ప్రేమ జంటల్లో 'భిన్నధృవాల మధ్య ఆకర్షణ' నిజమా? కాదా? విరుద్ధ వ్యక్తిత్వాలు కలుస్తాయా? లేదా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

    • రచయిత, జెస్సికా క్లీన్
    • హోదా, బీబీసీ వర్క్‌లైఫ్

భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయనేది సామెత. అంటే పరస్పర విరుద్ధమైనవి ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయని అర్థం. ఇది నిజమని జనం నమ్ముతుంటారు. ఈ నమ్మకం చిరకాలంగా మన సంస్కృతిలో ఇమిడిపోయింది.

చాలా మంది తమ జీవితాల్లో ఇలాంటి ఉదాహరణలు కూడా చెప్తుంటారు. నలుపు - తెలుపు పట్ల, తెలుపు నలుపు పట్ల ఆకర్షితమవుతుందంటారు. పోకిరి పిల్లాడు బుద్ధిగా చదువుకునే అమ్మాయి వెనుక పడితే.. బుద్ధిగా ఉండే పిల్లాడి వెనుక అల్లరి పిల్ల పడుతుంది. బిడియంగా ఉండే అబ్బాయి.. గలగలా మాట్లాడే అమ్మాయికి ఫిదా అవుతాడు. మౌనాన్ని ఇష్టపడే అమ్మాయి గట్టిగా మాట్లాడే అబ్బాయిని ఇష్టపడుతుంది. పేద కుర్రాడు, సంపన్న యువతిని.. డబ్బున్న యువకుడు, పేద యువతిని ఇష్టపడతారు. అని అనుకుంటాం. ఈ 'అపోజిట్స్ ఎట్రాక్ట్' థీమ్‌తో ఎన్ని సినిమాలూ తీసినా చూస్తాం.

కానీ ఈ నమ్మకంలో నిజం లేదంటున్నారు పరిశోధకులు. అంతేకాదు.. ఇలా అపోజిట్స్‌కి ఆకర్షితమవటం ఎప్పటికన్నా ఇప్పుడు అత్యంత తక్కువగా ఉందంటున్నారు. ''విరుద్ధాంశాల మధ్య ఆకర్షణ అనేది నిజం కాదు. పరిశోధన చాలా స్పష్టంగా చెప్తోంది. పరస్పరం ఒకే రకమైన ఆసక్తులు, వ్యక్తిత్వాలు, భావోద్వేగాలు ఉన్న వారు కలిసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది'' అని చెప్పారు కాలిఫోర్నియాకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ రమణి దుర్వాసుల.

నిజానికి.. స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య ముఖ్యమైన విశ్వాసాలు, విలువలు, హాబీలు ఒకే విధంగా ఉంటాయని అనేక అధ్యయనాలు చూపాయి. జనం ఎక్కువగా.. తమ వంటి భౌతిక లక్షణాలు ఉన్న వారి పట్ల ఆకర్షితులవుతారు. తమ వంటి వారినే ఎక్కువగా విశ్వసిస్తారు. తమ తరహా వ్యక్తిత్వాలున్న వారిని ఇష్టపడతారు. ఇవి కొన్ని పరిశోధనల్లో తేలిన అంశాలు. మొత్తంగా.. తమ వంటి లక్షణాలు, నమ్మకాలు, ప్రయోజనాలు ఉన్నవారి పట్లే జనం ఎక్కువగా ఆకర్షితులవుతారని పరిశోధకులు, సైకాలజిస్టులు ఇద్దరూ చెప్తున్నారు.

వాస్తవానికి వైరుధ్యాలు వికర్షించుకుంటాయని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి. ముఖ్యంగా అభిప్రాయాలు, విలువల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వాతావరణం మరింతగా విభజితమవుతూ ఉన్నపుడు.. మనకన్నా పూర్తి భిన్నంగా ఆలోచించే వారిని మనం ఇష్టపడే అవకాశం మరింత తక్కువగా ఉంటుంది.

