You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
14 ఏళ్లుగా వాజ్‌పేయి ఏకాంతవాసం - ఇంతకూ ఆయనకు ఏమైంది?
- రచయిత, సిద్ధనాథ్ గాను
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2004, మే 13. ఏబీ వాజ్‌పేయి అప్పుడే తన చివరి కేబినెట్ సమావేశాన్ని ముగించి, రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. ఎన్నికలలో ఎన్డీయే ఓటమి పాలు కావడంతో దగ్గరలో ఉన్న ఔరంగజేబ్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు.
రాజీనామా సమర్పించిన తర్వాత వాజ్‌పేయి టీవీలో ప్రసంగిస్తూ, ''నా పార్టీ, మా కూటమి ఓటమి పాలై ఉండవచ్చు. కానీ భారతదేశం గెలిచింది'' అన్నారు.
వాజ్‌పేయి తర్వాత ప్రతిపక్ష నేతగా ఉంటారని కేబినెట్ సమావేశం తర్వాత సుష్మా స్వరాజ్ ప్రకటన కూడా చేశారు. కానీ దేశాన్ని తన వాగ్ధాటితో మైమరపించిన మనిషి రాజకీయ ఏకాంత వాసానికి వెళ్లనున్నారని, ఇకపై నిశబ్దంగా ఉండబోతున్నారని ఎవరికీ తెలీదు.
మంచి వాగ్ధాటి కలిగిన నేత, కవి, జెంటిల్‌మ్యాన్ పొలిటీషియన్‌గా పేరొందిన ఏబీ వాజ్‌పేయి గత 14 ఏళ్లలో ప్రజల మధ్య కనిపించింది చాలా అరుదు. ఇంతకూ ఆయనకు ఏమైంది?
2004లో 'ఇండియా షైనింగ్' అనే ప్రచారం చేసినా బీజేపీ ఓడిపోయింది. తన 'అంతరాత్మ' ప్రబోధంతో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిని చేయడం జరిగింది. ఎల్ కే అడ్వాణీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు.
వాజ్‌పేయి క్రమక్రమంగా ప్రజాజీవితం నుంచి కనుమరుగయ్యారు.
2005లో ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగిన బీజేపీ రజతోత్సవ వేడుకల్లో తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు వాజ్‌పేయి ప్రకటించారు. వాగ్ధాటికి పేరొందిన వ్యక్తి ఆ ర్యాలీలో అతి తక్కువగా మాట్లాడారు.
వాజ్‌పేయి అప్పటికింకా లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన క్రమం తప్పకుండా పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు ఆరోగ్యం సహకరించలేదు. 2007లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఆయన తన ఓటు వేశారు. ఆ సందర్భంగా - ఆయన వీల్ ఛెయిర్‌లో వచ్చిన దృశ్యం చాలా మంది హృదయాలను కలచివేసింది.
2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున వాజ్‌పేయి ప్రచారం చేస్తారని చాలా మంది భావించారు. లక్నోలో నిర్వహించిన ప్రచారంలో మాత్రం ఆయన పాల్గొన్నారు.
2007లో వాజ్‌పేయి నాగ్‌పూర్‌లో జరిగిన ఓ ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు వీల్ ఛెయిర్‌లో ఉన్న వాజ్‌పేయిని స్టేజి మీదకు ఎక్కించడానికి లిఫ్టును ఏర్పాటు చేశారు.
2009లో ఎంపీగా తన పదవీకాలం పూర్తయ్యాక ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఇంతకూ వాజ్‌పేయి అనారోగ్య సమస్య ఏమిటి?
2000లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆయన మోకాలికి సర్జరీ జరిగింది. 2004 తర్వాత ఆయన ఎక్కువగా కదలకూడదని వైద్యులు సూచించారు.
2009లో వాజ్ పేయికి ఒకసారి గుండెపోటు వచ్చింది. నాటి నుంచి ఆయన సరిగా మాట్లాడలేకున్నారని ఆయన దీర్ఘకాల స్నేహితుడు, ఎన్ ఎమ్ ఘాటాటే తెలిపారు.
వాజ్‌పేయి అల్జీమర్స్ లేదా డిమెన్షియాతో బాధపడుతున్నారని అనుమానాలున్నాయి. ఆయనకు కొంత జ్ఞాపకశక్తి తగ్గిందన్నది నిజమే కానీ, ఎవరూ అధికారికంగా దీనిని నిర్ధారించలేదు. గత 15 ఏళ్లుగా వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రణదీప్ గులేరియా కూడా ఈ డిమెన్షియా వార్తలను ఖండించారు.
వాజ్‌పేయికి చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. స్వీట్లను కూడా ఆయన బాగా ఇష్టపడతారు. అయితే మధుమేహ వ్యాధి, కిడ్నీ సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా వాటిని పరిమితంగా ఆయనకు అందించారు.
2015 మార్చిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రీ మోదీలు దిల్లీలోని వాజ్‌పేయి నివాసంలోనే ఆయనకు భారతరత్న పురస్కారం అందజేశారు. ప్రజలు అప్పుడు వీల్ చెయిర్‌లో ఉన్న వాజ్‌పేయిని చూశారు.
వాజ్‌పేయి ఎక్కడ ఉన్నారు?
చాలా ఏళ్లుగా వాజ్‌పేయి తన దత్తపుత్రిక నమితా భట్టాచర్యతో పాటు కృష్ట మీనన్ మార్గ్‌లోని తన నివాసంలో ఉంటున్నారు.
డాక్టర్లతో పాటు వాజ్‌పేయిని ఆయన స్నేహితుడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎన్ ఎమ్ ఘటాటే, ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి, ఆయన దీర్ఘకాల సహచరుడు ఎల్ కే అడ్వాణీ సందర్శించేవారు.
ఏటా డిసెంబర్ 25న ఆయన జన్మదినం రోజున చాలా కొద్ది మంది మాత్రమే మరచిపోకుండా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వారిలో ఒకరు.
వాజ్‌పేయి గురించి ఎన్ ఎమ్ ఘటాటే ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు.
''1991లో పీవీ నరసింహారావు వాజ్‌పేయికి ఫోన్ చేశారు. 'నువ్వు బడ్జెట్‌పై ఎంత తీవ్రమైన విమర్శలు చేశావంటే, దీనిపై నొచ్చుకుని మా ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనుకుంటున్నారు' అన్నారు. దీంతో వాజ్‌పేయి మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి, ఆ విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని, దానిని కేవలం రాజకీయ ప్రసంగంగానే తీసుకోవాలని కోరారు. నాటి నుంచి వారిద్దరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది'' అని తెలిపారు.
అడ్వాణీ తరచుగా వాజ్‌పేయిని కలుస్తుంటారు. కొన్ని దశాబ్దాల పాటు వారిద్దరినీ రామలక్ష్మణులుగా పేర్కొనేవారు.
ఆ రామలక్ష్మణుల్లో - లక్ష్మణుడు అడ్వాణీ బీజేపీకి మార్గదర్శకులు కాగా, రాముడైన వాజ్‌పేయి 14 ఏళ్లుగా ఏకాంతవాసంతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)