You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ వరదలు: ఫేక్‌న్యూస్ ప్రవాహం
- రచయిత, బీబీసీ
- హోదా, తెలుగు డెస్క్
బీబీసీ న్యూస్ తెలుగుకు ఓ వాట్సాప్ మెసేజ్. అదేంటంటే నీలం రంగులో ఉన్న రెండు భవనాలు వరదల్లో కూలిపోతున్న వీడియో. ఈ వీడియో కేరళ వరదలకు సంబంధించిందన్న క్యాప్షనూ ఆ వీడియోకి జత చేసి ఉంది. అప్పటికే అది చాలా గ్రూపుల్లో షేర్ అయిపోయింది. కేరళ వరదల్లో భవనం ఇలా కూలిపోయిందంటూ అది ఫార్వర్డ్ అవుతూనే ఉంది. మరి ఆ వీడియో.. కేరళ వరదలకు సంబంధించిందేనా?
ఓ చిన్న అనుమానం.
అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ప్రయత్నించాం. వీడియోలో మాటలు విన్నాం.. వింటే మలయాళం కాదనిపించింది.
వెంటనే బీబీసీ తమిళ్ సర్వీసులో మలయాళం తెలిసిన మిత్రులకు ఈ వీడియోను చూపించాం. వారు అందులో వినిపిస్తున్న మాటలు మలయాళం కాదని స్పష్టం చేశారు.
మరి ఈ వీడియో ఎక్కడిది?
అనుమానం తీరలేదు. మరింత బలపడింది. యూట్యూబ్‌లోఈ వీడియో కోసం వెతికాం. ఎవరు పోస్ట్ చేశారో ఆరా తీశాం.
అది కేరళ వరదల్లో భవనం కూలిపోతున్న వీడియో అని రెండు రోజుల కిందట పోస్ట్ అయి ఉంది.
ఆ వీడియో కామెంట్స్ చెక్ చేస్తే ఒక యూజర్ ఇది కేరళ కాదు.. కర్నాటకలోని కొడగులో కూలిన భవనం వీడియో అని పోస్ట్ చేసి ఉంది.
అప్పుడు కొడగులో కూలిపోయిన భవనాల వార్తలు.. వీడియోల కోసం వెతికాం.
మళ్లీ ఈ వీడియో ప్రత్యక్షమైంది. కొడగులో కూలిన భవనం అని పేర్కొంటూ పలువురు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కానీ ఏ వార్తా సంస్థా.. ఆ వీడియోని పోస్ట్ చేయలేదు.
మరి అసలు ఈ వీడియో ఎక్కడిది? తెలుసుకోవడం ఎలా?
మళ్లీ వెదికాం. ఇటీవల వరదలు ఎక్కడ వచ్చాయో ఆలోచించాం.
అసోం, పశ్చిమ బెంగాల్లో వరదలు వచ్చాయి కదా.. మళ్లీ ఆ ప్రాంతాల పేర్లతో భవనాలు ఎక్కడైనా కూలాయా అన్నది వెతికాం.
అప్పుడు పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కూలిన భవనం అంటూ ఇదే వీడియో కనిపించింది.
దాని ప్రకారం ఇది ఈ నెల 7న పోస్టయిన వీడియో.
ఆ రోజు బంకురా జిల్లాలో భవనం కూలిపోయిందన్న అంశానికి సంబంధించిన వార్తలు వచ్చాయేమో ఆరా తీస్తే.. ఈ వీడియో అక్కడిదేనని నిర్ధరణ అయింది.
స్థానిక బెంగాలీ మీడియా సహా ఇంగ్లిష్ మీడియా ఈ వార్తను ఆ రోజు ప్రసారం చేశాయి.
కానీ ఈ వీడియో మాత్రం కేరళ వరదలకు సంబంధించిందని సోషల్ మీడియా, వాట్సాప్‌లో విపరీతంగా ప్రచారమవుతోంది.
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు : పినరయి విజయన్
కేరళ వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ హెచ్చరించారు.
''ఇప్పటికే కేరళ వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్‌న్యూస్ ప్రచారం అవుతోంది. ఇది చాలా దురదృష్టకరం. దాన్ని అడ్డుకోవాలి. అధికారులు అందరూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.'' అని రెండు రోజుల కిందట విజయన్ పేర్కొన్నారు.
ఇడుక్కి జిల్లా కలెక్టర్ జీవన్ బాబు మాట్లడుతూ.. ముల్లైపెరియార్ డ్యాం భద్రతపైనా ఫేక్‌న్యూస్ ప్రచారమవుతోందని చెప్పారు.
వందేళ్లలో కనీవినీ ఎరుగని విధ్వంసం
కేరళలో వరదలు సృష్టించిన విధ్వంసానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ వరదలు, వర్షాల వల్ల జరిగిన ఇతర ప్రమాదాల్లో 324 మంది చనిపోయారని సమాచారం.
వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
కొండచరియలు విరిగిపడటంతో ఆ మట్టిలో కూరుకుపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోచి విమానాశ్రయాన్ని ఈ నెల 26 వరకు మూసివేస్తున్నట్లు తెలిసింది.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వందలాది సహాయక దళాలను రంగంలోకి దింపారు. హెలికాప్టర్లు, లైఫ్‌బోట్లతో బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)