ఇప్పుడు సోషల్ మీడియా వంటి వేదికలు విస్తృతం కావటంతో.. లైక్-మైండెడ్ వ్యక్తుల బృందాల్లో చేరి తమ జంటను వెతుక్కోవటం మరింత సులభమవుతోంది. 'అపోజిట్స్ అట్రాక్ట్' అనే భావనకు మరింతగా కాలం చెల్లిపోయింది.

భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయనే నానుడి ఎప్పుడు ఎలా పుట్టిందో సరిగ్గా గుర్తించటం కష్టం. అయితే.. అమెరికా సామాజికశాస్త్రవేత్త రాబర్ట్ ఎఫ్ వించ్ 1954లో అమెరికన్ సోషియాలాజికల్ రివ్యూలో తన పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. 'జంటను ఎంచుకోవటంలో పూరకావసరాలు' అనే అంశంపై పరిశోధన పత్రమది. వ్యక్తులు తమలో లోపించిన నిర్దిష్ట లక్షణాలను తమ భాగస్వాముల్లో కోరుకుంటారనేది ఆ వ్యాసం చెప్తున్న విషయం. అంటే.. అంతర్ముఖులు, బహిర్ముఖులను ఎంపిక చేసుకోవటం వంటిది.

వించ్ పరిశోధన తర్వాత ఇతర పరిశోధకులు భిన్నమైన నిర్ధారణలు చేయటం మొదలుపెట్టారు. ఓ దశాబ్దం తర్వాత అమెరికాకు చెందిన మరో సామాజిక మనస్తత్వ పరిశోధకుడు డాన్ బైర్న్.. 'అపోజిట్స్ అట్రాక్ట్' సిద్ధాంతాన్ని సవాల్ చేస్తూ తన సొంత పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

''ఒక వ్యక్తి తనకు భిన్నమైన లక్షణాలున్న అపరిచిత వ్యక్తి కన్నా, తన వంటి లక్షణాలే ఉన్న అపరిచత వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒక వ్యక్తి తన వంటి లక్షణాలున్న అపరిచిత వ్యక్తినే ఎక్కువ తెలివైన వారిగా, ఎక్కువ విషయాలు తెలిసిన వారికి, ఎక్కువ సర్దుకుపోగల వ్యక్తిగా పరిగణిస్తారు'' అని బైర్న్ సూత్రీకరించారు. ఈ రెండు సూత్రీకరణలనూ ఆయన పరిశోధన సమర్థిస్తోంది.

''అక్కడ మొదలైంది. సారూప్యతలు ఆకర్షించుకుంటాయని చెప్పటానికి అప్పటి నుంచీ చాలా బలమైన, విస్తృతమైన ఆధారాలు లభించాయి'' అని అమెరికాలోని వెలెస్లీ కాలేజ్‌లో సైకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న ఏంజెలా బాన్ పేర్కొన్నారు.

ఏంజెలా తను సొంతగా నిర్వహించిన 2017 నాటి అధ్యయనంలో కూడా ఇదే విషయాన్ని గుర్తించారు. పరిశోధకులు మసాచుసెట్స్‌లోని బహిరంగ ప్రదేశాల్లో జంటలను కలిశారు. స్నేహితులు, ప్రేమికుల జంటలను పరిశీలించినపుడు.. వారి మధ్య చాలా ఎక్కువగా సారూప్యతలు ఉన్నట్లు గుర్తించారు. ప్రవర్తనా తీరు, విలువలు, వినోద కార్యకలాపాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి పలు అంశాలకు సంబంధించి ఆయా జంటల్లో సారూప్యతలు, వైరుధ్యాలలపై ఈ పరిశోధకులు లెక్కించారు. జంటల మధ్య గణనీయంగా 86 శాతం సారూప్యతలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా.. గే వివాహాలు, గర్భస్రావం, ప్రజల జీవితాల్లో ప్రభుత్వ పాత్ర, మతం ప్రాధాన్యత వంటి అంశాలపై.. స్నేహితులు, ప్రేమికుల జంటల్లో అభిప్రాయాలు, వైఖరుల్లో చాలా దగ్గరి సారూప్యతలు ఉన్నాయని తేలింది.

