You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?
- రచయిత, జుబిన్ బెఖ్రాడ్
- హోదా, బీబీసీ కల్చర్
హాలీవుడ్ చిత్రాలు స్టార్ వార్స్, గేమ్ ఆప్ థ్రోన్స్‌లను ప్రభావితం చేసింది. డివర్స్, వోల్టైర్, నీషే, ఫ్రెడ్డీ మెర్క్యురీ వంటి వారికి ప్రేరణగా నిలిచింది. ఇలా ఎందరినో ప్రేరేపించిన జొరాస్ట్రియనిజం అంటే ఏంటో తెలుసుకుందాం.
పశ్చిమ దేశాల్లోని ఇరాన్ సంబంధిత రాజకీయాల్లో 'మనం', 'వారు' అనే చర్చ చాలా కాలం ఆధిపత్యం ప్రదర్శించింది.
అదే సమయంలో యూఎస్, యూరప్ దేశాల విలువలను, గుర్తింపును నిర్వచించడానికి... మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన అవే విలువలను విభేదించడానికి క్రైస్తవ మతాన్ని తరచుగా ఉపయోగించేవారు.
అయినప్పటికీ, ఇప్పటికీ ఆచరణలో ఉన్న పురాతన మతం జొరాస్ట్రియనిజం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది పాశ్చాత్య ఆదర్శాలు, నమ్మకాలు, సంస్కృతిగా భావించేవి నిజానికి ఇరానియన్ మూలాలు కలిగి ఉండొచ్చని తెలుస్తోంది.
పురాతన ఇరానియన్ ప్రవక్త జరతుస్ట్రా (పర్షియన్‌లో జర్తోష్ట్, గ్రీకులో జొరాస్టర్) క్రీ.పూ 1500-1000 కాలం మధ్య జీవించి ఉంటారని పరిశోధకులు నమ్ముతారు.
జరతుస్ట్రాకు ముందు పర్షియన్లు పాత ఇరానో-ఆర్యన్ మతానికి చెందిన దేవతలను పూజించారు. ప్రస్తుతం హిందుత్వంగా పిలుస్తోన్న ఇండో-ఆర్యన్ మతం పరిడవిల్లిన కాలంలోనే ఇరానో-ఆర్యన్ మతం కూడా విరాజిల్లింది.
మతాల ఆచరణను జరతుస్ట్రా ఖండించారు. 'దేవుడు ఒక్కడే' అని ఆయన బోధించారు. తెలివికి ప్రతిరూపమైన 'అహురా మజ్దా'ను పూజించాలని చెప్పారు.
ఇలా చేయడం వల్ల ఆయన ఇరానియన్లు, ఇండియన్ ఆర్యన్ల మధ్య పెద్ద విభజనను తీసుకురావడంతో పాటు మానవజాతికి దేవుడొక్కడే అనే నమ్మకాన్ని తొలిసారి పరిచయం చేశారు.
దేవుడొక్కడే అనే భావన కేవలం జొరాస్ట్రియన్లే కాకుండా జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు కూడా ఇతర ప్రధాన విశ్వాసాలను కనుగొనేలా చేసింది.
స్వర్గం, నరకం, దేవతలు, దెయ్యాలు, జడ్జిమెంట్ డే ఇలాంటి భావనలన్నీ జరతుస్ట్రా బోధనల నుంచి ఉద్భవించాయి. జొరాస్ట్రియన్ సాహిత్యం కూడా ఇలాగే వచ్చింది.
చివరకు సైతాను అనే భావన కూడా ప్రాథమికంగా జొరాస్ట్రియన్లకు చెందినదే.
నిజానికి జొరాస్ట్రియన్ మత విశ్వాసాన్ని.... దేవుడు, మంచి, జ్ఞాన వెలుగులకు ప్రాతినిధ్యం వహించే హోలీ స్పిరిట్, స్పెంటా మ్యాన్యులతో చెడుకు, చీకటికి నాయకత్వం వహించే అహ్రిమాన్‌ల మధ్య పోరాటంగా అంచనా వేశారు.
