింది?
నీలి రంగు విషయానికొస్తే, ఇది మొదట ఈజిప్టులోని మెరిసే బంకమట్టి నుంచి వచ్చింది. ఈ మట్టిలో ఎక్కువ గాఢత కలిగిన ఆక్సైడ్‌లు ఉంటాయి. ఈ మట్టిని వేడి చేసినప్పుడు ఇందులో ఉండే కాపర్, కోబాల్ట్ మూలకాలు దీనికి నీలి రంగును అందిస్తాయి.
నిఘా, గూఢచర్యానికి కూడా 'కన్ను'ను చిహ్నంగా భావిస్తారు. ఈజిప్టు తవ్వకాల్లో చాలా నీలిరంగు కన్నుతో ఉండే పెండేట్లు బయటపడ్డాయని ఈల్డరన్ చెప్పారు.
టర్కీ ఆదివాసీలు తమ ఆకాశ దేవుడు 'తంజెరీ'తో అనుబంధం కారణంగా నీలి రంగుపై ఆసక్తి కనబరిచేవారని ఈల్డరన్ తెలిపారు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా నీలి కన్ను పూసల హారాలను విస్తృతంగా వినియోగించేవారు. వీటినే ఫోనీషియన్లు, అసీరియన్, గ్రీకులు, రోమన్లు ఉపయోగించారు.
ఈజిప్షియన్లు, ఎట్రుస్కాన్‌లు తమ ప్రయాణం సురక్షితంగా సాగడం కోసం నీలి కన్ను చిహ్నాన్ని వాడేవారు. వారి తరహాలోనే ప్రస్తుతం విమానాల చుట్టూ నీలి కన్ను చిహ్నాన్ని వాడుతున్నారు. నవజాత శిశువులను దిష్టి నుంచి రక్షించడానికి టర్కీలో ఇప్పటికీ నీలి కన్ను చిహ్నాన్ని వాడతారు.
కానీ, ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. దీనికి అనుగుణంగా చరిత్ర కూడా కొత్త రంగులు పులుముకుంటుందా? అని ఆశ్చర్యపోవడం తప్ప ఎవరూ ఏం చేయలేరు.
చెడు దృష్టి చరిత్ర చాలా పురాతనమైనది. ఇది చాలా మంది ప్రజల సంస్కృతితో ముడిపడి ఉంది. ఆ వారసత్వంతో సంబంధం కారణంగానే ప్రజలు నీలి కన్ను చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు.
ఉదాహరణకు కిమ్ కర్దాషియాన్, జిజి హడిద్ ఇద్దరూ 'చెడు దృష్టి' అనే భావనను నమ్మే సంస్కృతులకు చెందినవారే.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్లో ఈసారి బీజేపీకి కష్టమేనా? ‘కాంగ్రెస్ ఏదో కొత్తగా ప్రయత్నిస్తోంది, జాగ్రత్త’ అని మోదీ ఎందుకు హెచ్చరించారు?
- ఇరాన్లో ఏం జరుగుతోంది... మహిళల నిరసనలు ఎందుకు హింసాత్మకంగా మారాయి?
- అమాసియా: ఈ కొత్త సూపర్ ఖండం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడుతుంది?
- డాలర్ బలపడటం అంటే ఏంటి? డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి బలహీనపడుతోందా లేదా?
- షీ జిన్‌పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)