అయితే.. వైరుధ్యాలు ఆకర్షించుకుంటున్నట్లు కనిపించటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. నిజానికి పెద్దగా తేడా లేకపోయినా కానీ చాలా భిన్నంగా ఉన్నట్లు కనిపించేలా చేసే పైపై తేడాలు. అలాంటి జంటల్లో కుటుంబానికి సంబంధించినవైనా, రాజకీయాలకు సంబంధించినవైనా వారి విలువలు ఒకే తరహాలో ఉంటాయని దుర్వాసుల పేర్కొన్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ పరిశోధనల్లో వ్యక్తిత్వం విషయంలో సారూప్యతలు, తేడాలకు సంబంధించి అంత స్పష్టమైన నిర్ధారణలు లభించలేదు.

ఏంజెలా అధ్యయనంలో.. జంటల మధ్య వ్యక్తిత్వం విషయంలో సారూప్యత స్థాయి తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమైన ఐదు లక్షణాలు - నిష్కపటత, నైతికత, బహిర్వర్తనం, ఆమోదనీయత, ప్రతికూలభావన అంశాల్లో జంటల మధ్య సారూప్యత తక్కువగా ఉంది. ఉదాహరణకు.. ''బాగా ఆధిపత్యం చలాయించే లక్షణాలున్న ఇద్దరు వ్యక్తులు బాగా కలిసి పనిచేయలేరు. అలాంటి చోట.. 'వైరుధ్యాలు ఆకర్షించుకుంటాయ'నే మాట చెప్పుకోవటానికి ఎక్కువ వీలుంటుంది'' అని ఏంజెలా వివరించారు.

అయితే యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన సోషల్ సైకాలజీ లెక్చరర్ యుయు వు 2017లో నిర్వహించిన మరొక అధ్యయనం దీనికి భిన్నంగా చెప్తోంది. ఫేస్‌బుక్‌లో సుమారు 1,000 భాగస్వామ్య జంటలు, 50,000 స్నేహితుల జంటల ప్రొఫైల్స్‌ను వు, ఆయన సిబ్బంది పరిశీలించారు. జంటల మధ్య ''ఈ ఐదు వ్యక్తిత్వ లక్షణాలకు సంబంధించిన సారూప్యతలు ఇంతకుముందు గుర్తించిన దానికన్నా చాలా బలంగా ఉన్నాయి'' అని ఆ అధ్యయనం చెప్తోంది. ఇది.. వ్యక్తిత్వ లక్షణాల్లో సైతం వైరుధ్యాలు ఆకర్షించుకున్నట్లు కనిపించినప్పటికీ అవి ఆకర్షించుకోవని సూచిస్తోంది.

డేటింగ్ యాప్‌లు కూడా సారూప్యత ఉన్న భాగస్వాములను వెదికే వారిని ప్రోత్సహిస్తాయి.

అయితే.. దీని అర్థం.. విలువలు, అభిప్రాయాల్లో భిన్నధృవాల ఆలోచనలున్న వారు విజయవంతంగా కలిసి ఉండలేరని కాదు. అది జరుగుతుంది. జంటల్లో భేదాభిప్రాయాల వల్ల, ప్రాధమిక వైరుధ్యాల వల్ల ప్రయోజనాలు కూడా ఉండొచ్చు.

పారిస్‌కు చెందిన 29 ఏళ్ల ఐపెక్ కుక్ డేటింగ్ యాప్ హాపెన్‌లో డేటింగ్ అండ్ ట్రెండ్స్ నిపుణురాలు. ఇటీవల తాను.. వ్యాక్సినేషన్, మతం వంటి వివాదాస్పద అంశాలపై తన ఆలోచనలతో ఏకీభవించే వ్యక్తితో, ఆ తర్వాత తనతో పూర్తిగా విభేదించే వ్యక్తితో డేటింగ్‌ చేసినట్లు ఆమె చెప్పారు. ''నా మాజీ భాగస్వామితో విడిపోక ముందు.. నాకు ఎంత బోరింగ్‌గా ఉండేదో నాకు తెలీదు. కానీ నా ప్రస్తుత భాగస్వామి అభిప్రాయాలు కొన్ని తెలుసుకున్నాక నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. అది నేను ఎదిగేందుకు దోహదపడింది. నా దృక్కోణాన్ని విస్తరించింది. దానిని నేను నిజంగా అభినందిస్తాను'' అని తెలిపారు.

