You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈయన ప్రపంచంలోనే అత్యంత పేద మాజీ అధ్యక్షుడు
ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు హోజె ముహికాను ప్రపంచంలో అత్యంత నిరుపేద మాజీ అధ్యక్షుడుగా చెప్పుకుంటారు. దానికి కారణం... చాలా మామూలుగా ఉండే ఆయన జీవనశైలే. రాజకీయాల నుంచి రిటైరైన తర్వాత ఆయన తన పెన్షన్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు.
అధ్యక్ష పదవి తర్వాత ముహికా 2015 నుంచి ఉరుగ్వే పార్లమెంటులో సెనేటర్‌గా కూడా ఉన్నారు. టర్మ్ పూర్తికావడానికి ముందే ఈ వారంలో ఆయన తన సెనేటర్ పదవికి రాజీనామా చేశారు.
ఆయన 2020 వరకూ ఆ పదవిలో ఉండాలి. కానీ సుదీర్ఘ యాత్రతో అలసిపోయానని 83 ఏళ్ల ముహికా తన రాజీనామా లేఖలో తెలిపారు.
సెనేట్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు లూసియా తోపోలాస్కీకి ముహికా తన రాజీనామాను అందించారు. ఆమె ఆయన భార్య కూడా.
వ్యక్తిగత కారణాలతో సెనేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
లెఫ్టిస్టు అయిన ముహికా తన రాజీనామా లేఖలో "నా మెదడు పనిచేసినంత కాలం ఆలోచనలతో సాగే యుద్ధానికి రాజీనామా చేయను" అని తెలిపారు.
ముక్కుసూటిగా మాట్లాడే విప్లవ నేత
ఒక్కోసారి ముక్కుసూటిగా, అప్పుడప్పుడూ సృజనాత్మకంగా మాట్లాడతారని ముహికాకు మంచి పేరుంది. తన ప్రవర్తనతో సహచరులు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కూడా ఆయన తన రాజీనామా లేఖలో కోరారు.
2013లో ఆయన అర్జెంటీనా తాత్కాలిక అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. అధ్యక్షురాలు క్రిస్టినాను 'ముసలి దెయ్యం' అన్న ముహికా, ఆమె భర్త అర్జెంటీనా మాజీ అధ్యక్షుడు నేతోర్ కిర్సనెర్ కళ్ల గురించి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మైక్రోఫోన్ ఆన్ అయ్యి ఉందని, తన వ్యాఖ్యలు అందులో రికార్డ్ అవుతున్నాయని ఆయన ఊహించలేకపోయారు.
ముహికా 2016లో వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరోను కూడా 'మేక లాంటి పిచ్చోడు' అనేశారు.
మామూలు జీవనశైలి
అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విశాలంగా ఉండే అధ్యక్ష భవనంలో ఉండడానికి ఆయన నిరాకరించారు.
ఆయన, తన భార్యతో కలిసి రాజధాని మోంటేవిడియో బయట ఒక ఫాం హౌస్‌లో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ అంతకు ముందు తిరుగుబాటు బృందంలో సభ్యులుగా కూడా పనిచేశారు.
అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన తన జీతంలో ఎక్కువ భాగం దానధర్మాలు చేశారు. 2010లో అధ్యక్షుడు అయినప్పుడు ఆయన దగ్గర ఒకే ఒక ఆస్తి ఉండేది. ఒక 1987 ఫోక్స్ వ్యాగన్ బీటల్ కార్.
లేత నీలి రంగులో ఉండే ఆయన కారు చాలా పాపులర్. 2014లో ఒకరు దాన్ని కొనడానికి ఆయనకు 10 లక్షల డాలర్లు ఆఫర్ చేశారు. కానీ ఆయన కారు అమ్మనని చెప్పేశారు. ఆ కారు లేకుంటే తన కుక్కను బయటకు తీసుకెళ్లడం కుదరదని అన్నారు.
ముహికా సెనేటర్ పదవికి హఠాత్తుగా రాజీనామా చేయలేదు. ఆగస్టు 3న తను చివరిసారి పార్లమెంటుకు వస్తానని ఆయన మొదటి నుంచీ చెబుతూనే వచ్చారు.
ముహికా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో లేదో తమకు నమ్మకం కలగడం లేదని పార్లమెంటు సమావేశాల్లో ఆయన ప్రత్యర్థులు అన్నారు.
2019లో తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇప్పుడు రాజీనామా చేసినట్టు వదంతులు వస్తున్నాయని సెనేటర్ లూయిస్ ఆల్బర్ట్ హీబర్ ఆరోపించారు.
"మీరు మీ ఖాళీ సమయంలో, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా, విశ్రాంతి తీసుకుంటే మాకు నిజంగా చాలా బాగుంటుంది, మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు" అని హీబర్ అన్నారు.
సోషల్ మీడియాలో ముహికా సహచరులు ఆయనకు శుభాకాంక్షలు పోస్ట్ చేస్తుంటే, విమర్శకులు మాత్రం 1960, 70లలో తిరుగుబాటు బృందం సభ్యుడు అయిన ముహికా అప్పట్లో తను చేసిన వాటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవికూడా చదవండి.
- ప్రపంచ ఆకలి తీర్చే గోదుమ ‘జన్యుపటం‘
- ఎలుగుబంట్ల ప్రయాణం: జపాన్ టు బ్రిటన్
- స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించిన చిన్నారులు
- పసిఫిక్ దేశాధినేతలంతా బరువు తగ్గాలంటున్న టోంగా ప్రధాని
- ఇవి చైనా సృష్టించిన కృత్రిమ దీవులు
- తిమింగలం మాతృప్రేమ: చనిపోయిన పిల్ల తిమింగలంతో 1,600 కిలోమీటర్ల ప్రయాణం
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)