ఈ పోరాటంలో తాను ఏ పక్షానికి చెందినవాడో మానవుడు ఎంచుకోవాల్సి ఉంటుంది. చివరకు దేవుడే విజయం సాధిస్తాడు. నరకానికి వెళ్లేవారు కూడా స్వర్గం ఆశీర్వాదాలను పొందుతారు అని ఈ మతం బోధిస్తుంది.
జొరాస్ట్రియన్ల ఆదర్శాలు అబ్రహామిక్ విశ్వాసాల్లోకి ఎలా ప్రవేశించాయి?
ఈ భావనల్లో చాలావరకు పర్షియన్ చక్రవర్తి సైరస్ ది గ్రేట్ ద్వారా బాబిలోన్‌లోని యూధులకు పరిచయం అయ్యాయని నిపుణులు పేర్కొంటారు. అవి యూధుల ప్రధాన ఆలోచనల్లోకి ప్రవేశించడం వల్ల బీల్జెబబ్ వంటి వ్యక్తులు పుట్టుకొచ్చారు.
అషెమెనిడ్ సామ్రాజ్య ప్రాబల్యం ఉన్నతంగా ఉన్న సమయంలో గ్రీకు ప్రాంతాలను పర్షియా స్వాధీనం చేసుకున్న తర్వాత గ్రీకు ఫిలాసఫీ భిన్నమైన పంథాను తీసుకుంది.
గ్రీకులు అంతకుముందు మానవులు తక్కువ అధికారాన్ని కలిగి ఉంటారని, తాము నమ్మే దేవతలపైనే తమ అదృష్టం అధారపడి ఉంటుందనే నమ్మేవారు.
కానీ జొరాస్ట్రియం మతం, దాని తత్వంతో పరిచయం ఏర్పడ్డాక గ్రీకులు... మన విధికి మనమే విధాతలం అని నమ్మడం మొదలుపెట్టారు. మన నిర్ణయాలు మన చేతుల్లోనే ఉంటాయని భావించడం ప్రారంభించారు.
జొరాస్ట్రియనిజంతో డాంటే కూడా ప్రభావితమయ్యారా?
ఒకప్పుడు కేవలం ఇరాన్ దేశ మతంగా ఉన్నప్పటికీ జొరాస్ట్రియన్ మతాన్ని పర్షియన్లు నివసించే అనేక ప్రాంతాల వారూ ఆచరించేవారు. ఉదాహరణకు అఫ్గానిస్తాన్, తజికిస్తాన్‌తో పాటు సెంట్రల్ ఆసియాలో ఎక్కువభాగం ఈ మతం ఆచరణలో ఉండేది.
కానీ ఇప్పుడు ఇరాన్‌లోనే ఇది మైనారిటీ మతంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్వల్ప స్థాయిలో ఈ మతానికి అనుచరులు ఉన్నారు.
జొరాస్ట్రియన్ల సాంస్కృతిక వారసత్వం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా జొరాస్ట్రియన్ సంప్రదాయాలు, ఇరానియన్ సంస్కృతికి మద్దతుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అవతల, ముఖ్యంగా పశ్చిమ యూరప్‌లో ఇది చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపింది.
జొరాస్ట్రియన్ కావ్యాలు
డాంటే రచించిన డివైన్ కామెడీ కంటే శతాబ్దాల ముందే ఉనికిలో ఉన్న 'ఆర్డా విరాఫ్' అనే పుస్తకం స్వర్గం-నరకానికి మధ్య ప్రయాణాన్ని క్షుణ్ణంగా వివరించింది.
10వ శతాబ్ధంలోనే తుది రూపుకు వచ్చిన ఈ ఆర్డా విరాఫ్ పుస్తకం గురించి డాంటే విని ఉండే అవకాశం ఉందా? ఈ రెండు పుస్తకాల మధ్య ఉన్న సారూప్యత అసాధారమైనది.
