You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఆ మాటలు విన్నాక పిల్లల్ని కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- రచయిత, కమ్లేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
28ఏళ్ల సుమన్ గత నెల్లో ఓ బిడ్డను ప్రసవించారు. రెండో బిడ్డ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగితే.. ఆమె ముఖంలో విచారం కనిపించింది. ఆమెకు రెండో బిడ్డ గురించిన ఆలోచనలు లేక కాదు కానీ, మొదటి కాన్పు సమయంలో ఆమె ఎదుర్కొన్న సంఘటన గుర్తొచ్చి విచారంలో మునిగింది.
సుమన్ మొదటి కాన్పు దిల్లీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్లో జరిగింది. తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. "అది నా మొదటి ప్రసవం. ఏం జరగబోతోందో నాకు తెలీదు. అప్పటికే నాకు భయంగా ఉంది. అదో పెద్ద వార్డు. చాలా మంది మహిళలు ప్రసవం కోసం వచ్చారు. వారంతా పురుటి నొప్పులతో గట్టిగా అరుస్తున్నారు. నర్సులు వారిపై జాలి చూపడానికి బదులు కోప్పడుతున్నారు. దాంతో నా భయం మరింత పెరిగింది" అన్నారు.
"అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ అవి పని చేయడం లేదు. దిల్లీలో వేసవి ఇంకా పూర్తికాలేదు. ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితుల్లో కాన్పుకు వచ్చిన ముగ్గురు గర్భిణులకు ఒకే మంచం ఇచ్చారు. ఆ నొప్పులు భరించలేక పడుకోవాలనిపించేది. కానీ అది సాధ్యం కాదు. ముగ్గురమూ ఒకే మంచంపై ముడుచుకుని కూర్చున్నాం. మాలో ఎవరైనా బాత్రూం అవసరాల కోసమో, లేక అటూ ఇటూ నడవడానికో లేచినపుడే మిగతా ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలి."
"మా పక్క మంచంపై ఒకావిడ తీవ్రమైన నొప్పులతో మూలుగుతోంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆమె గొంతెండిపోయింది. కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. నొప్పులు తట్టుకోలేక ఆమె గట్టిగా అరుస్తోంది. అప్పుడు మాత్రమే నర్స్ వచ్చి ఆమెను పరీక్షించింది. బిడ్డ ఇంకా బయటకు రావడం లేదని చెప్పింది. ఆమెను పరీక్షిస్తున్నపుడు ఆ నర్స్ ఆ మహిళనొక్కటే కాదు.. అక్కడ నొప్పులతో బాధపడుతున్న అందరిపైనా కోప్పడింది. మా పక్క మంచంపై ఉన్న మహిళను కొన్నిసార్లు కొట్టింది కూడా!"
"కొట్టడమే కాదు.. జుట్టు పట్టుకుని లాగుతారు. బూతులు తిడతారు. ఆ మాటలు విన్న తర్వాత, పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది. 'సుఖం కోసం ఆరాటపడతారు.. పిల్లలను కనేటపుడేమో ఏడుస్తారు. పిల్లలు కనాలంటే ఈ నొప్పులు తప్పదు మరి' అని తిడతారు. మీరే చెప్పండి.. ఇలాంటి మాటలు ఎవరైనా అంటారా? మేమేమైనా జంతువులమా? ఇవన్నీ చూశాక మేము చాలా భయపడ్డాం. ఆమె అన్న మాటలకు మా నొప్పి కూడా ఎగిరిపోయింది."
ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి. ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న గర్భిణులు ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు చేశారు.
ఇలాంటి సంఘటనలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇలాంటి సందర్భాలను ఉద్దేశించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
చండీగడ్‌లోని 'పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్'(పీజీఐఎమ్ఆర్) ఓ అధ్యయనం చేసింది.
ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
ఆసుపత్రుల్లో సిబ్బంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిని తిడుతున్నారని, మాట వినకపోతే బెదిరిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
"ప్రసవ సమయంలో గర్భిణులపై అరవడం అవసరమని అందరూ భావిస్తారు. అలా అరవడం వల్ల ప్రసవం సులువవుతుందని కొందరు నర్సులు చెబుతారు" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మన్‌మీత్ కౌర్ అన్నారు.
"ఒక నర్స్ చాలా మంది పేషెంట్లను చూసుకోవాలి. అలాంటి సమయంలో ఒత్తిడి వలన సహనం కోల్పోవడం సహజం. ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టలేరు. ఈ విషయాన్ని చాలా మంది నర్సులు మాకు చెప్పారు. కానీ ప్రేమతో, గౌరవంతో మాట్లాడటం అసాధ్యమేమీ కాదు. పద్ధతిగా నడుచుకునే నర్సులు కూడా ఉన్నారు" అని ఈ అధ్యయనం కోఆర్డినేటర్ ఇనాయత్ సింగ్ కక్కర్ అన్నారు.
