మియన్మార్‌: రోహింజ్యాల హత్యాకాండలో ఫేస్‌బుక్ పాత్ర ఎంత?

రోహింజ్యాలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎగదోయడంలో ఫేస్‌బుక్ కూడా కీలకపాత్ర పోషించిందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది.

ఏ ఉద్దేశంతో ఫేస్‌బుక్ ప్రారంభమైందో, దానికి భిన్నంగా అది ఒక మృగంలా మారిందని మియన్మార్‌లోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి యాంఘీ లీ అన్నారు.

రోహింజ్యాల హత్యాకాండ విషయంలో తన వైఫల్యాలను అంగీకరించిన ఫేస్‌బుక్‌, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రపంచంలోని ప్రజలందరినీ కలిపే ఉన్నత లక్ష్యంతో ఏర్పడిన ఫేస్‌బుక్‌ ఎక్కడ తప్పు చేసింది?

అయిదేళ్ల క్రితం మియన్మార్‌లో పరిస్థితి భిన్నంగా ఉండేది. దేశంలో మిలటరీ పాలన ఉన్నపుడు ఆ దేశంపై బయటి దేశాల ప్రభావం అంత ఉండేది కాదు. కానీ, ఆంగ్ సాన్ సూచీ విడుదల, ప్రభుత్వాధినేతగా ఆమె ఎన్నిక కావడంతో వాణిజ్యంలో, మరీ ప్రధానంగా టెలికాం రంగంలో సరళీకరణ విధానాలు తీసుకువచ్చారు.

దాంతో, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటివరకు ఒక సిమ్ కార్డు ధర సుమారు రూ. 15 వేలు ఉండేది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో అది రూ.150 రూపాయలకే లభించడం మొదలైంది.

తక్కువ ధరకే సిమ్ కార్డు, తక్కువ ధరకు లభించే ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో మియన్మార్‌లో అందరికీ ఒక యాప్ కావాల్సి వచ్చింది. అదే - ఫేస్‌బుక్‌. ఎందుకంటే గూగుల్, ఇతర ఆన్‌లైన్ పోర్టల్స్ బర్మీస్ లిపిని సపోర్ట్ చేసేవి కావు. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం ఆ సదుపాయం ఉండేది.

అయితే, అప్పటివరకు చాలా మంది మియన్మార్ ప్రజలకు ఇంటర్నెట్, సోషల్ మీడియా గురించి పెద్దగా తెలీకపోవడం, సమాచారాన్ని ఎలా ఫిల్టర్ చేయాలో తెలీకపోవడంతో దుష్ప్రచారం చేయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం సులభంగా మారింది.

జాతిపరమైన ఉద్రిక్తతలు

మియన్మార్‌లో మొత్తం 5 కోట్ల మంది జనాభా ఉండగా, దాదాపు 1.8 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్లు ఉన్నారు.

అయితే, టెలికాం కంపెనీలు, ఫేస్‌బుక్‌ - దేశంలో జాతి, మతపరమైన ఉద్రిక్తతల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాత్రం వాళ్లకు వివరించలేకపోయాయి.

మియన్మార్‌లో రోహింజ్యాలు, బౌద్ధులకు తీవ్రమైన శతృత్వం ఉంది. రోహింజ్యాలకు ఆ దేశంలో పౌరసత్వాన్ని నిరాకరించారు. అధికారిక బౌద్ధ వర్గం రోహింజ్యాలను ఒక ప్రత్యేకమైన జాతిగా కూడా గుర్తించదు. దానికి బదులుగా వాళ్లను 'బెంగాలీలు' అని పిలుస్తూ, మిగతా దేశ పౌరులకు భిన్నంగా చూస్తారు.

పోయిన ఏడాది రఖైన్ రాష్ట్రంలో జరిగిన మిలటరీ ఆపరేషన్‌, మిలిటెంట్లను నిర్మూలించేందుకే అని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆపరేషన్ కారణంగా దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

రఖైన్ రాష్ట్రంలో జరిగిన మారణకాండపై మిలటరీ ఉన్నతాధికారులను విచారించాలని ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటికీ, మియన్మార్ ప్రభుత్వం మాత్రం దానిని తోసిపుచ్చింది.

ఆయుధంగా మారిన 'ఫేస్‌బుక్‌'

మియన్మార్‌లో జాతిపరమైన ఉద్రిక్తతలు, పెరుగుతున్న సోషల్ మీడియా మార్కెట్ - రెండూ కలిసి విషపూరితంగా మారాయి. దేశంలో అప్పుడప్పుడే సోషల్ మీడియా వాడకం పెరుగుతుండడంతో, రోహింజ్యాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు రావడం ప్రారంభించాయి.

జాతుల మధ్య విద్వేషాలు తొలగించడానికి కృషి చేస్తున్న 'సినర్జీ' సంస్థ డైరెక్టర్ థెట్ స్వేయ్ విన్, రోహింజ్యాంలకు వ్యతిరేకంగా చేసే పోస్టులు తనకు భయం కలిగించేవని తెలిపారు. ఆ సమయంలో ఫేస్‌బుక్‌ను ఒక ఆయుధంగా మార్చుకున్నారని అన్నారు.