16వ శతాబ్ధంలో రాఫెల్ వేసిన పేయింటింగ్ 'స్కూల్ ఆఫ్ ఏథెన్స్'లో ఇరానియన్ ప్రవక్త మెరిసే గ్లోబ్‌ను పట్టుకున్నట్లుగా కనిపిస్తారు.
అలాగే 17వ శతాబ్దం చివర, 18వ శతాబ్దం మొదట్లో రసవాదం (ఆల్కెమీ)పై జర్మన్ భాషలో రాసిన 'క్లావిస్ ఆర్టిస్' పుస్తకాన్ని జరాతుస్ట్రాకు అంకితం ఇచ్చారు. అందులో జరాతుస్ట్రాకు సంబంధించిన అనేక క్రైస్తవ నేపథ్య వర్ణనలను పొందుపరిచారు.
''ముఖ్యంగా పునరుజ్జీవనం తర్వాత జొరాస్టర్ ఒక మ్యాజిక్ మాస్టర్‌గా, తత్వవేత్తగా, జ్యోతిష్కునిగా గుర్తింపు పొందారు'' అని లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ యూనివర్సిటీకి చెందిన ఉర్సులా సిమ్స్ విలియమ్స్ చెప్పారు.
ఈరోజు 'జాడిగ్' అనే పేరును తలచుకోగానే వెంటనే ఫ్రాన్స్ ఫ్యాషన్ లేబుల్ 'జాడిగ్ అండ్ వోల్టైర్' దుస్తుల కంపెనీ మనకు గుర్తుకు వస్తుంది. ఈ కంపెనీ దుస్తులకు జొరాస్ట్రియన్లకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కంపెనీ పేరు వెనుక కథకు మాత్రం జొరాస్ట్రియన్లతో సంబంధం ఉంది.
18వ శతాబ్దం మధ్యలో వోల్టైర్ రచించిన జాడిగ్ పుస్తకంలో... ఫిలాసఫర్ అయిన ఒక జొరాస్ట్రియన్ హీరో కథను వర్ణిస్తారు. ఈ కథలో హీరో అనేక సవాళ్లు, కష్టాలు ఎదుర్కొన్న తర్వాత చివరకు బాబిలోనియన్ యువరాణిని వివాహం చేసుకుంటారు.
ఆ సమయంలో ఈ కథ అలక్ష్యానికి గురైనప్పటికీ వోల్టైర్, ఇరాన్‌పై ఉన్న వాస్తవ ఆసక్తుల ఆధారంగా ఈ కథను రాశారు. జ్ఞాన వృద్ధికి మార్గంగా అనేక మంది నాయకులు ఈ కథను పంచుకున్నారు.
వోల్టైర్ ఇరానియన్ సంస్కృతికి ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఈ కారణంగానే ఆయనను అందరూ 'సాది'గా పిలిచేవారు.
పర్షియన్ కవి హఫీజ్‌కు అంకితం ఇచ్చిన గోయెథ్ రాసిన 'వెస్ట్-ఈస్ట్ దివాన్' కవితా సంకలనంలో కూడా జొరాస్ట్రియన్ నేపథ్యమున్న అధ్యాయాలు ఉన్నాయి.
జొరాస్ట్రియనిజం కేవలం పాశ్చాత్య సాహిత్యం, కళలపైనే కాకుండా యూరోపియన్ వేదికపై అనేక సంగీత ప్రదర్శనల్లోనూ తన ముద్ర వేసింది.
సారస్ట్రో అనే అర్చక పాత్రతో పాటు మోజార్ట్స్ కంపోజ్ చేసిన 'ది మ్యాజిక్ ఫ్లూట్'లోని లిబ్రెట్టో గీతం కూడా జొరాస్ట్రియన్ నేపథ్యాలను కలిగి ఉంటుంది.
