You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారతదేశంలో మహిళల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
- రచయిత, దివ్య ఆర్య, పూజ ఛాబ్రియా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళల్లో దాదాపు 40 శాతం మంది భారతీయులే. ఇటీవల ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఎందుకు భారతీయ మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే దాని వెనుక రకరకాల కారణాలున్నాయి.
వైద్య సంక్షోభం
నిజానికి గత పదేళ్లలో భారత్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ప్రపంచ సగటుతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువే.
ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మంది మహిళల్లో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడితే, భారత్‌లో దానికి రెండింతలు ఎక్కువగా, అంటే ప్రతి లక్షమందిలో 15 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
‘భారత్‌లో మహిళల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినా, ఆశించిన స్థాయిలో అవి తగ్గట్లేదు’ అని లాన్సెట్ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన రాఖీ దండోనా అంటున్నారు.
పురుషులను పరిగణనలోకి తీసుకుంటే... ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్లలో 24శాతం మంది భారతీయు పురుషులే ఉంటున్నారు.
వైద్యపరమైన కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం పొందలేక చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని ఈ అధ్యయనం చెబుతోంది.
పెళ్లిళ్లు
భారత్‌లో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల్లో 71.2 శాతం మంది 15-39ఏళ్ల మధ్య వయసు వాళ్లే. వీళ్లలో ఎక్కువమంది వివాహితలే.
- పెద్దలు కుదిర్చిన వివాహం
- చిన్న వయసులో పెళ్లిళ్లు
- సామాజిక వెనుకబాటుతనం
- గృహ హింస
- ఆర్థికంగా భర్తపై ఆధారపడటం
ప్రధానంగా ఈ కారణాలే వివాహితలను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.
పెరుగుతున్న ఒత్తిడి
‘15-39 ఏళ్ల మధ్య వయసు వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సరైన మానసిక వైద్యులు కూడా వాళ్లకు అందుబాటులో ఉండరు’ అని రాఖీ చెప్పారు.
భారత్‌లో మహిళల ఆత్మహత్యలకు సంబంధించి కచ్చితమైన కారణాలను చెప్పే అధ్యయనం ఇప్పటిదాకా జరగలేదు. కానీ, ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే మహిళలు తొలి రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటారని, వాళ్లను ఉద్యోగం చేయనివ్వరని, ఆ పరిణామాలు వాళ్లపై ఒత్తిడి పెంచుతాయని మహిళల ఆత్మహత్యల నివారణ కోసం పనిచేస్తున్న ‘స్నేహ’ సంస్థ వ్యవస్థాపకురాలు డా. లక్ష్మీ విజయకుమార్ అంటున్నారు.
పెళ్లయి ఏళ్లు గడిచేకొద్దీ కుటుంబంలో మహిళల పాత్ర బలపడుతుందని ఆమె చెబుతారు.
దేశవ్యాప్తంగా మహిళల ఆత్మహత్యల రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకల్లో ఈ సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఈ రాష్ట్రాల్లో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. అయినా ఎందుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయనేదానికి స్పష్టమైన కారణాలు తెలీలేదు.
లక్ష్యాలు మరీ పెద్దవిగా ఉంటే, అసంతృప్తీ ఎక్కువగా ఉంటుందనీ, ఇవన్నీ ఆత్మహత్యలకు దారితీస్తాయని డా.లక్ష్మి అంటారు.
ఏం చేయొచ్చు?
ఆత్మహత్యల నివారణలో చైనా నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తారు. 1990ల్లో చైనాలో మహిళల ఆత్మహత్య రేటు చాలా ఎక్కువగా ఉండేది. కానీ 2016 నాటికి అది 70శాతం మేర తగ్గింది. ఈ పరిణామానికి ప్రభుత్వ చర్యలే కారణమని, 25శాతం మంది గ్రామీణులను పట్టణాలకు తరలించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించారని, ఫలితంగా ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని డా.లక్ష్మి వివరిస్తారు.
చైనాతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకల్లో కూడా మహిళల ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. కానీ పెద్ద వయసువారితో పోలిస్తే ఆత్మహత్యలు చేసుకునే యువతుల సంఖ్య మాత్రం పెరిగింది.
‘ఆత్మహత్యల నివారణకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. గతంలో 70-80ఏళ్ల పైబడ్డవారే ఎక్కువగా ప్రాణాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే యువతుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆత్మహత్యలను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యకు ఉపయోగపడే సాధనాలు అందరికీ అందుబాటులోకి రాకుండా చేయడం అందులో ఒకటి’ అంటారు లక్ష్మి.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో 30 శాతం మంది పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. మద్యపానం కూడా ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఇలాంటి అంశాలపైన దృష్టిపెడితే ఆత్మహత్యల సంఖ్య తగ్గించే అవకాశం ఉంటుందని ఆమె చెబుతారు.
గృహహింసపై ఫిర్యాదులు
‘భారత్ లాంటి దేశాల్లో పెళ్లయిన మహిళలు గృహహింస గురించి ఎక్కువగా ఫిర్యాదు చేయరు. ఫలితంగా హింసతో పాటు గృహిణులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
చదువు పరమైన లక్ష్యాల విషయంలో కూడా భారత్‌లో ఒత్తిడి ఎక్కువ’ అంటారు లక్ష్మి.
ఒత్తిడికి గురైన వారిని వీలైనంత త్వరగా గుర్తించి, వాళ్లకు మానసిక వైద్య సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పరిణామాలు తీవ్రతరం కాకుండా జాగ్రత్త పడొచ్చని రాఖీ దండోనా సూచిస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)