సరైన శిక్షణ అవసరం
సంజయ్ గాంధీ ఆసుపత్రి అధికారిని ఈ విషయమై ప్రశ్నించగా.. పేషెంట్లతో అనుచితంగా ప్రవర్తించారన్న ఫిర్యాదులేవీ తమ దృష్టికి రాలేదన్నారు. కానీ, ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణంగా జరుగుతాయని ఆయన అంగీకరించారు.
"ఎవరైనా రోగులను కోపగించుకుంటే, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తాం. అలాంటి కౌన్సెలింగ్‌ల ద్వారా రోగులతో ప్రేమగా ఎలా నడుచుకోవాలో వారికి అర్థమవుతుంది. కానీ పేషెంట్లను కొట్టడం, హింసించడం లాంటి ఫిర్యాదులేవీ మాకు అందలేదు" అని సంజయ్ గాంధీ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం నిజమేనంటూ... "చాలా మంది నర్సులకు 'సాఫ్ట్ స్కిల్స్' శిక్షణ ఇవ్వరు. వైద్య విద్యలో సాఫ్ట్ స్కిల్స్ కూడా ఒక బోధనాంశంగా చేర్చాలి. కానీ ఈ శిక్షణ ఎవ్వరికీ ఇవ్వరు" అని అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత కూడా ఇందుకు ఒక కారణమే. ప్రతి ఆసుపత్రిలో 15-20 ఉద్యోగాలు (డాక్టర్లు/నర్సులు) ఖాళీగా ఉంటాయి. రోగుల సంఖ్య పెరుగుతోంది కానీ డాక్టర్లు, నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. రోగులు, వైద్య సిబ్బంది మధ్య సంఖ్యాపరంగా వ్యత్యాసం తగ్గించాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అన్నారు.
"ఒక వార్డులో ఇద్దరు మాత్రమే నర్సులున్నారు. కానీ పేషెంట్ల సంఖ్య 50-60 ఉంది. వీరిద్దరే అందర్నీ చూసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నర్సులకు కూడా ఇబ్బందే. పేషెంట్లను చూసుకుంటూనే వీరు రికార్డులను కూడా చూసుకోవాలి, సకాలంలో పేషెంట్లకు మందులు, ఇంజెక్షన్లు ఇవ్వాలి, పేషెంట్లు పిలిస్తే వెళ్లాలి. చాలా సందర్భాల్లో వీరికి సెలవులు దొరకడం కూడా కష్టమే!"
"సిబ్బంది కొరత నిజమే!"
ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత నిజమేనని దిల్లీలోని ‘బాబూ జగ్జీవన్‌రామ్ ఆసుపత్రి’ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిభ కూడా అన్నారు.
"ఇప్పటికీ చాలా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిల్లీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. అక్కడి ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తే, దిల్లీలోని ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది" అని డాక్టర్ ప్రతిభ అభిప్రాయపడ్డారు.
పేషెంట్ల పట్ల కరుణ చూపడం చాలా అవసరమన్నారు డాక్టర్ ప్రతిభ. "నర్సులు నిత్యమూ గర్భిణులతో ఉంటారు, అలాంటి సందర్భాల్లో వారికి సరైన శిక్షణ అవసరం" అని ఆమె అన్నారు.
కౌన్సెలింగ్ అవసరం
ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. అలాంటపుడు ప్రసవ సమయంలో నొప్పి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆసుపత్రుల్లో విధివిధానాలు ఎలా ఉంటాయి అన్న అంశాలకు సంబంధించి మహిళలకు అంగన్‌వాడీ స్థాయిలో కౌన్సెలింగ్ ఇవ్వాలి.
గర్భిణుల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించింది.
అందులో..
- ప్రసవ సమయంలో గర్భిణికి ప్రత్యేకమైన గది లేదా చోటు ఇచ్చి ఏకాంతాన్ని కల్పించాలి.
- పురుటి నొప్పులు వచ్చినపుడు కుటుంబ సభ్యులు గర్భిణి వద్దనే ఉండాలి.
- ప్రసవ సమయంలో గర్భిణికి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలానే ఉంచాలి.
- బల్లలను కాకుండా, లేబర్ బెడ్‌ను వాడాలి.
- గర్భిణులను మాటలతో కానీ, చేతల ద్వారా కానీ ఇబ్బందిపెట్టరాదు.
- వైద్యం చేస్తున్నపుడు, లేదా ప్రసవం తర్వాత డబ్బు అడగరాదు.
(ఈ వార్త 2018 ఆగస్టు 18న ప్రచురితమైంది. ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో మళ్లీ ప్రచురించాం.)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)