బ్రిటిష్ ప్రముఖ రాక్ సింగర్, గీత రచయిత అయిన దివంగత ఫరోఖ్ బుల్సారా అఖా ఫ్రెడ్డీ మెర్క్యురీ, తన పర్షియన్ జొరాస్ట్రియన్ వారసత్వం పట్ల అమితమైన గర్వాన్ని కలిగి ఉండేవారు.
''నేనెప్పుడూ పర్షియా పాటగాడిలాగే ఉంటాను. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు '' అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
ఆయన సోదరి కశ్మీరా కూకి, 2014లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తమ కుటుంబంలో జొరాస్ట్రియనిజం పాత్ర గురించి మాట్లాడారు. '' ఒక కుటుంబంగా మేం జొరాస్ట్రియన్లు అయినందుకు చాలా గర్వపడుతున్నాం. కష్టపడి పనిచేయడం, పట్టుదల ప్రదర్శించడం, కలలను అన్వేషించడం వంటి లక్షణాలన్నీ ఫ్రెడ్డీకి జొరాస్ట్రియన్ విశ్వాసాల వల్లే కలిగాయి'' అని ఆమె చెప్పారు.
వారసత్వ ప్రభావం
ఇక సంగీతం విషయానికొస్తే, జొరాస్ట్రియనిజం వారసత్వ ప్రభావాన్ని రిచర్డ్ స్ట్రాస్ కవిత 'దస్ స్పోక్ జరాతుస్ట్రా' కంటే ఉత్తమంగా ప్రతిబింబించేది మరొకటి లేదు. స్టాన్లీ కుబ్రిక్స్ దర్శకత్వం వహించిన '2001: ఎ స్పేస్ ఒడిస్సీ' అనే చిత్రానికి కూడా ఇదే మూలం.
జర్మన్ తత్వవేత్త నీషే రచన మాగ్నమ్ ఓపస్‌కు కూడా ఇదే స్ఫూర్తి. కానీ నీషే ఆలోచనల్లో చాలావరకు జొరాస్ట్రియనిజానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఆయన ఈ మతం లక్షణాలైన మంచి, చెడుల మధ్య ద్వంద్వత్వాన్ని తిరస్కరిస్తారు. ఒక నాస్తికుడిగా, ఏకేశ్వరోపాసనను కూడా ఆయన విశ్వసించరు.
ఫ్రెడ్డీ మెర్క్యురీ, జాడిగ్ & వోల్టైర్‌లను పక్కన పెడితే పశ్చిమాన సమకాలీన సంస్కృతిపై జొరాస్ట్రియనిజం ప్రభావానికి సంబంధించిన ఇతర ఉదాహరణలు కూడా ఉన్నాయి.
అహురా మజ్దా అనే కార్ కంపెనీపై, గతేడాది అభిమానులను అలరించిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలోని లెజెండ్ అజర్ అహాయ్ పాత్రకు ఈ మతమే స్ఫూర్తి.
అలాగే, స్టార్ వార్స్‌లోని కాస్మిక్ యుద్ధం కూడా జొరాస్ట్రియనిజం నుంచి స్ఫూర్తి పొందినదే అని చెప్పవచ్చు.
పాశ్చాత్య ఆలోచనలు, మతం, సంస్కృతికి అన్ని రకాల సేవలు అందించినప్పటికీ ప్రపంచంలోని మొట్టమొదటి ఏకేశ్వరోపాసన భావనను కలిగించిన ఈ మతం గురించి దాని వ్యవస్థాపకుడి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.
చాలామంది యూఎస్, యూరోపియన్ రాజకీయ నాయకులకు ఇరాన్ ఒక వ్యతిరేక ధృవంగా కనబడుతుంది. మిగతా ప్రపంచమంతా కోరుకునేదాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తుందని వారు నమ్ముతారు.