ఆగస్టులో రాయిటర్స్ వార్తా సంస్థ చేసిన పరిశోధనలో - రోహింజ్యాలు, ఇతర ముస్లింలకు వ్యతిరేకంగా వేయికి పైగా పోస్టులు, కామెంట్లు, నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో కనిపించినట్లు వెల్లడైంది.

దాంతో తాను వాటిని ఫేస్‌బుక్‌కు పంపిపనట్లు రాయిటర్స్ ఇన్వెస్టిటేటింగ్ రిపోర్టర్ స్టీవ్ స్టెక్లో తెలిపారు. స్టీవ్ ఫేస్‌బుక్‌కు పంపిన కొన్ని పోస్టుల్లో రోహింజ్యాలను పందులు, కుక్కలంటూ కించపరిచారు.

''అసలు వాళ్లను మనుషులుగానే గుర్తించకుండా చేశారు. దాంతో, వాళ్లపై హత్యాకాండ జరిగినపుడు, వాటిపై నోరు మెదిపే వాళ్లే ఉండరు'' అని స్టీవ్ అన్నారు.

రాయిటర్స్ బృందం ఫేస్‌బుక్‌కు పంపిన పోస్టులు ఆ సంస్థ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. తర్వాత ఆ పోస్టులలో చాలా వాటిని తొలగించారు. అయితే, బీబీసీ విచారణలో అలాంటి పోస్టులు ఇంకా కొన్ని ఉన్నట్లు తేలింది.

ఇంతకూ ఫేస్‌బుక్‌ అలాంటి ద్వేషపూరిత ప్రచారాన్ని ఎలా విస్మరించింది?

దీనికి ఒక ప్రధాన కారణం, కొన్ని పదాలను అనువాదం చేయడం ఫేస్‌బుక్‌కు కష్టంగా మారడమే అని స్టీవ్ లాంటి విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు 'కలార్' అంటే మియన్మార్‌లో ముస్లింలను కించపర్చడానికి వాడే అవమానకరమైన పదం. అయితే దానికి 'సెనగలు' అనే సాధారణ అర్థం కూడా ఉంది.

2017లో ఫేస్‌బుక్‌ ఆ పదాన్ని నిషేధించినా, దానికి రెండు అర్థాలు ఉండడంతో తిరిగి ఆ పదాన్ని అనుమతించారు.

అంతే కాకుండా మియన్మార్ ఫేస్‌బుక్‌ కాంటెంట్‌ను పర్యవేక్షించే వారి కొరత కూడా ఉండేది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2014లో అలాంటి సిబ్బంది కేవలం ఒక్కరే ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 60 ఉండగా, ఈ ఏడాది చివరికి వారి సంఖ్యను 100కు పెంచాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

తప్పు అంగీకరించిన ఫేస్‌బుక్‌

మియన్మార్‌లో ఫేస్‌బుక్‌ వినియోగం బాగా పెరగడంతో, ఆ వేదిక ద్వారా రోహింజ్యాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత భావాలను ప్రచారం చేస్తున్నట్ల అనేకసార్లు హెచ్చరించారు. మొదట్లో ఫేస్‌బుక్‌ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే గత ఏడాది ఆగస్టులో మాత్రం అలాంటి 12 అకౌంట్లు, 52 పేజీల లింకులను తొలగించింది.

ఈ ఏడాది జనవరిలో ఫేస్‌బుక్‌, ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని పేరున్న అశిన్ విరతు అనే బౌద్ధసాధువు అకౌంట్‌ను కూడా తొలగించింది.

మియన్మార్‌లో విద్వేషపూరిత సమాచారాన్ని కట్టడి చేసే విషయంలో తాము చాలా నెమ్మదిగా స్పందించిన విషయం వాస్తవమే అని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో అంగీకరించింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా కొత్తగా అందుబాటులోకి వచ్చిన దేశాలలో ఇలాంటి ద్వేషపూరిత భావాజలాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఏప్రిల్‌లో ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట హాజరైనప్పుడు, ఆయనను ప్రత్యేకంగా మియన్మార్‌లో జరిగిన సంఘటనలపై ప్రశ్నించారు.

వాటికి సమాధానమిస్తూ ఆయన, తాము బర్మా భాష తెలిసిన వారిని చాలా మందిని సంస్థలో చేర్చుకుంటున్నామని, స్థానిక బృందాలతో కలిసి ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం మియన్మార్‌లో ఫేస్‌బుక్ పాత్రపై పరిశోధన జరుగుతున్నా, ఇది సమస్యలోని ఒక కోణం మాత్రమే అని, సోషల్ మీడియా పర్యవసానాలు సమస్యలు చాలా లోతైనవి అని బీబీసీ మీడియా యాక్షన్ ప్రతినిధి ఎలిజబెత్ మియార్న్స్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)