ఇప్పుడు.. రాజకీయ అభిప్రాయాలు కలవటమనేది జంటలు కలవటానికి ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఉదాహరణకు.. డేటింగ్ యాప్ టిండర్‌లో 2020 సంవత్సరంలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అని ప్రస్తావించటం 55 రెట్లు పెరిగింది. జనం తాము అత్యంత బలంగా ఉండే అభిప్రాయాలు, విలువలతో ఏకీభవించని వారిని భాగస్వాములుగా పరిగణించటానికి విముఖంగా ఉన్నారని ఇది సూచిస్తోంది.

ఓకేక్యూపిడ్ యాప్‌లో సైతం.. బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు తెలుపుతూ తమ ప్రొఫైల్ మీద ప్రదర్శించటానికి బ్యాడ్జ్ విడుదల చేసిన తర్వాత.. ఆ బ్యాడ్జ్ పెట్టుకున్న వారి మధ్య మ్యాచింగ్ రెండు రెట్లు పెరిగిందని ఓకేక్యూపిడ్ ప్రతినిధి ఒకరు బీబీసీ వర్క్‌లైఫ్‌కు ఈమెయిల్ ద్వారా తెలిపారు.

ఇక అనంతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా సాంస్కృతిక ప్రభావం, భావసారూప్యత గల వారిని కనెక్ట్ చేసే దాని ఆల్గోరిథంల వల్ల.. జంటలను అన్వేషించే వారు తమ వంటి ఆలోచనలు, అభిప్రాయాలు, వైఖరులు గల వారివైపు వెళ్లటం మరింతగా పెరుగుతుండవచ్చు.

''మా పరిశోధన ప్రకారం.. ముందుగా ఫ్రెండ్స్ మధ్య వ్యక్తిత్వంలో సారూప్యతలు ఉంటాయి. డేటింగ్ యాప్‌లు వాడే వాళ్లకి.. వారి స్నేహితుల స్నేహితులను రికమెండ్ చేస్తుంటాయి. అంటే.. వారి వంటి వ్యక్తిత్వాలే ఉన్న మరింత మందిని కలవటం జరుగుతోంది'' అని వు వివరించారు.

''మనతో ఏకీభవించే వారిని ఆన్‌లైన్‌లో కలవటం సులభం. సోషల్ మీడియా ఆల్గోరిథం.. మనం ముందుగానే అంగీకరించగల అంశాలుగా భావించిన వాటిని మనకు చూపుతుంది'' అని చెప్పారు ఏంజెలా.

దీనిని ఆన్‌లైన్ డేటింగ్ సర్వీసెస్ కూడా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ్రెండ్స్ కోసం, డేటింగ్ కోసం, చివరికి ప్రేమ కోసం.. అన్వేషిస్తూ మనలో చాలా మంది ఉపయోగించే ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్లు.. మనం మనలాగే ఆలోచిస్తున్నట్లు కనిపించే వారివైపు మళ్లిస్తున్నాయి. అదేమీ పూర్తిగా చెడ్డ విషయం కాదు. చిరకాలం నిలిచే సంబంధానికి ఇది మంచి సంకేతమని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కానీ ఇందులో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మనలాగే ఆలోచించే వారితో మాత్రమే మనం కలుస్తుంటే.. కుక్ తన భాగస్వామితో ఆస్వాదించే తరహా సంభాషణలు మనకు ఉండే అవకాశం తక్కువ. మన అభిప్రాయాలను సవాల్ చేసే చర్చలు, విభిన్నమైన ప్రాపంచిక దృక్పథాన్ని మనకు పరిచయం చేసే సంవాదాలు మిస్ కావచ్చు. ఏదేమైనా.. భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయనే నానుడికి కాలం చెల్లినట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)