ఇరాన్‌కు చెందిన ఇతర వారసత్వాలను, ప్రభావాలను పక్కన బెడితే... 'మనం', 'వారు' అనే పదాల మధ్య సారుప్యతను అర్థం చేసుకోవడానికి జొరాస్ట్రియనిజం ఒక కీలక అంశంగా ఉపయోగపడొచ్చు.
అంత్యక్రియలు ఇలా..
మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడంలో జొరాస్ట్రియన్ల శైలి భిన్నంగా ఉంటుంది. మృతదేహాలను రాబందులు, పక్షులు తినేందుకు వదిలేస్తుంటారు.
శరీరం నుంచి చివరి శ్వాస బయటకు వెళ్లిపోయిన వెంటనే, అది అపవిత్రం అవుతుందని జొరాస్ట్రియన్లు భావిస్తుంటారు. భూమితోపాటు భూమిపై ఉండే ప్రతిదాన్నీ దేవుడు సృష్టించాడని వీరు భావిస్తారు. కానీ, మరణం మాత్రం చెడుకు ప్రతిరూపమైన ''అంగిరా మైన్యు'' చర్యగా వీరు నమ్ముతారు.
అందుకే పవిత్రమైన నేల, గాలి, అగ్ని, నీరుతో చెడుకు ప్రతీకగా భావించే మృతదేహాన్ని కలపడం పాపంగా పరిగణిస్తారు.
మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా వీరు ఎత్తైన ప్రదేశాల్లో ఎండలో వదిలేస్తారు. రాబందుల్లాంటి పక్షులు వీటిని తింటుంటాయి.
దాదాపు 70వేల మంది పార్సీలు జీవించే ముంబయిలో భారీ టవర్ ఆఫ్ సైలెన్స్ నిర్మాణం ఉంది. దీన్ని 57 ఎకరాల్లో తోటల మధ్య నిర్మించారు.
కానీ, కొన్ని పశ్చిమ దేశాల్లో ఇలా మృతదేహాలను ఇలా వదిలేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. దీంతో అక్కడ సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు.
అయితే, భవిష్యత్‌లో భారత్‌లోనూ ఈ పద్ధతికి తెరపడే అవకాశముంది. ఇక్కడ రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఈ తరహా అంత్యక్రియలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలో కూడా ముంబయిలోని టవర్ ఆఫ్ సైలెన్స్ వద్ద కొన్ని నెలల పాటు మృతదేహాలు అలానే ఉండిపోయాయి. కీళ్లనొప్పులకు ఉపయోగించే డైక్లోఫెనాక్ ఔషధ అవశేషాలున్న మృతదేహాలను తినడంతో చాలా రాబందులు చనిపోయాయి.
దీంతో మృతదేహాలు త్వరగా నిర్వీర్యం అయ్యేందుకు టవర్ ఆఫ్ సైలెన్స్‌లపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటుచేశారు. అయితే, వీటి వల్లకూడా పెద్ద ఉపయోగం ఉండటం కనిపించలేదు.
సగటున రోజుకు మూడు మృతదేహాలను ఇక్కడికి తీసుకొస్తుంటే, ఒక్కో మృతదేహం నిర్వీర్యం కావడానికి నెలల సమయం పడుతోంది. దీంతో శతాబ్దాలనాటి ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని చర్చ గతంలో జరిగింది.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం: పుతిన్ మనసులో ఏముంది? పాశ్చాత్య దేశాల ఊహకు అందని రష్యా అధ్యక్షుడి ఆలోచనలు..
- మహిళగా జీవనం, పాస్‌పోర్టులో పురుషునిగా గుర్తింపు, ఆ తర్వాత ఏమైందంటే..
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విపక్షాలు గద్దె దింపగలవా
- కోవిడ్-19: కరోనావైరస్ నాలుగో వేవ్‌కు భారత్ సిద్ధంగా ఉండాలా?
- భగత్‌సింగ్ 90 ఏళ్ల క్రితం కులం గురించి ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)